చిత్రాంగుడు మొదలైన మిత్రులు ముగ్గురూ మంధరుడికి కలిగిన ఆపదను చూసి, ఏడుస్తూ, కొంత వెనుకగా వేటగాడి వెన్నంటి పోసాగారు . హిరణ్యకుడు అప్పుడు 'వచ్చిన కష్టాన్ని దాటుకున్నాం గదా' అని క్షణం ముందే సంతోషించామే, ఇంతలోనే ఈ కష్టం వచ్చిపడింది చూడండి! అయినా ఈ కష్టాన్ని చూసి మనం దు:ఖపడకూడదు. వేటగాడు అడవిని దాటిపోకముందే మంధరుడిని విడిపించాలి. దానికి తగిన ఉపాయం ఏదైనా ఆలోచించండి. వాడు అడవిని దాటాడంటే మనం ఇక మంధరుడిని కాపాడలేం" అన్నది.

అది విని చిత్రాంగుడూ, లఘుపతన-కుడూ ఇద్దరూ "మా శరీరాలు నిప్పుల్లో పడి దొర్లినట్లు మండుతున్నాయి. మనసులు స్వాధీనంలో లేవు. 'ఏం చేయాలి' అనేది మాకు అర్ధం కావటం లేదు. నువ్వు బుద్ధిశాలివి. నువ్వే ఏదో ఒక ఉపాయం ఆలోచించగలవు. నావ మాదిరి, నువ్వే మిత్రుడిని ఆపదల తీరం చేర్చి, మమ్మల్ని కూడా శోక సముద్రం నుండి దరి చేర్చు. నువ్వు తప్పితే మాకు వేరే శరణ్యం లేదు. ఏం చెయ్యాలో నువ్వు చెప్పు- నువ్వెట్లా చెబితే మేము అట్లా చేస్తాము" అన్నాయి.

అప్పుడు హిరణ్యకుడు "మనలో ఏ ఒక్కరికి వచ్చిన కష్టసుఖాలలోనైనా అందరం భాగస్వాములమే. అందువల్ల ఇప్పుడు మనకు ఎదురైన కష్టం నుండి తప్పించుకొనే ఉపాయాన్ని వెదకటం మీకెంత ముఖ్యమో, నాకూ అంతే ముఖ్యం. దాని కోసం మీరు నన్నింతగా ప్రాధేయపడి అడగనక్కరలేదు. ఏదో, నాకు తోచిన ఉపాయం ఒకటి చెబుతాను. మీ మీ బుద్ధులతో ఆలోచించండి. అందరికీ అంగీకారమైన పద్ధతిని పాటిద్దాం" అన్నది.

ఆపైన అది చిత్రాంగుడి వైపు తిరిగి “నువ్వు వేటగాడి కంటపడకుండా ముందుకుపోయి, వాడు పోయే దారిలో ఒక నీటి కొలను ఒడ్డున పడుకో. నాలుగు కాళ్లూ చాచి, కళ్లని సగం మూసి సగం తెరచి ఉంచి, మెడ ఎత్తి, మోర సారించి చచ్చినట్లు కదల-కుండా పడి ఉండు. లఘుపతనకుడు నీ మీద కుర్చొని, నీ కళ్లు పొడుచుకొని తింటున్నట్లు నటిస్తుంటుంది.

అప్పుడు వేటగాడు 'జింక చచ్చిపడి ఉన్నది' అనుకుంటాడు. చేతిలో ఉన్న విల్లును మంధరునితోబాటు దించి నేలమీద పెట్టి, మీ దగ్గరకు వస్తాడు. వాడు అటు తిరగగానే నేను వచ్చి, చీమ చిటుక్కు-మనకుండా మంధరుని కట్టు త్రాళ్లు కొరికేస్తాను. వెంటనే మంధరుడు కొలనులోకి వెళ్లి పోతాడు. నేను ఏదో ఒక బొరియలోకి దూరతాను. వాడు మిమ్మల్ని చేరకనే మీరూ పారిపోండి: ఇది నాకు తోచిన ఉపాయం. ఇక త్వరగా మీ అభిప్రాయం చెప్పండి!" అనగానే చిత్రాంగుడు, లఘుపతనకుడు చాలా సంతోషించి, హిరణ్యకుడి తెలివిని ప్రశంసించి, 'అలాగే చేద్దామ'న్నారు.

ఆపైన ముగ్గురూ తమ ఉపాయాన్ని చక్కగా అమలుచేశారు. అనుకున్నట్లుగానే మంధరుడు కొలనులోకి, హిరణ్యకుడు బొరియలోకి దురారు . కాకి, జింక అడవిలోకి పరుగు తీశారు.

అప్పుడు వేటగాడు చాలా చింతించి, ఇక చేసేది ఏమీ లేక ఇంటికి వెళ్లిపోయాడు. ఆపైన హిరణ్యకుడు మొదలుగా గల మిత్రులు నలుగురూ కలిసి తమ నివాస స్ధానానికి వెళ్లి, గతంలో మాదిరి సుఖంగా కాలం గడిపారు.
(మిత్రలాభం ముగిసింది)

మిత్రభేదం

అప్పుడు రాజకుమారులు విష్ణుశర్మతో "స్వామీ! మీ చలవ వల్ల మిత్రలాభాన్ని వినగల్గాము. ఇక 'మిత్రభేదా'న్ని వినాలని కోరికగా ఉంది!" అన్నారు. అప్పుడు విష్ణుశర్మ ఇలా చెప్పసాగాడు:

'ఒక అడవిలో ఒక సింహం. ఒక ఎద్దు చాలా స్నేహంగా ఉండేవి. జిత్తులమారి నక్క ఒకటి వాటి మధ్య స్నేహాన్ని చెడగొట్టి, ద్వేషం పుట్టించి, సింహం చేత ఎద్దును చంపించింది. ఆ కథను మీకు వివరంగా చెబుతాను. శ్రద్ధగా వినండి :

దక్షిణ దేశంలో 'రక్షావతి ' అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణంలో 'వర్ధమానుడు ' అనే వ్యాపారి ఒకడుండేవాడు. తన బంధువులు చాలా మంది తనకంటే సంపన్నులవ్వటం చూసి, వాళ్ల కంటే ఎక్కువ డబ్బు గడించాలనిపించింది అతనికి-

"మానవుడు సంపాదించవలసిన ధర్మ- అర్థ- కామ- మోక్షాలు నాల్గింటిలోకీ ముఖ్యమైనది ధనమే. ధనవంతుడికి అసాధ్యమైనదేదీ ఈ లోకంలో కనబడదు. కాబట్టి మనిషన్నవాడు న్యాయం తప్పకుండా ఏ- విధంగానైనా సరే, ధనాన్ని సంపాదించాలి. "తెలివైనవాడు 'ముసలితనంగానీ, చావుగానీ ఎన్నటికి రాని వాడిలాగా', విద్యను , డబ్బును సంపాదించాలి" అని పెద్దలు చెబుతుంటారు. డబ్బు సంపాదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. 'వాటన్నిటిలోకీ వ్యాపారమే ఉత్తమం' అని నాకు తోస్తున్నది" అనుకున్నాడు. ఆపైన అతను ఇతర దేశాలకు అవసరమయ్యే సరుకులను- తన దేశంలో దొరికే మేలుజాతి వాటిని- సేకరించుకొని, ఆ సరుకుల్ని ఎద్దుల బండ్లమీద, గుర్రాలమీద, కంచర గాడిదల మీద వేసుకొని, కొన్నిటిని మోసేందుకు మనుషుల్ని నియమించు-కున్నాడు. ఇక తన కోసం గట్టి బండినొకదాన్ని సిద్దం చేసుకొని, దాన్ని లాగేందుకు 'సంజీవకము, నందకము' అనే మంచి- బలిష్ఠమైన ఎద్దులను పూన్చుకొని, తగిన పరివారంతో ఉత్తరదేశానికి బయలుదేరాడు.

ఇట్లా బయలుదేరిన వర్ధమానుడి బృందం చాలా దూరం ప్రయాణించి, 'సుదుర్గం' అనే పర్వతానికి దిగువన ఉన్న అడవిని చేరుకున్నది. వాళ్లంతా ఆ అడవిలో పోతూ ఉండగా, కాడి ఎద్దులలో ఒకటైన సంజీవకం బండిని లాగలేక-లాగలేక లాగుతూ, జారి, మోకాలు విరగగా, కూలి, నేలమీద పడిపోయింది.

వర్తకుడు వెంటనే బండి నుండి దిగి, సంజీవకం మెడ నుండి కాడి కట్టును విడిపించి, రెండవ ఎద్దునూ ప్రక్కకు తీసి "అయ్యో! ఇది నా దగ్గరున్న కాడి ఎద్దులలో కెల్లా గొప్పది- నా దగ్గరున్న కాడి ఎద్దుల్లో ఏదీ దీనికి సాటి రాదు. చాలా మంచి నఱ్ఱ ఇది. 'ఇక్కడ ఆగి దీనికి తగిన చికిత్స చేయించుకొని పోదామా' అంటే ఇది నట్టడవి! నిలువ దగిన చోటు కాదు.”

"ఈ ఎద్దును ఇక్కడ వదిలి పోవలసిందే. దీనికి ఇలా ఈ అడవిపాలు కావలసిన గతి ఉన్నది కాబోలు. దైవానికి ఎదురొడ్డి మానవుడు ఏమి చేసినా ప్రయోజనం ఉండదు. మంచో, చెడో- ఏ సమయంలో ఏది జరగాలో అది జరగక మానదు. కాబట్టి ఎప్పుడైనా ఒక కష్టం ఎదురైనప్పుడు చింతించకూడదు. అలా చింతపడి మాత్రం ఏం ప్రయోజనం?" అనుకున్నాడు.

ఆపైన అతను తనతో బాటు ఉన్న బండ్లను, కావళ్లను తీసుకున్నాడు. కొందరిని మాత్రం బండికి కాపలా ఉంచాడు. మిగిలిన వాళ్లతో ఆ అడవికి దగ్గరలోనే ఉన్న 'ధర్మపురం' అనే ఊరికిపోయి, అక్కడ బాగా బలిసి, బలంగా ఉన్న వేరొక ఎద్దునొకదాన్ని కొని తెచ్చాడు. ఆపైన దాన్ని తన బండికి కట్టించుకొని, ఆ వ్యాపారి ముందుకు సాగిపోయాడు.

అయితే సంజీవకం భాగ్యం మంచిది కాబట్టి, కౄర జంతువులు ఏవీ ఆ దాపులకు రాలేదు. కొద్ది రోజుల్లోనే విరిగిన మోకాలు చక్కబడింది: అది ఇప్పుడు లేచి చక్కగా నడుస్తున్నది! ఆయుష్షు గట్టిగా ఉంటే మహా మృత్యువు నోట్లోకి పోయి కూడా వెనక్కి తిరిగి రావచ్చు. అలా కాక, కాలం సమీపించిందంటే, కోటి దేవతలైనా ఆ మరణాన్ని తప్పించలేరు.

ఆ తర్వాత ఆ ఎద్దు అడవిలో విచ్చలవిడిగా తిరుగుతూ పోయింది. రోజు రోజుకూ మంచి పచ్చిక మేత కడుపారా దొరకటంతో, అది బాగా బలిష్టంగా తయారైంది. ఒకనాడు అది ఆ విధంగా బాగా మేసి, పర్వతాలలోని గుహలు ప్రతిధ్వనించేట్లు "గణిల్" అని రంకె వేసింది!

ఆ అడవిలో 'పింగళకం' అనే సింహం ఒకటి ఉండేది. అది పులులను బెదిరిస్తూ, అడవి పందులను బాధపెడుతూ, అడవి దున్నలను అమితంగా భయపెడుతూ, ఎలుగుబంటులను శిక్షిస్తూ, మిగిలిన మామూలు జంతువులను అస్సలు ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా- తన ఇష్టం వచ్చినట్లు విహరిస్తూ ఉండేది. ఆ రోజున అది బాగా శ్రమపడటంతో, దానికి బాగా దాహం వేసింది. నీళ్ళు తాగేందుకు అది యమునా నదీ తీరానికి పోయింది. సరిగ్గా సమయానికి అడవిలో ఉన్న సంజీవకం రంకె వేసింది. ప్రళయ సమయంలో మేఘాలు గర్జించినట్లు, భయంకరంగా వెలువడ్డ ఆ ధ్వనికి పింగళకం నివ్వెరపోయి, నిశ్చేష్టం అయిపోయి నిలబడింది.

(తరువాతి కథ వచ్చే మాసం...)