మంగళ గిరి గ్రామంలో మాధవుడు అనే యువకుడు ఉండేవాడు. వాడు మంచివాడు, పట్టుదల గలవాడు. కానీ సిగ్గరి కావటంతో పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. దాంతో అందరూ వాణ్ణి ‘మందమతి’ అనీ, ‘ఆలోచించటం రాని వాడనీ’ అనేవాళ్ళు.
రాను రాను ఆ మాటల్ని నమ్మేసిన మాధవుడు, నిజంగానే తాను అనాలోచనా పరుణ్ణనీ, అసమర్ధుణ్ణనీ అనుకోసాగాడు. అది చూసి వాడి తల్లి చాలా బాధ పడేది.
ఓసారి ఊరి నుండి వాడి మేన మామ వాళ్ళని చూడవచ్చాడు. మాధవుడి గురించి అన్నతో చెప్పుకొని వాపోయింది వాడి తల్లి. నాలుగురోజులు మాధవుణ్ణి బాగా పరిశీలించిన మేనమామ, ఆమెకి భరోసా ఇచ్చాడు. ఆ రోజు సాయంత్రం మాధవుణ్ణి మాటల్లో పెట్టి, వాడి సామర్ధ్యాన్ని పొగిడాడు.
మాధవుడు విచారంగా "నన్ను ఆటపట్టిస్తున్నావా మామయ్యా! నాకు ఆలోచించటమే రాదు. ఇంకేం సామర్ధ్యం?" అన్నాడు.
మేనమామ వెంటనే "అయితే ఓ పందెం వేసుకుందాం. ఊరంతా వెదికి, దుఃఖ వృక్షం ఎక్కడుందో కనిపెట్టి, దానిని దేనికి ఉపయోస్తారో చెప్పు. ఆ పని నువ్వు చేస్తే నేను గెలిచినట్లు. అప్పుడు ‘నువ్వు సమర్దుడివి’ అన్న నా మాటని నువ్వు ఒప్పుకోవాలి. చెయ్యలేకపోతే నువ్వు గెలిచినట్లు. అప్పుడు ‘నువ్వు అసమర్ధుడివి’ అనే నీ మాటని, నేను ఒప్పుకుంటాను" అన్నాడు.
మాధవుడు సరేనన్నాడు.
మర్నాడు ఊరంతా గాలించాడు. "దుఃఖ వృక్షం అంటే ఏమిటి, ఎక్కడుంది?" అని అందర్నీ అడిగాడు. అందరూ వాణ్ణి చూసి నవ్వినా పట్టుదల విడిచిపెట్టలేదు. ఎవర్నడిగినా ఏమీ తెలియక పోవటంతో, చెఱువు గట్టున కూర్చున్నాడు.
పక్కనే ఉన్న చింత చెట్టు క్రింద పిల్లలు గోళీలాడుకుంటున్నారు. ఒక్కసారిగా మాధవుడికి దుఃఖాన్ని ‘చింత’ అంటారని గుర్తుకొచ్చింది. గబగబా చెట్టెక్కి, పై కండువా నిండా చింత పండ్లు తెంపు కొచ్చి తల్లికిస్తూ "అమ్మా! వీటితో పులిహోర చెయ్యి" అన్నాడు.
రాత్రి భోజనాల వేళ, మేనమామ వాడితో "ఏరా అబ్బాయ్! నువ్వు ఓడిపోయినట్లే కదా! ఇప్పుడు ఒప్పుకుంటావా నా మాటే నిజమనీ, నువ్వు సమర్ధుడివే, ఆలోచనా పరుడివేనని?" అన్నాడు కళ్ళెగరేస్తూ!
"నేను ఓడి గెలిచాను మామయ్యా!" అన్నాడు మాధవుడు నవ్వుతూ.
"ఓరి పిడుగా?" అన్నాడు మేనమామ సంతోషంగా!