సంచీ నిండా పుస్తకాలు.

నోటు పుస్తకాల నిండా ప్రశ్నలూ జవాబులూ.

ఎప్పుడైనా తెల్ల కాగితం దొరికిందంటే దాని మీద రాసేది పరీక్ష జవాబులు.

బొమ్మలేసుకుందామంటే- చిత్తు కాగితాలు.
'నువ్వెంత బాగా బొమ్మలు వేస్తావో!' అంటుంది అమ్మ.
కాని కొత్త కాగితం అడిగితే మాత్రం 'దండగ' అంటుంది.
'చెట్లు కొట్టి కాగితాలు చేస్తారు;'

'కాగితాలు తక్కువ వాడాలి, ఖాళీ ఉంటే మళ్ళీ వాడాలి' అంటుంది.

ఒక రోజు మా నాన్న, అమ్మకి తెలియకుండా తన ఫైలులోంచి తీసి ఒక తెల్ల కాగితం ఇచ్చారు.

నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను దానిని.

'ఏదైనా మంచి బొమ్మ వెయ్యడానికి వాడాలి 'అని.

అంతే కాదు, అమ్మ చూస్తే కోప్పడదూ? నాన్న మీద కూడా కోపమొస్తుందో ఏమో.

రోజూ పడుకున్నాక, అమ్మ లైట్లు ఆర్పేసి వెళ్ళిపోతే, ఆ చీకట్లోనే ఆ కాగితం తీసుకుని చూసుకుంటున్నాను: ఏమైనా మంచి ఆలోచన తడ్తుందేమోనని. ఒకటే బెంగ, ,అమ్మ చూసేస్తుందేమో, తీసేసుకుంటుందేమో అని!

ఒక రోజు అమ్మకి ఒంట్లో బాలేదు. రోజంతా పడుకునే ఉంది.

నాకేమీ తోచలేదు. ఆ దాచి ఉంచిన కాగితం గుర్తుకు వచ్చింది.

బాగా దిగులేసింది. ఏదో తప్పు చేశాననిపించింది.

నాన్న ఇంటికి వస్తూ కొత్త మందులేవో తెచ్చారు. నేను కంగారు పడుతుంటే టెంపరేచరు చూసి, “పరవాలేదులే, జ్వరం లేదు. ఈ రోజుకి అమ్మని ఇబ్బంది పెట్టకు. వీలైతే ఏదైనా మంచి బొమ్మ వేసి ఇవ్వ కూడదూ, సంతోషిస్తుంది?” అన్నారు.

అప్పుడు వెంటనే ఆ తెల్ల కాగితం తీసి అమ్మ కోసం ఒక మంచి బొమ్మ వేశాను.

కింద చాలా చిన్నగా “సారీ” అని రాశాను.

అమ్మకి చూపించాను.

అమ్మ, బొమ్మ చూసి చాలా బావుంది అంటుంటే నేను కింద రాసిన “సారీ” చూపించాను.
అమ్మ నవ్వేసింది.

'సరే, అయితే ఇప్పుడు వెనక వైపు కూడా ఏదైనా బొమ్మ వేసి ఇవ్వు'.

'రెండు వైపులా పూర్తిగా వాడుతానంటే నాన్న నీ కోసం కొని ఉంచిన కాగితాల్లోంచి నీకు రోజుకొకటి ఇస్తాను' అంది.

అప్పటికప్పుడు కాగితం తిప్పి ఇంకో బొమ్మ వేశాను. నాన్న కాగితాలు గూట్లో దాస్తుంటే అమ్మ నా కళ్ళు మూస్తోందిట.

కింద పెద్ద అక్షరాలతో రాశాను, “అమ్మ దొంగా!” అని.