అనగా అనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుకు ఇద్దరు కొడుకులు . వాళ్ళిద్దరూ బాగా చదవాలని, ప్రపంచంలోని విద్యలన్నిటినీ బాగా నేర్చుకోవాలని ఆ రాజుగారి కోరిక. అందుకని ఆ రాజుగారు తన కుమారులకు విద్య నేర్పించటంకోసం ఒక గురువుగారిని రప్పించారు.
ఇద్దరు రాకుమారులూ చాలా తెలివైనవాళ్ళు. గురువుగారు ఏమి నేర్పిస్తే అవి వెనువెంటనే నేర్చుకుంటున్నారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి, గురువుగారు తనకు తెలిసిన విద్యలన్నిటినీ వాళ్ళకు నేర్పించేశారు.
ఆపైన ఆయన ఇద్దరు సోదరులనూ పిలిపించి, "నాయనలారా! మీ చదువులు అయిపోవస్తున్నాయి. 'నాకు తెలిసిన విద్యలన్నిటినీ మీకు నేర్పించేశాను' అని నాకు తోస్తున్నది. అయితే, ఇంకొక్క పరీక్ష మాత్రం మిగిలి ఉన్నది. నానుండి మీరు ఏ మాత్రం నేర్చుకున్నారో ఆ ఒక్కసారీ పరీక్షించిన తరువాత, మిమ్మల్ని మీ రాజ్యానికి తిరిగి పంపించగలను" అని చెప్పారు.
"సరేనండీ గురువుగారూ!" అన్నారు రాకుమారులిద్దరూ, వినయంగా.
అయితే ఆ రోజు నుండీ గురువుగారు వాళ్లను పట్టించుకోకుండా వదిలేశారు. రెండు రోజులు- మూడు రోజులు- వారం గడిచినా గురువుగారు వాళ్లను పరీక్షించనూ లేదు, ఇంటికి పంపనూ లేదు.
రాజకుమారులకు పని లేకుండా పోయింది. రోజంతా ఏం చేయాలో అర్థం కాలేదు. పరీక్ష ఎప్పుడు పెడతారో తెలీటం లేదు. 'ఇంటికి వెళ్తే తమ విద్యల్ని అందరిముందూ ప్రదర్శించవచ్చు కదా' అనిపించసాగింది. 'గురువుగారు మర్చిపోయి నట్లున్నారు' అని కోపంతో విసుగు చెందసాగారు.
గురువుగారు వీళ్ళని గమనిస్తూనే ఉన్నారు. వీళ్ళలో అసహనం తారస్థాయికి చేరిందనిపించిన తర్వాత, ఆయన వాళ్ళిద్దరినీ పిలిపించి "నాయనలారా! విద్య అనంతమైనది. 'మనిషన్నవాడు జీవితాంతం విద్యార్థిగా ఉండాలి' అన్నది ఒట్టిమాట కాదు. నేను గత వారం రోజులుగా మీలోని సహనాన్ని పరీక్షిస్తూ వచ్చాను. రాజన్నవాడికి భుజబలం మాత్రం ఉంటే సరిపోదు- రాజ్య భారం వహించటానికి ఓపిక చాలా అవసరం.”
"మీరింకా కుర్రవాళ్ళు. మీలో మరింత సహనం, మరింత ఓర్పు అవసరం. మీరు ఈ వారం రోజుల సమయాన్నీ సద్వినియోగం చేసుకొని ఉండవచ్చు- మీకు ఇప్పటికే వచ్చిన విద్యల్ని మరింత సాధన చేసుకొని ఉండవచ్చు- కానీ మీరు అలా చేయక, మీ సమయాన్ని అసహనంతో వృధా చేసుకున్నారు. ఇకపైన మీరు ఎటువంటి సందర్భాలలోను సహనం, ఓర్పు కోల్పోకుండా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడే మీరిద్దరూ సంపూర్ణ విద్యావంతులవుతారు " అన్నారు.
గురువుగారి భావన అర్థమైన రాజ-కుమారులు ఇద్దరూ ఆనాటినుండీ ఓపికను పెంచుకోవాలని నిశ్చయించుకున్నారు. కాలక్రమంలో వాళ్ళిద్దరూ రాజులై, చక్కని పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు.