ఒక ఊరిలో ఒక బీద రైతు ఉండేవాడు. కొద్దిపాటి వ్యవసాయం తప్ప అతనికి మరే జీవనాధారమూ లేదు. అతని కూతురు, అంజలి. అంజలి రోజూ బడికి పోయి శ్రద్ధగా చదువుకునేది. అన్ని పనులనూ చాలా చురుకుగా చేసేది. ఇంటి పనుల్లో తల్లికి సాయం చేసేది.
అంజలికి ఒక స్నేహితురాలుండేది. ఆమె పేరు అక్షయ. అక్షయ వాళ్ళ నాన్న చాలా పేరున్న పారిశ్రామికవేత్త. వాళ్ళు చాలా ధనవంతులు. అక్షయకు అంజలి అంటే చాలా ప్రేమ- కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం అంజలిని చాలా చులకన చేసి మాట్లాడేవాళ్ళు. అంజలి వాళ్ల మాటల్ని పట్టించుకోకుండా, తనకు ఏది ఎంతవరకు అవసరమో అది అంతవరకు చేసుకొని పోతుండేది.
అనుకోకుండా ఒక రోజున అంజలి వాళ్ల అమ్మ అనారోగ్యంతోచనిపోయింది. అటుపైన తండ్రి త్రాగుడుకు బానిసయ్యాడు. రోజు రోజుకు ఇంట్లో కొట్లాటలు ఎక్కువయ్యాయి. ఇల్లు గడవటంకూడా కష్టమైన పరిస్థితులు దాపురించాయి. బడిమానేసి, అంజలి ఇంటి పనులను బాధ్యతగా నెరవేర్చటం మొదలు పెట్టింది. చివరికి ఒకనాడు తండ్రి తాగి వచ్చి, అంజలిని కొట్టి, ఇంట్లోంచి తరిమేశాడు!
అకస్మాత్తుగా ఎవ్వరూ లేని అనాధ అయిపోయింది అంజలి. ఆ రాత్రి సమయంలో తను ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడామెకు తన స్నేహితురాలు అక్షయ గుర్తుకొచ్చి, వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అంత రాత్రిపూట వచ్చిన మిత్రురాలిని చూసి అక్షయ ఆశ్చర్యపడింది. ఆమెకు అంజలి తన ఇంటి దగ్గర జరిగిన సంగతులన్నిటినీ పూసగుచ్చినట్లు వివరించింది. అంజలిపైన జాలిపడి అక్షయ ఆమెను తనతోపాటు ఉండమని ఆహ్వానించింది; కానీ అక్షయ వాళ్ళ అమ్మానాన్నలు ఇద్దరికీ అది నచ్చలేదు. "ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచుకుంటే మన పరువు పోతుంది" అన్నారు వాళ్ళు.
ముందు గదిలో ఉండి వాళ్ల మాటలు విన్న అంజలి చాలా బాధ పడింది. ఇంకా తెల్లవారకుండానే లేచి, ఎవ్వరికీ ఏమీ చెప్పకుండానే బయలుదేరి పోయింది. అక్షయ నిద్రలేచి చూసుకునే సరికి, అంజలి అక్కడ లేదు!
చాలా సంవత్సరాలు గడిచాయి. అక్షయ వాళ్ల నాన్న చాలా సంపద కూడ బెట్టాడు. అయితే రాను రాను వాళ్ళ ఫ్యాక్టరీ పాతదైంది. సమస్యల వలయాల్లో చిక్కుకున్నది. అక్షయ వాళ్ళ నాన్న దాన్ని బాగు పరచే ప్రయత్నంలో, ఉన్న ఆస్తులన్నిటినీ అమ్మేశాడు. చివరికి వాళ్ళు ఉన్న ఇంటిని కూడా అమ్మేసినా అప్పులు తీరని పరిస్థితి ఏర్పడింది. తనకు ఇక ఆ అప్పుల్ని తీర్చే స్తోమత లేదనీ, వాటిని మాఫీ చేయాలనీ వేడుకుంటూ జిల్లా కలెక్టరు గారికి ఒక అర్జీ పెట్టుకున్నాడాయన.
కలెక్టరుగారు ఆయన్ని తన కార్యాలయానికి రప్పించారు. "మీరు చాలా మందికి సహాయం చేసి ఉంటారు గదా! వాళ్ళనెవరినైనా వచ్చి, మీ బదులు అప్పులు కట్టమనరాదూ? ఇట్లా అప్పులు మాఫీ చెయ్యమంటే ఎలాగ?" అన్నారు.
అక్షయ వాళ్ల నాన్న బిక్క మొగం వేశాడు. ఆనాటివరకూ ఆయన ఎవ్వరికీ నిజంగా సాయం చెయ్యలేదు మరి! అదే సంగతి ఆయన కలెక్టరు గారికి చెప్పాడు.
కలెక్టరు గారు నవ్వారు. "మీకు కనీసం మీ అమ్మాయి అక్షయ ఐనా జామీను ఉంటుందా?" అన్నారు.
అక్షయ పేరు కలెక్టరుగారికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపడ్డాడు ముసలాయన.
అప్పుడు కలెక్టరు గారు చెప్పారు: "చాలా గడ్డు పరిస్థితుల్లో ఉన్న ఒక చిన్న పాప అంజలి, ఒకరోజు మీ ఇంటికి వచ్చింది. ధనం మత్తులో ఉన్నారు మీరు. ఆ పాపను వెంటనే వదిలించుకున్నారు. అదృష్టం కొద్దీ ఆ పాప ఒక మంచి మనిషి కంట పడింది. ప్రభుత్వంవారి సాయంతో బాగా చదువుకున్నది. చివరికి 'అంజలి- ఐఏఎస్' కాగలిగింది. 'తోటి మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు ఊరుకోకూడదు: తప్పక సాయం చెయ్యాలి' అని అంజలికి బాగా అర్థం చేయించారు మీరు. అందుకని, ఇప్పుడు మీ అప్పును అంజలి తీరుస్తుంది. కలెక్టరుగా కాకపోయినా, తోటి మనిషిగా మీకు ఈ మాత్రం సాయం చేయగలదు ఈ అంజలి" అని.
ముసలాయన సిగ్గుతో తలవంచుకున్నాడు. కలెక్టరు గారు జామీను ఉండటం చేత ఫ్యాక్టరీ తిరిగి ప్రాణం పోసుకున్నది. అక్షయ తండ్రి ఇప్పుడు మారిపోయాడు: అందరికీ సాయం చేస్తూ మంచివాడనిపించుకున్నాడు.