ఒక తల్లికి గొప్ప చింత పట్టుకున్నదట.

ఆమె కొడుక్కి స్వీట్ల పిచ్చి. తినేందుకు తీపి వస్తువులేమైనా కావాలని ప్రతిరోజూ మారాం చేసేవాడు. వాడికి స్వీట్లు తినీ తినీ లేనిపోని రోగాలు ఎక్కడొస్తాయోనని తల్లికి భయం.

ఎంతో ప్రయత్నం చేసింది; ఎన్నో రకాలుగా చెప్పి చూసింది- పిల్లవాడు వినలేదు.

రోజూ స్వీట్లు తింటూనే ఉన్నాడు.

ఎవరో అన్నారు-"చూడమ్మా! ఇట్లా నువ్వు చెబితే మానడు. శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందట. ఎవరైనా గొప్పవాళ్లతో‌ చెప్పించు. వాళ్ళమీది గౌరవంతోనన్నా మీవాడు స్వీట్లు తినటం మానేస్తాడు" అని.

వాళ్ళింట్లో అందరికీ రామకృష్ణ పరమహంస అంటే గురి. "ఎవరిచేతో ఎందుకు? ఆయన చేతే చెప్పిస్తాను" అనుకున్నదా తల్లి. కొడుకును వెంటబెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళింది.

సమస్యను శ్రద్ధగా విన్నాడాయన. "తల్లీ! నేను చెబుతాను వాడికి. అయితే ఇప్పుడు కాదు- ఒక పదిహేను రోజులాగి, రా!" అన్నాడు.

తల్లి పదిహేను రోజుల తరువాత మళ్లీ తీసుకెళ్లింది కొడుకును. రామకృష్ణుడన్నాడు- "అయ్యో! ఇప్పుడే ఏమీ చెప్పేట్లు లేదు తల్లీ! ఇంకొక పదిరోజులాగి రండి" అని.

పది రోజుల తర్వాత మళ్లీ పది రోజులు- ఇట్లా ఐదారు సార్లు జరిగింది.

చివరికి రామకృష్ణుడు పిల్లవాడిని దగ్గరికి తీసుకొని, "బాబూ! స్వీట్లు అంతగా తినకూడదు- పళ్ళు పాడైపోతాయి. ఆరోగ్యం కూడా పాడౌతుంది. స్వీట్లు మానేసేందుకు ప్రయత్నించు, సరేనా?" అన్నాడు.

పిల్లవాడు 'సరే'నని తలూపాడు. అయిపోయింది- అన్ని రోజులు తిరిగి తిరిగి వేసారి చూసిన ఇంటర్వ్యూ అయిపోయింది ఒక్క నిముషంలో! రామకృష్ణుడు తనపని తాను చూసుకోవటం మొదలుపెట్టాడు.

తల్లికే అర్థం కాలేదు: "ఈ రెండు ముక్కలు చెప్పేందుకు ఇన్నిసార్లు తిప్పాలా? మొదటిసారే చెప్పేస్తే ఏం పోయె?" అని. కుతూహలాన్ని ఆపుకోలేక, వెనక్కి వచ్చి మరీ అడిగింది పరమహంసను.

ఆయన సిగ్గు పడుతున్నట్లు నవ్వాడు. "ఏం లేదు తల్లీ! వాడెట్లా తింటాడో నేనూ అట్లాగే, చాలా ఇష్టంగా తింటాను స్వీట్లు. ఒక వైపున నేను తింటూ, వాడికి ఎలా చెప్పను, తినద్దని? అందుకని పదిహేను రోజులు సమయం కోరాను. ఆలోగా నేను స్వీట్లు మానేద్దామనుకున్నాను. కానీ ఏం చేసేది? ఈ నాలుక ఆగలేదు. చివరికి, దానితో పోరాడి గెలిచేందుకు ఇన్ని రోజులు పట్టింది" అన్నాడు రామకృష్ణుడు.

నమ్మినదాన్ని ముందుగా తాము ఆచరించి చూసి, ఆ తర్వాతగానీ ఇతరులకు సలహాలనివ్వని ఇలాంటి మహాత్ములు అరుదు. అలాంటి కొద్దిమంది మంచివాళ్లలో ఒకరు, గాంధీజీ. అక్టోబరు రెండవ తేదీన గాంధీ జన్మదినం సందర్భంగా, ఆయనకున్న అనేక రూపాలలో కొన్నిటిని ఆవిష్కరిస్తున్నాయి, ఈ మాసపు అనువాద కథలు. మనందరం రకరకాల పనుల్ని సొంతంగా, సంతోషంగా చేసుకునేందుకు ఇవి ప్రేరణనిస్తాయని ఆశిద్దాం.

ఆగస్టునెల "బొమ్మకు కథ" కోసం లలిత గారు ఇచ్చిన "భయం" చిత్రానికి పాఠకులు చక్కగా స్పందించారు. ఒక్క అరవింద హైస్కూలునుండే మూడు కథలు రావటం మాకందరికీ చాలా సంతోషాన్నిచ్చింది. ఆ చిన్నారులకు, వారిని ప్రోత్సహించిన పెద్దలకు, అందరికీ అభినందనలు.

శుభాకాంక్షలతో,

కొత్తపల్లి బృందం.