పిచ్చి కవిత

వెళ్ళాను నేను గోల్కొండ
అక్కడ ఉన్నది ఒక కుండ
కుండ ప్రక్కన ఉన్నాడు గూండా
తింటున్నాడు బోండా
చూపాడు వాడి కండ
భయపడి ఎక్కాను నా హీరో హోండా!

టోల్ గేటు!
టీచరు: ప్రపంచంలో పెద్ద గేటు ఏదిరా?
రాము: కోల్గేటు సార్!

పెళ్ళి రోజు గుర్తింపు!
భార్య(పువ్వు బహుమానంగా ఇస్తూ): ఏమండీ! మీకు పెళ్ళిరోజు శుభాకాంక్షలండీ!
భర్త(పేపరు చదువుకుంటూ): కృతజ్ఞతలు. మీ పెళ్ళిరోజెప్పుడో చెప్పండి, నేనూ మీకో బహుమానం ఇస్తాను.

ఏం< వర్కు?!
అమ్మ: రామూ! ఇంకా ఏమి ఆటలురా? రా, ఇంటికి వచ్చి చదువుకో!
రాము: ఇది కూడా హోం వర్కే అమ్మా!
అమ్మ: ఇదేం హోంవర్కు రా?
రాము: ఈ హోంవర్కు మా డ్రిల్ మాస్టారు ఇచ్చారులే.

మహా ప్రసాదం! టీచరు: రామూ! గుళ్ళలో ప్రసాదం ఇచ్చాక బొట్టు ఎందుకు పెడతారో చెప్పు!
రాము: ఒకసారి ప్రసాదం తీసుకున్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రసాదానికి రాకుండా సార్!

పొడుపు కథ:
పచ్చని టోపీ
ఎర్రని శాలువ
కడుపులో ఉన్నాయి ముత్యాలు
జవాబు: మిరపపండు.

పొడుపు కథ
సీతమ్మ చీర
ఎంత ఆరేసినా ఆరదు.
జవాబు: నాలుక.

(పైవన్నీ సేకరించినవారు: V.విష్ణు, Mచంద్ర, పదవతరగతి, ప్రకృతిబడి)

పిచ్చి ప్రశ్న:
వాడు విమానం ఎక్కి ఎందుకు చదువుకున్నాడు?
ఉన్నత విద్య కావాలని!

అసలుకు మోసం!
రామారావు విచారంగా ఉన్నాడు.
సుబ్బారావు: ఏంటి రామారావూ, విచారంగా ఉన్నావు?
రామారావు: ఏమీ లేదురా, మా దుకాణంలో డబ్బులు లెక్కపెట్టే కొత్త గుమాస్తా కోసం వెతుకుతున్నాను.
సుబ్బారావు: అదేంటిరా, మొన్ననే గదా, కొత్త గుమాస్తాను చేర్చుకున్నావు?
రామారావు: నేను వెతుకుతున్నది వాడికోసమేరా! వాడూ లేడు, నా డబ్బులూ లేవు!

వినటం సమస్య!
టీచరు(కోపంగా): రామూ! నేను చెబుతున్నది నువ్వసలు వినటం లేదు. నీకు వినికిడి సమస్య వస్తున్నట్లుంది!
రాము: లేదు మేడం! నాకు మీరు చెప్పేది వినటం సమస్యగా ఉంది అంతే.

నేను మా నాన్నను!
రాము (బడికి ఫోన్ చేసి): హెడ్మాస్టరుగారూ! మా అబ్బాయికి బాగా జలుబు చేసింది, ఈ రోజు బడికి రాడు.
హెడ్మాస్టరు: ఎవరండీ, మాట్లాడేది?
రాము: నేను మా నాన్నను మాట్లాడుతున్నాను.

పొడుపు కథ:
మురికిగా ఉంటే తెల్లగాను,
శుభ్రంగా ఉంటే నల్లగాను- ఉంటాను-
ఎవరిని నేను?
జవాబు: బడిలో ఉండే నల్లబల్ల (బ్లాక్ బోర్డు)

తెలివి!
వెంగళప్ప, తన ఇద్దరు మిత్రులతో కలిసి దొంగతనానికి వెళ్ళాడు.
వాళ్ళ ఖర్మ కొద్దీ, అదే సమయానికి తుపాకీ పట్టుకున్న పోలీసు అక్కడికి వచ్చాడు అనుమానంగా చూస్తూ.
దొంగలు ముగ్గురూ ఎక్కడ దాక్కోవాలో‌తెలీక, అక్కడున్న మూడు గోతాల్లోకి దూరి, కదలకుండా కూర్చున్నారు.
పోలీసు మొదటి గోతాన్ని పొడుస్తూ అడిగాడు: ఎవరున్నారు ఇందులో?
మొదటి దొంగ: మ్యావ్! మ్యావ్!
పోలీసు రెండో గోతాన్ని పొడుస్తూ అడిగాడు: ఇందులో ఉన్నదెవరు?
రెండో దొంగ: భౌ! భౌ!
పోలీసు మూడో గోతాన్ని పొడిచి అడిగాడు: ఆ రెండిట్లోను పిల్లి, కుక్క ఉన్నై..మరి ఇందులో ఎవరున్నారు?
వెంగళప్ప(తెలివిగా చెప్పాడు): టమేటాలు!

పీకాకు! బడి ఎలాగుందో చూసేందుకు పరీక్షకులవారు వచ్చారు. పిల్లల్ని ప్రశ్నలు అడుగుతున్నారు.
పరీక్ష: బాబూ నెమలిని ఇంగ్లీషులో ఏమంటారో‌చెప్పు!
పిల్లలెవ్వరూ మాట్లాడలేదు.
టీచరుగారికి ఉత్కంఠ పెరిగిపోతున్నది. ఎవ్వరూ చెప్పక పోతే పరువు చేటు. ఎలా? అప్పటికప్పుడు ఓ ఆలోచన తట్టింది. ఓ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, పరీక్షకుడు చూడకుండా జుట్టు పట్టుకొని గట్టిగా పీకాడు.
పిల్లవాడు అరిచాడు: పీకాకు సార్! పీకాకు (పీకవాకు) సార్!! అని.
పరీక్ష: (అటువైపు తిరిగి ) కరెక్టు! అన్నారు.
టీచరుగారు గట్టిగా గాలి పీల్చుకున్నారు.

గడియారం తప్పు! టీచరు: రామూ! పది, పదకొండు, పన్నెండు- తరవాత ఎంతొస్తుంది?
రాము: ఒకటి వస్తుంది టీచర్!
టీచరు: తప్పు. పన్నెండు తర్వాత వచ్చేది పదమూడు గదరా?
రాము: లేదు టీచర్! మా ఇంట్లో‌గడియారంలో‌ పన్నెండు తరువాత వచ్చేది ఒకటే!
(పై రెండు జోకుల సేకరణ: శ్రీ పుల్లయ్య, ఉపాధ్యాయులు, గడ్డం నాగేపల్లి, అనంతపురం జిల్లా)