ఒకానొక సమయంలో, చక్కనైన పట్టులాంటి వెంట్రుకలతో ముచ్చటగొలిపే ఒక చిన్నారి ఫెయిరీ పాప ఉండేది. అందమైన ఎర్రటి ఆంగో బెర్రీ కాయలు, నీలిరంగు కాట్ పువ్వులు కలిగిన ఒక పురాతనమైన చెట్టు తొర్రలో ఆ ఫెయిరీ ఒంటరిగా నివసిస్తుండేది. అంత చక్కనైన స్థలంలో ఉంటున్నప్పటికీ, చిన్ని ఫెయిరీకి ఎందుకనో- సంతోషం లేకుండింది. ఏదో తక్కువైనట్లు, దేన్నో కోల్పోయినట్లు అనిపించేది. కానీ అది ఏంటో మాత్రం అర్థం అయ్యేది కాదు. ఎందుకంటే ఆ ఫెయిరీ ఇంకా చిన్నది మరి! జ్ఞానం కూడా తక్కువే కద, అందుకని!
ఒక రోజు రాత్రి ఆ చిన్నారి ఫెయిరీ అడవిలో నడుస్తోంది. నడుస్తుంటే, అకస్మాత్తుగా నేలమీద ఆమెకు ఒక జాబిలి తునక కనిపించింది. దాన్ని వెంటనే ఇంటికి తీసుకెళ్ళి పరిశీలించడం మెదలు పెట్టింది ఆ పాప. మిరుమిట్లు గొలుపుతున్న దాని అందాన్ని చూస్తుంటే ఇప్పుడు అందులో ఒక అద్భుత దృశ్యం ప్రత్యక్షమైంది: చెట్టు ఊడలు, దాని క్రింద రెండు నీలి చెర్రీ పండ్లు- వాటి మధ్యగా ఎర్రటి కోన్ ఫ్లవర్, ఇంకా వీటి క్రింద ఎర్రటి రంధ్రం ఒకటి!
ఆశ్చర్యంతో చిన్నారి ఫెయిరీ ఆ జాబిలి తునకను ఇటూ అటూ తిప్పసాగింది. తిప్పుతున్నకొద్దీ అందులో దృశ్యం కూడా మారుతోంది! చెట్టు ఊడల మధ్యలోంచి రెండు బుజ్జి బుజ్జి ఆకులు బయటకు వస్తున్నట్టు కనిపించింది ఇప్పుడు! 'అరే! ఎంతటి వింత దృశ్యం' అనుకొనింది ఫెయిరీ పాప.
వయసైన, తెలివైన గుడ్లగూబ ఒకటి అప్పుడే వచ్చి వాలింది ఆ చెట్టు మొదట్లో . అది ఆ చిన్నారి ఫెయిరీని చూసి, "నీ చేతిలో ఏముంది?" అని ఉత్సాహంగా అడిగింది. ఏవైనా కొత్తవి కనిపిస్తే వెంటనే తెలుసుకోవాలని ఆత్రం గుడ్లగూబలకు . అందుకే, అవి చాలా తెలివైనవి మరి.
"ఇందులో కదిలే దృశ్యం ఉంది" అని ఫెయిరీ జవాబిచ్చింది. "ఓహో! ఎట్లాంటి దృశ్యం ఉంది ఇందులో?" అని గుడ్లగూబ అడిగింది. "ఇందులో చెట్టు ఊడలు, రెండు నీలి చెర్రీ పండ్లు, ఎర్రటి పొడవైన...." అని మొత్తం చెప్పింది ఫెయిరీ. "ఓహ్! ఓహ్! నాకివ్వవా ఓ సారి, నేనూ చూసి ఇస్తాను!" అని ప్రాధేయపడింది గుడ్లగూబ. "దానిదేముంది, ఇదిగో తీసుకో- చూడు, ఎంత చక్కని దృశ్యమో!" అని ఫెయిరీ జాబిలి తునకను దానికి ఇచ్చింది.
గుడ్లగూబ దాన్ని పరీక్షించి "అరె! ఇందులో ఉండేది గుడ్లగూబ కదా?" అన్నది. తర్వాత కొంచెం ఆలోచించి "ఆఁ! కాదు! నాకర్థమయ్యింది ఇప్పుడు! ఇది ఒక అద్దం!" అని చెప్పింది. కానీ చిన్నారి ఫెయిరీకీ ఏమీ అర్థం కాలేదు. "ఈ జాబిలి తునక ప్రతిబింబాన్ని చూపిస్తుంది. ఇందులో మన రూపాన్ని చూసుకోవచ్చు" అని చెప్పింది గుడ్లగూబ. అయినా ఆ ఫెయిరీకి ఆశ్చర్యం వేసింది తప్ప, పెద్దగా అర్థం కాలేదు: "ఏమిటీ? నేనట్లా ఉంటానా? అయితే ఆ నీలి రంగు పండ్లు ఏమిటి? పొడుగైన ఆకులాంటిది ఏమిటి? మిగిలినవన్నీ ఏమిటి?' అని ఆ పాప గుడ్లగూబను అడిగింది. 'అవి నీ కళ్లు , ముక్కు, చెవులు, నోరు- అంతా కలసి నీ మొఖమే కదా!' చెప్పింది గుడ్లగూబ నవ్వుతూ.
చిన్నారి ఫెయిరీ తన ప్రతిబింబాన్ని దీక్షగా , తదేకంగా చూసింది చాలా సేపు . ఆ చిన్నారి మనసంతా అలజడి- ఎన్నో ప్రశ్నలు తలెత్త సాగాయి. చిన్నారి ఫెయిరీకి తనెలా ఉంటుందో మొదటి సారిగా తెలిసింది- కానీ ఇప్పుడు ఆ పాపకు ఒంటరితనం అనుభవంలోకి వచ్చింది. అరచేతితో తన ఎదపై తడిమింది- అందులో ఏదో అద్భుతమైనది ఉన్నట్టు అనిపించింది. -జాబిలి తునకలో కనబడనిది- కానీ తనకు మాత్రం అనిపిస్తున్నది! చిన్నగా.. లోపల..కొట్టుకుంటున్నట్లు...ఏదో స్పందన.
"చూడు చిన్నారీ! కళ్ళు, చెవులు, ముక్కు- ఇవన్నీ కలిపి నువ్వే! నీకు ఆశ్చర్యంగా ఉందా, ఈ సంగతి తెలిసి?" అని అడిగింది గుడ్లగూబ.
"అవును! ఆశ్చర్యంగాఉంది. వీటితో నేను ఏమి చేయాలో తెలియట్లేదు" అని చిన్నారి ఫెయిరీ బదులిచ్చింది. ఈ సారి ఆశ్చర్యపోవడం గుడ్లగూబ వంతయింది: "నీ కళ్ళు, ముక్కు, నోరు- వీటితో ఏమి చెయ్యాలో తెలీదా?" అంది ఆశ్చర్యపోతూ.
అందుకు చిన్నారి ఫెయిరీ "అవును- నాకు ఎట్లా తెలుస్తుంది? నేనేమో చిన్న ఫెయిరీని. ఇక్కడేమో అంతా చిత్రంగా ఉంది. కానీ అన్నిటికంటే చిత్రమైనది ఏంటో చెప్పనా? నాలోపల ఏదో చిన్నగా కొట్టుకుంటోంది! అదే అన్నిటికంటే చిత్రం. కాసేపు నిండుగా, మరి కాసేపు ఖాళీగా ఉన్నట్టుంటోంది అది. ఎందుకో నాకైతే తెలియటం లేదు గానీ, కాస్త ఇబ్బందిగానే ఉన్నట్లుంది దానితో" అన్నది.
'అయ్యో నా బుజ్జీ! ఇంత అమాయకంగా ఉంటే ఎలాగ?" అని ఆ తెలివైన ముసలి గుడ్లగూబ తల ఊపుతూ అన్నది.
"కానీ నువ్వేమో పెద్దదానివి, చాలా సంగతులు తెలిసిన దానివి కదా, నాకు వివరించి చెప్పవా అని ప్రాధేయపడింది ఫెయిరీ. ఆ ముసలి గుబ్లగూబ కాసేపు ఆలోచించి, నిదానంగా "నేనొకటి చెప్తాను విను! ఇవన్నీ మెల్లగా నీఅంతట నువ్వే, అనుభవపూర్వకంగా తెలుసుకొంటావు. అట్లా తెలుసుకోవటమే సరైనది" అన్నది. "సరే, కానీలే! అనుభవపూర్వకంగా ఎలా నేర్చుకోనేది, అదైనా చెప్పు" అని అడిగింది ఫెయిరీ.
"వెళ్ళు- నడుస్తూ అడవిలోకి వెళ్ళు. ఆ పచ్చని అరణ్యంలోకి వెళ్ళిరా. నువ్వు నేర్చుకొన్నది ఏంటో నాకు వచ్చి చెప్పు . అంత వరకూ సెలవు " అని ఆ గుడ్లగూబ రెక్కలు విప్పుకొని గాలిలోకి ఎగరబోయింది. "ఆగాగు! అన్నింటి కంటే చిత్రమైనది ఏదో నీకు తెలుసుకదా, ఆ ఒక్కటీ చెప్పేసి వెళ్ళు!" అని అరిచింది ఫెయిరీ, దానికి వినబడేటట్లు. "నీ లోపల ఏదైతే కదలాడుతున్నదో, అదే అతి ముఖ్యం!" అంటూ ఆ గుడ్లగూబ కీకారణ్యంలోకి ఎగిరిపోయింది.
ఇక చేసేదేమీ లేక, గుడ్లగూబ చెప్పిన విధంగానే చిన్నారి ఫెయిరీ అడవిలో నడవటం మొదలు పెట్టింది. ఆ బుజ్జి ఫెయిరీ ఇల్లు ఒక పెద్ద కొండ లోయలో ఉండేది. అయినా ఇంత వరకూ ఎన్నడూ ఆ కొండ ఎక్కే ధైర్యం చేయలేదు ఫెయిరీ. కానీ ఇప్పుడు ఆ కొండను ఎక్కి చూడాలని నిశ్చయించుకొంది. ఆ కొండ నిండా చెట్లు, పొదలు, రాళ్ళు, బండలు- ఎక్కడానికి చాలా కష్టంగా ఉన్నప్పటికీ, ఫెయిరీ వాటన్నిటినీ దాటుకొంటూ, ఏటవాలు బండలను ఎక్కుతూ, చివరికి - ఎలాగైతేనేమి- కొండ పైకి చేరుకొంది.
ఫెయిరీ పాప కొండ కొనను చేరుకునేటప్పటికి రాత్రి అయిపో-వచ్చింది. తెల్లవారు జాము అవుతున్నది. చంద్రుడు, చుక్కలు వెళ్ళి పోతున్నాయి- ఒకదాని తర్వాత ఒకటిగా. అంతలో తొలి ప్రొద్దు పొడిచింది- ఆకాశం అంచు నారింజ రంగులోకి వచ్చింది!
అంతలో అదేంటో తెలియని ఒక అద్భుతమైన నీలికాంతితో అడవంతా నిండిపోయింది! అటువంటి సుమనోహర సమయంలో, సరస్సుల పైన మంచు వీడుతుండగా, సూర్యుడు ఉదయిం-చాడు! వెలుతురుతో రంగులు నింపసాగాడు. ఆకులు-చిగుర్ల పచ్చదనం, సరస్సుల్లోను-నదులలోను నీలిదనం, వివిధ పరిమళ పుష్పాల వైవిధ్యమైన వర్ణాలతో కొండంతా నిండిపోయింది!
ఈ సుందర దృశ్యాన్ని కొండ పై నుంచి చూసి పరవశించిపోయింది చిన్నారి ఫెయిరీ. ఓ సారి కళ్ళు మూసి, మళ్ళీ తెరిచి- అలాగే చూస్తూ ఉండిపోయింది. అప్పుడు ఆమెకు ఇలా అనిపించింది- "కళ్ళతో ఏం చేయాలో ఇప్పుడు తెలిసింది! వాటితో ఈ ప్రపంచం ఎంత అందమైనదో చూడచ్చు!" అని.
అయితే ఆమె ఎదలో అంతుపట్టని విధంగా స్పందిస్తున్నదేదోగాని, ఇప్పుడు అది ఇంకా వేగంగా కొట్టుకుంటోంది. ఉండీ ఉండీ కాస్త నొప్పి కూడా పుడుతున్నది. ఎందుకో అర్థంకాలేదు చిన్నారి ఫెయిరీకి.
కొండపైన ప్రకృతి సోయగాలను తనివి తీరా చూసిన తర్వాత, ఫెయిరీ లోయలోకి దిగింది. ఇప్పుడామె పచ్చ పచ్చని బయళ్ళున్న మైదాన ప్రాంతంలోకి వచ్చింది. ఇక తెల్లవారింది కూడా. గాలి సన్నగా వీస్తూంటే, చెట్లు ఒకదానితో ఒకటి గుసగుసలాడుతున్నాయి. పక్షులు కలకలలాడుతూ, మధురంగా సంగీతం పలికిస్తున్నాయి- ఎంతో ముచ్చటైన కచేరీ! ఫెయిరీ ఆగి, ఆ సంగీతాన్ని ఆస్వాదించటంకోసం తన కళ్ళు మూసుకున్నది. కానీ ఆ మధురమైన సంగీతం కళ్లతో ఆనందించేది కాదు! ఫెయిరీ ఇప్పుడు తన రెండు చేతులతోటీ చెవులు మూసుకొని చూసింది- అప్పుడు అర్థమయింది, చెవుల పరమార్థం! పట్టరాని ఉత్సాహంతో గంతులు వేసింది ఫెయిరీ- ఈ చెవులతో అడవిలోని సంతోష స్వరాలను వినవచ్చు! అట్లా వింటూ వింటూ ఆ చిన్నారి పాప సంతోషంతో పొంగిపోయింది. ఆమె ఎదలో ఆనందోత్సవాల కేరింతలు! దేనివి, ఆ స్పందనలు? ఏమిటో అది?! ఆ ఒక్కటీ మాత్రం అంతు చిక్క లేదు.
ఫెయిరీ సంతోషంగా నాట్యం చేయటం మొదలు పెట్టింది. ఆ చిన్నారి కేరింతలు అడవంతా ప్రతిధ్వనించసాగాయి. "ఈ ప్రపంచంలో అందరికంటే నేనే సంతోషవంతమైన ఫెయిరీని!" అని అరిచింది. "సంతోషవంతమైన ఫెయిరీని" అని ప్రతిధ్వనించింది మైదానం. అకస్మాత్తుగా ఆ క్షణంలో ఇంకొక క్రొత్త విషయం అర్థమయింది ఫెయిరీకి- తనకు నోరెందుకుందో తెలిసింది! ఆ పచ్చిక పైన పడుకొని, పగలబడి నవ్వసాగింది. ఫెయిరీ నవ్వుల శబ్దం వినేందుకు పక్షులు పోటీ పడ్డాయి. ఆశ్చర్యంతోటీ, సంతోషంతోటీ అవన్నీ తమ పాటలు ఆపేసిమరీ ఫెయిరీ నవ్వుల్ని విన్నాయి. చాలా సేపటి తర్వాత, అవి మళ్ళీ పాటలు మొదలుపెట్టేసరికి, ఫెయిరీ తన నవ్వులతో వాటికి పోటీగా పాడటం మొదలు పెట్టింది.
పాదాలు గాలిలో తేలియాడుతున్నట్లు, ఆ ఎర్రటి నేలపై నాట్యం ఆడసాగింది. చివరికి అలిసిపోయి, ఆ గడ్డిపైన పడుకొని- మట్టివాసన, పచ్చటి గడ్డి వాసన, మత్తైన మల్లెల వాసన ఎలా ఉంటుందో తెలుసుకున్నది. ప్రపంచపు సౌందర్యాన్ని తన ఇంద్రియాలతో రుచి చూసింది. కానీ తన ఎదలో కదలాడేదేమిటో తెలియలేదు ఇంకా. అతి ముఖ్యమైనది అదేనట! అదేమిటో ఇంకా తెలియలేదెందుకో.
ప్రక్కనే ఉన్న పొదల్లో నుంచి "ఉయ్!ఉయ్!ఉయ్!" అని మూలుగులు వినిపించాయి అంతలోనే. చిన్నారి ఫెయిరీ చెవులు రిక్కించి విన్నది. ఈసారి ఇంకా బాధగా అరుపులు వినిపించాయి. ఫెయిరీ ఆ వైపు తిరిగి, కొంచెం అనుమానంగా, కొంచెం బెరుకుగా, కొంచెం జాగ్రత్తగా- "ఎవరది?" అని అడిగింది. ఫెయిరీకి అనుమానం, సిగ్గు, బెరుకు కాస్త ఎక్కువే.
"నేను, చిన్ని కుందేలును! నా కాలు చాలా నొప్పి పెడుతోంది. ఎవరైనా కాస్త సహాయం చేస్తారా?" అని వినబడింది పొదల్లోంచి. కొమ్మలు పక్కకు తీసి చూసింది ఫెయిరీ. లోపల, ఆ పొదలో- పాదం ఆకాశం వైపుగా పెట్టుకొని ఓ చిన్ని కుందేలు కనిపించింది.
"నీ పాదానికి ఏమైంది?" అని ఫెయిరీ అడిగింది. "ఏమో తెలీదు. పాదం నేల పై పెట్టాలంటే చాలా నొప్పిగా ఉంది" అని కుందేలు జవాబిచ్చింది. చిన్నారి ఫెయిరీ ఆ కుందేలు పిల్లను దగ్గరకు తీసుకొని దాని పాదాన్ని పరిశీలించింది. అందులో ఓ చేప ఎముక గుచ్చుకొని ఉండింది. "వాగును ఆనుకొని ఒడ్డున గంతులు వేస్తున్నప్పుడు గుచ్చుకొని ఉంటుంది" అనుకున్నది ఫెయిరీ.
"నువ్వు వాగు ఒడ్డున నడుస్తున్నప్పుడు నీ కాలిలో చేప ఎముక గుచ్చుకున్నది. అందుకని నొప్పి పుడుతున్నది. ఇప్పుడు నేను దాన్ని బయటికి తీస్తానులే" అని కుందేలును ఓదార్చి, మెల్లగా ఆ ఎముకను బయటికి లాగేసింది. "ఇదిగో వచ్చేసింది! ఇక నీపాదం బాగై పోతుందిలే" అని సంతోషంగా చెప్పింది.
కానీ కుందేలుకు ఇంకా నొప్పిగానే ఉంది. అప్పుడు ఫెయిరీ వాగు ఒడ్డుకు వెళ్ళి, ఒక కొబ్బరి చిప్పతో నీళ్ళు తెచ్చి, గాయాన్ని కడిగింది. ఒక ఆకును తెచ్చి, పాదానికి చుట్టి, గడ్డిని దారంలా పేని, కట్టు కట్టింది. అంతేకాక తను వెళ్ళి, కుందేలు త్రాగేందుకు, తినేందుకు కావలసినవి తెచ్చి ఇచ్చింది. కొమ్మలతో చిన్ని కుందేలుకు ఒక బుజ్జి ఇల్లు కట్టి పెట్టింది. "గాయం తగ్గేంత వరకు ఈ ఇంట్లో ఉండు" అని చెప్పింది. "అబ్బ! ఎంత చక్కనైన దానివి! ఇంత మంచిగా, నేర్పుగా చేసినందుకు ధన్యవాదాలు! నాకున్న చేతులతోనైతే నేనెన్నటికీ నీలా ఇంత చక్కగా చేయలేక-పోయేదాన్ని" అని కుందేలు ఫెయిరీని మెచ్చుకున్నది.
అప్పుడు చిన్నారి ఫెయిరీ తన చేతులను, కుందేలు చేతులను మార్చి మార్చి చూసింది: "అరె! ఎంత వేరుగా ఉన్నాయి! నా కున్న వేళ్ళతోనైతే వేటినైనా బాగా పట్టుకోవచ్చు!" అప్పుడు ఆ చిన్ని ఫెయిరీకి తన చేతుల గొప్పదనం అర్థమయ్యింది. వాటితో ఏమేం చేయచ్చో, ఎంత చక్కగా చేయచ్చో తెలిసింది.
అప్పటికి ఇంక చీకటి పడటం మొదలయ్యింది. ఫెయిరీ ఇంటి దారి పట్టింది. "ఈ రోజు ఎంత నేర్చుకొన్నానో!" అని సంతోషపడ్డది. "కానీ ఆ అన్నిటి కంటే ముఖ్యమైనది ఏదోనే తెలీలేదు. అది తెలీకపోతే ఇక వేరేవి తెలిసికూడా ప్రయోజనం లేదనుకుంటాను" అనుకుంటూ నడవసాగింది. అంతలోనే ఆ పాపకు గూడులో నుంచి నేల పై పడిన ఒక చిన్న పక్షిపిల్ల కనపడింది.
ఆ పక్షి పిల్లకు ఇంకా ఈకలు రాలేదు. మొండి రెక్కలతో దయనీయంగా ఉన్న ఆ పక్షిని చిన్నారి ఫెయిరీ తన చేతిలోకి తీసుకున్నది-"అయ్యో! నీకు చలిగా ఉందేమో, ఆకలి కూడా వేస్తోందేమో, ఎలాగ?" అని దాన్ని అరచేతిలో పెట్టుకొనే అటూ ఇటూ కలయ చూసింది. ప్రక్కనే సాలీడు బూజులో ఇరుక్కొన్న చిన్న పురుగు ఒకటి కనబడింది ఆ పాపకు. మెల్లగా తన వ్రేళ్ళతోఆ పురుగును పట్టుకొని, "ఈ పక్షి పిల్లకి నీ అవసరం ఎక్కువమ్మా, ఏమీ అనుకోకు" అంటూ దాన్ని పక్షి పిల్లకు ఆహారంగా పెట్టింది.
దాన్ని తీసుకొని ఇల్లు చేరిన తర్వాత, ముందురోజు రాత్రి కూర్చునట్టుగానే ఇంటి ముందరి మెట్ల మీద కూర్చుంది. క్రితంరోజు రాత్రి తన చేతిలో జాబిలి తునక ఉండింది. ఈ రోజు అవే చేతుల్లో దయనీయమైన స్థితిలో ఉన్న చిట్టి పక్షి పిల్ల ఉంది: "అబ్బా! ఎంత అందంగా, మెత్తగా, చిన్నగా ఉన్నావు! నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానులే, నువ్వు చక్కగా, పెద్దగా అవుతావు! ఎంతో చక్కగా పెరుగుతావులే! ఇక ఇప్పటినుండీ నా చేతులే నీకు గూడు. నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు" అని దానికి తియ్యటి కబుర్లు చెప్పసాగింది ఫెయిరీ పాప.
"ఓహో! నీ ప్రయాణాలన్నీ ముగించుకొని ఇంటికొచ్చినట్లున్నావే" అని గంభీర స్వరం ఒకటి వినబడింది: తెలివైన ముసలి గుడ్లగూబ అప్పుడే చెట్టు మొదలు పైన మెల్లగా వాలింది. "సరే! ఈ రోజు ఏమేం నేర్చుకొన్నావు, చెప్పు నీ యీ ముసలి స్నేహితుడికి" అని ఫెయిరీని అడిగిందది.
ఆ రోజు జరిగింది అంతా పూసగుచ్చినట్టు చెప్పింది ఫెయిరీ. గుడ్లగూబ అప్పుడప్పుడూ తలాడిస్తూ మొత్తం శ్రద్ధగా విన్నది. "ఓహో! అలాగైతే రోజంతా చక్కగా గడిపినట్లే! ఇప్పుడు నీకు నీ గురించి అంతా తెలిసినట్లే గదా, ఇప్పుడు సంతోషంగా ఉన్నావా?" అని అడిగింది ఫెయిరీని.
"లేదు,లేదు. ఇదివరకు ఉన్నట్లే ఇప్పుడు కూడా బాధగానే ఉన్నాను- ఎందుకంటే, ఆ అతిముఖ్యమైనది ఏంటో ఇంకా తెలియనే లేదు. నా ఎదలో ఎప్పుడూ స్పందిస్తున్నదేమిటో, నిండుగా ఉన్నట్లుండి, అదే సమయంలో ఖాళీగా ఉన్నట్లుండేది ఏమిటో, సంతోషంగా ఉన్నా నొప్పిలాగా అనిపించేది ఏమిటో అది మాత్రం ఇంకా తెలియలేదు" అని చెప్పింది ఫెయిరీ.
ఆ ప్రశ్నకు వెంటనే సమాధాన మివ్వకుండా గుడ్లగూబ- "నీ చేతులో ఏముంది?" అని అడిగింది. ఫెయిరీ తన అరచేయిని నెమ్మదిగా, మెత్తగా తెరిచి చూపించింది- "ఇంటికి తిరిగి వస్తుంటే, నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ చిన్న పక్షిని చూశాను. దీనికి తిండి, వేడి ఇవ్వక పోతే చచ్చిపోతుంది. పాపం ! చిట్టి పక్షి " అంటూ దాన్ని హృదయానికి హత్తుకుంది.
ఓ క్షణం ఆగి, ముసలి గుడ్లగూబ ఇలా చెప్పింది: నీ అంతట నువ్వే నీ కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు కాళ్ళు ఎందుకున్నాయో తెలుసుకున్నావు- అంతేకాదు, చూడు- ఇప్పుడు నువ్వు నీ గుండె ఉపయోగాన్ని కూడా కనుక్కున్నావు. నీ ఎదలో ఎప్పుడూ స్పందిస్తూండేదీ, ఒకే సమయంలో సంతోషంతోటీ, బాధతోటీ రెండింటితోటీ ఖాళీగానూ, నిండుగా కూడాను ఉండేదీ, అదే. ప్రేమ, జాలితో నిండి పోయిన ఆ గుండే, ఎవరికైనా ఉండే అత్యంత విలువైన నిధి. అలా దయ, జాలి, ప్రేమలతో నిండుగా ఉండేదే నిజమైన హృదయం. ఇప్పుడు అర్థమైందా?" అని.
అప్పుడు ఆ చిన్నారి ఫెయిరీ తన చేతితో ఎదను తడిమింది ఆశ్చర్యపోతూ. "నాకు గుండె ఉన్నదా!" అన్నది. "కానీ నాకు దానితో ఏమి పని?" అని అడిగింది. "ఆ ప్రశ్నకు సమాధానం నీఅంతట నువ్వే చెప్పాలి. వేరేవాళ్ళు కాదు" అన్నది తెలివైన ముసలి గుడ్లగూబ.
అప్పుడు ఫెయిరీకి అన్నిటికంటే ముఖ్యమైనది ఎందుకున్నదో అర్థమయ్యింది- "అవును, ఇప్పుడు తెలిసింది ఈ హృదయం ఎందుకుందో: నిస్సహాయ స్థితిలో ఉన్నవాళ్ళకు సహాయం చేయటానికి, మంచిని ప్రేమించటానికి, ప్రపంచంలోని అందాన్ని ఇప్పుడే ఆస్వాదించడానికి!" అని చెప్పింది గుడ్లగూబతో.
తెలివైన ముసలి గుడ్లగూబ ఫెయిరీ పాపను చూసి మురిసిపోయింది. "అవునవును! సరిగ్గా చెప్పావు. నువ్వు చెప్పింది నీకు అర్థమయ్యింది! సరిగా ఉంది! ఇది నేర్చుకొన్న తర్వాత- ఓ చిన్నారి ఫెయిరీ, నువ్వింక ఫెయిరీవి కావు! నువ్విప్పుడు నిజంగా మానవ బాలికవు అయ్యావు. మానవజాతిలో అంతర్భాగం అయినావు ఇప్పుడు!" అని దీవిస్తూ అది ఆకాశానికి ఎగిరింది.