అనగా అనగా పంజాబ్ ప్రాంతాన్ని బల్వంత్ సింగ్ అనే మహారాజు పరిపాలించేవాడు. ఆయనకి జంతువుల్ని పెంచటం అంటే చాలా‌ ఇష్టం ఉండేది. ఆయన పెంపకంలో అందమైన గుర్రాలు లెక్కలేనన్ని ఉండేవి. వాటిలో కొన్ని అతి వేగంగా‌పరుగులు తీసేవి. కొన్ని సాటిలేని యుద్ధాశ్వాలు- ఇవేకాక రాజుగారి దగ్గర పెద్ద పెద్ద ఏనుగుల మందలు ఉండేవి-వందలాది మంది మావటీలు వాటికి శిక్షణనిస్తుండేవాళ్ళు.

ఆ ఏనుగుల్లో ప్రత్యేకమైన ఏనుగొకటి ఉండేది.బలంలో గాని,బడ్డూ పొడవుల్లో గానీ దానికి సాటివచ్చే ఏనుగు మరొకటి లేదు. ఐరావతం లాంటి ఆ ఏనుగు పేరు భీముడు.

రాజుగారికి భీముడంటే విపరీతమైన అభిమానం ఉండేది. దాన్ని బలంగాను, సంతోషంగాను ఉంచేందుకు ఎంతైనా సరే, వెచ్చించేందుకు ఆయన వెనుకాడేవాడు కాదు.

మొదట్లో భీముడు అడవిలో స్వేచ్చగా తిరుగుతుండేది. పట్టుబడిన కొత్తల్లో అది చాలాసార్లు తప్పించుకొనే ప్రయత్నం చేసింది-కొన్ని సార్లు నిజంగానే తప్పించుకుపోయింది కూడా. కానీ రాజుగారు తన మనుషుల్ని పంపి, ప్రతిసారీ దాన్ని తిరిగి బంధిస్తూ వచ్చారు. మెల్లగా భీముడు కూడా మనుషుల మాదిరే, ధనికస్వామ్యపు బీద జీవితంలో రుచులు వెతుక్కునే పట్టణ వాసానికి అలవాటు పడిపోయింది. అరణ్యపు స్వేచ్చ జీవితంలోని సుఖం మెల్లగా మరుగు పడింది.రాజుగారి మనుషులు చూపించే తాయిలాలు దానికి నచ్చసాగాయి.

పండుగ రోజుల్లో దానికోసమే ప్రత్యేకంగా తయారుచేయించిన ఆభరణాలతో దాన్ని అలకరించేవాళ్ళు. రాజుగారు, మంత్రిగారు భీముడి మీద కూర్చుని, ప్రధాన వీధుల్లో ఊరేగింపుగా వెళ్తుంటే, మిగిలిన ఏనుగులన్నీ వెంటనడిచేవి. వాళ్ల ముందు సంగీత వాయిద్యాలను పట్టుకొని, వాద్యకారుల బృందం ఒకటి నడిచేది.

సైనికుల పాటల్ని ఆలపిస్తూ, ఆ సంగీతం భీముడి చెవులకు చాలా ఇంపుగా అనిపించేది. నిజానికి ఆ పాటల్ని వింటూ అది మంత్రముగ్ధం అయిపోయేది.

ఒకరోజున మావటీలు దాన్ని స్నానానికి ఊరి బయట ఉన్న చెరువుకు తీసుకెళ్ళారు. భీముడు ఆ చెరువులో పడి సంతోషంగా ఈదులాడింది. అలా ఈదుతూ, అకస్మాత్తుగా అది అక్కడే ఉన్న బురదలో కూరుకుపోయింది. ఇక అది తన బలం మొత్తాన్నీ ఉపయోగించి, ఆ ఊబిలోంచి బయట పడేందుకు పెనుగులాడింది- కానీ ఎంత పెనుగులాడితే అంత లోపలికి కూరుకుపోయింది తప్ప, అది ఇక బయటికి రాలేకపోయింది. కబురు రాజుగారికి చేరింది. ఆయన భీముడిని బయటికి లాగేందుకు చేతనైన ప్రయత్నాలన్నీ చేయమని ఆదేశించారు. ఎవరేమి చేసినా ప్రయోజనం లేదు- భీముడు కొద్దికొద్దిగా దిగబడిపోసాగాడు.

అందరూ నిరాశ పడుతున్న ఆ తరుణంలో మంత్రి కుమారుడికి ఒక ఆలోచన వచ్చింది. ఆస్థాన వాద్యబృందాన్ని రప్పించి, భీముడికి ఇష్టమైన పాటల్ని వినిపించమన్నాడు. సంగీతం ఆ ఏనుగులో నిద్రాణమై ఉన్న శక్తుల్ని వేటినో మేలుకొలిపింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అది శరీరాన్ని పట్టి బధించిన బురదను దులుపుకున్నది. తనలోని శక్తినంతటినీ కూడగట్టుకొని, అది కొంచెం కొంచెంగా జరుగుతూ, ఊబిలోంచి బయట పడింది. చుట్టూ ఉన్నవాళ్ళు హర్షాతిరేకంతో చప్పట్లు కొట్టారు.

అందరూ ఒక కొత్త సంగతిని తెలుసుకున్నారు- మనసులో మనకెవ్వరికీ తెలియని శక్తులు చాలా ఉన్నాయి. శరీరం ఒంటరిగా చేయలేని పనుల్ని కూడా, మనసు తోడైనప్పుడు అది అతి సులభంగా చేసేస్తుంది. జీవితం చరమ దశలోనైనా సరే, మనం ఏది కోరుకుంటే అది సాధించగలం- మనసుపెట్టి పనిచేయాలి- అంతే.