అనగా అనగా ఒక అడవికి దగ్గర్లో ఒక ఊరు ఉండేది. ఆ అడవిలో ఒక పులి నివసిస్తూ ఉండేది. ప్రతిరోజూ అది ఊరి మీద పడి, దొరికిన మనుషులనల్లా చంపి తినేది. ఊరి ప్రజలెవ్వరూ దాని దాటికి తట్టుకోలేక- పోయారు. అందరూ కలిసి ఊరి పెద్ద దగ్గరికి వెళ్లి, తమ కష్టాలు చెప్పుకున్నారు. ఆ ఊరి పెద్ద అప్పుడు ఇలా చాటింపు వేయించాడు: "పులిని ఎవరైతే బంధించి తెచ్చిస్తారో వాళ్ళకు వెయ్యి రూపాయలు బహుమానం ఇస్తాను" అని. బహుమానానికి ఆశపడి, దగ్గర గ్రామాల్లోని వీరులందరూ పులిని పట్టుకునేందుకు చాలా ప్రయత్నించారు- కానీ ఎవ్వరూ దాన్ని బంధించలేకపోయారు.

ప్రక్క ఊళ్లో నివసించే రత్నమ్మకు రాము,రవి అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు . వాళ్లిద్దరికీ 13సంవత్సరాలే. వాళ్ళు చాలా తెలివైన పిల్లలు. వాళ్ళకు చాలా భాషలు వచ్చు కూడా. వాళ్ళకు వచ్చిన ఒక భాష, పులి భాష! పొరుగూరి పెద్ద వేయించిన చాటింపు విని, వాళ్లకు ఎలాగైనా పులిని బంధించాలని ఆలోచన వచ్చింది. ఇక వాళ్ళిద్దరూ రెండు గట్టి తాళ్ళను తీసుకొని, తినేందుకు భోజనం మూట గట్టుకొని, బయలుదేరారు.

వాళ్ళు అడవిలోకి చేరుకునేటప్పటికి, పులి ఒక జింకను పట్టుకొని తింటూ కనిపించింది. వీళ్లను చూడగానే 'వీళ్లు తనను పట్టుకునేందుకు వచ్చినవాళ్ళు' అని అర్థమైంది పులికి. అది కోపంతో గర్జిస్తూ వీళ్ల మీదికి దూకబోయింది.

రాము, రవి ఇద్దరూ చాలా ధైర్యం ఉన్నవాళ్ళే- అందుకని వాళ్ళు పులంటే అస్సలు భయపడలేదు. వాళ్ళు అలా నిబ్బరంగా ఉండటం చూసి పులే ఆశ్చర్యపోయింది. అప్పుడు రాము దానితో పులిభాషలో "ఏమ్మా, పులీ! ఆకలిగా ఉన్నట్లున్నావే, ముందు ఆ జింకను తినటం పూర్తి చెయ్యి. ఆ తర్వాత మమ్మల్ని తిందువులే. ప్రస్తుతం మా దగ్గర మా ఎముకలు మాత్రమే ఉన్నాయి- కండలేదు. నిన్న దారిలో పోతుంటే ఇంకో పులి కనబడి, మా కండ కావాలని అడిగింది. 'నీకెందుకు శ్రమ, మేమే ఇచ్చేస్తాం' అని మేం మా కండను దానికి ఇచ్చేశాం. మా కండదేముంది- రెండు రోజుల్లో‌ తిరిగి తయారవుతుంది గదా" అన్నాడు.

పులి ఇంకా ఆశ్చర్యపోయింది. 'వీళ్ళకు పులిభాష ఎలావచ్చు?' అని. అది వాళ్ళను ముట్టుకొని చూస్తే, నిజంగానే వీళ్లిద్దరికీ పెద్దగా కండ లేదు. 'కండ ఎక్కడుంటుందిలే, పులికి ఇచ్చేశాం కద!' అన్నాడు రవి దానితో, మళ్ళీ.

'నిజంగానా, మీ కండ రెండు రోజుల్లో పెరిగిపోతుందా, ఎలాగ?' అని అడిగిందది. "ఏముంది, బాగా అన్నం తింటే సరి! మేం నిన్న తిన్నాం కద, అందుకనే ఈ మాత్రం వచ్చింది. ఇవాళ్ళకూడా తిన్నామంటే, ఇక కండే కండ" అన్నాడు రాము, నమ్మకంగా.

"అయితే తినండి, తినండి. మీక్కూడా కొంచెం జింక మాంసం‌ ఇవ్వమంటారా, ఇంకా బాగా కండ పడుతుంది?" అన్నది పులి, సంబర పడిపోతూ.

"అయ్యో, పచ్చి మాంసం తింటే కండ పట్టటం కష్టం. మేం అన్నం తెచ్చుకున్నాంలే. అది సరిపోతుంది. మేము ఇక్కడే, నీ ముందరే భోజనం చేస్తాము. అప్పుడు మాకు బాగా కండ పడుతుంది. ఆ తర్వాత నీక్కావలసినంత కండ నీకు ఇచ్చేస్తాం" అని చెప్పి రాము, రవి తాము తెచ్చిన తాళ్ళను నేలమీద పరిచారు.

వీళ్లను చూసి పులికి చాలా సంతోషం వేసింది. అది వాళ్ళతో‌ అవీ-ఇవీ మాట్లాడుతూ క్రింద కూర్చోబోయింది. వాళ్ళు దాన్ని వారిస్తూ "అయ్యయ్యో, ఆగండి. మీరు పెద్దవాళ్ళు- అట్లా నేలమీద కూర్చోకూడదు. మేం మీకోసం చాప వేస్తాము" అని చెప్పి, నేలమీద త్రాళ్ళు పరిచి, దానిమీద అక్కడే ఉన్న పచ్చి ఆకులు వేసి, పులిని తాళ్ళ మీద కూర్చోబెట్టారు.

పులి ఆ త్రాళ్ళమీద పడుకొని, "ఈ రోజు నాకు బాగా కండ ఉన్న మాంసం దొరకబోతోంది. బాగా తినండి, తినండి! తొందరగా తినండి ! నాకు చాలా ఆకలిగా ఉన్నది" అని చెబుతూ ఒక్క క్షణంపాటు సంతోషంగా కళ్ళు మూసుకున్నది. అదే సమయం కోసం ఎదురుచూస్తున్న రాము, రవిలు ఒక్క ఉదుటున లేచి దాన్ని తాళ్ళతో బంధించేశారు.

"అయ్యో, అయ్యో!‌ ఇదేంటి?" అన్నది పులి. "ఏమీ లేదు తల్లీ, నువ్వేమో మనుషుల కండనే తినాలంటున్నావు. మనుషులేమో మమ్మల్ని కాపాడమంటున్నారు. మరి మేం ఏం చేయాలి, నువ్వే చెప్పు?" అన్నారు వాళ్లు.

"అలాకాదు- నేనుండే అడవిలోకి మనుషులు వచ్చేస్తుంటే, చెట్లన్నీ కొట్టేస్తుంటే, నాకు జంతువులు దొరక్కుండా చేస్తుంటే, మీరే చెప్పండి మరి, నేనేం చెయ్యాలి?" అన్నది పులి.

"నీకేం అవ్వదులే, నిన్ను తీసుకెళ్ళి అభయారణ్యంలోనైనా పెడతారు, లేకపోతే ఏ జంతు ప్రదర్శన శాలలోనైనా పెట్టి నీకు కడుపు నిండేలా చూస్తారు- ఊరికే ఉండు" అని రాము, రవి ఇద్దరూ దాన్ని పట్టుకొని పోయి ఊరి పెద్దకి అప్పజెప్పారు.

గ్రామపెద్ద, అటవీశాఖ వాళ్ళను పిలిచి వాళ్ళకు పులిని అప్పగించాడు. రాము, రవి తమకు వచ్చిన వెయ్యి రూపాయల బహుమానాన్ని "జంతునిధి"లో వేసుకున్నారు!