అనగా అనగా ఒక రాజ్యం ఉండేది. దాని పేరు కీరరాజ్యం. కీర రాజ్యానికి రాజు రామలింగరాజు. ఆ రాజుగారికి పొగడ్తలు అంటే చాలా ఇష్టం. పొగడ్తలు వింటూ పొద్దు పుచ్చేవాడు. పొగిడేవాళ్ళు ఏం చెబితే అది నమ్మేవాడు. ప్రజల కష్ట సుఖాలను సొంతగా కనుక్కునేవాడు కాదు.
కీరరాజ్యంలోని బ్రాహ్మణుల్లో చాలా తెలివైన వాడు ఒకడు ఉండేవాడు. అతని పేరు సుబ్బావధాని. ఆనాటి రాజులకు పొగడ్తల పిచ్చి ఉందని అతను చాలా త్వరగా గ్రహించాడు. అందుకని అతను పనిగట్టుకొని చాలా రాజ్యాలకు పోయేవాడు. అక్కడి రాజులను ఇంద్రుడనీ, చంద్రుడనీ పొగిడే వాడు. ఆ వెర్రి రాజులందరూ ఉబ్బి తబ్బిబ్బై అతని మీద ధనరాసులు క్రుమ్మరించేవాళ్ళు. ఆ విధంగా అతను చాలా డబ్బులు సంపాదించాడు.
కీర రాజ్యపు రామలింగరాజు పొగడ్తల పిచ్చి తెలీనిదెవ్వరికి? సుబ్బావధాని టోపీ వేసే రాజుల్లో మొదట నిల్చేది ఆయనే. అవధానిగారు సంవత్సరానికొకసారి దర్బారుకు వెళ్ళేవారు. ఇంతకు ముందు ఎవ్వరూ పొగడని విధంగా పొగిడేవారు రాజుగారిని. రాజుగారు మెచ్చి అతనికి అక్షర లక్షలు ఇచ్చేవారు.
ఈ సంవత్సరం సుబ్బావధానిగారు కీరరాజ్యపు దర్బారుకు వెళ్ళినప్పుడు రాజుగారి తెలివితేటల్ని మహ పొగిడాడు. ఆయన తెలివితేటలకు సాటి రాగలవారు ఈ భూమిమీదే కాదు- సమస్త విశ్వం లోనే ఎవ్వరూ లేరన్నాడు. అంత తెలివిగా ఏలే రాజు ఉన్నాడు గనకనే ప్రజలు చాలా సుఖంగా ఉన్నారని ప్రశంసించాడు. మీ తెలివితేటలకు దేవతలు కూడా అసూయ పడుతున్నారన్నాడు. సుబ్బావధాని పొగడ్తలకు రాజుగారికి ఒళ్ళు పులకరించి పోయింది. అవధానిగారికి తగినట్లు ఏదైనా తెలివైన బహుమతి ఇద్దామనుకున్నాడాయన. మరేమివ్వాలి?
ఒక గుమ్మడి కాయను జాగ్రత్తగా తొలిపించి, దానిలో అతి విలువైన వజ్రాలు, వైఢూర్వాలు, మాణిక్యాలు, అన్నీ పెట్టించాడు. అద్భుత నైపుణ్యంతో ఆ గుమ్మడి కాయను యధావిధిగా అతికింపజేశాడు. ఆ గుమ్మడికాయను సుబ్బావధానికి బహూకరించాడు.
సుబ్బావధానికి చాలా చిన్నతనం అనిపించింది. 'తను అంతగా పొగిడినా రాజుగారు ఒక గుమ్మడికాయను ఇచ్చి చేతులు దులుపుకున్నారే' అని అతనికి దు:ఖం వేసింది. ఎందరో రాజుల సన్మానాలందిన తాను, ఓ మామూలు గుమ్మడికాయను ఇంటికి ఎలా తీసుకు వెళ్ళాలి?' అని అతను ఆ గుమ్మడికాయను అక్కడే ద్వారం ప్రక్కన వదిలి పెట్టేశాడు. నిరాశగా ఇల్లు చేరుకున్నాడు.
కీర రాజ్యంలోనే 'సత్య వ్రతుడు' అనే ఇంకో బ్రాహ్మణుడు ఉండేవాడు. సత్యవ్రతుడు నీతివంతుడు. కానీ చాలా పేదవాడు. తన శిష్యులకు శాస్త్రవిద్యలతోబాటు మంచి ప్రవర్తన ఎలా ఉండాలో కూడా నేర్పించేవాడు ఆయన. రాజ్యంలో ప్రజలు అసౌకర్యాలతో కష్టపడుతుండటం చూసి ఆయన ఊరుకోలేకపోయాడు. ఒక రోజున ఆయన పనిగట్టుకొని రామలింగరాజు దగ్గరికి వెళ్ళి, "రాజా! కీర రాజ్యంలోని ప్రజలు నానా బాధలకూ లోనౌతున్నారు. వారి అగచాట్లు పట్టించుకొనవలసిన మీరు, పొగడ్తలకు బానిస అని జనశృతి. పొగిడేవారిని ప్రక్కన పెట్టి, వాస్తవాలను స్వయంగా తెలుసుకోండి. రాజ్యంలో పర్యటించండి. దేశాన్ని కాపాడండి" అని హితవు చెప్పాడు.
రాజుకు చాలా కోపం వచ్చింది. సత్యవ్రతుడిని చీవాట్లు పెట్టి, సభాముఖంగా అవమానించాడు. ద్వారపాలకుడిని పిలిచి, 'ఈ బ్రాహ్మణుడిని బయటికి గెంట'మన్నాడు.
నిజాన్ని నిర్భయంగా పలికిన సత్రవ్రతుడంటే గౌరవభావం కలిగింది ఆ ద్వారపాలకుడికి. అతను సత్య వ్రతుడిని బయటికి తీసుకెళ్ళి నమస్కరించి, "స్వామీ, మీ మాటల్లోని వాస్తవాన్ని రాజుగారు గుర్తించలేదు గానీ, నాబోటి సామాన్యులెవ్వరం గుర్తించకుండా ఉండలేము. చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు, మీ మాటలు రాజుగారి ముందు వృధా అయ్యాయి. బాధపడకండి. నిర్భయంగా నిజం చెప్పిన మీకు సన్మానం చేసేంత గొప్పవాడిని కాదుగానీ, ఏదో భక్తి కొద్దీ సమర్పించుకుంటున్నాను, ఈచిన్న బహుమతిని- కాదనకుండా స్వీకరించండి-" అని సుబ్బావధాని వదిలేసిన గుమ్మడి కాయను ఆయనకు ఇచ్చాడు.
సత్యవ్రతుడు అతన్ని ఆశీర్వదించి, ఇంటికి వెళ్ళి, భార్య చేతికి గుమ్మడికాయ ఇచ్చి కూర వండమన్నాడు. ఆవిడ దాన్ని కోయగానే వజ్రాలు, వైఢూర్యాలు, మణులు, మాణిక్యాలు అన్నీ జలజలా రాలాయి!
వాటిని చూసి సత్యవ్రతుడి భార్య చాలా సంతోషపడ్డది. అయితే ఆ విషయాన్ని చెప్పగానే సత్యవ్రతుడు వాటినన్నిటినీ పట్టుకొని రాజ భవనానికి బయలుదేరాడు. "తనకు ఆ బహుమతిని ఇచ్చిన ద్వారపాలకుడికే అవన్నీ చెందుతాయి" అని ఆయనకు గట్టిగా తోచింది.
అయితే ద్వారపాలకుడు వాటిని తీసుకునేందుకు ససేమిరా అంగీకరించలేదు. "నేను ఒకసారి బహుమతిగా ఇచ్చేశాక అది మీదే" అన్నాడు.
సత్యవ్రతుడు బలవంతం చేసేసరికి అతను "అసలు ఆ గుమ్మడికాయ నేను పండించింది కాదు. అందువల్ల అది నాది కాదు. ఆ కాయను తిరస్కరించి, అక్కడే పడేసి వెళ్ళాడు సుబ్బావధాని. అందుకని అది సుబ్బావధానికి చెందదు. దాన్ని ఆయనకు రాజుగారు బహుమానంగా ఇచ్చారు; అందువల్ల ఇప్పుడది రాజుగారిదీ కాదు- కనుక దాని మీద సర్వ హక్కులూ మీవే" అన్నాడతను.
ఈ గొడవంతా విన్నారు రాజుగారు. అంత సంపదనూ వెనక్కి తీసుకొచ్చిన సత్యవ్రతుడి నిజాయితీ ఆయనకు నచ్చింది. దాన్ని తిరస్కరించిన తన ద్వారపాలకుడి మంచితనమూ, అందుకై అతను చూపిన కారణాల వెనుక గల తార్కికశక్తీ ఆయనను మురిపించాయి. ఆయన వాళ్ళిద్దరినీ పిలిపించి మర్యాదగా కూర్చోబెట్టి, ఆ సంపద యావత్తూ సత్యవ్రతుడిదేనని తీర్పునిచ్చారు. భయంలేకుండా రాజ్యపు స్థితిని తన దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నించినందుకు ఆయనను మరోసారి సత్కరించారు.
ద్వారపాలకుడిని తన ప్రధాన సలహాదారుగా నియమించుకున్నారు. ఆనాటినుండీ ఆయన తన నైజాన్ని మార్చుకున్నాడు. పొగడ్తలకు లొంగక, రాజ్యపరిస్థితులను స్వయంగా తెలుసుకుంటూ చక్కని రాజుగా పేరుగాంచాడు.