బారిస్టరు గాంధీ కోర్టుకు వెళ్ళేటప్పుడు మిగిలిన యూరోపియన్‌ల మాదిరి సూటూ, బూటూ, హ్యాటూ, లోపల ఒక చొక్కా, చొక్కాకు విడిగా ఒక కాలరు, మెడకొక టై- ఇవన్నీ వేసుకునేవాడు. ప్రతిరోజూ చొక్కాకు మ్యాచ్ అయ్యేట్లు కొత్త కాలర్ కావలసి వచ్చేది. చొక్కాని రోజువదిలి రోజు మార్చేవాడు- దాంతోబాటే మిగతావన్నీ మార్చాల్సి వచ్చేది. ఇక ఆ బట్టలన్నింటినీ ఉతికేందుకు చాలా ఖర్చు అయ్యేది- బట్టలుతికే ఖర్చు ఎక్కువౌతున్నదని చింత పట్టుకున్నది గాంధీకి.

ఇలా రెండురోజులకొకసారి బట్టలు మార్చి, ఉతికేందుకు వేస్తే, అక్కడి చాకలివాళ్ళు వాటిని అంత తొందరగా వెనక్కి ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు సర్వ స్వతంత్రులు! అంతా వాళ్ల దయ! అందుకని, మంచి మంచి బట్టలు ఎక్కువమొత్తంలో ముందుగా జమచేసుకొని పెట్టుకుంటే తప్ప, గాంధీ అవసరానికి బట్టలు అందేవి కాదు. చివరికి, ముఫ్ఫై ఆరు జతల బట్టలున్నా గాంధీకి సరిపోలేదు!

బట్టల ఖర్చు తడిసి మోపెడయ్యాక, 'ఇక ఖర్చులు తగ్గించాల్సిందే' అని నిశ్చయించుకున్నాడు గాంధీ. కానీ ఎలా? తనకేమో బట్టలు ఉతుక్కోవటం రాదు- ప్రధానమంత్రి కొడుకాయె! చివరికి, ఇక తప్పదన్నట్లు, తన బట్టలు తాను ఉతుక్కునేందుకు అవసరమయ్యే సామగ్రినంతా కొని తెచ్చుకున్నాడు. బట్టలు ఉతకటం గురించిన పుస్తకం ఒకటి కొనుక్కొచ్చుకుని, ముందు దాన్నంతా శ్రద్ధగా చదివాడు. ఒకసారి ఆ సూచనలన్నీ మనసుకెక్కాక, ఇక వాటిని అమలు చేసేందుకు పూనుకున్నాడు. తన ప్రయోగాల్ని ఊరికే కూర్చొని చూసే అవకాశం ఇవ్వలేదు కస్తూర్బాకు- ఆమెకూ బట్టలు ఉతకటం నేర్పేశాడు! గాంధీకి అంటిన ఈ కొత్త పిచ్చి అతనికున్న ఇతర పనులమీద ఇంకొంచెం ఒత్తిడిని పెంచింది- కానీ ఓటమిని అంత తొందరగా అంగీకరించే రకం కాదు, గాంధీ- "అక్కడి చాకలివాళ్ల బల దర్పాన్ని త్రుంచి, తను ఎలాగైనా సరే, ఆత్మ నిర్భరుడు కావాలి" అనుకున్నాడు. ప్రయత్నం కొనసాగిస్తూ పోయాడు.

ఒక రోజున గాంధీ తన చొక్కా కాలరును ఉతికి, బాగా గంజి పెట్టుకున్నాడు. పని ఇంకా సరిగ్గా రాదు కదా, ఆ కాలరుకు గంజి ఎక్కువైంది. పైపెచ్చు, దాన్ని బాగా వేడెక్కిన ఇస్త్రీ పెట్టెతో ఇస్త్రీ చెయ్యటానికి బదులు, మామూలు వేడితో‌ పని కానిచ్చేశాడు. "కొంచెం బలంగా ఒత్తితే చాలు" అనుకున్నాడు. "కాలిపోదూ, వేడి ఎక్కువైతే?" అనుకున్నాడు. ఇక అది గట్టిగా, అట్టలాగా, నీలుక్కొని, అలాగే నిల్చుండి పోయింది. మనవాడు దానినే వేసుకొని, గర్వంగా కోర్టుకు పోయాడు. తోటి లాయర్లందరూ పడి పడి నవ్వుతున్నా, గాంధీ మాత్రం చెక్కు చెదరలేదు. "ఏముంది? ఇది మొదటిసారి కదా, నేను సొంతగా ఉతుక్కున్నది?! అందుకని గంజి కాస్త ఎక్కువైనట్లుంది: కానీ ఏమీ పరవాలేదులే. కనీసం అది మిమ్మల్ని ఇంతగా నవ్వించింది- అంతేచాలు!" అన్నాడు తనూ నవ్వేస్తూ.

వాళ్లలో ఒకతను అడిగాడు- "ఇక్కడ ఇస్త్రీ షాపులకు అంత కొరత ఏమీ లేదే?!" అని. "లేదు. కానీ, బట్టలకయ్యే ఖర్చు ఎక్కువగానే ఉంటోంది. ఒక కాలరును ఉతికేందుకు అయ్యే ఖర్చుతో కొత్త కాలరునే కొనుక్కోవచ్చు! అంతేగాక ఆ ఉతికేవాళ్ళమీద నిరంతరంగా ఆధారపడి బ్రతకటం ఉంది- దానికంటే సొంతంగా ఉతుక్కోవటమే మేలు!" అన్నాడు గాంధీ.

తర్వాతి కాలంలో గాంధీ గొప్ప చాకలివాడు అయ్యాడు. బట్టలు ఉతికే కళలో నిష్ణాతుడయ్యాడు.

గాంధీకి గోఖలే అంటే గురుభావం ఉండేది. ఒకసారి గోఖలే వచ్చాడు, గాంధీ వాళ్ళ ఇంటికి. ఆరోజున గోఖలే ఏదో పెద్ద సభకు వెళ్ళ వలసి ఉన్నది. ఆయన మెడకు కట్టుకున్న గుడ్డ బాగా నలిగిపోయి ఉన్నది; కానీ దాన్ని ఉతికించుకునేందుకు సమయం చాలదు. గాంధీకి అవకాశం దొరికింది- "నేను దాన్ని చక్కగా ఇస్త్రీ చేసిపెట్టనా?" అని అడిగాడు గురువుగారిని.

"లాయరుగా నీ శక్తి సామర్ధ్యాలమీద నాకు నమ్మకం ఉంది. కానీ చాకలివాడుగా అస్సలు నమ్మలేను. దాన్ని నువ్వు పాడు చేయవని ఎలా నమ్మేది?" అన్నాడు గోఖలే. కానీ గాంధీ పట్టిన పట్టు వదలక, గురువుగారిని పీడించి మరీ దాన్ని ఇస్త్రీ చేశాడు. గోఖలేకు గాంధీ పనితనం నచ్చింది కూడా! ఆయన గాంధీని మెచ్చుకునేసరికి, "నాకు ఈ ప్రశంస చాలు- ఇక ఈ ప్రపంచంలో ఎవ్వరినుండీ నాకు ఎలాంటి సర్టిఫికేటూ అవసరం లేదు" అని సంబరపడ్డాడు గాంధీ.

దక్షిణాఫ్రికాలో గాంధీ ఆశ్రమంలో నీళ్ల సమస్య ఉండేది. ఆడవాళ్ళు దూరంగా ఉండే వంకకు వెళ్ళి, బట్టలు ఉతుక్కొని వచ్చేవాళ్ళు. ఆ పనిలో గాంధీ వాళ్ళకు సాయపడేవాడు. ఆరోజుల్లోనే కొత్తగా ఆశ్రమంలో ముతక ఖాదీ బట్టలు నేయటం మొదలుపెట్టారు- ఆడవాళ్ళు ఆ చీరల్ని కట్టుకునేందుకైతే ఇష్టపడేవాళ్ళు; కానీ ఉతుక్కోవటం దగ్గరికి వచ్చేసరికి సణిగేవాళ్ళు. అప్పుడు ఇక గాంధీ కొంత కాలం పాటు పూర్తిస్థాయి చాకలివాడుగా తన సేవలందించాడు.

గాంధీ ఇతరుల బట్టలు ఉతికేందుకు ఏమీ సిగ్గుపడేవాడు కాదు. ఒకసారి ఆయన ఎవరో ఒక ధనికుడి ఇంటికి అతిథిగా వెళ్ళాడు. స్నానం చేసేందుకని స్నానాల గదిలోకి వెళ్ళిన గాంధీకి, అక్కడొక చక్కని పంచె, నేలమీద పడి కనిపించింది. స్నానం చేశాక, ఆయన తన బట్టలతోబాటు ఆ పంచెను కూడా ఉతికాడు. ఆపైన వాటిని ఆరేసేందుకు ఎండలోకి పోయాడు- "తెల్ల బట్టల్ని ఎంతమంచి ఎండలో ఆరేస్తే అంత మంచిది- అవి అంత తెల్లగా మెరుస్తాయి; వాటిలోని క్రిములూ నశిస్తాయి" అనేవాడు గాంధీ. బట్టలు ఆరేస్తున్న గాంధీని చూసి ధనికుడు పరుగెత్తుకొచ్చాడు- "ఏంటిది, బాపూ!" అని నొచ్చుకుంటూ.

"తప్పేముంది? క్రింద పడ్డాక, పంచెకు మురికి అంటి ఉంటుంది. అందుకని నేను దాన్ని ఉతికి ఆరేస్తున్నాను. మనం వాడే వస్తువుల్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు సిగ్గేల?" అన్నాడు చాకలి గాంధీ, చిరునవ్వుతో.