అది ఒక జంతు సంరక్షణ శాల. అందులో అన్ని జంతువులూ సైజుల వారీగా వేరు వేరు బోనుల్లో ఉన్నాయి. కానీ డైనోసార్, జిరాఫీ, ఏనుగు మాత్రం ఒకేచోట ఉన్నై. జిరాఫీ చెట్టు ఆకులను తినేందుకు ప్రయత్నిస్తోంది.
ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు కానీ, ఒక్క ఏనుగు మాత్రం అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ అనుకుంటోంది: "ఈ మానవులకు అస్సలు బుర్రలేదు, బుద్ధి లేదు! ఆకారాన్ని బట్టి, పరిమాణాన్ని బట్టి నన్నూ, డైనోసార్ని, ఆ జిరాఫీని ఒక్క బోనులోనే ఉంచారు. జిరాఫీతో ఏదో ఒకలాగా నెట్టుకొని వస్తాను- పోయి పోయి ఈ డైనోసార్ని ఇక్కడే ఉంచారు గదా!? కదలాలంటే భయం, అరవాలంటే వణుకు! ఈ వెర్రి జిరాఫీ మాత్రం ఆ కొండ డైనోసార్ని తగిలేలా తిండి కోసం ఎగబడుతోంది. అది ఒక్క పెట్టు పెట్టిందంటే అప్పుడు తెలుస్తుంది- డైనోసారా, మజాకా అని!" అని అనుకుంటూ ఉంది.
ఇంతలోనే జిరాఫీ దాని దగ్గరికి వచ్చి "ఏమిటక్కా! అంత కంగారుగా ఉన్నావు?" అని అడిగింది. ఏనుగు తన కోపాన్ని పంటి బిగువున ఉంచి, "ఏమిటా?! 'ఇద్దరం ఒకేలా ఉన్నాం' అనుకొని, తల్లిలా భావించి ఆ డైనోసార్ దగ్గర కు వెళ్తున్నావు. ఆ డైనోసార్ నీకు సవతి తల్లి- తెలుసా?" అన్నది. ఈ మాటలు విన్నాయి- మిగిలిన జంతువులన్నీ. అవన్నీ నవ్వుకొని, ఏనుగుని ఆట పట్టించాలనుకున్నాయి:
"అదేమిటి పిన్నీ!? నీకు అండగా నేను లేనా? నీకు ఏమైనా అయితే నేను ఊరుకుంటానా?" అంది పాము. ఏనుగుకు చర్రున కోపం వచ్చేసింది: "ఎవరే, నీకు పిన్ని? నీకు నాకు ఉన్న బంధం ఆ శివపూజ నాడే తెగి పోయింది. కావాలంటే ఆ పెంగ్విన్ తో పెట్టుకో" అని అన్నది. వెంటనే పెంగ్విన్ "చాలు- చాల్లేవమ్మా! ఆ పాముకూ, నాకూ స్నేహమా? నీకు వచ్చిన ఆపద సమయంలో నా కు చేతనైన సాయం నేను సొంతగా చేస్తాను" అన్నది. ఆ మాటలతో ఏనుగుకు కోపం, బాధ, నవ్వు ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉన్నాయి.
ఇంతలో తాబేలు "నేను లేనామ్మా, ఏనుగూ!? నీ ఆపద సమయంలో నేను నిన్ను ఆదుకుంటానులే, భయపడకు" అన్నది. ఏనుగు ఉడుక్కున్నది. తన బాధను మనసులోనే అదుముకుంటూ "మీరా?! మీరు- నాకు సాయం చేస్తారా? మిమ్మల్ని కూడా నాతోబాటు ఈ బోనులో పెట్టి ఉంటే తెలిసేది. నా ఇనుప పాదంతో తొక్కి చంపేసేదాన్ని" అన్నది కోపంగా.
దానితో అవతలగా ఉన్న సింహం అందుకొని, "అదేమిటి ఒదినా? నన్ను ఉండనీ, నీ బోనులో! నిన్ను ఆనందంగా ఉంచుతాను!" అన్నది. ఆ మాటలతో ఏనుగుకు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. "నువ్వా?!" అని మనసులో అనుకొన్నది: "నువ్వు కలలో వచ్చినా చాలునే, నాకు గుండె పోటు వస్తాది! ఇంక నీ దగ్గరే ఉంటే-?! అమ్మో?" అనుకొని, పైకి మాత్రం "వద్దులే సింహం బాబూ! నేనేమంత పిరికి దానిని కానులే, నా బాగు నేను చూసుకోగలను!" అన్నది.
ఇంతలో కంగారూ, కంగారు-కంగారుగా వచ్చి, "అయ్యో! ఇదేంటి? ఇక్కడ డైనోసార్ ఉందేమిటి?!" అని ఆశ్చర్యంగా అడిగింది.
ఏనుగు ఒక్కసారిగా కళ్ళనీళ్ళు పెట్టుకున్నది. "ఇందాకటినుండీ నా బాధ అదే! ఏ ఒక్కరికీ అర్థం కావడం లేదు-మనమెంత ప్రయాదంలో ఉన్నామో!" అన్నది.
ఇంతలో కోతి, చింపాంజి అరటి పండ్లు నోట్లో కుక్కుకుంటూ "ఆ డైనోసార్ని చూసి భయమెందుకు? అది మాకంటే బలమైనదా, ఏమిటి?!" అన్నాయి.
దాంతో ఏనుగు కోపం తారాస్థాయికి చేరుకొన్నది: "నా తొండంతో కొడితేనే మీరు ఒక మైలు దూరంలో పడతారు- ఆ డైనోసార్ కంటే బలమైన వాళ్ళా, మీరు? మీకు తెలుసో తెలీదో- ఆ డైనోసార్ కోట్ల సంవత్సరాల క్రిందట ఈ భూమి మొత్తాన్నీ ఏలింది! ఇప్పుడు అదే మన మధ్యకు చేరుకున్నది! తలచుకున్నదంటే అది మనల్నందరినీ చంపేస్తుంది. మీకు భయం వేయట్లేదా? ఒక్క సారిగా అందరం ఈ 'జూ'ని వదిలి పారిపోదాం - అందరూ సరే అనండి!" అన్నది ఆవేశంగా.
అన్ని జంతువులూ ఒక్కసారిగా గొల్లుమని నవ్వాయి. ఏనుగుకు భయం, కోపం, చికాకు, అసహనం, సిగ్గు- అన్నీ ఒకేసారి ముంచుకొచ్చాయి. "ఎందుకు నవ్వుతున్నారు? ప్రాణాలంటే మీకు మాత్రం తీపి లేదా?" అన్నది.
అప్పుడు జిరాఫీ ఇకిలిస్తూ "అయ్యో, ఏనుగుక్కా! ఇది నిజమైన డైనోసార్ కాదు! బొమ్మ మాత్రమే! లేకపోతే ఇది మనతో పాటు ఆ మనుషుల ప్రాణాల్ని కూడా తీస్తుంది- ఆ సంగతి వాళ్ళకు మాత్రం తెలియదా?!" అన్నది.
దాంతో ఏనుగు హాయిగా ఊపిరి పీల్చుకొన్నది. పైకి మాత్రం బడాయిగా "నా కోసం కాదు చెల్లీ, మీ అందరి కోసమే! అయినా ఇది బొమ్మ డైనోసారా? 'నిజందేమో' అని హడలి చచ్చాను!" అని దాన్ని ముట్టుకొని చూడసాగింది. అన్ని జంతువులూ దాని బడాయి తనాన్ని చూసి మళ్ళీ ఓసారి నవ్వుకున్నాయి.