ఒక రోజున తైమూర్ పాదుషా గుర్రం మీద వేటకి వెళ్తున్నాడు. దారిలో ఊరి బయట నసీరుద్దీన్ నేలను తవ్వుతూ కనిపించాడు.
తైమూర్ అతనిని పిలిచి "ఇక్కడేం చేస్తున్నావ్?" అని అడిగాడు.
నసిరుద్దీన్ గొప్ప చమత్కారి, మాటకారి. అందరినీ ఆటపట్టిస్తూ ఉంటాడు. తైమూరును కూడా 'ఆట పట్టించాలి' అనుకున్నాడు. "షాదుషా గారూ! నేను బంగారు నాణాలను పొలంలో నాటుతున్నాను. ఇవి నావి కూడా కావు- అప్పు తెచ్చి నాటుతున్నాను" అన్నాడు.
"ఎందుకలా చేస్తున్నావ్?!” అని అడిగాడు తైమూర్, ఆశ్చర్యపోతూ.
"నేను నాటే ఈ బంగారు నాణాలు కొన్ని రోజుల్లో మొలుస్తాయి. బంగారు పంట పండుతుంది. వచ్చి బంగారు పంటను కోసుకొని పోతాను" అన్నాడు నసిరుద్దీన్ .
తైమూర్ నవ్వుకున్నాడు. "బంగారు నాణాలను నాటితే పంట వస్తుందా, ఎక్కడైనా?ఈ ముసలివాడికి బంగారపు పిచ్చి పట్టుకున్నట్లుంది" అనుకున్నాడు.
"అయ్యో, ఎందుకు రాదు జహాపనా?! ఏ ఆధారమూ లేకుండానే నేను అప్పుతెచ్చి మరీ నాణాలు నాటతానా?" అన్నాడు నసీరుద్దీన్, తైమూరు మనసును చదివినట్లు.
"ఈ ముసలివాడికి బుద్ధి చెప్పాలి- ఎలాగైనా సరే, వీడి దగ్గరున్న బంగారాన్ని కూడా కొట్టెయ్యాలి" అనుకున్నాడు తైమూర్.
"ఈ కొద్ది బంగారు నాణాలు నాటితే ఎంత బంగారం వస్తుంది? రాజ మందిరానికి వెళ్ళి, నీకు కావల్సినన్ని బంగారు నాణాలు తెచ్చుకో. పండిన బంగారు పంటలో నాకు కూడా వాటా ఇవ్వాలి మరి" అన్నాడు తైమూర్, గుర్రాన్ని అదిలిస్తూ.
నసిరుద్దీన్ వెంటనే రాజభవనం వెళ్ళి, పెద్ద సంచి నిండా బంగారు నాణాలు తెచ్చాడు. దాన్నంతా పేదలకు పంచి పెట్టాడు. రెండు నెలల తర్వాత ఖాళీ చేతులతోషాదుషా దగ్గరికి వెళ్ళాడు.
"బంగారం ఏది?" అడిగాడు తైమూర్ .
"ప్రభూ! ఘోరం జరిగిపోయింది. ఇన్ని రోజులుగా వర్షం కురవలేదు. బంగారు చేనంతా ఎండిపోయింది. పంటంతా నేల పాలైంది. నాటింది కూడా దక్కడం లేదు" అన్నాడు నసీరుద్దీన్, బాధ నటిస్తూ.
"బంగారు నాణాల చేను ఎండిపోయిందా? నన్ను నమ్మమంటావా? మర్యాదగా నేను ఇచ్చిన నాణాలన్నీ ఏమయ్యాయో చెప్పు!" గద్దించాడు తైమూర్ .
"ప్రభూ! బంగారు నాణాల్ని నాటినప్పుడు పంటవస్తుందని చెబితే నమ్మిన మీరు, వానలేక ఆ పంట నాశనమైందని చెబితే ఎందుకు నమ్మటం లేదు?" అడిగాడు నసీరుద్దీన్, అక్కడే ఉన్న న్యాయాధికారుల వైపుకు చూస్తూ.
షాదుషాకి ఏం చేయాలో దిక్కు తోచలేదు. న్యాయాధికారులంతా నసీరుద్దీన్ కే వత్తాసు పలికేటట్లు అనిపించింది.
తైమూరు ఏమీ అనకపోవటం చూసి, నసీరుద్దీన్ తన గాడిద మీద ఎక్కి దర్జాగా వెళ్ళిపోయాడు.