ఒక ఊరిలో ఒక రాణి, కుక్క ఉండేవాళ్ళు. ఇద్దరూ గర్భవతులు. రాణి మాత్రం మంచి ఆహారం తీసుకునేది. కాని కుక్కకి మాత్రం అన్నం పెట్టేది కాదు. అప్పుడు దేవుడు ఒక శాపం పెట్టాడు- "నీకు పుట్టే బిడ్డలు కుక్కకు పుడతారు, కుక్కకు పుట్టే బిడ్డలు నీకు పుడతారు"అని. అలాగే రాణికి మూడు కుక్క పిల్లలు పుట్టాయి! వెంటనే రాణి వాటిని బయట పడేసి, వదిలించుకున్నది.
ఇక కుక్కకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. మొదటి కూతురి పేరు మల్లెల బేబి, రెండవ కూతురి పేరు జాబిల్లి, మూడవకూతురు పేరు చామంతి. కుక్క అడవిలోకి చేరుకుని, ఆ ముగ్గురు పిల్లల్నీ చాలా జాగ్రత్తగా పెంచి పెద్ద చేసింది.
ఒక రోజున కుక్క ఆహారం తెచ్చేందుకని ఊళ్లోకి వెళ్లింది. ఆ సమయంలో ముగ్గురు రాజ కుమారులు అడవిలో వేటకు వచ్చారు. మధ్యలో వాళ్లకు దాహం వేసి, నీళ్ల కోసం వెతక సాగారు. అప్పుడు వాళ్ళకు కుక్క ఇల్లు కనిపించింది. అక్కడికి వెళ్ళి మంచి నీళ్ళు అడిగారు. ముగ్గురు కూతుళ్లూ నీళ్ళు తెచ్చి ముగ్గురు రాజకుమారులకు ఇచ్చారు. అప్పుడు రాజ కుమారులు వాళ్ళు ముగ్గురినీ చూసి- "ఇంత అందంగా ఉన్నారు- వీళ్లను పెళ్ళి చేసుకోవాలి" అనుకున్నారు. "మమ్మల్ని పెళ్ళి చేసుకుంటారా?" అని అడిగారు వాళ్లని. పెద్దకూతురు, రెండవకూతురు "సరే" అన్నారు- కానీ మూడవ కూతురు చామంతి మాత్రం- "లేదు, నేను మా అమ్మను అడిగి చెబుతాను" అన్నది.
అయినా పెద్దవాళ్ళిద్దరూ ఆమె మాట వినలేదు. తల్లి వెనక్కి వచ్చేంతవరకూ ఆగలేదు. చామంతిని కూడా లాక్కొని రాజకుమారుల ఇంటికి పిలుచుకుపోయారు.
దారిలో అంతా మూడవ కూతురు- తన అమ్మ గుర్తు కోసమని- తన దగ్గరున్న పాత చీరనొకదాన్ని చింపి, అక్కడక్కడా వేసుకుంటూ పోయింది. అంతలో ఆ చీర కాస్తా అయిపోయింది! తరువాత ఆమె పెద్ద పెద్ద ఆకులను కోసి, దారిలో వేసుకుంటూ పోయింది- పాపం, ఇంకేమి చేయగలదు? అంతలో కుక్క తన ఇల్లు చేరుకొని, పిల్లల్ని పిలిచింది- కానీ ఎవ్వరూ బయటికి రాలేదు. లోపలికి వెళ్ళి చూస్తే ఎవ్వరూ లేరు! కుక్క బయటికి వచ్చి, చుట్టు ప్రక్కల అంతా వెతికి చూసింది- పిల్లలు కనిపించలేదు కానీ, చిన్న కూతురు చీరముక్కలు కనబడ్డాయి. వెంటనే అది ఆ చీర గుర్తును అనుసరించి చాలా దూరం వెళ్ళింది.
అట్లా పోతూ పోతూ, అది దారిలో ఉన్న వాళ్ళను అందర్నీ అడుగుతూ పోయింది. అట్లా "రాజకుమారులు ఎవరో ముగ్గురు ఆడపిల్లలను పెళ్ళి చేసుకుని రాజభవనానికి తీసుకు వెళ్ళారు" అని తెలిసింది.
కూతుళ్లను చూడకుండా ఉండలేని కుక్క, వాళ్లను వెతుక్కుంటూ రాజ భవనానికి వెళ్ళింది. కుక్క రావటం చూసిన మల్లెల బేబి "ఆ కుక్కను పట్టుకొని దాని కాలు విరిచి పంపించండి" అని భటులకు చెప్పింది. భటులు కుక్కను పట్టుకొని, దాని కాలు విరిచి పంపారు.
కుక్క, పాపం అలాగే కుంటుకుంటూ రెండవ కూతురు కోసం పోయింది. తల్లి రాకను గమనించిన జాబిల్లి భటులతో "ఆ కుక్కను పట్టుకొని దాని నడుం విరగగొట్టి పంపించండి" అని చెప్పి, లోపలికి వెళ్ళి దాక్కున్నది. ఆ భటులు కుక్కను పట్టుకొని, దాని నడుము విరగగొట్టి పంపించారు.
కుక్క బాధతో , నొప్పి భరించలేక, ఒక చోట కూలబడిపోయింది. అప్పుడు చామంతి దాన్ని గమనించి, "ఆ కుక్కను జాగ్రత్తగా తీసుకొని వచ్చి, స్నానం చేయించి, కట్టుకట్టమ"ని చెప్పింది భటులతో. వాళ్ళు రాణి ఆజ్ఞ ప్రకారం కుక్కకు పన్నీటితో స్నానం చేయించి, మందువేసి కట్టు కట్టారు. తన అమ్మకోసం భోజనం తెచ్చింది చామంతి- కానీ తన కూతుర్ని చూసిన ఆనందంతో, కుక్క ఇక అక్కడ భోజనం చేయకుండా వెళ్లిపోయింది.
కొన్ని రోజుల తరువాత ఆ కుక్క చనిపోయింది. ఆవిషయాన్ని తెలుసుకున్న రాణి చామంతి చాలా బాధ పడింది. తన తల్లిని దహనం చేసి, ఆ బూడిదను ఒక కుండలో పెట్టి, తన దగ్గర పెట్టుకున్నది. ఏదో ఒకనాడు దాన్ని గంగానదిలో కలపాలనుకున్నది . అయితే దాన్ని గమనించిన యువరాజు ఒక రోజున "ఆ కుండలో ఏమున్నది?" అని అడిగాడు.
"ఏమీ లేదులే!" అని చెప్పింది చామంతి. "అయితే చూపించు!" అన్నాడు రాజకుమారుడు. "ఏమీ లేదు, ఇందులో మా అమ్మ ఇచ్చిన ఆస్తి ఉంది!" అని చెప్పింది చామంతి. "అయినా చూపించాల్సిందే!" అని పట్టు పట్టాడు ఆమె భర్త. చామంతికి మనసు విరిగిపోయింది. 'అందరి ముందూ తన తల్లిని పలచన చేసేకంటే, చచ్చిపోవటమే మేలు' అనుకొని, ఆమె అన్నది- "ఈ కుండను తీయాలంటే ముందుగా పుట్టలో ఉన్న నాగ దేవునికి నీళ్ళు పోసి పూజ చేయాలి" అని.
"సరే" అని, రాజకుమారుడు నాగ పూజకు అందరినీ పిలిచాడు. చామంతి బండి కట్టుకొని పుట్ట దగ్గరికి వెళ్ళింది. తల్లిని తలచుకొని, చనిపోయేందుకని నాగుపాము పుట్టలో కాలే కాలే వేడినీళ్లు పోసింది.
అయితే అదే సమయానికి, పుట్టలోఉన్న నాగదేవుడికి భరించలేనంత చెవి నొప్పిగా ఉంది. ఆ నీళ్ళు కాసిని తగిలేసరికి, ఆయన నొప్పి కాస్తా తగ్గిపోయింది. అప్పుడు ఆయన తన ఇద్దరు కొడుకులనూ పంపించి , ఆమెకు లెక్కలేనంత బంగారం ఇచ్చాడు. తన బండి నిండా బంగారం వేసుకొని సంతోషంగా పోతూ ఉన్న చామంతిని చూసి, వాళ్ళ ఇద్దరు అక్కలూ "ఎక్కడిది, ఇంత బంగారం?" అని అడిగారు. ఆమె నాగదేవుడి గురించి చెప్పగానే, వాళ్ల ఆశకు అంతు లేకుండా పోయింది.
అప్పుడు వాళ్ళు కుండలు కుండలు ఉడుకుడుకు నీళ్ళు తెచ్చి, పుట్టలో పోశారు. లోపల పడుకున్న నాగదేవుడికి ఒళ్ళు కాలటమే కాక, మళ్లీ చెవినొప్పి మొదలయింది. వెంటనే నాగదేవుడి కొడుకులు బయటికి వచ్చి ఆశపోతు అక్కలిద్దర్నీ కరిచి పోయారు. అటుపైన చామంతి తన భర్తకు వాస్తవం అంతా చెప్పింది. రాజకుమారుడు, చామంతి కలకాలం సంతోషంగా జీవించారు.