మోహన్‌దాస్ గాంధీ వాళ్ల నాన్న రాజ్‌కోట సంస్థానానికి ప్రధానమంత్రి. వాళ్ల ఇంట్లో "ఉకా" అనే అతను పాకీ పని చేసేవాడు.
ఆ రోజుల్లో ఇప్పుడున్నట్లు "సెప్టిక్ లెట్రిన్లు" ఉండేవి కావు. డబ్బులున్నవాళ్ల ఇళ్లలో మరుగుదొడ్లు ఉండేవి; కానీ అవి చాలా వేరేగా ఉండేవి. టాయిలెట్ గదిలో చిన్న పాటి పిట్ట గోడ ఒకటి కట్టి ఉండేది- గోడవారగా. గోడకు, ఈ పిట్ట గోడకు మధ్య మట్టి వేసి ఉంచేవాళ్ళు. దొడ్డికి పోయేవాళ్ళు పిట్టగోడ మీద ఎక్కి కూర్చుంటే దొడ్డి అంతా వెనకనున్న మట్టి మీద పడేది. వాళ్ళు పని ముగించుకున్నాక, ఆ దొడ్డిమీద కొంచెం సున్నం, మట్టి చల్లిపోయేవాళ్ళు. ప్రతిరోజూ పాకీ పనివాళ్ళు వచ్చి, ఆ దొడ్డినంతా తమ పారలతో తాము తెచ్చుకున్న బుట్టల్లోకెత్తుకొని, తలమీద పెట్టుకొని తీసుకెళ్ళి దూరంగా పారేసేవాళ్ళు.
ఈ పాకీవాళ్ళు అంటరాని వాళ్ళు- ఇళ్లలోకి రాకూడదట, వాళ్ళు! అందుకని, వాళ్ళు వచ్చి పోయేందుకు వీలుగా, ఇళ్ళకు వెనకవైపున ఒక తలుపు ఉండేది. అలా పాకీవాళ్ళు నేరుగా టాయిలెట్లోకి వెళ్ళి, దొడ్డి నిండిన తట్టలు నెత్తిన పెట్టుకొని పోయేవాళ్ళు.
గాంధీ ఎప్పుడైనా ఉకాను ముట్టుకుంటే 'మైల' పడ్డట్లు లెక్క. అప్పుడు వాళ్ళమ్మ పుతలీబాయి వాడిని స్నానం చెయ్యమనేది- ఆ మైల పోయేందుకు. మామూలుగానైతే గాంధీ తల్లిదండ్రుల మాటలు చక్కగా వినేవాడు; చాలా విధేయుడుగా కూడా ఉండేవాడు. కానీ ఈ మైలపడటం, స్నానం చెయ్యటం మాత్రం వాడికి అస్సలు ఇష్టం అయ్యేవి కావు.
పన్నెండేళ్ల వయస్సులో వాడు తల్లితో వాదించేవాడు- "ఉకా మన పని చేసిపెడుతున్నాడు కదా? మన దొడ్డిని ఎత్తి పడేస్తున్నాడు. మనకు అంత సాయం చేస్తున్న మనిషిని ముట్టుకుంటే అంత నష్టం ఎందుకౌతుంది? ముట్టుకుంటే మైల పడేంత పాపపు పనా, అది? నేను నువ్వు చెప్పినట్లే స్నానం చేస్తాను- కానీ రామాయణం గుర్తు చేస్తానొకసారి- పడవ నడిపే గుహుడిని రాముడు కౌగిలించుకున్నాడు గదా? అప్పుడు తను మైల పడతానని ఆలోచించలేదు కదా! రామాయణం తప్పుగా ఎందుకు చెబుతుంది?" అని. పుతలీబాయి దీనికి జవాబు చెప్పలేకపోయేది.
గాంధీ పెద్దయ్యాక, దక్షిణాఫ్రికాలో బారిస్టరు పనిచేస్తూ, పాకీపని చెయ్యటం నేర్చుకున్నాడు. గాంధీ స్నేహితులు అతన్ని ఆ రోజుల్లో ప్రేమగా "అతి గొప్ప పాకీవాడు" అని పిలుచుకునేవాళ్ళు. అక్కడ మూడు సంవత్సరాలుండి, శలవు మీద ఒకసారి భారతదేశానికి వచ్చాడు గాంధీ.
సరిగ్గా అదే సమయానికి బొంబాయిలో ప్లేగువ్యాధి ప్రబలింది. ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ అయిపోసాగాయి. వ్యాధి రాజకోటకు కూడా ప్రాకే అవకాశం ఉన్నది. శలవుమీద వచ్చిన గాంధీ రాజకోటలో ఇల్లిల్లూ తిరిగి చూడటం మొదలు పెట్టాడు. ప్రతి ఇంట్లోనూ దొడ్డి గుంటలుండేవి- మురిగిపోయి, కంపు కొడుతూ, చీకటి కూపాలలాగా. కొందరు ధనిక అగ్ర వర్ణాల వాళ్ళు అయితే, వీధి కాలవల్లోనే దొడ్డికి పోయేవాళ్ళు. ప్రధానమంత్రి కొడుకు, విదేశంలో లాయరుగా పనిచేస్తున్నవాడు- వచ్చి ఇంటింటా తిరిగి దొడ్డిని పరీక్షించటం, ఆరోజుల్లో వింతగానే ఉండేది. "దొడ్డి, మూత్రం రెండిటినీ వేరు వేరుగా ఉంచేందుకు ప్రయత్నించాలి. వీటికోసం మట్టివేసిన బక్కెట్లు రెండింటిని వేరువేరుగా వాడాలి" అని ఇల్లిల్లూ తిరిగి చెప్పాడు గాంధీ.
దక్షిణాఫ్రికానుండి భారతదేశానికి రెండోసారి వచ్చినప్పుడు, గాంధీ 'భారత జాతీయ కాంగ్రెస్' జాతీయ సమావేశాలకోసం కలకత్తా వెళ్ళాడు. 'విదేశాల్లో మగ్గుతున్న భారతీయుల కష్టాల' గురించి ఆయన అక్కడ మాట్లాడాల్సి ఉన్నది. అయితే అతను అక్కడికి వెళ్ళేసరికి ఇతర నేతలు మాట్లాడుతున్నారు, వేదిక మీద. తన ఉపన్యాసానికి ఇంకా చాలా సమయం ఉన్నది.
ఊరికే అటూ ఇటూ తిరుగుతున్న గాంధీకి అక్కడి పరిసరాలు 'చాలా ఘోరం' అనిపించాయి. ఎక్కడ పడితే అక్కడ దొడ్డి, బురద, మురికి- పడి ఉన్నాయి. సభల్లో పాల్గొంటున్న ప్రతినిధులు కొందరైతే, ఏకంగా తమకు కేటాయించిన గదుల ముందే దొడ్డికి పోయి ఉన్నారు!
అక్కడ 'స్వచ్ఛంద సేవకులు' అని బ్యాడ్జీలు పెట్టుకొని తిరిగేవాళ్లను 'పరిశుభ్రత సంగతేమిటి?' అని అడిగాడు గాంధీ. "అది పాకీవాళ్ల పని- మాదికాదు" అన్నారు వాళ్ళు!!
గాంధీ ఊరికే ఉండలేకపోయాడు. ఎవరినో అడిగి, తనే స్వయంగా చీపురు పట్టుకొన్నాడు. అక్కడి దొడ్డిలన్నిటినీ శుభ్రం చేసి, తట్టలోకి ఎత్తి, దూరంగా పొయ్యటం మొదలు పెట్టాడు. ఆ సమయానికి అతను విదేశీయుల మాదిరి, సూటూ, బూటూ, హ్యాటూపెట్టుకొని ఉన్నాడు. అక్కడున్న స్వచ్ఛందసేవకులంతా ఒక ప్రక్కకు చేరి, ఆశ్చర్యపోతూ చూశారు తప్పిస్తే, ఒక్కరు కూడా "మేమూ చేస్తాం" అని ముందుకు రాలేదు.
చాలా సంవత్సరాల తర్వాత, గాంధీని 'భారత జాతీయోద్యమానికి కాంతిరేఖ' గా అందరూ గుర్తించిన తర్వాత, ప్రతి కాంగ్రెస్ సభలోనూ పాకీ పని కోసం "భంగీ స్క్వాడ్‌లు"-"పాకీ బృందాలు" ఏర్పడ్డాయి. కొంతకాలం పాటు ఆ భంగీ స్క్వాడ్ లలోకేవలం బ్రాహ్మణులే ఉండేవాళ్ళు!
సెప్టిక్ లెట్రిన్‌లు వచ్చినా, ఇంకా కొన్ని చోట్ల పాకీ పని రివాజుగా కొనసాగుతూనే వచ్చింది, చాలాకాలం వరకూ. చివరికి స్వతంత్ర భారత ప్రభుత్వం చట్టం చేసి, పాకీ పనిని నిషేధించింది. ఇప్పుడిక ఎవ్వరూ దొడ్డిని నెత్తికెక్కించు-కోవలసిన అవసరం లేదు.