ఒక ఊరిలో రంగయ్య అనే పేదవాడు ఒకడు ఉండేవాడు. కట్టెలు కొట్టుకొని జీవించేవాడు రంగయ్య. ఎంత కష్టపడినా, వ్యాపారం మాత్రం సరిగ్గా జరిగేది కాదు. బ్రతుకు తెరువు కష్టంగా ఉండటంతో రంగయ్య ఆ పని మానేసి వేరే పని ఏదైనా వెతుక్కుందామని ఆలోచించసాగాడు. సరిగ్గా అదే సమయంలో అతని అదృష్టం పల్టీ కొట్టింది.

ప్రతి రోజూ లాగే రంగయ్య ఒక రోజున కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు. అతను కట్టెలు కొడుతూ ఉంటే ఎవరో పిలిచినట్టు అనిపించింది. అటూ- ఇటూ చూశాడు రంగయ్య. ఎవరో "ముందుకెళ్ళు ముందుకెళ్ళు" అంటున్నారు! అంతకు ముందు కూడా రంగయ్యకు అలా వినబడేది- కానీ ఎప్పుడూ దాన్ని పట్టించుకోలేదు. ఆనాడు మాత్రం అతను ఒక క్షణం ఆలోచించి, "సరే, ముందుకెళ్తే ఏం జరుగుతుందో చూద్దాం" అని చెప్పి, ముందుకెళ్ళాడు. కొంత దూరం వెళ్ళి చూసేసరికి, అక్కడ ఎండు కట్టెల కుప్ప ఒకటి కనిపించింది! రంగయ్య వాటిని చిన్నగా తెగకొట్టుకొని ఊరిలో అమ్మితే, ఆ ఒక్కరోజునే వంద రూపాయలు వచ్చింది! రంగయ్య ఆరోజున చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళాడు.

మరుసటి రోజున రంగయ్య కట్టెలు కొడుతుండగా, ఎవరో మళ్ళీ "ముందుకెళ్ళు ముందుకెళ్ళు"అంటున్నారు.రంగయ్య "సరే, వీళ్లెవరోగానీ నాకు మేలు చేసేందుకే చెబుతున్నట్లున్నారు. నిన్నటిలాగే, నాకు ఇవాళ్ల కూడా ఏదైనా లాభం కలుగుతుందేమో" అని ముందుకెళ్ళాడు. చూడగా ఆ వైపున అడవిలో పెద్ద పెద్ద టేకు చెట్లు,చందనం చెట్లు కనిపించాయి. రంగయ్య కు "భలే, భలే" అనిపించింది. "నేను వాటిని అన్నిటినీ కొట్టుకొని అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి" అని అనుకొని, ఒక చెట్టును మొదలుకంటా కొట్టుకొని, అమ్ముకొని, సంతోషంగా ఇంటికి వెళ్ళాడు.

మరుసటి రోజున అతను ఉత్సాహం పట్టలేక, ఇంకా తొందరగా అడవికి బయలుదేరాడు. అడవిలో తనకు టేకు చెట్లు కనబడ్డ చోటుకు పోయి ఒక చెట్టును కొట్టటం మొదలుపెట్టాడో లేదో- "ముందుకెళ్ళు- ముందుకెళ్ళు!"అని వినిపించింది. అతను ఈసారి ఇంకా సంతోషంగా ముందుకెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు మొదట్లో అతనికి ఒక పెద్ద నిధి కనిపించింది. అందులో బంగారం, వెండి, వజ్రాలు, మాణిక్యాలు ధగ ధగా మెరుస్తున్నాయి. వాటిని చూడగానే మన రంగయ్యకు కూడా కళ్ళు తళుక్కుమన్నాయి. వాటిని అమ్ముకొని రంగయ్య ఆ ఊరిలోనే పెద్ద ధనవంతుడయ్యాడు.

అయినా ఇప్పటికి కూడా రంగయ్య కట్టెలు కొట్టడం మాత్రం మానలేదు. అయితే అటు తర్వాత ఎప్పుడు కట్టెలు కొడుతున్నా "ఎవరైనా మాట్లాడతారేమో, "ముందుకెళ్ళు--ముందుకెళ్ళు అంటారేమో" అని ఎదురు చూడటం మొదలు అయింది.. ఒకటి రెండుసార్లు అతనికి ఆ మాటలు వినబడ్డాయి కూడా. కానీ తీరా చూస్తే ఏలాంటి లాభమూ లేదు. రాను రాను రంగయ్య ఆ మాటల్ని పట్టించుకోవటం‌ మానేశాడు. కొన్నాళ్లకు అతనికి ఆ మాటలు వినబడటము కూడా ఆగిపోయింది.

అయితే రంగయ్యకు అట్లా "ముందుకు వెళ్ళు" అని చెప్పింది ఎవరు? ఆ ప్రాంతపు చెట్లే! "మమ్మల్ని కొట్టద్దు, ముందుకు వెళ్లు!" అని చెప్పాయి అవి. అయితే రంగయ్య వాటిని వేరేగా అర్థం చేసుకున్నాడు.

ఇక నిధులు- టేకు చెట్లూ- ఇవన్నీ యాదృచ్ఛికంగా తగిలినవే!