చంద్రాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకు , రైతు భార్యకు వాళ్ళ కూతురు పూజ అంటే చాలా ఇష్టం . ఆమెను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునేవారు వాళ్లు. పూజ చక్కగా చదివేది, చక్కగా రాసేది, చక్కగా పనిచేసేది- అన్ని విద్యల్లోనూ ఆరితేరింది ఆమె.
ఇలా ఉండగా ఆ ఊరికి ఒకసారి ఒక మోసగాడు వచ్చాడు. 'ఊళ్లోని ప్రజలను ఎవరిని మోసం చెయ్యాలా..?' అని చూస్తుండేవాడు వాడు. ఒక రోజున పూజ గుడికి వెళ్ళి ఇంటికి వస్తూ ఆ మోసగాడి కంటపడింది. అంత అందమైన పూజను చూడగానే వాడు 'ఎలాగైనా ఈమెను పెళ్ళి చేసుకోవాలి' అనుకున్నాడు.
మారువేషంలో పూజ వాళ్ళింటికి వెళ్ళి, తన గురించీ, తన ఉద్యోగం గురించీ గొప్పలు చెప్పుకున్నాడు వాడు. పూజ తనకు నచ్చిందనీ, ఆమెనే పెళ్లి చేసుకుంటానని వాడు మాయ మాటలు చెబితే, విని మోసపోయిన పూజ తల్లి దండ్రులు, ఆమెను ఆ మోసగాడికి ఇచ్చి పెళ్ళి చేసేశారు.
పెళ్లి జరిగిన మరునాడే తన అసలు రంగును బయటపెట్టాడు ఆ మోసగాడు. వాడికి విదేశాల్లోనే కాదు- స్వదేశంలో కూడా ఎలాంటి ఉద్యోగమూ లేదు! ఇప్పటికే చాలా చోట్ల పెళ్ళిళ్లు చేసుకొని పారిపోయి ఉన్నాడు వాడు! పూజ పల్లెటూరు పిల్ల కనుక, చెప్పిన మాట వింటుందనీ, కుక్కిన పేనులాగా పడి ఉంటుందనీవాడు అనుకున్నాడు! అంతేకాక, తనకు పూజ తల్లిదండ్రులు ఇచ్చిన వరకట్నం డబ్బుతో జల్సా చేసుకోవచ్చని కూడా ఆశ పడ్డాడు!
పూజ తల్లిదండ్రులు జరిగిన తప్పును తలచుకొని చాలా విచార పడ్డారు. పిల్లల పెళ్లి కోసం సంబంధాలు వెతికేటప్పుడు వరుల గురించి, వాళ్ళ నడవడిని గురించి, వాళ్ల ఉద్యోగాల గురించి ఒకటికి రెండు సార్లు ఇతరులతో వాకబు చేసి తెలుసుకోవాలి! 'తాము అలా చేయలేదే!' అని కృంగిపోతున్న తల్లిదండ్రులకు పూజ ధైర్యం చెప్పింది- "గతంలో మాదిరి, ఈనాడు ఆడపిల్లలు 'పెళ్ళే సర్వస్వం' అనుకోవటం లేదు! బాగా చదువుకొని, ఏదో ఒక విద్యను చక్కగా నేర్చుకున్నవాళ్ళ, జీవితంలోఎన్ని కష్టాలు ఎదురైనా నిలదొక్కుకోగలరు" అన్నది.
పూజ తనకు ఎదురైన కష్టాన్ని తన మిత్రులందరికీ వివరంగా చెప్పింది. వాళ్ళంతా కలిసి ఆ మోసగాడిని శిక్షించేందుకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా 'చంద్ర' అనే మిత్రుడు పూజ వాళ్ళ ఊరికి వచ్చాడు. అతను విదేశాలనుండి వచ్చినట్లుగా అందరికీ పరిచయం చేసింది పూజ. రెండో రోజుకల్లా ఆ మిత్రుడు మోసగాడికి దగ్గరయ్యాడు. ఆనాటి రాత్రి మంచి ఆహారం, మత్తు పానీయాలు తీసుకొని, ఆ మోసగాడిని విందుకు ఆహ్వానించాడు చంద్ర.
త్రాగిన మత్తులో ఉన్న మోసగాడు ఏమేమో మాట్లాడటం మొదలు పెట్టాడు. చంద్ర వాడి చేత నిజాలన్నీ బయటపెట్టిస్తూ, ఆ మాటలను అన్నింటినీ వీడియోలో రికార్డు చేశాడు. అవన్నీ పూర్తయ్యే సరికి, అంతవరకూ బయటే నిలబడి వింటున్న పూజ తల్లిదండ్రులు, ఊరి పెద్దలు, పత్రికలవాళ్ళు, పోలీసు అధికారులు అందరూ ఒక్కసారిగా లోపలికి వచ్చేసరికి, మోసగాడు బిత్తరపోయాడు.
ఊళ్ళోవాళ్ళు వాడికి చక్కగా దేహశుద్ధి చేశారు. పోలీసులు వాడికి బేడీలు తగిలించి, పూజను, ఆమె మిత్ర బృందాన్నీ అభినందించారు.
ఆ స్ఫూర్తితో బాగా చదివి, పోలీసు ఆఫీసరు అయింది పూజ!