కాసేవారిపల్లిలో మహేష్ , సుధీర్, ప్రతాప్, నాజర్ అనే నలుగురు పిల్లలు 9వ తరగతి చదువుతున్నారు. ఈ నలుగురూ చాలా మంచి స్నేహితులు. ప్రతిరోజూ నలుగురూ కలిసి ఎవరో ఒకరి ఇంట్లోచదువుకునేవాళ్ళు.
వేసవి సెలవలలో పదిరోజులపాటు ఎవరికి వాళ్ళు బంధువుల ఇళ్లకు వెళ్ళారు. ఇక వెనక్కి వచ్చాక, నలుగురికీ ఏం చేయాలో తోచలేదు. చివరికి నలుగురూ కలిసి దగ్గరలోనే ఉన్న అడవిలో గుడారం వేసుకొని నాలుగు రోజులు గడపాలని, అలా వాళ్ల టీచరుగారు చెప్పినట్లు క్యాంపు జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆ అడవి ఎంత బాగుందో! దాన్ని చూస్తూ అందరూ ముగ్ధులైపోయారు. అక్కడి ప్రకృతిని చూసి మైమరచిపోయారు. అక్కడున్న కొత్త కొత్త చెట్లను, మొక్కలను, పురుగులను, చిన్న చిన్న పక్షులను చూసి సంతోషిస్తూ ఆ అడవి చివరన- రోడ్డుకు ఒక ప్రక్కగా- లోపలికి ఒక గుడారం నిర్మించుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి అడవిని చూడడానికి వెళ్లిన నలుగురు మిత్రులూ అప్పటికే అక్కడ చేరిన జనాలను చూసి ఆశ్చర్యపోయారు. చూడగా వాళ్ళు దొంగలల్లే ఉంది! వాళ్లు రహస్యంగా ఇలా మాట్లాడుకుంటున్నారు: "మనం ఏనుగుల దంతాలను, జింకల చర్మాలను, దుప్పి కొమ్ములను సేకరించి పెట్టుకున్నాం కదా! వాటిలో కనీసం సగాన్నైనా ఈ రోజు రాత్రికి ఈ అడవి నుండి బయటికి పంపించేయాలి" అని.
నలుగురు మిత్రులూ చాటునుండి ఈ మాటలు విని, బెదిరిపోయారు. దొంగల కంట పడకుండా తప్పించుకొని ఊరికి వెళ్ళిపోదామనుకున్నారు గానీ, అలా పారిపోవటం ఎవ్వరికీ ఇష్టం లేకుండింది. "ఇంకొకరోజు ఉండి, ఏం జరుగుతుందో చూద్దాం" అనుకున్నారు నలుగురూ.
రాత్రి కావస్తున్నది. ఆ చిమ్మ చీకటిలో టార్చిలైట్ల వెలుతురు కనబడుతోంది. 'ఆ దొంగల ముఠా వస్తున్నది' అని వీళ్ళకు అర్థమైంది. చూస్తూండగానే దొంగ వాళ్ళంతా వచ్చారు. ఏనుగుల దంతాలను, జింక చర్మాలను, పులులను వ్యానులోకి ఎక్కిస్తున్నారు. అంతలో ఒక పెద్దాయన వచ్చి, ఈ దొంగల ముఠా వాళ్లకు ఒక సంచి నిండా డబ్బులు ఇచ్చాడు- అన్నాడు- "మీ సహాయానికి కృతజ్ఞతలు. మీకు బహుమానం- ఇదిగో, ఈ సంచీ నిండా మీరు కోరుకున్నంత బంగారం ఉంది. మీదగ్గర ఇంకా ఇలాంటి సరుకేమన్నా ఉంటే చెప్పండి. వీటిని అమ్మి, వచ్చిన మొత్తంలో సగం వాటా కూడా మీకే ఇస్తాను, సరేనా? ఇంకా సరుకేమన్నా ఇవ్వగలరా, రేపు?"
దొంగల ముఠా దగ్గర ఇంకా ఇలాంటి సంపద చాలా ఉన్నట్లుంది. వెంటనే ఒప్పందం కుదిరింది మళ్లీ. "రేపు రాత్రి 10 గంటలకు వస్తాం. అన్నీ తయారుగా ఉంచండి" అని చెప్పి వ్యాను తీసుకొని వెళ్ళిపోయారు, వచ్చినవాళ్ళు. దొంగల ముఠా తమ సంపాదనను చూసుకొని మురిసిపోయింది.
నలుగురు మిత్రులూ వెంటనే ఊళ్ళోకి పోయి, ఈ విషయం పోలీసులకు తెలియజేశారు. రాత్రి 10 గంటలు కావస్తోంది. పోలీసులు, ఈ నలుగురు అబ్బాయిలు కలిసి ఆ చీకటిలో దాక్కొని ఉన్నారు.
అంతలో వ్యాను లైట్ల వెలుతురు కనిపించింది. వ్యాను వచ్చి ఆగగానే దొంగలంతా కలిసి వ్యానులోకి జింకలను, ఏనుగుల దంతాలను, ఎక్కిస్తూ ఉన్నారు- అంతలోనే పోలీసులు వాళ్ళందరినీ చుట్టుముట్టి పట్టుకున్నారు!
ఈ విషయం ప్రొద్దున్నే పేపరులోకి వచ్చింది. జిల్లా అధికారి కూడా ఈ సంఘటన గురించి చదివారు. ఆ నలుగురు అబ్బాయిలను పిలిపించి, ఘనంగా సత్కరించారు. వారి పేర్లను భారత ప్రభుత్వం వారి "సాహస బాలల అవార్డు"కై సిఫారసు చేశారు. అటుపైన ఈ సాహస బాలల చదువులకయ్యే ఖర్చు మొత్తాన్నీ భారత ప్రభుత్వమే భరించింది!
మనందరం మన చుట్టూ ఉన్న జంతువులను కాపాడదాం!