అనేక సంవత్సరాల క్రితం కళింగపుర రాజ్యాన్ని భీమరాజు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు ఒక్కగానొక్క కుమారుడు అశోకవర్మ. ఆ యువరాజుకు మూడు కథలు వచ్చు. అయినా అతను ఆ కథల్ని ఎవ్వరికీ చెప్పలేదు. మనకు ఏవైనా కొత్త కథలు వస్తే అందరికీ చెప్పెయ్యాలి కదా!? యువరాజు మాత్రం ఎవ్వరికీ‌చెప్పకుండా వాటిని తన మనసులోనే దాచిపెట్టుకున్నాడు. ఆ కథలకు మాత్రం ఎలాగైనా బయటికి వెళ్దామని ఉన్నది. 'ఎలాగా,' అని అవి అవకాశం కోసం చూస్తూ ఉన్నాయి.

అంతలో యువరాజుకు పెళ్ళి నిశ్చయమైంది. ఇంకా రెండు రోజుల్లో అతని పెళ్ళి అనగా, ఆనాటి రాత్రి ఆ మూడు కథలూ కలిసి, 'ఎలా బయటపడాలి' అని చర్చించుకుంటున్నాయి: మొదటి కథ అంటున్నది- "ఈ యువరాజు ఇన్ని రోజులైనా మన గురించి ఏ ఒక్కరికీ చెప్పలేదు. కనుక ఈ యువరాజుకు పెళ్ళి జరగకుండా చూడాలి. రేపు పొద్దున యువరాజు అన్నం తింటూ మొదటి పిడస(ముద్ద)ను నోట్లో పెట్టుకుంటున్నప్పుడు, నేను గాలిలో గాహనం అయి అతన్ని చంపేస్తాను- చూస్తూండండి" అని.

ఇక రెండవ కథ అంటున్నది: "రేపు పొద్దున యువరాజు రథంలో పోతున్నప్పుడు, నేను ఆ కొండ దగ్గర నిల్చొని, ఒక పెద్ద గుండ్రాయిని రథం మీద వేస్తాను- చూడండి"అని.

అప్పుడు మూడవ కథ అంటుంది, "నేను మీ మాదిరి అతన్ని చంపను. పెళ్ళయిన మరునాడు, అతని తప్పు ఏమీ లేకుండానే అతను పదిమంది ముందూ తల వంచుకునేట్లు చేస్తాను" అని.

అవి 'మా మాటలు ఎవ్వరూ వినటంలేదు' అనుకున్నాయి- కానీ మరుగున నిల్చున్న మంత్రి కొడుకు రవిచంద్ర వాటి మాటల్ని పూర్తిగా విని, "ఎలాగైనా నేను మా యువరాజుని కాపాడుకోవాలి" అనుకున్నాడు.

మరునాటి ఉదయం యువరాజు అన్నం తినేటప్పుడు రవిచంద్ర అతని ప్రక్కనే కూర్చున్నాడు. యువరాజు మొదటి పిడసను నోట్లో పెట్టుకుంటాడనగా రవివర్మ తటాలున ఆ పిడసను తనే లాక్కొని, జాగ్రత్తగా నమిలి మింగేశాడు. అతను చేసిన ఈ పనికి రాజుతో సహా అందరికీ చాలా కోపం వచ్చింది- "ఎందుకు” తినే పిడసను లాగేసుకున్నావు? రాజకుమారునితో ప్రవర్తించేది ఇలాగేనా?" అని కోప్పడ్డారు. "ఏమీ లేదు- ఏమీ లేదు. మీరు తినండి" అన్నాడు రవిచంద్ర అందరినీ శాంతపరచి. అలా మొదటి ప్రమాదం తప్పింది.

ఆ తర్వాత యువరాజు రథంలో ఊరేగింపుగా కల్యాణ మండపానికి బయలుదేరాడు. దారిలో కొండ ఇంకా కొంచెం దూరంలో ఉందనగా రథం ఆపమన్నాడు రవిచంద్ర. యువరాజుతో "మిత్రమా! మనం ఇద్దరం ఇప్పుడు కొంచెం దూరం నడుద్దాం. ఎందుకు అని ప్రశ్నలు వేయకుండా నావెంట నడువు" అన్నాడు. 'సరే'అని, ఇద్దరూ నడుచుకుంటూ కొండను దాటేశారు. అలా రెండవ ప్రమాదం కూడా తప్పింది.

ఇక 'మూడవ ప్రమాదం ఏమై ఉంటుందా' అని అర్ధరాత్రి దాకా ఆలోచిస్తూ మేలుకొని ఉన్నాడు రవిచంద్ర. ఆ సమయంలో వంట గది వైపు నుండి ఏవో పాత్రల శబ్దం వినిపించింది. 'ఈ సమయంలో పాత్రల శబ్దం ఎందుకు వస్తున్నది?' అని అతను వెళ్ళి చూశాడు. అంత:పుర దాసి సీతమ్మ ఏదో దొంగ పని చేస్తున్నట్లుగా అటూ ఇటూ చూసుకుంటూ, కంగారుగా చేతికందిన పిండి వంటల్ని గిన్నెలో వేసుకొని, ఎక్కడికో పోతున్నది! రవిచంద్రకు ఆమెను చూడగానే అనుమానం వేసింది. దొంగచాటుగా ఆమెనే వెంబడిస్తూ పోయాడు.

పోయి పోయి, సీత రాజ భవనం ప్రక్కగా ఉన్న చిన్న సామాన్ల గదిలోకి పోయింది. 'ఈమెకు ఇక్కడ ఏం పని?' అని, మంత్రికొడుకు ఆ గది కిటికీ ప్రక్కగా నిలబడి లోపలికి చూడసాగాడు. లోపల, మొద్దు చేతులు, మొద్దు కాళ్ళు పెట్టుకొని ఒక శతృ దేశపు గూఢచారి కూర్చొని ఉన్నాడు! సీతమ్మ వాడి దగ్గరికి పోగానే వాడు "మూడు రోజులుగా నాకు తిండి లేదు; కంటిమీద నిద్ర లేదు. యువరాజును చంపేందుకు పథకం చెబుతానని నన్ను ఊరించి, చివరికి నువ్వేమో అక్కడ హాయిగా తింటూ కూర్చున్నావా? ఇక్కడ నేనేం కావాలి?" అని పోట్లాట పెట్టుకున్నాడు. "లేదు, లేదు! నేను రావడానికి ఏమాత్రం వీలు లేకుండింది" అని సీతమ్మ ఎంత చెప్పినా వాడు వినలేదు. "నాదగ్గర అన్ని డబ్బులు తీసుకొని, నా పని చేయకుండా తప్పించుకుందామనుకుంటున్నావా?" అని, కోపంతో ఆమె ముక్కును కోసేశాడు వాడు. ఆమె ఏడ్చుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఆ వెంటనే రవిచంద్ర లోపలికి పోయి, ఆ గూఢచారితో యుద్ధం చేసి, వాడిని త్రాళ్లతో కట్టి పడేసి, అక్కడే పడి ఉన్న సీతమ్మ ముక్కును జాగ్రత్తగా ఎత్తిపెట్టి, తను వెళ్ళి నిశ్చింతగా పడుకున్నాడు.

ఇక ఉదయాన్నే వేరొక దాసీ వచ్చి సీతమ్మను నిద్ర లేపింది. ఆమె పరుపు మీద అంతా రక్తపు మరకలు! వాటిని చూసి ఆమె భయపడి, "అయ్యో ,అయ్యో! ఎంత ఘోరం జరిగిందో చూడండి, ఎంత రక్తమో!" అని అరిచి అందరినీ పిల్చింది. అందరూ వచ్చి "ఏమైంది ఏమైంది?" అని అడగారు. సీతమ్మకు ఏం చెప్పాలో తోచలేదు- "నా ముక్కును యువరాజుగారు కొరికేశారు" అని భోరు-మన్నది ఆమె.

"మా రాజ్యంలో యువరాజుకొక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదు. తప్పు చేసిన వాళ్ళెవరైనా సరే, శిక్ష పడుతుంది" అని రాజుగారు సభ ఏర్పాటు చేశారు. "నేను ఏపాపం ఎరుగను" అని యువరాజు ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు.

అప్పుడు రవివర్మ ముందుకు వచ్చి, యువరాజుగారికి వచ్చిన మూడు ప్రమాదాల గురించి చెప్పాడు. "మా యువరాజుకు మూడు కథలు వచ్చు. కానీ వాటిని అతను ఎవ్వరితోటీ పంచుకోలేదు. అందుకని అవి ఎలాగైనా అతనినుండి తప్పించుకు పోవాలనుకున్నాయి. ఒకటేమో గాలిలో గాహనమై వచ్చి యువరాజును చంపాలని ప్రయత్నించింది. రెండవది యువరాజు రథం మీద బండరాయిని వేసి చంపాలనుకున్నది. నేను యువరాజును ఆ రెండు ప్రమాదాల నుంచీ కాపాడాను .

ఇక మూడవది, 'యువరాజు ఏ తప్పూ చేయకుండానే అతను పదిమంది ముందూ తల వంచుకునేట్లు చేయాల'నుకున్నది. దాని ఫలితమే ఈ విచారణ. దీనిలో వాస్తవం ఏంటో నేను చెబుతాను వినండి. సీతమ్మకు ఒక శత్రుదేశపు గూఢచారితో సంబంధం ఉన్నది. యువరాజును చంపేందుకు పథకం చెప్పమని, వాడు ఆమెకు కొంత డబ్బు ఇచ్చి ఉన్నాడు. అయితే ఈమె చాలారోజులుగా వాడిని కలవలేదు- చివరికి నిన్న రాత్రి ఆమె వాడికోసం పిండి వంటలు తీసుకొని పోయింది. అక్కడ వాడు ఆమెతో పోట్లాడి, చివరికి ఆమె ముక్కును కోసేశాడు. ఇదిగో చూడండి, ఆమె ముక్కు, ముక్కును కోసిన వాడూ-" అని తను తెచ్చిన ముక్కును, గూఢచారినీ చూపించాడు. అందరూ సీతమ్మ తెగింపుకు ఆశ్చర్యపోయారు. ఆమెకు, గూఢచారికి తగిన శిక్ష వేశారు.

ఆపైన యువరాజు తనకు వచ్చిన కథల్ని ఆపుకునే ప్రయత్నం చెయ్యలేదు. కథల్ని అందరికీ చెప్పెయ్యటం అలవాటు చేసుకున్నాడు. యువరాజులో వచ్చిన మార్పుకు కధలూ చాలా సంతోషించాయి!