యమునా నదికి దగ్గరలోనే 'విలాసధామం' అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణపు రాజుగారి అంత:పుర స్త్రీలంతా కలిసి, ఒక రోజున విహారం చేయటం కోసం అడవిలోకి వెళ్ళారు. అడవి నిండుగా విరిసిన పూలను చూసి వాళ్ల మనసులు పరవశించాయి. వాళ్ళు చాలాసేపు అక్కడ పూలు కోసుకోవటంలో గడిపి, బాగా అలసిపోయారు.
'ఎక్కడైనా మంచి సరస్సు ఉంటే బాగుండును కదా, జలకాలాడవచ్చు!' అనుకునేసరికి, దగ్గరలోనే అతి మనోహరంగా ఉన్న సరస్సు ఒకటి వాళ్ళ కంట పడింది. దాంతోవాళ్ళ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
ఆ వెంటనే వాళ్ళంతా తమ నగలు, ఆభరణాలు అన్నీ తీసి ఒక ప్రక్కన పెట్టారు; ఒకరి చేతులొకరు పట్టుకొని, మెల్లని నడకలతో వయ్యారాలు పోతూ, సున్నితంగా అడుగులు వేయసాగారు; నీళ్ల లోపల మెరుస్తున్న చేపలను చూసి, వాటిని మించుతున్న తమ నెచ్చెలుల శరీర శోభల్ని చూడటం కోసం తమ చూపుల్ని అటూ ఇటూ చలింపజేశారు; అట్లా కొంత బిడియంతో, మరికొంత బెరుకుతో- నీళ్లలోకి దిగారు; ఆపైన వాళ్ళ భయమూ, సిగ్గూ పోయాయి- మించిన ఉత్సాహంతో అందరూ జల క్రీడలు మొదలు పెట్టారు:
వాళ్ళలో ఒకామె దోసిళ్ల నిండా నీళ్ళను తీసుకొని, మరొకామె పైన చల్లింది. ఆమె కిలకిలా నవ్వి, 'ఏదీ, ఆపకుండా వరసగా చల్లు, చూద్దాం!' అని హెచ్చిరించింది. వెంటనే మొదటి యువతి నవ్వుతూ జలధారలు కురిపించింది. ఆ తాకిడికి తాళలేక రెండవ యువతి ముఖానికి చేతులు అడ్డు పెట్టుకొని, ముఖం తిప్పుకొని, ఇంకొక చెయ్యెత్తి దండం పెడుతూ- "అమ్మమ్మ! చాలు తల్లీ! నీ జోలికి ఇక రాను. ఆపు ఆపు!" అన్నది.
అంతలో ఇంకొకామె అందుకొని, "అయ్యో, ఇంత పిరికిదానివా?" అన్నది. మరొక యువతి కల్పించుకొని- "అంత చిన్న వాళ్ళతోటి కాదమ్మా, నీ గొప్పదనం నాముందు చూపించు!" అని ఆవేశం కల్పించింది. ఆపైన ఇక ఆమె, మొదటి యువతీ ఒకరి పైన ఒకరు నీళ్ళను చల్లుకుంటూ, ఒకరిని మించి ఒకరు జలధారలు కురిపిస్తూ, ఆ ధారలలో వెను- దీయక తడుస్తూ జలయుద్ధం మొదలు పెట్టారు. మిగిలిన వాళ్లంతా వాళ్ల చుట్టూ చేరి వారిస్తూ, "చాలు చాలు! ఇదేమి ఆవేశమమ్మా!" అనగా అనగా చివరకు వాళ్ళు యుద్ధం ఆపి, చిరునవ్వులు చిందించే ముఖాలతో, రొప్పుతూ నీళ్ళలో నిలబడ్డారు.
ఆలోగా మరికొందరు ఇద్దరిద్దరుగా జట్లు కట్టి, తమ తమ ఆభరణాలను పందెం వేసుకొని, 'ఎవరు ముందు తీరాన్ని తాకుతారో చూద్దాం!' అని అతి వేగంగా ఈదుతో నీళ్ళను కకలావికలం చేయసాగారు. "అయ్యయ్యో ఎందుకమ్మా ఊరికే నీళ్ళను అతలాకుతలం చేస్తారు?" అని మిగిలినవారు వారిస్తే- "ఆఁ ఏమున్నది, మనల్ని చేరిన'వారి'కి (నీటికి) క్షోభ తప్పదు గదా" అని రెండర్థాలూ స్ఫురించేటట్లు చతుర్లాడుతూనే పోటీని కొనసాగించారు; తీరాన్ని తాకి 'నేను గెలిచాను- నువ్వు ఓడావు'అని నవ్వుతూ, ఓడిన వాళ్లను ఎగతాళి చేస్తూ , వాళ్ళమీదికి జలధారల్ని కురిపిస్తూ, అనేక విధాలుగా సంతోషపడుతూ జలవిహారం చేయసాగారు.
అంతలో ఆ కాకి చప్పుడు చేయకుండా వెళ్ళి, వాళ్ళు అంతకు ముందు సరస్సు ఒడ్డున విడచిన నగలలో బాగా మెరుస్తూ అందం ఒలుకుతూ ఉన్న ఒక పెద్ద హారాన్ని ముక్కున కరచుకొని పారిపోయి, కొంచెం దూరంగా ఒక చెట్టుకొమ్మ మీద కూర్చొని, వాళ్ళలో ఒక యువతి కంట పడ్డది.
అప్పుడు ఆమె చాలా ఆశ్చర్యంతో "ఇదేమి విచిత్రం? రత్న హారాన్ని కాకి ఎత్తుకెళ్ళింది చూడండి" అని గట్టిగా చెప్పగానే, మిగిలిన వాళ్ళంతా ఒక్కసారిగా తలలెత్తి, కళ్ళన్నీ విప్పారించి కాకి వైపుకు చూసి, ఆశ్చర్యంతో 'ఇదేమి?' అని ముక్కున వేళ్ళు వేసుకున్నారు.
వాళ్ళలో ఒకామె "ఓహోహో! ఎర్రగా మెరుస్తై కదా, పద్మరాగాలు? అవి పొదిగిన హారాన్ని చూసి ఈ వెర్రి కాకి మాంసపు ముక్క అని భ్రమ పడింది కాబోలు!" అన్నది. మరొక యువతి "కాదు కాదు, ఆ నగ దానికి నచ్చి ఉంటుంది- మెడలో వేసుకొని కులుకుదామనుకొని ఉండచ్చు" అని నవ్వి, "నీ ముఖానికి ఈ హారమొక్కటే తక్కువైందా?" అని ఎకసెక్కాలాడింది. "చక్కని హారమమ్మా! ఈ దొంగ కాకి ఎక్కడినుండి వచ్చిందో, దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళి పడేస్తుందో, అది ఎవ్వరి పాల బడుతుందో " అని బాధను వ్యక్తం చేస్తూ "అయినా ఏమీ పరవాలేదు- నీళ్లలోనో, అడవిలోనో పడి, ఎవ్వరికీ కాకుండా పోవటం కంటే ఎవరో ఒకరి చేతుల్లో పడటమే మంచిదిలే!" అన్నది మరొకామె.
"పిట్టకు అలంకారాలతో పని ఏమున్నది? దీనికి ఏదో కారణం ఉండి ఉండాలి. నిలకడమీద తెలుస్తుంది" అన్నది ఒక యువతి- ఇలా వాళ్ళంతా ముచ్చటించుకుంటూ ఉండగా, కొందరు పరిచారికలు "ఆ కాకి ఏవైపుకు పోతుందో- ఏమారకుండా జాగ్రత్తగా చూస్తూ ఉండండి" అని అక్కడి ద్వారపాలకులను నియోగించారు. ఆపైన తాము త్వర త్వరగా వెళ్ళి రాజ భవనంలోని మగవారికి ఈ సంగతి చెప్పి, వారినీ వెంట బెట్టుకొని వచ్చారు.
కాకి అంతవరకూ ప్రశాంతంగా అక్కడే వేచి ఉన్నది; ఇక అందరూ రాగానే అది మెల్లగా పైకి ఎగిరింది. మెల్లగా తన గూడు ఉన్న చెట్టు వైపుకు పయనించింది. తర్వాత, ఆ చెట్టు కొమ్మ మీద కూర్చొని, రాజభటులందరూ చూస్తుండగా, ఆ నగను సూటిగా చెట్టు క్రింద ఉన్న పాము పుట్టలో పడేటట్లు ఎంతో నేర్పుతో జారవిడిచింది. పగడాలు కూర్చిన ఆ హారం ఎర్రగా మెరుస్తూ పాము పుట్టలోకి జారటం అలా రాజభటుల కంట పడగానే, వాళ్లు ఆ పుట్ట చుట్టూ మూగారు. పారలు, గునపాలు మొదలైన సాధనాలను తెప్పించారు. ఆ పుట్టను పెకలించారు.
వెంటనే అందులో ఉన్న త్రాచు పాము కోపంతో విషపు జ్వాలలు చిమ్ముతున్నట్లు బుస కొడుతూ, తన పుట్టను త్రాకిన వాళ్ళ ప్రాణాలు త్రాగేసేందుకా అన్నట్లు నాలుకలు అల్లాడిస్తూ బయటికి దూకి, వాళ్ళ పైన పడేందుకు ప్రయత్నించింది. అప్పుడు ఆ రాజభటులు తమచేతుల్లో ఉన్న దుడ్డు కర్రలతో దాన్ని అదిమి పట్టి చంపారు. అటుపైన వాళ్ళు తీరికగా ఆ పుట్టలో వెతుక్కున్నారు. తమ హారాన్ని తాము తీసుకొని పోయారు.
అట్లా పాము పీడనుండి విముక్తి చెందింది కాకి- అటుపైన చాలా సుఖంగా జీవించింది. కాబట్టి ఉపాయంతో సాధించలేని పని అంటూ ఏదీ లేదు.
చూడు, బుద్ధిబలం ఉన్నవాడికి శారీరక బలం కొంత తక్కువ ఉన్నా పరవాలేదు. కానీ తెలివి లేనివాడికి ఎంత కండ బలం ఉన్నా దాని వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. చాలా కాలం క్రిందట ఒక కుందేలు తన తెలివిని ఉపయోగించి ఒక సింహాన్నే చంపగల్గింది- నీకు ఆ కథ చెబుతాను, జాగ్రత్తగా విను.
కుందేలు-సింహం కథ
ఒక అడవిలో 'సత్వసారం' అనే సింహం ఒకటి ఉండేది. అది ఆ అడవిలోని జంతువులను అన్నింటినీ దొరికినవాటిని దొరికినట్లు పట్టుకొని, చంపి తినేస్తుండేది. దాతో అక్కడి జంతువులన్నీ ఎప్పుడూ విపరీతమైన భయంతో వణికి పోతూ ఉండేవి. అవన్నీ ఒకసారి ఒక చోట చేరి అనేక విధాలుగా ఆలోచించినై. అయినా తమ కష్టాలు తీరే మార్గం కానరాలేదు వాటికి. అందువల్ల అవి 'ప్రస్తుతానికి ఏమి చేద్దాం?' అని ఆలోచించుకున్నాయి. చివరికి అన్నీ కూడబలుక్కొని, ఒక్కసారిగా సింహం దగ్గరికి పోయాయి. బిక్కుబిక్కుమంటూ, ప్రాణాలు అరచేత బట్టుకొని, దూరం దూరంగా నిలబడి, అవన్నీ సింహానికి నమస్కరించాయి.
"ఓ మృగరాజా! మేము అందరమూ తమరికి ఒక విన్నపం చేసుకునేందుకు వచ్చాం. మామీద కనికరం ఉంచి వినండి. తమరి ప్రతాపం ముందు ఈ ప్రపంచంలోని దుష్ట ఏనుగులన్నీ గడ్డిపోచలతో సమానం- ఇక మావంటి అల్పులను లెక్కించవలసిన పని ఏమున్నది? ఏదో దయగలవారు కనుక ఇన్నాళ్ళు ప్రాణాలతో వదిలారు గానీ, లేకపోతే మమ్మల్నందరినీ ఒక్క నిముషంలోచంపగల సమర్థులే, తమరు. అంత కరుణా మూర్తులైన తమ ముందు మా ప్రార్థనలు వృధా కావనే విశ్వాసంతోటే, తమ సమ్ముఖానికి వచ్చేందుకు సాహసించాం. తమరికి ఆహారం అవ్వటంకోసం వంతుల వారీగా రోజుకొక్క జంతువును తమ సన్నిధికి పంపగలం. తమరు దయతో దీనికి అంగీకరించి, మా భయం తొలగించి, మమ్మల్ని కాపాడాలని విన్నపం" అని ప్రార్థించాయి.
అప్పుడా సింహం కొంత మెత్తబడి "సరే, అట్లాగే కానివ్వండి!" అని వాటికి అభయమిచ్చి పంపింది. అటు తర్వాత ఆ జంతువులన్నీ వంతులు వేసుకొని, రోజుకొక్క జంతువును ఎంపిక చేసుకొని, సింహానికి ఆహారంగా పంపటం మొదలు పెట్టాయి.
ఇట్లా కొంత కాలం గడిచింది. ఒకనాడు ఆ జంతువులన్నీ తమ ఏర్పాటును అనుసరించి, ఒక కుందేలును ఎంపిక చేసి, "రేపు సింహం దగ్గరికి ఆహారంగా పోవటం నీవంతు" అనగానే పాపం, ఆ కుందేలు భయంతో కొంత సేపు మూర్ఛ పోయింది.
ఆపైన అది తెలివి తెచ్చుకొని, చెదిరిన గుండెను రాయి చేసుకొని, "ఎంత వాళ్ళకైనా విధి రాత తప్పదు గదా" అని ఆలోచించింది. వేడి వేడి నిట్టూర్పులు విడుస్తూ, తల విదిల్చి, "ఆపద వాటిల్లినప్పుడు తెలివిని ఉపయోగించి బయటపడే మార్గం ఆలోచించాలి గాని, మబ్బుబారిపోవటం సరైన పద్ధతి కాదు. ఎట్లాగైనా నా తెలివి తేటలను ఉపయోగించి, సింహాన్ని మోసగించి చంపేసేందుకు ప్రయత్నిస్తాను. అటు పైన దేవుడు ఎట్లా నిర్ణయిస్తే అట్లా అవుతుంది" అనుకున్నది. మరునాడు అది తన బంధువర్గం నుండి తీరికగా శలవు పుచ్చుకున్నది. నడిచేందుకు కాళ్ళు రానట్లే నడిచింది. మెల్ల మెల్లగా పోతూ, తగిన ఉపాయాన్ని ఆలోచించింది. దాన్ని తన మనసులోనే సరిచూసుకున్నది. అటు తర్వాత అది ఇంకొంచెం సేపు అడవిలోనే అటూ ఇటూ తిరిగి, ఆహారపు సమయాన్ని తప్పించింది. ఆపైన మెల్లగా సింహం దగ్గరికి పోయి, దానికి నమస్కరించింది.
దాన్ని చూడగానే సింహానికి కోపం నసాళానికంటింది. దాని జూలు పైకి లేచి నిలబడింది. భయంకరంగా ఉరుములు ఉరిమినట్లు గర్జిస్తూ, మెరుపుల్లాంటి చూపులతో చూసింది- "అహహా! మేము చూపిన ఓర్పుకు ఫలితం ఎంత బాగున్నది! 'కుడితే తేలు; కుట్టకపోతే కుమ్మరి పురుగు' అంటారు గదా? నాకు ఈ విధంగా వేళ తప్పించి ఆహారం పంపే విధానం చూస్తుంటే, ఈ మృగాలకు నా కోపపు వేడిని మరొక్కసారి చవి చూడాలని కోరిక పుట్టిందనిపిస్తున్నది. ఈ అడవి జంతువులకు ఇంతలోనే ఇంత మత్తా? ఈరోజే ఈ అడవిలో ఉన్న జంతువులన్నింటినీ ఒక్క దెబ్బకు చంపి, మండే నా కడుపుకు ఆహుతి చేస్తాను చూడు!" అని తోకను నేలకు జాడించి, లేచి నిలబడ్డది. (...మిగతాది మళ్ళీ.)