వివేకానందుడు చెప్పిన చక్కని కథ ఒకటుంది:

అనగా అనగా ఒక అడవి ఉండేది. ఆ అడవికి దగ్గర్లోనే ఒక మేకలాయన ఉండేవాడు. ఆయన దగ్గర చాలా మేకలుండేవి. ఒకసారి ఆ మేకలాయన అడవిలో పోతూ ఉంటే ఒక బుజ్జి సింహంపిల్ల ఎదురైంది. మేకలాయన కాళ్లకు చుట్టుకొని, నాకుతూ ప్రేమ పడింది ఆ చిట్టిపిల్ల. ఒక్కరోజు వయసుండే ఆ పిల్లను చూస్తే మేకలాయనకు ముద్దుగా అనిపించింది. తల్లి సివంగి వచ్చిందంటే తన పని ఐపోయినట్లే- అందుకని ఆయన ఎక్కువ ఆలోచించకుండా ఆ సింహంపిల్లను చంకనెత్తుకొని ఇంటికి పరుగెత్తాడు.

ఇంట్లో చాలా మేకపాలున్నై. మేకలాయన సింహాన్ని పాలతోటీ, తను తినే జొన్న సంకటితోటీ, అన్నంతోటీ పెంచుకున్నాడు. సింహం పిల్ల మేకలన్నిటికీ అలవాటు పడింది. మనుషులకూ అలవాటైంది. అది కూడా మేకలలాగే అరిచేది. తోటి మేకలతో ఆడుకునేది. వాటి లాగానే ప్రవర్తించేది. మేకలతో బాటు అది కూడా రోజూ మేతకు వెళ్లటం మొదలుపెట్టింది. మేకలాయన తన మందను కాపాడే బాధ్యతను దానికే అప్పగించేంత బాధ్యతగల గొర్రె పొటేలు మాదిరి తయారైంది.

ఒకరోజున, అది అలా మేకలమందతో బాటు అడవిలో గడ్డి మేస్తున్న సమయంలో, దగ్గరున్న పొదల్లోంచి సింహ గర్జన వినబడింది. మేకలన్నీ భయంతో కంపించి పోయాయి. చెల్లా చెదరై, దిక్కులు తెలీనట్లు పరుగులు పెట్టాయి. అప్పటికి సంవత్సరం నిండిన సింహపు పిల్ల కూడా వణికిపోయింది. తోచిన దిశలో పరుగు తీసింది. "సింహం! సింహం! పారిపోండి! పోయి మీ ప్రాణాలు దక్కించుకోండి! మే! మే!" అని అరుస్తూ అది పారిపోతుంటే, వేటాడ వచ్చిన సింహం ఆశ్చర్యపోయింది. "ఏమిటిది?! సింహపు పిల్ల, ఇట్లా భయపడటమేమిటి?! అదీ, తోటి సింహాన్ని, నన్ను చూసి ఇంత అలజడి చెందటమేమిటి?!" అనుకొని, అది మేకల్ని వదిలి, సింహంపిల్ల వెంట పడింది.

సింహం తన వెంటే పడటం చూసి సింహపు పిల్లకు మరింత భయం వేసింది. "కాపాడండి! కాపాడండి!" అని మేకల భాషలో అరుచుకుంటూ, అది తుప్పల మీది నుండీ, ముళ్ల పొదలలో నుండీ దౌడు తీసింది. సింహం దాన్ని వదలకుండా వెంబడించి, చివరికొక చెరువు ఒడ్డున దాన్ని పట్టుకున్నది.

"నన్నొదిలెయ్! నీకు పుణ్యం ఉంటుంది. నన్నేమీ చెయ్యకు! నేనొక మేకను! చిన్ని మేకను - గడ్డి తినే దాన్ని! తింటే నీకేమి వస్తుంది? నీ కాళ్లు పట్టుకుంటాను - నన్నొదిలెయ్" అని ఏడుస్తూ ప్రాధేయ పడుతున్నది సింహం పిల్ల.

"ఏంటీ? నిన్ను తినకూడదా?! నువ్వు మేకవా? నువ్వేమనేదీ నీకు అర్థమౌతోందా, అసలు?" అన్నది సింహం.

"నేను చిన్నదాన్ని- నాకేమీ తెలీదు - అజ్ఞానిని - తెలివిలేని మేకను - నన్నొదిలెయ్" అని ఏడుస్తోంది సింహంపిల్ల, అశక్తతతో.

"ఓరి! నువ్వు మేకవి కాదే! ఏంటి ఇట్లా ఏడుస్తావు, మేకలాగా? నువ్వు కూడా సింహానివే!" అంది సింహం.

ఎంత చెప్పినా వినలేదు సింహంపిల్ల. భయం దాన్ని పూర్తిగా ఆవరించి, దాని బలాన్ని, శక్తిని హరించింది. "నేను మేకపిల్లను" అనే అసత్యం దాని అస్తిత్వాన్ని మొత్తాన్నీ సంపూర్ణంగా హరించింది.

చివరికి విసుగెత్తిన సింహం దాన్ని చెరువు గట్టుకు తీసుకెళ్లి, నీటిలో దాని ప్రతి బింబాన్ని చూపించింది; దాన్ని బెదిరించి, దాని చేత తన మాదిరి అరిపించింది; దాన్ని తన గుహకు లాక్కెళ్లి తన పిల్లల్ని చూపించింది- అలా అతి కష్టం మీద సింహం పిల్లకు తానెవరో తెలియజెప్పింది.

ఇప్పుడా సింహం పిల్ల మారిపోయింది! తానెవరో గ్రహించిన ఆ సింహంపిల్ల ఇప్పుడు నిజంగా మృగరాజైంది. అడవిని మొత్తాన్నీ శాసించింది. తన శక్తి సామర్థ్యాలను అడవిలోని ప్రతి జంతువూ గుర్తించేలా చేసింది.

మనందరిలోనూ అంతర్లీనంగా చాలా శక్తులున్నై. "నాకు చేత కాదు" అనుకుంటున్నంతకాలం ఆ శక్తులు అట్లా నిద్రపోతూనే ఉంటై. నిరాశా భావనకు వదిలి, "నాకేమి, నేను రాజును!" అనుకున్న మరుక్షణం ఆ శక్తులన్నీ మేల్కొని, మనకు సాయం చేస్తాయి. ప్రపంచంలో ఉన్న ఏ పరీక్షలూ నిజానికి మన శక్తిని పూర్తిగా కొలవలేవు. ఏ అపజయాలూ మనల్ని సంపూర్ణంగా విశ్లేషించవు. అందుకని, “నాకు చేత కాదు" అనే మాటను ప్రక్కనపెట్టి, ప్రయత్నిస్తూపోవాలి. ఏదో ఒకనాటికి విజయం మనదౌతుంది.

కథలు రాయటం కూడా అంతే. “నాకు రాదు" అనుకుంటే ఎన్నటికీ రాయలేం. “రాసి చూద్దాం" అనుకొని, మొదలుపెట్టి చూడండి: అనంత కథా సామ్రాజ్యం‌ మన హస్తగతం అవుతుంది. అలా మనకు స్ఫూర్తినిచ్చేందుకే- లలితగారు పంపారు: “ఏమో, గుర్రం ఎగరావచ్చు!” బొమ్మల కథను. దాన్ని చదివి, అంతం ఎలా ఉండాలో రాసి పంపండి, అందరూ!

కథలు రాసే పిల్లలకు, పెద్దలకు; రాయబోయే పిల్లలకు, పెద్దలకు-

అందరికీ, అభినందనలతో, కొత్తపల్లి బృందం.