అనగాఅనగా ఒక రాజు. ఆ రాజు చిత్రమైన కలలు కనేవాడు. విచిత్రమైన ఆజ్ఞలు జారీ చేసేవాడు.
ఒకరోజు ఇలా దండోరా వేయించాడు: “నా గుర్రం ఎగిరేలా చేస్తే అడిగింది ఇస్తాను. చేస్తామని చెప్పి చేయకపోతే తల తీసేస్తాను.”
గుర్రం ఎగరదని అందరికీ తెలుసు. అయినా ఆశతో ఒకరిద్దరు ప్రయత్నించి తలలు పోగొట్టుకున్నారు.
అప్పుడొక బీద బ్రాహ్మడు రాజు వద్దకు వెళ్ళాడు: “మీ గుర్రాన్ని నేను ఎగిరేలా చేస్తాను!” అన్నాడు.
“ఆరు నెలల గడువు కావాలి. సరిపడా డబ్బు కావాలి” అన్నాడు. "సరే కానియ్యి” అన్నాడు రాజు.
గుర్రమూ, డబ్బూ తీసుకొని ఇంటికి వెళ్లాడు బ్రాహ్మడు. “గుర్రం ఎగరదు! నువ్వు మిగలదు!” అని ఘొల్లుమంది భార్య. దానికి బ్రాహ్మడు “ఆరు నెలలలో ఏమౌతుందో ఎవరికి తెలుసు?రాజుగారికి బుద్ధి రావచ్చు. రాజుగారు మనసు మార్చుకొని వదిలేయవచ్చు”.
"గుర్రం చనిపోవచ్చు. రాజుగారు చనిపోవచ్చు. నేనే పోవచ్చు. అంత వరకు మనం కడుపు నిండా తిండి మాత్రం తినొచ్చు.” అని, ఆగి మళ్ళీ ఇలా అన్నాడు. "ఎవరికి తెలుసు. ఏమో? గుర్రం ఎగరావచ్చు!”
దీని తరువాత ఏమై ఉంటుందో ఊహించండి. మీ ఆలోచనల్ని ఈ క్రింది చిరునామాకు పంపించండి.
“కొత్తపల్లి" తెలుగు పిల్లల ఈ (e) మాసపత్రిక ఇంటి నెం: 2-312, న్యామద్దల రోడ్డు, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా, 515 101.