పాండవులు ఐదుగురూ అనామకులు-గా ఒక చిన్న పట్టణంలో ఉంటున్న సమయం అది. ఒక రోజున, ఇంకా తెల్లవారకనే ఎవరో వచ్చి, వాళ్ళు ఉంటున్న ఇంటి తలుపు తట్టారు. ధర్మరాజు వెళ్లి, తలుపు తీసి చూశాడు. చూస్తే, అక్కడున్నది ఒక బిచ్చగాడు!
ధర్మరాజుకు కొంచెం చికాకు వేసింది- ’తాము ఇంకా నిద్ర నుండి పూర్తిగా లేవనైనా లేవలేదు; అప్పుడే భిక్షకోసం వచ్చి నిలబడ్డాడా?’ అని. అనాలోచితంగా అతను అనేశాడు బిచ్చగాడితో- "రేపురావయ్యా" అని.
అంతలో ఇంటిలోపలి నుండి "హహ్హ హ్హా" అని గట్టిగా నవ్వులు వినబడ్డాయి. ఆ గొంతు-చూడగా, భీముడిది. ఏదో పెద్ద జోకు విన్నట్లు నేలమీద పడి దొర్లుతూ, కడుపు పట్టుకొని, పగలబడి నవ్వుతున్నాడు వాడు.
ధర్మరాజు లోపలికి వెళ్లి అరిచాడు, చెవులు మూసుకొని- "అబ్బ!ఆపు! ఎందుకట్లా నవ్వుతున్నావు? పిచ్చి గానీ పట్టలేదు గద! లేకపోతే ఏమైనా తిక్క పని చేశావా, మళ్ళీ? ఇంకా బాగా తెల్లవారనే లేదే, నీ తిక్క పనులకు?" అని.
ధర్మరాజుకు శాస్త్రాలన్నీ తెలుసు. కానీ ఆచరణ దగ్గరకు వచ్చేసరికి, అతని పాండిత్యమే తరచు అతనికి అడ్డం వచ్చేది: అతని కళ్లముందు పదాలు, వాటికి ఉన్న విభిన్న అర్థాలు నిల్చేవి- మార్గం కానరాకుండా చూసేవి.
ఆ రోజూ అలాంటి రోజే- ధర్మరాజుకు తన బండ తమ్ముడు అట్లా నవ్వటం చూసి చికాకు వేసింది-" ఎందుకట్లా నవ్వుతున్నావు, భీమా?" అన్నాడు కోపంగా, దగ్గరకు వెళ్ళి.
"నిన్ను చూసే నవ్వుతున్నాను- ఇంకెవర్ని చూసి నవ్వాలి? 'రేపు అంటూ ఒకటి ఉండబోతున్నద'ని నీకు ఎట్లా తెలుసు? సరే, ఒకవేళ ఆ ’రేపు’ ఏదో వచ్చిందే అనుకో- ఆనాటికి నువ్వూ, ఆ బిచ్చగాడూ- ఇద్దరూ బ్రతికే ఉంటారని ఎట్లా చెప్పగలవు? ఆనాడు నువ్వు ఎక్కడుంటావో, వాడెక్కడుంటాడో!? కానీ నువ్వు మాత్రం ఆ బిచ్చగాడికి అద్భుతమైన ఆత్మ విశ్వాసంతో బదులిచ్చావు- ’రేపు రా’అని. నేనిప్పుడే ఊరంతా చాటింపు వేసి చెప్పబోతున్నాను- 'మా అన్నకు అద్భుతమైన జ్ఞానం కలిగింది- రేపు ఏమి కానున్నదో చెబుతాడు ఆయన' అని! హీ హీ హీ!" అన్నాడు భీముడు, ఇకిలిస్తూ.
ధర్మరాజు వెంటనే బయటికి పరుగెత్తి, ఆ బిచ్చగాడ్ని వెనక్కి పిలుచుకొచ్చాడు. అతనికి భోజనం పెట్టి కొన్ని డబ్బులిచ్చి, పంపేశాడు. తన ’బండ’తమ్ముడి సునిశితమైన వాస్తవిక దృష్టి, అతని కళ్లకు కమ్మిన పుస్తక పాండిత్యపు పొరల్ని కరిగించివేసింది. "నువ్వు సరిగ్గా కనుక్కున్నావు భీమా, ధన్యవాదాలు!" అన్నాడు తమ్ముడితో.
అప్పుడు భీముడు అన్నకు ఒక చక్కని కథ చెప్పాడు-
"ఒక రాజుగారి దర్బారులో ఒక మంత్రి ఉండేవాడు.ఆ మంత్రి చాలా తెలివైన వాడూ, లోకజ్ఞానం కలవాడు కూడా. అయినా ఒకసారి ఎందుకనో రాజుకు అతనిమీద విపరీతమైన కోపం వచ్చింది. ఎంత కోపం అంటే, అతనికి మరణశిక్ష విధించి, మరుసటిరోజు ఉదయాన్నే దాన్ని అమలు చేయమన్నాడు.
మంత్రిగారి ఇంట్లో వాళ్ళంతా ఏడవటం మొదలెట్టారు. చుట్టుప్రక్కల వాళ్ళూ, బంధువులూ వచ్చి మంత్రిగారి భార్యను, పిల్లల్ని ఓదారుస్తున్నారు. "త్వరలో ఇక మంత్రిగారు ఉండరు." అని వాళ్లందరికీ అర్థమైంది. ఎందుకంటే వాళ్లంతా తమకు 'రేపు ఏం కానున్నదో తెలుసు' అనుకున్నారు.
అయితే మర్నాడు ఉదయాన, మంత్రిగారి శవానికి బదులు, స్వయంగా మంత్రిగారే ఇకిలించుకుంటూ ఇంటికి వచ్చారు!- అదిన్నీ రాజుగారు పెంచుకునే పంచ కళ్యాణి గుర్రాన్నెక్కి!
ఆయన్ని అలా చూడగానే, ఏడుస్తున్న బంధువర్గం అంతా ఒక్క క్షణం స్తంభించి-పోయింది- ఎవ్వరికీ నోట మాట లేదు. ముందుగా తేరుకున్న మంత్రి గారి భార్య లేచి వచ్చి, ’ఇంత అద్భుతంఎలా సాద్యమైంది?’ అని అడిగింది.
మంత్రిగారుచెప్పారు, చిద్విలాసంగా:"నా మృత్యుఘడియలు దగ్గర పడే సమయానికి, మమూలుగా రివాజు ప్రకారం రాజుగారు అక్కడికి విచ్చేశారు. ఆ సమయంలో ఏడుస్తున్న నన్ను చూసి, ఆయన "’నీకు చావంటే ఇంత భయం’ అని నేను అనుకోలేదు!" అన్నారు.”
" 'నేను ఏడుస్తున్నది నేను చచ్చిపోతానని కాదు! నాకు మాత్రమే తెలిసిన ఆ అద్భుతవిద్య, నాతోటే అంతమైపోతున్నదే, అని, నా బాధ!' అన్నాను నేను.”
'ఏమిటావిద్య?' అని అడిగారు రాజుగారు.
'కొన్నిరకాల గుర్రాలకు శిక్షణ ఇచ్చి, అవి గాలిలో ఎగిరేలా చేయటంవచ్చు, నాకు'అన్నాను నేను.
"రాజుగారికి ఆ ఐడియా నచ్చింది.- 'ఎన్నాళ్ళు పడుతుంది?' అని అడిగారు ఆయన.”
" 'ఒక సంవత్సరం పట్టవచ్చు' అన్నాను నేను. ఆయన నన్ను విడుదల చేసి, నాకు ఈ గుర్రాన్నిచ్చేశారు- 'సంవత్సర కాలంలో ఈ గుర్రాన్ని గాలిలో ఎగిరించగల్గితే నీకు నీ ప్రాణాలే కాదు, నా రాజ్యంలో 4వ వంతు ఇచ్చేస్తాను' అన్నారు!
అలా నేను ఇక్కడికి క్షేమంగా చేరుకున్నాను!" అని.
ఇది వినగానే మంత్రిగారి భార్య సంతోషం ఆవిరైంది: "నీకు గుర్రాలకు శిక్షణ నిచ్చేంత ప్రత్యేక శక్తులు ఏమీ లేవు కదా, ఎందుకు - అబద్ధం చెప్పావు? ఇలా చేస్తే నాకు ఏం సుఖం? ఇంకో సంవత్సరం పాటు నేను ప్రతి క్షణమూ కంగారు పడుతూ గడపాలి. అంత చేసినా సంవత్సరం తర్వాత నేను విధవరాలినవ్వక తప్పదు. అదేమి బ్రతుకు?! దీని కంటే ఏం జరగాలో అది ఒక్కసారిగా జరగటమే నయం!" అన్నది ఏడుస్తూ.
మంత్రిగారు ఆమెని ఓదార్చి, ప్రేమగా తిట్టాడు- "తిక్కదానా! రేపు ఎవరికెరుక? రాజుగారు ఇంకో సంవత్సరం పాటు బ్రతికి ఉంటారని ఎవరికెరుక? నేను మాత్రం అంతకాలం ఉంటానని ఎవరు చెప్పగలరు?- ఆలోగా పరిస్థితులు ఎంత మారిపోవచ్చు! ఏదో ఒక సందర్భం వచ్చి, నేను రాజుగార్ని మెప్పిస్తే , అయన నన్ను క్షమించెయ్యవచ్చు- ఆలోగా వేరే ఏదైనా కావచ్చు కూడా. గుర్రం ఎగరనూ వచ్చు! భవిషత్తును ఎవ్వరూ ముందుగా కనుక్కోలేరని తెలీలేదా ఇంకా ? ఆందోళనను వదిలిపెట్టు. ప్రస్తుతంలో బ్రతుకు. సంతోషంగా ఉండు!" అన్నాడు నవ్వుతూ.