సీతారామ పురం అనే ఊళ్ళో నివసించేవాడు రామయ్య. అతనికి ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు ఉండేవాళ్ళు. వాళ్ళది చాలా పేద కుటుంబం. రామయ్య కరెంటు పని చేసి కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. వాళ్ల పెద్దమ్మాయి అనురాధ, చాలా తెలివైనది- తండ్రి చేస్తున్న పనిని శ్రద్ధగా గమనిస్తుండేది. ఇంటి పనుల్లోతల్లికి సహాయం చేస్తూ ఇంటి వద్దే ఉండేది. అనురాధ చెల్లి, తమ్ముడు మాత్రం బడికి వెళ్ళేవాళ్ళు.
ఒక రోజు రాత్రి వర్షం కారణంగా కరెంటు తీగలు తెగి పడిపోయాయి. జనం బయట తిరగటానికి భయపడుతున్నారు. ఊళ్ళో కరెంటు పని చేసేది తను ఒక్కడే కనుక, వాటిని సరి చేసేందుకు వెళ్ళాడు రామయ్య- ఆ సరిచేయటంలో కరెంటు షాకుకు గురై ఆకస్మికంగా చనిపోయాడు.
అప్పటినుండి అనురాధ కుటుంబానికి పూట గడవటంకూడా కష్టమైంది, అనురాధ తమ్ముడు, చెల్లి ఇద్దరూ చదువులు మానేశారు. తల్లి కూలి పనికి, అనురాధ ఇళ్ళలో పనికి వెళ్ళటం మొదలుపెట్టారు- అయినా ఇల్లు సరిగ్గా నడిచేది కాదు.
అనురాధ పనిచేసే ఇళ్లలో టీచర్ ఒకావిడ ఉండేది. అనురాధ పనికి వెళ్ళేసరికి ఒకరోజున ఆమె పిల్లలకు పాఠాలు చెబుతూ ఇలా అంటున్నది- "ఈ ప్రపంచంలో ఆడవాళ్ళు చేయలేని పనులంటూ ఏవీ లేవు. ఈ రోజుల్లో మహిళలు విమానాలు నడుపుతున్నారు. వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. దేశాలను పరిపాలిస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా వాళ్ళు వాటిని ఎదుర్కొని నిలిచారు; గొప్పవారని ఖ్యాతి పొందుతున్నారు" అని.
ఆవిడ చెబుతున్న పాఠం అనురాధకు చాలా నచ్చింది. 'తను కూడా ఎందుకు రాణించకూడదు?' అనుకున్నది. అదే రోజున అనురాధ చెల్లి, తమ్ముడు పోట్లాడుకుంటున్నారు: "ధన ధృవం, ధనధృవం కలిపితే విద్యుత్తు ప్రవహిస్తుంది" అంటున్నాడు తమ్ముడు. "కాదు కాదు! ధనధృవం, ఋణధృవం కలిపితే విద్యుత్తు ప్రవహిస్తుంది" అంటోంది చెల్లి. తండ్రి దగ్గర కరెంటు పని నేర్చుకున్న అనురాధ, ఈ సమస్యను టీచరు దృష్టికి తీసుకెళ్ళింది. కరెంటు పనిమీద ఆమెకున్న ఇష్టాన్ని అర్థం చేసుకొని, ఆమెకు విద్యుత్తు గురించిన పాఠాలు వివరంగా నేర్పించటం మొదలు పెట్టారు, టీచరుగారు.
దాంతో ధైర్యం తెచ్చుకున్న అనురాధ, ఊళ్లోనే ఒక 'రిపేరి షాపు' పెడతానన్నది. ముందు వాళ్ల అమ్మ ఒప్పుకోలేదు; అయితే టీచరు మాట్లాడి, అనురాధ తల్లిని ఒప్పించింది. ఆ దుకాణంలో అనురాధ టివిలు, రేడియోలు, టేపు రికార్డర్లు, సిడి ప్లేయర్లను రిపేర్ చేసేది. ఒక్కోసారి పోరంబోకులు దుకాణం ముందు నిలబడి, ఆమెను ఎగతాళి చేసేవాళ్ళు. కానీ అనురాధ వాళ్ళని అస్సలు పట్టించుకోలేదు. త్వరలో అనురాధ పెట్టిన దుకాణం చాలా పెద్దదైంది- ఇప్పుడు ఆ దుకాణంలో కొత్త టివిలు, టేప్ రికార్డరులు, రేడియోలు, క్యాసెట్లు, డివిడి ప్లేయర్లు అన్నీ అమ్మబడుతున్నాయి!
అనురాధ ఇంటి పరిస్థితులు కూడా ఇప్పుడు చాలా మెరుగు పడ్డాయి: తమ్ముడు ఇంటర్ పూర్తి చేశాడు; చెల్లెలు 10వ తరగతిలో జిల్లా ఫస్టు వచ్చింది. అనురాధ తల్లి, టీచరుగారు మాత్రమేకాక, ఊళ్లోవాళ్ళూ అనేకమంది ఆమె కృషిని అభినందించటం మొదలు పెట్టారు. పట్టుదలకూ, కృషికీ మారుపేరుగా నిలచి, ఆ ప్రాంతంలో అనేక మందికి ఆదర్శప్రాయు రాలైంది అనురాధ!