అప్పుడు దమనకుడు "దేవా, మీ కను సన్నలలోని ఈ వన సీమలో నివసించే ఏ ప్రాణికీ చిన్నపాటి కొరత కూడా ఉండదు. ఇక తమరి సేవకులమైన మా క్షేమం అడగవలసిన పని ఏమున్నది? అవసరమైనప్పుడు సేవకుడు యజమాని పిలువకనే వచ్చి, తగిన సమయంలో మంచి చెడ్డలు వివరించాలి. స్వామి హితాన్ని సరిగా పట్టించుకోని సేవకుడు ఎంత మేలు కోరేవాడు అయినప్పటికీ, నిజానికి స్వామిద్రోహి కిందే లెక్క. అలాంటి స్వామి- ద్రోహికి, ఏ చిన్నపాటి మేలు కూడా జరగదు. మంచి చెడులను స్వయంగానే గ్రహించగలిగే తమవంటి గొప్పవారికి, మాబోటి 'చిన్న ప్రాణులనుండి తెలుసుకోవలసిన అగత్యం వచ్చిందే' అని విచారించవలసిన అవసరం లేదు. కళ్ళున్నవాడికే దీపం అవసరం గాని, గుడ్డివాడికి దీపంతో పనిలేదు గదా! ఒక్క సంగతి విన్నవించుకుంటాను, చిత్తగించండి:
అనేక ప్రదేశాలు తిరగటం, పండితులతోటి నిరంతర సహవాసం, బహు కావ్యాలు,శాస్త్రాలు చదవటం, రాజాస్థానాలలో బహుకాలం ఉండి సేవించటం- ఈ నాలుగూ ఎలాంటివాడిలోనైనా వివేకాన్ని పెంచుతాయి. ఈ నాలుగింటిలో ఏ ఒక్కటీ లేనివాడు నూతిలోని కప్ప మాదిరి, 'తన ముక్కుకు మీద ఉండేదే ఆకాశం; తను ఉండే ఇరుకైన సందే ప్రపంచం' అనుకొని, కేవలం తను బ్రతుకుతున్నందుకే సంతోషపడుతూ, లోకపు తీరు తెలీక, అజ్ఞాని అయి నశిస్తాడు. ఏలినవారి పాదాలవద్ద చిరకాలంగా సేవచేసుకుంటూ బ్రతుకుతున్న మాబోటి చదువురానివాళ్ళు కూడా విద్యావివేక సంపన్నులౌతున్నారంటే అది తమరి సన్నిధి ప్రభావం కాక, మరేమిటి? యజమాని మేలుకోరే సేవకుడు 'నన్ను అడగలేదే' అని అనుకోకూడదు- సందర్భానుసారం ఏది అవసరమో దాన్ని తప్పక చెప్పాలి. అయినప్పటికీ- 'స్వామి తప్పుగా తలుస్తాడేమో' అని మనస్సుకు భయం కలుగుతున్నది" అన్నది.
అది వివి పింగళకుడు "దమనకా! నువ్వు మాకు ప్రియ సేవకుడివి. నువ్వు చెప్పిన దానిని మేం తప్పకుండా స్వీకరిస్తాం. మేమేమైనా నీకు క్రొత్తవాళ్ళమా? ఎందుకు, అలా జంకు-తున్నావు? నీ మనస్సుకు ఏది తోస్తే అది చెప్పవచ్చు" అన్నది.
అప్పుడు దమనకుడు చేతితో నోటిని మూసుకొని పింగళకుని మాటలు విన్నది. ఆపైన అది "చిత్తం చిత్తం!" అని, "దేవా! ఇంతకుముందు తమరు యమునా నదీ తీరానికి వెళ్ళి, అక్కడ నిశ్చేష్టుడైనట్లు అనిపించే విధంగా కొంతసేపు బొమ్మలాగా నిలబడి, ఆపైన వెనక్కి తిరిగి ఇంటికి చేరుకున్నారు. తమరు ఇలా ఎందుకు చేశారో అర్థం కాక, నా మనసు కలత చెందింది. ఈ సంగతి తమకు విన్నవించుకునేందుకే తమరి సేవకుడు వేచి ఉన్నాడు" అన్నది.
అప్పుడు పింగళకుడు "దమనకా! విను. నువ్వు మాకు చాలా దగ్గరివాడివి. నీనుండి దాచవలసిన సంగతి మాకు ఏదీ లేదు. సమస్త జీవులకూ ఆధారమైన ఈ అడవి యావత్తూ మా ఆధీనంలోఉన్నది. ఈ ప్రదేశంలో మా ఆదేశం లేకుండా ఆకైనా కదలదు- అయితే, ఈ రోజు ఒక విపరీతం జరిగింది- అది ఏమిటో విను. దాహంతోయమునా నదీ తీరానికి పోతున్న మాకు, ఉరుము లాంటి అరుపు ఒకటి వినబడింది. ఆ శబ్దం వినబడగానే నిశ్చేష్టులమై నిలచిపోయాము. మనసులో ఏమాత్రం భయమనేది లేకుండా ఇంత గట్టి అరుపును వెలయించిన ఆ జంతువేదో చిన్నది కాదని నాకు అనిపిస్తున్నది. ఈ ప్రపంచంలోకెల్లా అతిగొప్ప వీరుడు ఇతరుల గొప్పతనాన్ని విని సహించగలడా? బలహీనుడు కూడా పగవాడిని పట్టించుకోకుండా వదలడే, ఇక బలవంతుడు ఎట్లా వదలుతాడు? ఎంతటి వీరుడైనా సరే, బలగర్వంతో శత్రువును ఉపేక్షించినట్లైతే, లోకులు అలాంటివాడిని బలహీనుడనీ, పిరికివాడనీ నిందిస్తారు. వద్దని చెప్పకుండా మూకుడుతో నోళ్ళు మూస్తే ఎలాగ? అలాంటి నిందకు గురవ్వటం కంటే చచ్చిపోవటమే మేలు కాదా? ఊరికే చచ్చిపోవటం కంటే పోరాడటమే మంచిది- దైవ వశాన శత్రువే చంపనీగాక, అదే శ్రేయస్కరం. అందువల్ల, 'ఇప్పుడే శత్రువుకు వ్యతిరేకంగా పోదాము' అనేది ఒకటి-
ఇక, శత్రువును వ్యతిరేకించటమే ముఖ్యం అయితే, దానికి తగిన ఉపాయాన్ని వెతకాలి. బలవంతుడైన పగవాడిని ఉపాయంతో గెలవాలి. కాబట్టి ఇప్పటికి ప్రక్కకు తొలగి పోదాం, ఆ తర్వాత దేశకాలాలను అనుసరించి, కావలసిన ఉపాయాన్ని వెతుక్కొని, శత్రువును శిక్షించవచ్చు- ఇది రెండవది. ఈ రెండింటిలోనూ నీకు ఏది సరైనదనిపిస్తున్నదో చెప్పు" అన్నది.
అప్పుడు దమనకుడు కొంతసేపు ఆలోచించినట్లుండి, చివరికి "కారణం తెలియకుండా తొందరపడకూడదు. కేవలం శబ్దం విని ఎక్కువ భీతి చెందటం కూడా తగదు-
నక్క-నగారా కథ
ఇదివరకు ఒక నక్క అడవిలో తిరుగుతూ ఉన్నది- దానికి ఎక్కడా ఆహారం దొరకలేదు. కడుపు ఆకలితో నకనకలాడుతూంటే అది చాలా బలహీనపడింది. ఆ సమయంలో దానికి ఒకచోట ముక్కలు ముక్కలై నేల మీద పడి ఉన్న రధాలు కనబడ్డాయి. విరిగిన తొండాలు, ముక్కలైన దంతాలతోటి, పెద్ద పెద్ద కొండలేమో అనిపిస్తూ, చచ్చి పడి ఉన్న ఏనుగుల గుంపులు ఎదురయ్యాయి. ముందు కాళ్ళు విరిగి, డొక్కలు తెగి పడి, మెడలు వంకర తిరగ్గా, వెల్లకిలా పడిఉన్న గుర్రాలు ఉన్నాయక్కడ. గొప్ప పరాక్రమం ఒలుకుతూ, పెదవి కొరుక్కుంటూ, చూపుల్లో బెదిరింపు ధోరణిని ఇంకా వీడని తలలు చెల్లా చెదరుగా పడి ఉన్నై. కత్తుల్ని ఇంకా వదలని చేతులు, గొప్పగా పోరాడి మరణించిన వీరుల సమూహాలతో నిండి, భయంకరంగాను, నిర్జనంగాను ఉన్న ఆ రణభూమిని చూడగానే నక్క సంతోషంగా ఆ భూమి దగ్గరికి పోబోయింది.
అంతలో దానికి భయంకరమైన శబ్దం ఒకటి వినబడింది. ఘోరమైన ఆ శబ్దాన్ని వినగానే నక్క గుండెలు బ్రద్దలయినట్లైంది. అది బెదిరి ఒక్కసారిగా మూర్ఛపోయింది. కొంత సేపటికి తెప్పరిల్లి, మెల్లగా కను రెప్పలు తెరచి, నలువంకలా చూసింది. గాలికి కదిలే కొమ్మల తాకిడికి "ఢమ్ము ఢమ్ము'న మోగుతున్న నగారా ఒకటి కనబడింది దానికి.
దాన్ని చూశాక నక్కకు భయం పోయింది. మనసులోని విచారం మాయమవ్వగా అది ఆ నగారా దగ్గరికి పోయి, దాని తోలు పటకాలను కొరికి నములుతూ "అరే! దీని వాస్తవం తెలీక భయపడ్డాను. 'ఇప్పుడు గదా, దీని అసలు రూపం బయట పడ్డది! దేనినైనా సరే, విమర్శనాత్మకంగా చూస్తే తప్ప దాని వాస్తవికత తెలిసిరాదు' అని అనుకుంటూ, ఇప్పుడు శ్రద్ధగా నలుదిక్కులా చూసింది. అన్నివైపులా గుట్టలుగా పడి ఉన్న శవాల గుంపులను చూసి అది "ఆహా! ఇట్లాంటి ఆహారాన్ని చుట్టూ ఉంచుకొని కూడా నేను గమనించలేదే! " అని బాధపడుతూ, కావలసినంత మాంసంతిని తనకు నచ్చిన దారిన పోయింది. కాబట్టి, 'కేవలం శబ్దంవిన్నంత మాత్రాన నిర్ఘాంత పోకూడదు' అన్నాను-
తమరు ఆజ్ఞ ఇస్తే చాలు- తమ ఈ సేవకుడు ఈ క్షణమే ఆ చప్పుడు వచ్చిన చోటుకు వెళ్ళి, అది వెలువడిన కారణం ఏంటో కనుక్కొని వచ్చి తమకు విన్నవించుకుంటాడు" అన్నది దమనకం.
పింగళకుడు దాని ముఖంకేసి తేరిపార చూసి, కొంచెం ఆలోచించి "ఇది కూడా ఇప్పటికి సరైన పనే అనిపిస్తున్నది. బాగా పరిశీలించకుండా తొందరపడి ఏ పనైనా చేసి కూడా లాభం ఉండదు. శత్రువు ఎదుట నిలచి మాట్లాడేటప్పుడు, బలాబలాలను తెలుసుకొని, ఆ సమయానికి తగినట్లు, 'నేను చెప్పి పంపిన మాటలు' అన్నట్లుగా, నీకు తోచిన విధంగా చెప్పి, శత్రువును లొంగదీసుకొనేందుకు ఏ మార్గం కనబడితే దానిని అనుసరించు. నువ్వు అన్నింటా నేర్పు గలవాడివే. నీకు వేరే చెప్పవలసిన పని లేదు. పోయి రా!" అన్నది.
అప్పుడు దమనకుడు గబగబా ముందు శబ్దం వచ్చిన దిక్కును పట్టుకొని పోయి, మైదానాన్ని చేరుకున్నది. ఆ చదును ప్రదేశపు నలుదిక్కులా వెతికి, అది అక్కడున్న అడుగు జాడలను అనుసరించి పోయి, చివరికి ఆ ఎద్దును కనుగొన్నది.
ఆపైన అది సంజీవకుడి దగ్గరికి పోయి "ఓ వృషభేంద్రుడా! నేను ఈ అడవికి రాజైన సింహం- పింగళకుని అనుచరులలో ఒకడిని. నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. మహారాజు గారు తనకు తానుగా నీకు చెప్పమని బోధించి పంపిన మాటల్ని నేను ఇప్పుడు నీకు వినిపిస్తాను, విను-
"ఈ అడవి మొత్తం నా అధీనంలో ఉన్నది. ఈ అడవిలోని జంతువులు అన్నీ నా శాసనానికి లోబడి వర్తిస్తున్నాయి. నువ్వు కూడా నా ఆజ్ఞకు లోబడి ఉండు. ఇంతే కాదు. నా అనుచరులతో కలసి ఉంటానంటే, నా ఆస్థానంలో నీకు తగిన ఉద్యోగం కూడా ఇస్తాను. నీకు ఎలా ఇష్టమైతే అలా చెయ్యి" అని మహారాజు పింగళకులవారు ఆనతిచ్చారు. ఇంతకు ముందు నువ్వు అనాలోచితంగా రంకె వేశావు కాబోలు! దాన్ని విన్న తరువాత మహారాజు నువ్వెక్కడున్నదీ కనుక్కు రమ్మని ఆజ్ఞాపించారు. నువ్వు భయపడకు- ఆ మహానుభావుడు కరుణ కలవాడు, ధర్మం తెలిసినవాడు- కనుకనే ఆయన మంచివాళ్ళందరికీ ఆశ్రయుడయ్యాడు. నువ్వేమీ సందేహించకుండా నా వెంట రా!" అని చెప్పి ఒప్పించింది.
ఆపైన, సంజీవకం వెనకగా రాగా, అది ముందుగా సింహం దగ్గరికి వెళ్ళి, “స్వామీ, ప్రభువులవారి ఆనతి మేరకు- నేను పోయి, చూశాను. తమరు విన్న ఆ రంకె వేసినవాడు తమరి దయకు పాత్రుడే తప్ప, తమరిని అతిక్రమించేవాడు కాడు. తమరి ధైర్యసాహసాలను గురించి విని, భయభ్రాంతుడై ఉన్నాడు. వాయుదేవుడు గొప్పవైన మహా వృక్షాలను పెకలించి వేస్తాడు గానీ, వంగిపోయే గడ్డిపోచలను ఏమీ చేయక వదిలిపెట్టడా? నిజంగా బలం ఉన్నవాడు తనను ఎదిరించిన వాడిపైన తన బలాన్ని ప్రయోగిస్తాడు తప్ప, బలహీనులను పట్టించుకోడు. అటువంటి గొప్ప గుణాలు తమరికి సహజంగానే అబ్బాయి. అవసరం కనుక ఇంతమాత్రం చెప్పాను గానీ, ఏలినవారికి అసలు చెప్పవలసినదేమున్నది? ఆ శబ్దం చేసినది ఒక పెద్ద ఎద్దు- బుద్ధిమంతుడు: తమరి కొలువులో ఉండదగినవాడు. తమరు సమ్మతిస్తే వాడిని తమ పాదాలవద్దకు తీసుకొని వస్తాను" అన్నది.
చిరునవ్వుతో 'సరే' అన్నట్లు తల ఎగురవేసింది పింగళకం.
(మిగతాది మళ్ళీ.....)