అనగనగా ఒక ఊళ్లో రాము అనే పిల్లవాడు ఉండేవాడు. రాము చాలా తెలివైన పిల్లవాడు; మంచివాడు, ధైర్యవంతుడు కూడాను. ఆశ్చర్యం గొలిపే విషయాలు, విశేషమైన సంగతులంటే అతనికి చాలా ఇష్టం ఉండేది. 'ఇష్టం' అనేకంటే, దాన్ని 'మోజు' అంటే నయమేమో- ఎందుకంటే, అతను తన ఆ 'ఇష్టం' కోసం ఎన్నో కష్టాలు కొని తెచ్చుకున్నాడు!
అనుకోకుండా తెలిసింది రాముకు- తను పూర్వజన్మలో ఒక జమీందారు అని! తమది జమీందారు వంశమట. ఎంతో విలాసవంతమైన జీవితం గడుపుతుండేవాడట. తనకు పదహారేళ్ళ వయసులో తను పాముల రాజైన ఆదిశేషుడినే చంపేశాడట! రాముకు ఈసంగతిని ఒక మాంత్రికుడు చెప్పాడు. ఆదిశేషుడు ఇప్పుడు తనపైన పగ పట్టాడట; తగిన అవకాశం కోసం వేచి చూస్తున్నాడట. ఎవ్వరూ కనుక్కోలేని విధంగా వచ్చి తనని చంపేందుకే కాచుకొని కూర్చున్నాడట!
అది విన్నప్పటినుండీ రాము చాలా జాగ్రత్తగా ఉండటం మొదలు పెట్టాడు. ఎప్పుడూ దాన్ని గురించే దీర్ఘంగా ఆలోచించసాగాడు. అంతకు ముందున్న ధైర్యం ఏమైందో ఏమో- ఇప్పుడు రాము విపరీతమైన భయాందోళనలకు గురౌతున్నాడు. కంటిలో కునుకు లేదు. పరధ్యానంలోనే ఉండి పోయాడు.
ఇలా ఎన్ని రోజులు గడిచాయో! చివరికి రాము మళ్ళీ ఆ మాంత్రికుడి దగ్గరికే వెళ్ళి 'పరిష్కారం ' ఏంటని అడిగాడు. అప్పుడు చూస్తే, రాము కళ్లలో భయం. అతని శరీరంలో వణుకు. మాట తడబడుతున్నది. మాంత్రికుడు పరిష్కారం చెబుతాడన్న ఆశ ఒక్కటే అతనికి మిగిలి ఉన్నది. ఆ మాంత్రికుడేమో ఏదేదో మాట్లాడుతున్నాడు- పరిష్కారం మాత్రం చెప్పటం లేదు. అసలు ఆ మాంత్రికుడికి ఏమైనా తెలిస్తేనే కదా, చెప్పేందుకు? అతను చెప్పిన కథల్ని రాము అమాయకంగా నమ్మాడు- అంతే తప్ప, అతనికి అసలు ఏలాంటి శక్తులూ లేవు. రాము దగ్గర ఏమైనా డబ్బులుంటే కొట్టేద్దామనేదే అతని పథకం.
మాంత్రికుడు ఏమీ చెప్పకపోయే సరికి, రాము భయంతో ఇంటికి పరుగులు తీశాడు. ఇల్లు చేరుకునేటప్పటికి అతనికి విపరీతమైన జ్వరం. భయంతో అలా రాము చావు అంచుల దాకా వెళ్ళాడు.
ఎన్ని రోజులు చూసినా, పాము మాత్రం రాలేదు. ఇక చచ్చిపోతాడనగా- తెలివి మేలుకున్నది రాముకు. తనకు తెలీని గతాన్ని పట్టుకొని, తనకు తెలీని భవిష్యత్తుకోసం వర్తమానంలో భయపడనక్కర్లేదని అర్థమైంది. దాంతో కథ సుఖాంతం అయ్యింది. రాముకు భయం తీరింది; ఆరోగ్యం మళ్ళీ బాగైంది.
ఇంతకీ ఇదంతా ఎప్పుడు జరిగిందోచెప్పలేదు కదూ? -రాము కలలో!!