ఆరవ తరగతి పిల్లవాడొకడు ఆ మధ్య వాళ్ళ బడికి ఒక తుపాకీ తీసుకుపోయాడట.
ఆ తుపాకీ బొమ్మది కాదు. అందులో బుల్లెట్లు రబ్బరువీ కావు. అది నిజం తుపాకీ!
వాళ్ళ నాన్నదిట అది. వాళ్ళ ఇంట్లో మొత్తం రెండు తుపాకులుంటాయట- ఒకటి వాళ్ళ నాన్నది; ఒకటి వాళ్ళ అమ్మది. వాటితో వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. మొత్తానికి ఒక తుపాకీ ఈ పసివాడి చేతిలోకి వచ్చింది.
వాడు అప్పటికే చాలా వీడియో గేములూ, కంప్యూటర్ గేములూ ఆడి ఉన్నాడు. తుపాకీతో ఏంచేస్తారో వాడికి బాగా తెలుసు. తుపాకీని గురిపెట్టటం వాడికి చక్కగా వచ్చు. ఎందరో టి.వి. రాక్షసుల్ని పేల్చేసిన అనుభవం ఉన్నది వాడికి. బడిలో తనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్న కుర్రవాళ్ళు ఇద్దర్ని , పిట్టల్ని కాల్చినట్లు కాల్చి పడెయ్యటం వాడికి ఏమాత్రం కష్టం కాలేదు.
వెయ్యిమంది విద్యార్థుల ఎదుట, విద్య గరపే టీచర్ల సాక్షిగా, వాడు తన తోటి పిల్లల్ని కాల్చి చంపేశాడు. తల్లిదండ్రులనుండి పిల్లలు చాలా సంగతులు నేర్చుకుంటారు. వాళ్ళని ఎంత దూరంగా, బోర్డింగు స్కూళ్లలో ఉంచినా సరే, పిల్లలు తల్లిదండ్రుల అలవాట్లని అంత తొందరగా మర్చిపోరు. తల్లి, తండ్రి తూటాలు, బాంబులు లేకుండా బ్రతకలేని అస్తవ్యస్త జీవితపు ప్రాణులైనప్పుడు, పిల్లలు శాంతసౌహార్ద్ర మూర్తులవ్వటం కాస్తంత కష్టమే.
అందుకని, పిల్లలున్న పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ అలవాట్లు, దురలవాట్లు పిల్లలకు సోకకుండా ఉండేందుకు శ్రమించాలి.
తండ్రి రోజూ గుప్పు గుప్పున సిగరెట్లుకాలుస్తూ, పిల్లలచేతే వాటిని తెప్పించుకుంటేనూ, త్రాగి రోడ్డుమీద ఎక్కడపడితే అక్కడ పడి దెబ్బలు తగిలించుకుంటుంటేనూ, గూండాగా అందరినీ బెదిరించుకొని బ్రతుకుతుంటేనూ, భార్యలను కొట్టి, గొడవపడుతుంటేనూ పిల్లల మానసిక స్థితి సరిగా ఉండదు. అలాంటి పిల్లలు తల్లిదండ్రుల మాదిరే తుపాకులకు, సెల్ ఫోన్లకు, మోటారు బైకులకూ బానిసలై, తమకు ఇంట్లో దొరకని ప్రేమల్ని వీధుల వెంబడి, సారాదుకాణాల్లోను, పబ్బుల్లోను, డిస్కోథెక్కుల్లోను వెతుక్కుందామనుకుంటారు.
పిల్లలు సహజ సౌకుమార్యంతో, సంతోషంగా ఎదిగి, బాధ్యతగల పౌరులవ్వాలంటే, ముందుగా పెద్దలు బాగుపడాలి. "మనం వ్యసనాలకు దూరమైతే తప్ప, మన పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాలు బాగుపడవ"ని గ్రహించాలి- ఏమంటారు?
ఈమాసంలో పిల్లలందరూ వేసవి శలవల్లో ఉంటారు. ఇళ్లన్నీ హడావిడిగాను, గజిబిజిగానూ ఉంటై. పిల్లలు ఎండల్లో తిరిగి వడదెబ్బలు తినకుండా ఉండాలంటే, వాళ్ళు ఆడుకునేందుకు ఇష్టపడే ఆటలు వాళ్లకి అందాలి. ఆటల్లో గొప్పవి, తక్కువవి అంటూ ఏమీ లేవు- అన్నీ ఆటలే, అన్నీ పిల్లలకు ఏదో ఒక రకంగా పనికొచ్చేవే. రకరకాల ఆటల సమాహారంగా, ఈ నెల ముఖచిత్రం- "వేసవి" ని అందించిన చిత్రకారుడు అడవి రాముడికి అభినందనలు.
వేసవి శలవల శుభాకాంక్షలతో,
-కొత్తపల్లి బృందం.