పిల్లవాడుగా ఉన్నప్పుడు గాంధీకి పాములంటే చాలా భయం ఉండేది. చీకట్లోకి ఒంటరిగా పోవాలంటే కూడా భయం వేసేది. వాడి ఊహల్లో దొంగలు, భూతాలు, పాములు-ఇవన్నీ తనమీదికి దూకేందుకు సిద్ధంగా ఉన్నాయనిపించేది.

35ఏళ్ల వయసు వచ్చేసరికి గాంధీ ఆశ్రమాలు స్థాపించటం మొదలు పెట్టాడు. ఆశ్రమం అంటే కేవలం ఒక గుడిసె కాదు- పెద్ద స్థలం, బావి, వ్యవసాయానికి తగినంత భూమి, పండ్లతోట- ఇవి కాక, చాలామంది నివసించేందుకు వేరు వేరు గుడిసెలు- ఉండేవి ఆశ్రమాల్లో. అవన్నీ నగరాల దుమ్మునుండి, రొద నుండీ దూరంగా, ప్రశాంతమైన వాతావరణంలో ఉండేవి. గాంధీ దగ్గర పెద్దగా డబ్బు ఉండేది కాదు- అందుకని కూడా ఆయన ఎవ్వరికీ ఇష్టం కాని బీడు భూముల్ని ఎంచుకొనేవాడు. ఆయన స్థాపించిన అన్ని ఆశ్రమాలూ-ఫోనిక్సు ఆశ్రమం, టాల్‌స్టాయ్ ఆశ్రమం, సబర్మతీ ఆశ్రమం, వార్థా ఆశ్రమం, సేవాగ్రాం- ఇవన్నీ పాములతో నిండి ఉండేవి! ఆశ్రమాల్లో గుడిసెల నిర్మాణం‌ జరిగేంతవరకూ అందరూ గుడారాలు వేసుకొని ఉండేవాళ్ళు- పిల్ల పాపలు ఉంటారు గనక, ఈ పాముల బెడదతో చాలా భయం వేసేది.

ఒక రోజున పైకప్పుకు వేళ్ళాడుతూ విషపు పాము దొరికేది. ఒక రోజున సైకిళ్ళ దగ్గరే చుట్టలు చుట్టుకున్న పాములు కనబడేవి. ఒక్కోసారి అవి పడక గదుల్లోకి కూడా చొరబడేవి!

గాంధీ అహింసను నమ్మేవాడు. తనకు, భార్యకు, కొడుక్కు రోగాలతో ప్రాణం మీదికి వచ్చినా సరే, ఆయన మాంసం వాడలేదు. మాంసం నుండి, చేపలనుండీ తీసిన మందుల్నికూడా వాడనన్నాడు. ఆవుల్ని, బర్రెల్ని పీడించి పీడించి సేకరించే పాలు తనకు వద్దని, వాటి పాలు కూడా వాడటం మానేశాడు. అలాంటివాడు ఇక పాముల్ని ఎలా చంపుతాడు?

విషపు పాముల్ని కూడా చంపటానికి వీలు లేదని సాధారణ నియమం ఉండేది. త్రాళ్ళతో ఒక సాధనాన్ని తయారు చేశాడు గాంధీ- దానితో దూరం నుండే పాముల్ని పట్టుకోవచ్చు- ఆపైన వాటిని దూరంగా ఎక్కడైనా వదిలేసి రావచ్చు. అయితే మరి, పాములు అట్లా పట్టుకోడానికి అనువుగా లేని చోట్లలో కనబడితే ఎలాగ? పోనీ, వీలుగానే ఉన్నా, ఆ పని చేసేందుకు చేతులు రాకపోతే, భయం వేస్తే ఎలాగ? చివరికి గాంధీ ఓటమిని అంగీకరించాడు- "హింసను పూర్తిగా విడనాడటం దాదాపు అసాధ్యం. మనం కూరగాయలు కోసేటప్పుడు చెట్లకు కూడా బాధ కలుగుతుంది. ఎవరైనా పిల్లవాడు పాముకాటుతో చనిపోతే నేను తట్టుకోలేను. దానికంటే పాముల్ని చంపి పిల్లల్ని కాపాడటమే నయం. ఇప్పటికీ నాకు పాములంటే భయమే- ఇక నేను ఇతరులకు ఎలా చెప్పను? భయపడొద్దని?" అన్నాడు. "ఇతర మార్గాలన్నీ విఫలమైతే, అప్పుడు పామును చంపవచ్చు" అని అనుమతినిచ్చాడు చివరికి.

పాముల్ని గురించి నేర్చుకోవాలని గాంధీకి మహా ఉబలాటంగా ఉండేది. 'కాలెన్ బాచ్' అనే జంతు శాస్త్రజ్ఞుడి సాయంతో విషపు పాముల్ని ఎలా గుర్తించాలో నేర్చుకున్నాడు గాంధీ. ఇంకా బాగా, 'ప్రాక్టికల్‌గా' నేర్చుకునేందుకు, కాలెన్ బాచ్ ఒక నాగు పామును పట్టుకొని, దాన్ని ఒక బోనులో పెట్టాడు. దానికి తనే స్వయంగా రోజూ ఆహారం పెట్టేవాడు. ఆశ్రమంలో ఉండే పిల్లలు అందరూ దాన్ని చూసేందుకు ఎగబడేవాళ్ళు. ఎవ్వరూ దాన్ని పీడించేవాళ్ళు కాదు. అయినా గాంధీకి అది నచ్చలేదు. "దాని అలవాట్లు, పద్ధతులు తెలుసుకోవాలని మనం దాన్ని బంధించాం. అయితే మనం దాని పట్ల చూపిస్తున్న స్నేహభావం దానికి అర్థం అయి ఉండదు. దానితో ఆడుకునేంత ధైర్యం నీకూ లేదు; నాకూ లేదు. నీ స్నేహభావం వెనుకనే దాక్కుని ఉన్నది భయం. ఆ నాగుపామును మచ్చిక చూసుకుందామనుకోవటంలో దానిపట్ల ప్రేమ ఏమీ లేదు" అన్నాడు గాంధీ, కాలెన్ బాచ్ తో. ఆ సంగతి నాగుపాముకూ తెలిసినట్లుంది- అది ఒక రోజు బోనులోంచి తప్పించుకొని ఎటో పోయింది.

ఆశ్రమంలో ఉండే జర్మనీ దేశస్తుడొకడు పాముల్ని బాగా పట్టుకునేవాడు. పాములంటే అతనికి అసలు భయమే ఉండేది కాదు. చిన్న-పెద్ద పాముల్ని పట్టుకొని, వాటిని అతను తన అరచేతులమీద వేసుకొని ఆడించేవాడు. అంతటి ధైర్యం‌తెచ్చుకోవాలని గాంధీ మహా ప్రయత్నం చేసేవాడు. తను ముట్టుకోగానే, ఆ స్పర్శతోటే పాము "ఓహో! ఇతను నన్నేమీ చెయ్యడు" అని అనుకోవాలని ఆయనకు గొప్పకోరికగా ఉండేది. రామనామం జపించుకుంటూ విషపు పాము నోట్లో చెయ్యి పెట్టేంత ధైర్యం తెచ్చుకోవాలని ఉండేది గాంధీకి. కానీ తన చివరి రోజుల వరకూ కూడా ఆయన సొంతగా పాముల్నీ, తేళ్ళనీ పట్టుకోలేక-పోయాడు- అయితే ఆ విషయమై ఆయన సిగ్గు పడేవాడు చాలా సార్లు.

ఒకసారి నాయకులు కొందరు ఆయనతో‌ ఏవో ముఖ్య విషయాలు చర్చించేందుకు వెళ్ళి, అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కారణం- లోపల, గదిలో గాంధీ కూర్చొని ఒక పాముల వాడితో మాట్లాడుతున్నాడు. గాంధీ మెడను చుట్టుకొని ఉన్నది, ఒక పాము! గాంధీ వీళ్ళ రాకను గమనించనే లేదు- పాములవాడి మీదనే మనసంతా పెట్టాడు మరి! అప్పటికి గాంధీకి డెబ్భై ఏళ్ళు. ఆ వయస్సులో ఆయన పాములవాడికి శిష్యరికం చేస్తానని ముచ్చట పడుతున్నాడు. 'పాములు పట్టటమూ, పాము కాటుకు వైద్యం చెయ్యటమూ' నేర్చుకుంటాడట! ప్రయోగం చేసేందుకు, 'ఎవరైనా ఒక మనిషి పాము చేత కాటు వేయించుకోవాలం'టున్నాడు పాములవాడు. "ఎవరో ఎందుకు? నేను సిద్ధం" అని తయారౌతున్నాడు గాంధీ!!

నాయకులంతా కలిసి ఎంతో నచ్చజెప్పాక, చివరికి గాంధీ ఆ ఆలోచనను విరమించాడు. అలా డెబ్భై ఏళ్ల గాంధీతాత పాముల వాడికి శిష్యుడయ్యే బంగారు అవకాశాన్ని కోల్పోయాడు, పాపం!