అనగనగా ఒక ఊరిలో సుశీల అనే అమ్మాయి ఉండేది. ఆమెకి దయ్యాలన్నా, దయ్యాల కథలన్నా ఆసక్తి ఎక్కువ. అందువల్ల ఆమె దయ్యాల పుస్తకాలు ఎక్కువగా చదువుతుండేది. ఆ పుస్తకాల్లో రాసినట్లు, అర్థరాత్రి కుక్కలు అరిచినా, పొగ వచ్చినా, ఇక దయ్యాలు రాబోతున్నాయని అనుకునేది.
ఒకరోజున ఆమె నిద్రపోతుండగా ఒక కుక్క గట్టిగా అరిచింది. ఆ కుక్కకి దెబ్బతగిలి అరిచింది, పాపం. ఆ అరుపులు విని మేలుకున్నది సుశీల. అదే సమయానికి ఇంటి ప్రక్కన ఉన్న చెత్తకుప్పలోంచి పొగ వస్తున్నది. సుశీలకు భయం వేసింది. ప్రక్కనే పడుకున్న అమ్మ-నాన్నల్ని లేపి, "చూడండి- పొగ, కుక్క అరుపు! ఇప్పుడు దయ్యం రాబోతోంది... వచ్చేస్తుంది, ఇక!" అని ఏడిచింది. అమ్మ నాన్న ఆమెను దగ్గరికి తీసుకొని సముదాయించి, ఏమీ రావట్లేదని సర్ది చెప్పి పడుకోబెట్టేసరికి వాళ్ల తల ప్రాణం తోకకు వచ్చింది.
అటుపైన సుశీల నిద్రపోయేందుకు ప్రయత్నించింది, కానీ నిద్ర పట్టలేదు. మళ్ళీ ఒకసారి కుక్క అరిచేసరికి. భయం వేసి చెవుల వరకూ దుప్పటి కప్పుకొని పడుకున్నది.
మరుసటి రోజున తన ఎదురుగుండా ఒక పిల్లి ఉన్నది. అది రాక్షస బల్లిగా మారుతున్నట్లు అనిపించింది సుశీలకు. భయంతో కెవ్వున అరిచింది. అందరూ పరుగెత్తుకొని వచ్చారు- "ఏమైంది, ఏమైంది!?" అంటూ. పిల్లి రాక్షసబల్లిగా మారటం గురించి చెప్పేసరికి, అందరూ ఆమెను పిచ్చిదాన్ని చూసినట్టు చూసి వెళ్ళిపోయారు.
కాసేపటికి, వాళ్ళమ్మకు తాడు అవసరమై, సుశీలను తెమ్మన్నది. సుశీల లేచి వణుక్కుంటూనే వెళ్ళింది- కానీ చూస్తే, తాళ్ళు ఉండాల్సిన చోట నిండా పాములున్నై!! "పాములు! పాములు!!" అని అరవటం మొదలు పెట్టింది కళ్ళు మూసుకొని. సుశీల వాళ్లమ్మ పరుగున వచ్చింది: చేతిలో ఒక కర్ర పట్టుకొని. కానీ, నిజంగా చూసేసరికి, అక్కడ ఉన్నవన్నీ తాళ్ళే! ఒక్క పాము కూడా లేదు!
సుశీల వాళ్ల అమ్మకి అంతా అర్థం అయ్యింది. సుశీలకు ధైర్యం చెప్పింది. తను చూసినవన్నీ నిజంకాదని, అంతా తన భ్రమనే అని వివరంగా చెప్పింది. డాక్టరు గారి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆవిడకూడా చాలా సేపు మాట్లాడి, సుశీల భయం పోగొట్టింది. దీనంతటికీ కారణం తను చదువుతున్న దయ్యాల పుస్తకాలే అని తెలుసుకున్నది సుశీల. ఆ కట్టు కథల్ని నమ్మకూడదని అర్థమైంది. వాటిని గురించి ఎక్కువగా ఆలోచిస్తే లేనిపోని అనర్థాలు వస్తాయని తెలిసిందిప్పుడు.
అటుపైన సుశీలకిక భయం వెయ్యలేదు. దయ్యాల కథల్ని చదివినా, "ఎంత చెత్తగా రాశారు! అన్నీ అబద్ధాలే!" అనుకుని నవ్వేది సరదాగా.