వింధ్య పర్వతాల్లో ఒక దట్టమైన అడవి ఉండేది. కాకులు దూరని ఆ అడవిలో అనేక జంతువులు, పక్షులు తరతరాలుగా స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండేవి. ఆ అడవి మధ్యలో ఒక సరస్సు ఉండేది. ఆ సరస్సుకు దగ్గరగా ఉన్న గుహలో ఒక రాక్షసి, తన పిల్లతో సహా నివసించేది. ఈ రెండూ చాలా మంచివి. ఏనాడూ ఒక్క ప్రాణికి కూడా అపకారం చేసి ఎరుగవు. మిగిలిన జంతువుల లాగే, వాటి మానాన అవి జీవిస్తూ ఉండేవి. పిల్ల రాక్షసికి తను పుట్టిన ఆ అడవి అన్నా, అక్కడి వాతావరణం అన్నా చాలా ఇష్టం. అమ్మ రాక్షసికి తన పిల్ల అంటే ప్రాణం.

ఒకసారి పిల్ల రాక్షసి సరస్సు ఒడ్డున కూర్చొని, కాళ్ళు నీళ్ళలోకి చాపుకొని ఆడుకుంటున్నది, రోజూలాగే. చుట్టూ వాతావరణం బాగున్నది- వసంతం వచ్చింది. పూలు వికసించి, గాలికి ఊగుతున్నై. పక్షులు కువకువలాడుతున్నై. ప్రకృతి సోయగాలను చూస్తున్న పిల్లరాక్షసి మైమరచి పోతున్నది.

అకస్మాత్తుగా తన మీద ఏదో నీడ పడినట్లై, వెనక్కి తిరిగి చూసింది అది- అక్కడో వింత ప్రాణి నిలబడి ఉన్నది, తనకేసే చూస్తూ. రెండు కాళ్ళు- రెండు కాళ్లమీద నిలబడి ఉన్నదది, అచ్చం రాక్షసుల లాగే. కానీ దాని తలమీద కొమ్ములు లేవు- ఏదో కప్పుకొని ఉన్నది. కోరలు లేవు- నోటి లోపలికే పోయినట్లున్నై, మరి. రంగులు రంగులుగా ఉంది, దాని చర్మం- వెంట్రుకలూ లేవు, పొలుసులూ లేవు! చేతిలో పొడుగాటి కట్టె పట్టుకొని, అది క్రూరంగా చూస్తున్నది తనవైపే.

పిల్ల రాక్షసికి భయం వేసింది. గబుక్కున లేచి నిలబడి దానివైపే చూస్తూ కదలకుండా ఉండిపోయింది ఒక్క క్షణం. ఆ సమయంలో వింత ప్రాణి "హే..య్" అని అరిచింది. వెంటనే దాని దగ్గరున్న కట్టెలోంచి "టు..శ్..శ్..ష్" అని శబ్దం చేస్తూ ఏదో దూసుకొచ్చింది రాక్షసి పిల్ల మీదికి. రాక్షసి పిల్ల ఒక్క ఉదుటున ప్రక్కకు దూకి, ఎటు పడితే అటు పరుగు తీసింది.

వింతజీవి దాని వెంట పడింది, అరుచుకుంటూ. దాని చేతిలో ఉన్న కట్టె ఆగి ఆగి "టు..శ్..శ్..ష్" అని శబ్దం చేస్తున్నది. రాక్షసి పిల్ల ఇక వెనక్కి తిరిగి చూడకుండా పరుగు తీసింది, వింతజీవికి అందకుండా పొదలలోకీ, తుప్పలలోకీ పరుగెత్తిపోయింది.

అలా పరుగెత్తుతుంటే దానికి ఏనుగు ఎదురైంది. "కాపాడు, కాపాడు. ఏదో వింతజీవి, రెండు కాళ్లమీద వెంటపడుతోంది. "టుష్.." మని శబ్దం చేస్తోంది" అన్నది పిల్లరాక్షసి, వగరుస్తూ. అంతలో "ఏ...య్! ఎక్కడున్నావు నువ్వు? నానుండి తప్పించుకు పోలేవు! టుశ్....ష్" అని శబ్దం వచ్చింది వెనకవైపునుండి. "అమ్మో, మనిషి!" అని అంతలావు ఏనుగూ పరుగులు పెట్టి, ఒక్క క్షణంలో కనుమరుగైంది. పిల్ల రాక్షసి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసే సరికి వింతజీవి దగ్గరకొచ్చేసింది! పిల్ల రాక్షసి పరుగు మళ్ళీ మొదలైంది.

చాలా దూరం పరుగెత్తాక దానికి ప్రాణాలు కడబట్టినట్లై, ఒక ప్రక్కగా ఆగింది. అక్కడ ఓ చెట్టుమీద ఒక చిరుతపులి కునుకు తీస్తున్నది. పిల్లరాక్షసిని అది ఆప్యాయంగా పలకరించింది. "ఏదో వింత జీవి- మనిషట, నావెంట పడింది. కాపాడు, కాపాడు" అని పిల్లరాక్షసి అనగానే అది దబ్బున నేలమీద పడింది-"అమ్మో, మనిషా!?" అని అరిచి, వంకరదారుల వెంట, తుప్పల మీదినుండి దూకుతూ పరుగు పెట్టింది.

రాక్షసిపిల్లకు ఆయాసంతోటీ, భయంతోటీ ఊపిరాడనట్లౌతున్నది. అయినా ఆగేందుకు లేదు- ఏనుగునూ, చిరుతపులినీ భయపెట్టిన ఆ ప్రాణి సామాన్యమైనది కాదు! దాని పాలబడితే తన గతి ఏమౌతుందో- ఊహించుకుంటేనే దానికి వణుకు పుట్టింది.

అలా అది సింహాన్నీ, పెద్దపులినీ, తోడేళ్లనీ, నక్కల్నీ కల్సి "కాపాడమని" మొర-పెట్టుకున్నది. ఏ జంతువుల్ని కలిస్తే అవల్లా- "మనిషా!" అని ప్రాణం పోయినట్లుగా అరిచేవి; లేచి, ఒక్క ఉదుటున పారిపోయేవి!

అలా పరుగు తీసీ పరుగు తీసీ చివరికి పిల్ల రాక్షసి తమ గుహనే చేరుకున్నది. గుహలో తల్లి రాక్షసి గురక పెట్టి నిద్రపోతున్నది. పిల్లరాక్షసి వెళ్ళి "ఓయమ్మో, కాపాడు, కాపాడు" అని మొత్తుకోగానే అది లేచి, "ఏమైందే" అని అడిగింది, బద్ధకంగా. "ఎవరో మనిషట, నా వెంట పడ్డాడు. "ఏ..య్.టు..శ్..శ్..ష్" అని అరుస్తున్నాడు. అన్నది రాక్షసి పిల్ల.

తల్లి రాక్షసి ఆవులించింది. "మనిషి మనకు భయపడాలి గాని, మనం వాడికి భయపడేదేంటి?" అన్నది ఒకింత చికాకుగా. "అందరికీ అదంటే భయమేనే, నా వాసన పట్టినట్లుంది, నా వెంటే వస్తున్నది, వెతుక్కుంటూ" అన్నది పిల్ల రాక్షసి, తల్లిని కావలించుకుంటూ. "ఏం పర్లేదులే, నేను వస్తాను గదా, పద!" అని, తల్లి రాక్షసి దాన్ని బుజ్జగించి బయటికి తీసుకెళ్ళింది.

ఇవి వెళ్ళే సరికి, మనిషి అక్కడ సరస్సు దగ్గర నిల్చొని 'ఏ జంతువును చంపుకెళ్దామా' అని ఎదురుచూస్తున్నాడు.

తల్లి రాక్షసి వాడిని చూసీ చూడగానే పెడబొబ్బలు పెట్టుకుంటూ ఒక్క ఉదుటున వాడి పైకి దూకింది. ఆ పొలికేకకు వాడికి వెన్నులోంచి చలి పుట్టుకొచ్చినట్లైంది. ఇప్పుడిక పారిపోవటం వాడి పనైంది. వాడు ముందు పరుగెత్తుతుంటే, తల్లి రాక్షసి, పిల్లరాక్షసి వాడి వెంటపడి తరిమి, తరమటంలోని ఆనందాన్ని చవి చూశాయి!

ఆ తరువాత తల్లి రాక్షసి పిల్లకు-"చూడమ్మా, మనం దేనికీ భయపడకూడదు- భయపడితే అలుసైపోతాం. ఆ తర్వాత లోకం మనల్ని వశం చేసుకుంటుంది. అందుకని, అవసరాన్ని బట్టి లోకాన్ని భయపెట్టాలి తప్ప, మనం మాత్రం ఎప్పుడూ భయపడరాదు" అని ఉపదేశించింది.