అడవికి దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెలో మాధవయ్య అనే పేదవాడు ఒకడు ఉండేవాడు. అతను, అతని భార్య- ఇద్దరూ ప్రతిరోజూ అడవికి పోయి కట్టెలు కొట్టి తెచ్చి, బస్తీలో వాటిని అమ్ముకొని జీవించేవాళ్ళు. వాళ్ళకు ఒక్కతే కూతురు- పేరు విజయ. విజయకు యుక్త వయస్సు వచ్చింది- చాలా అందంగా ఉండేది ఆ అమ్మాయి. రోజులు గడిచేకొద్దీ మాధవయ్యకు విజయ పెళ్ళి గురించిన చింత పట్టుకున్నది. అయితే తెలివిగలవాడు కనుక, సరైన సంబంధం దొరికే వరకూ తొందర పడకూడదనుకున్నాడు.

ఒకసారి మాధవయ్య భార్యకు జబ్బు చేసింది. చాలా రోజులపాటు పని చేయలేకపోయింది ఆమె. అందుచేత, 'పనిలో సాయం ఉంటుంది గదా' అని, విజయను కూడా తనతోబాటు అడవికి పిలుచుకు పోయేవాడు మాధవయ్య.

ఒక రోజున అట్లా వాళ్ళిద్దరూ అడవిలో కట్టెలు కొడుతుండగా- వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది ఒక సింహం!

దానిని చూసిన మాధవయ్య, విజయలకు పై ప్రాణాలు పైనే పోయిన-ట్లైంది. తప్పించుకుని పారిపోయే మార్గం కనిపించ లేదు. చావు తప్పదనిపించింది; కాళ్ళు నేలకు అతుక్కు పోయాయి. గట్టిగా కళ్ళు మూసుకొని, భయంతో వణికిపోతూ నిలబడ్డారు ఇద్దరూ.

సింహం మెల్లగా వాళ్ళదగ్గరికి వచ్చి నిలబడి, గంభీరంగా అన్నది- "మాధవయ్యా! నీ కూతురు నాకు చాలా నచ్చింది. ఆమెనే పెండ్లి చేసుకోవాలని కోరిక కలిగింది నాకు. కనుక నువ్విప్పుడు ఆమెను నాకిచ్చి పెండ్లి చెయ్యి!" అని.

మాధవయ్యకు మతిపోయినట్లైంది. ఏమంటే ఏం ముంచుకొస్తుందో తెలీదు! అతని మెదడు చురుకుగా పనిచేసింది. ఎట్లాగైనా దీని బారినుండి ఇప్పటికి తప్పించుకుంటే చాలుననుకొని, అతను మర్యాదగా "నా భార్యతో ఆలోచించి చెప్తాను సింహరాజా! నాక్కొంత సమయం‌ ఇవ్వు" అన్నాడు.

'సరే, అయితే రేపు మళ్ళీ కలుస్తాను, ఆలోగా ఆలోచించండి. ఒకవేళ మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్ళి చెయ్యకపోతే నేను మిమ్మల్నిద్దరినే కాక, మీ అమ్మాయిని కూడా చప్పరించేస్తాను మరి, చూసుకోండి" అని ఎంచక్కా బెదిరించి వెళ్ళిపోయింది సింహం. అయినా మాధవయ్య సంతోషంగానే ఊపిరి పీల్చుకున్నాడు: 'మరునాడు అసలు అడవికే వెళ్ళకపోతే సరి' అనుకున్నాడు.

అయితే మరునాడు తెల్లవారి తలుపులు తెరిచే సమయానికి సింహం వాళ్ళ ఇంటి ముందుకొచ్చి నిలబడి ఉన్నది! మాధవయ్య కంగు తిన్నాడు. అది అంతగా గుర్తుపెట్టుకొని ఇంటికి వస్తుందనుకోలేదు అతను. ఇప్పుడేం చేయాలి?

చేసేదేమీ లేక అతను దాన్ని లోనికి ఆహ్వానించి కూర్చోబెట్టి, మర్యాదలు చేశాడు. "మృగరాజా! అమ్మాయిని నీ కిచ్చి వివాహం జరపటానికి అంగీకరిస్తున్నాం. కానీ పెళ్ళి మాత్రం మా ఆచారం ప్రకారం జరగాలి. ఇంకో రెండు షరతులకు గనక నువ్వు అంగీకరిస్తే వెంటనే మీ యిద్దరికీ పెళ్ళి జరిపించేస్తాం!" అన్నాడు.

"మీ ఆచారం ప్రకారమే పెళ్ళి జరపండి. ఆ షరతులేమిటో ముందుగా చెప్పండి" అంది సింహం, దర్పంగా.

"మరేమీ లేదు- అమ్మాయిని పెంచి ఇంత పెద్దదాన్ని చేశాను కదా, నాకు చాలా డబ్బు ఖర్చైంది. అందుచేత ముందుగా నాకు కొంత డబ్బో, దస్కమో ఇవ్వాలి నువ్వు!" అన్నాడు మాధవయ్య.

"ఓహోహో! అదేమంత పెద్ద కోరిక? నా దగ్గరున్నంత బంగారం వేరే ఎవ్వరిదగ్గరా లేదు. నువ్వు మోయలేనంత బంగారం తెచ్చి ఇస్తాను చూడు!" అని తన గుహకు పరుగెత్తింది సింహం. బాటసారుల్ని చంపి తను కూడబెట్టిన ధనరాసుల్లోంచి కొంత బంగారాన్ని ఒక మూట నిండా నింపి పట్టుకొచ్చి మాధవయ్యకి ఇచ్చేసింది: "రెండవ షరతు ఏమిటో చెప్పు. నాకు పెళ్ళెప్పుడో చెప్పు!" అన్నది, మాధవయ్య గుక్క తిప్పుకునేలోపు.

మాధవయ్య సింహాన్ని బాగా మెచ్చుకొని సంతోషపెట్టి, తన కూతురి వంక చూపుతూ, "ఏమీ లేదు సింహరాజా! విజయకు నీ గోళ్ళు, కోరలు చూస్తే భయంగా ఉందట. తన భర్తకు అంత వాడి గోళ్ళు, అంత పదునైన పళ్ళు ఉంటే తను తట్టుకోలేనంటున్నది. అందుకని, నువ్వు వాటిని కాస్త వదిలించుకొని వచ్చావంటే, వెంటనే నీ పెళ్ళి జరిపిస్తాను- ఇంకే అడ్డంకీ ఉండదు" అన్నాడు.

పెళ్ళిని తలుచుకొని సింహానికి మనసు నిలవలేదు. అయితే గోళ్ళు, కోరలు పీక్కోవటం దానికి చేతకాలేదు.

అది స్వయంగా ఒక పట్టకారును, చాకును తీసుకొచ్చి మాధవయ్యకిచ్చి, తన కోరలు గోళ్ళు పీకి పెట్టమన్నది. "అమ్మో! నాకు భయం! నీకు నొప్పి పుట్టిందంటే నన్నేం చేస్తావో!" అని భయం‌ నటించాడు మాధవయ్య. "ఏమీ పరవాలేదు. నొప్పిని భరిస్తాను- నిన్నేమీ అనను" అని సింహం భరోసా ఇచ్చాక, అతను ముందుకెళ్ళి, దాని గోళ్ళు, కోరలు పీకేశాడు ధైర్యంగా.

పెళ్ళి మోజులో బాధనంతా భరించింది సింహం. దాని మొండితనాన్ని చూసి మాధవయ్యకే కొంచెం సేపు ముచ్చట వేసింది. పని అంతా అయిపోగానే అది "ఊ , ఇక కానివ్వండి! త్వరగా పెళ్ళి జరిపించండి! ఆలస్యంచేశారంటే నేను సింహాన్నని నిరూపిస్తాను- ఆపైన మీ ఇష్టం" అని గర్జిస్తూ అందరినీ తొందరపెట్టింది.

"మా ఆచారం ప్రకారం పెళ్ళి కుమారుడికి ముందుగా బడితెతో పెళ్ళి జరుపుతారు." అని మాధవయ్య, అతని భార్య, కూతురు- ముగ్గురూ మూడు కర్రలు పట్టుకొచ్చి సింహాన్ని ఎడాపెడా బాదారు. అది తిరగబడిందిగానీ, దానికిప్పుడు గోళ్ళు, పళ్ళు లేవు కదా, అందుకని ఏమీ చేయలేకపోయింది. చివరికి ఆ దెబ్బలు భరించలేక అది అడవిలోకి పారిపోయింది!

అటుపైన సింహం ఇచ్చిన బంగారంతో ఒక పెద్ద వ్యాపారం ప్రారంభించింది విజయ. వాళ్ల దుకాణానికి "మృగరాజా అండ్ కో" అని పేరెందుకు పెట్టుకున్నారో ఎవ్వరికీ తెలీలేదు- మనకు తప్ప!