తాబేలు ఇంకా ఇలా అన్నది- “అయినా, గతించినదాన్ని ఇప్పుడు త్రవ్వుకోవడం ఎందుకు? పోనివ్వు. బుద్ధిమంతులు 'రాని దాని కోసం ఎదురుచూడరు, పోయిన దానికోసం ఏడ్వరు, ఆపదలు వచ్చినప్పుడు అచేతనంగా నిలబడిపోరు'. కాబట్టి, స్నేహితుడా! ఎల్లప్పుడూ సంతోషంగా, ఉత్సాహంగా ఉండు."

"శాస్త్రాలు చదివి కూడా అనేక మంది మూర్ఖులుగానే ఉన్నారు. క్రియావంతుడైన వాడే విద్వాంసుడు. మందు పేరు చెప్పినంత మాత్రాన రోగికి రోగాలు శాంతించవు. గుడ్డివాడి చేతిలో ఉన్న దీపం వల్ల అతనికి ఏమీ లాభం లేనట్లే. వివేకం లేనివాడికి ఎంత శాస్త్ర పాండిత్యం ఉన్నా ప్రయోజనం ఉండదు. చూడు, ఆపదలు వచ్చినందుకు నేను దు:ఖించను. సంపద వచ్చినప్పుడు నేను పొంగిపోను. మనిషికి ఆపదలు, సంపదలు ఒకదాని వెనుక ఒకటి వస్తూండటం సహజం. 'సంపదలు శాశ్వతం కావు' అని తెలుసుకున్నవాడు, అవి పోయినప్పుడు దు:ఖించడు. డబ్బు లేనంతమాత్రాన ధైర్యవంతుడికి లోకంలో గౌరవం ఏమీ తక్కువ కాదు. పుష్కలంగా ఉన్నంత మాత్రాన క్షుద్రుడికి గౌరవమూ రాబోదు. సింహానికి సహజంగానే ఒక తేజస్సు ఉంటుంది- నూరు బంగారు సొమ్ములు పెట్టినా కుక్కకు అంతటి తేజస్సు అబ్బుతుందా? నువ్వు బుద్ధిమంతుడివి. నీ గౌరవానికి ఇప్పుడు ఏమి లోటు వచ్చింది? జీవిని పుట్టించిన ఆ భగవంతుడు, ఏదో ఒక విధంగా ఆహారాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. చూడు -జంతువు పుట్టి నేలమీద పడీ పడగానే తల్లి రొమ్మునందిస్తున్నది. అందువల్ల, బ్రతకటం కోసం మరీ ఎక్కువ శ్రమించటం కూడా వ్యర్థమే. అన్ని ధర్మాలూ తెలిసిన వాడివి, నీకింత విడమరచి చెప్పవలసిన అవసరమే లేదు. నీకు నేను వేరు, లఘుపతనకం వేరు కాదు. దేవుడే మనల్ని ముగ్గుర్నీ ఒకచోట చేర్చినట్లు ఉన్న ది. దొరికినదానితో సంతృప్తి చెంది మనం సుఖంగా జీవిద్దాం. “ అన్నదది ఎలుకతో.

అప్పుడు హిరణ్యకుడు చాలా సం తోషిం చి, “మంధరా! నీమాటలు అమృతపుజల్లు లాగా కురిసి, అంతులేని నా దు:ఖాన్ని పోగొట్టాయి. నేను ధన్యుడినయ్యాను. 'మిత్రలాభం ప్రపంచంలోని సంపదలన్నిటి పెట్టు '- అన్నసూక్తి కూడా నాకు ఇప్పుడు అర్థం అయ్యింది.”

“ఏ భగవంతుడైతే హంసలను, రామచిలుకలను, నెమళ్ళను, తెలుపు, అకుపచ్చ మొదలైన రంగులను సృష్టించాడో, ఆభగవంతుడే ఆయా జంతువులకు వాటికి అనుగుణమైన వృత్తులను కల్పించాడు. మూర్ఖులు దీన్ని అర్థం చేసుకోలేక, జీవనం కోసం పడరాని పాట్లు పడి, సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు."

" తనను సంపాదిం‌చేటప్పుడొక దు:ఖం, కాపాడుకోవటంలో ఒక దు:ఖం, అది నాశనం అయిపోయేటప్పుడొక దు:ఖాన్ని కలిగిస్తున్నది డబ్బు. ఇట్లా దు:ఖానికి మూలకారణం అయిన ఆ డబ్బెందుకు? కాల్చడానికా? సొంత పనులకోసం డబ్బును కోరటం కంటే‌, కోరికను వదిలి ఊరకుండటమే మేలు. అడుసు తొక్కటం ఎందుకు , కాళ్లు కడగటం ఎందుకు? ఆకాశంలో పక్షుల చేత, భూమిపైన కౄర మృగాల చేత, నీళ్లలో చేపల చేత మాంసం తినబడుతున్నది, కానీ ధనవంతుడు అన్నింటా తినబడతాడు. కాబట్టి ధనాశను వదిలి పెట్టడంలోనే వివేకం ఉన్నది. ఆశను వదిలిపెట్టేస్తే, ఇక ఆ పైన దరిద్రుడెవ్వడు, ధనికుడెవ్వడు?"

"ఇక దురాశకు అవకాశం ఎవరిస్తారో, దాస్యం వాడి తలపైకెక్కి కూర్చొని రాజ్యమేలుతుంది. నిన్ను కలిసి మాట్లాడటం వల్ల నా అజ్ఞానం తొలిగింది. చేపట్టిన పని పూర్తైనంత సంతోషం కలిగింది. నీతో నిరంతరం కలిసి ఉండటాన్ని మించిన అదృష్టం నాకు వేరే ఏదీ లేదు. నీతో స్నేహానికి ఎలాంటి లోటూ ఉండదు. మహాత్ముల స్నేహం ఆమరణాంతం ఉండేది. వారి కోపాలు ఒక్క క్షణంలో నశించే బుడగలాంటివి, ఇక మహాత్ముల త్యాగం అయితే సందేహానికి తావు లేనిది.” అని చెప్పింది. మంధరుడు ఆ మాటలు విని, చాలా సంతోషించింది. ఆ పైన హిరణ్యకుడు, లఘుపతనకము, మంధరుడు స్వేచ్ఛగా విహరిస్తూ, కాలక్షేపం చేస్తూ సుఖంగా జీవించసాగారు.

కొంతకాలానికి, మంధరుడు, హిరణ్య-కుడు, లఘుపతనకుడు ముగ్గురూ కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉన్న సమయంలో బెదిరిపోయిన జింక ఒకటి, మహా వేగంతో అక్కడికి పరుగెత్తుకొని వచ్చింది. అది చూసి భయపడిన తాబేలు నీళ్లలోకి దూకింది; ఎలుక కలుగులోకి పారిపోయింది; కాకి ఎగిరి, చెట్టు కొన కొమ్మన కూర్చున్నది.

కొంచెంసేపటికి కాకి చెట్టుమీది నుండి అన్నివైపులకూ నిక్కి నిక్కి చూసి, ఇక భయపడవలసిన కారణం ఏదీ దగ్గరలో లేదని నిశ్చయించుకున్నది. ఆపైన అది మంధరుడినీ, హిరణ్యకుడినీ పిలిచి, “మీరు భయపడకండి. చుట్టు ప్రక్కల చాలా దూరం వరకూ చూశాను. భయానికి కారణం ఏదీ నా కంట పడలేదు.” అని చెప్పగానే నీటిలోంచి తాబేలు, బొరియలోంచి ఎలుక, బయటకి వచ్చాయి. లఘుపతనకం వెళ్లి వాళ్ళకు దగ్గరగా వాలింది.

అప్పుడు, భయంతో గడగడా వణుకుతున్న జింకను చూసి, మంధరుడు- "నువ్వెవ్వడివి? ఎందుకు, నువ్విట్లా పరుగెత్తుకొని వచ్చావు?” అని అడిగింది.

డొక్కలు ఆడేట్లు రొప్పుతున్న ఆ జింక అన్నది- "నాపేరు చిత్రాంగుడు. వేటగాడొకడు నన్ను తరుముకొని వచ్చాడు. వాడికి భయపడి, పారిపోయి వచ్చాను. ఆ పరుగులో నన్ను అందుకోలేక, వాడు వెనుక బడ్డాడు. నేను మీ శరణు జొచ్చాను. అన్ని దానాలు,అన్ని వ్రతాలు, అన్ని యాగాలు- ఇవేవీ శరణాగతుడిని కాపాడటంతో సరిపోలవు. శరణుగోరిన వారిని పట్టించుకోలేక పోవడం కంటే పాపం లేదని ధర్మశాస్త్రం తెలిసిన పెద్దలు చెబుతూ ఉంటారు. మీరు అన్ని ధర్మ శాస్త్రాలూ తెలిసిన వారని బుద్ధిమంతులు గతంలో చెప్పగా విని ఉన్నాను. నా మనసు కలత చెంది ఉండటం వల్ల ఏది చెప్పదగిందో, ఏది చెప్పకూడని మాటో తెలీక ఏదేదో అనేశాను. మీకు ధర్మం చెప్పేంత వారిని కాను. నా మాటల్లో తప్పుల్ని మన్నించి, నన్ను కాపాడండి. మీ స్నేహం సంపాదించుకొని, మీతో పాటు ఇక్కడే కాలం గడపాలని నా కోరిక. మా బంధువులను, మా దేశాన్నీ విడిచి వచ్చాను. మీ శరణుజొచ్చాను. ఇక మీరు నన్ను పాల ముంచుతారో, నీట ముంచుతారో, మీదే భారం,” అన్నది.

అప్పుడు మంధరుడు దాన్ని శాంతపరుస్తూ అన్నది- “చిత్రాంగా! నువ్వు బుద్ధిమంతుడివి. సాధువువు. నీతో స్నేహం చేయటం మా భాగ్యం. దీనికై ఇంత చెప్పవలసిన పనిలేదు. ఇది నీ యిల్లే అనుకో. మాతో కలసి స్వేచ్ఛగా జీవిస్తూ, సుఖంగా ఉండు” అని. అప్పుడు ఆ జింక చాలా సంతోషించి అక్కడే ఉండి-పోయింది. ఆ అడవిలోని లేత పచ్చిక చిగుళ్ళను మేస్తూ చెరువులోని నీటిని త్రాగుతూ, దగ్గరలోనే ఉన్న చెట్టు నీడన పడుకుంటూ, సుఖంగా కాలం గడపసాగింది.

ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజున జింక మేతకని అడవికి వెళ్ళింది. సాయంత్రం మామూలుగా అది తిరిగివచ్చే సమయం దాటిపోయింది. అయినా అది ఇంకా ఇంటికి చేరుకోలేదు. దాంతో కంగారు పడిన మంధరుడు, కాకి-ఎలుకలతో "మన స్నేహితుడు చిత్రాంగుడు ఇంత ఆలస్యం చేయటానికి కారణం ఏమై ఉంటుంది? ఏనాడూ ఇంత సేపటి వరకూ రాకుండా లేడు. ఆహారం కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన పక్షుల గుంపులు తినటం చాలించి ఇళ్లకుతిరిగివస్తున్నాయి. గొల్లవాళ్లు పశువుల మందల్ని తోలుకొని పల్లెలకు పోతున్నారు. పడమట దిక్కు ముఖానికి కుంకుమ బొట్టు మాదిరి కనబడుతున్నాడు సూర్యుడు. ఆ సూర్యకిరణాల వేడి తగ్గిపోతున్న కొద్దీ నాకు ఆరాటం పెరిగిపోతున్నది. 'కొంచెం అటు-ఇటు వెళ్లి వెతికి వద్దామంటే' నా నడక వేగం సహకరించదు. 'మిమ్మల్ని పంపుదామా' అంటే మీరు మళ్లీ తిరిగి వచ్చి నా కళ్లకు కనిపించేత వరకు నా మనస్సు తత్తరపడుతూ ఉంటుంది. నేనేమి చేసేది?” అని, కళ్లల్లో నీరు కారగా దిక్కులు చూడసాగింది.

అప్పుడు కాకి లఘుపతనకం “పక్షిజాతులు అన్నిటికంటే నా వేగం ఎక్కువ. ఎన్ని యోజనాల దూరమైనా క్షణకాలంలో తిరిగి చూసి రాగలను. అందుకనేగదా నాకు 'లఘుపతనకుడు' అని పేరు వచ్చింది? నువ్వేమీ విచారించకు . నేను ఇక్కడే ఉన్నాననుకో. ఇదిగో, ఒక్క నిముషంలో వెనక్కివచ్చి చిత్రాంగుడి క్షేమ సమచారాలు నీకు చెబుతాను- చూస్తూండు" అని తక్షణం ఎగిరిపోయింది.

అలా ఆ కాకి అడవిలోని నానా ప్రదేశాలనూ వెతికి, త్వరలోనే చిత్రాంగుడు ఉన్న ప్రదేశాన్ని కనుక్కున్నది. అక్కడ చిత్రాంగుడు త్రాళ్ల వలలో చిక్కుకొని పడి ఉన్నది. అప్పుడు లఘుపతనకుడు దాన్ని చూసి, కళ్ల నీరు పెట్టుకొని, దాని దగ్గరకు పోయి "మిత్రమా! నువ్వు ఇతరుల సొమ్ముకు ఆశపడవు. ఇతరులను బాధించవు. అడవిలోని గడ్డిని మేసి, గుంటలలోని నీళ్లు త్రాగి, ఏదైనా చెట్టు నీడన పడుకొని కాలం గడుపుతావు. ఇతరులెవ్వరికీ కీడు నీ ఆలోచనల్లో కూడా రాదు. నీ అంత మంచివాడికా, ఇట్లాంటి ఆపద ఎదురు అయింది? అయినా ఇంత అనుకోవటం ఎందుకు? ఎంతవారికైనా దైవనిర్ణయాన్ని దాట శక్యంకాదు. వచ్చిన కష్టాన్ని `ఎలా దాటాలి' అని ఆలోచించాలిగాని, నివ్వెరపోయి నిల్చుండకూడదు. కాబట్టి, నీకు తెల్సినంతలో- ఇప్పుడేం చేయాలో త్వరగాచెప్పు. మంధరుడు, హిరణ్యకుడు నా రాక కోసం ఎదురుచూస్తూంటారు. పోవాలి" అన్నది.

"వేటగాడు రాక ముందే త్వరగా నన్ను విడిపించారంటే బ్రతికిపోతాను. లేకపోతే ఇక నా పైన ఆశ పెట్టుకోవద్దు. నువ్వు ఇప్పుడు పోయి, తొందరగా హిరణ్యకుడిని తీసుకొనిరా. అతను వచ్చాడంటే నా కట్లు తెగకొరికి నన్ను రక్షించగలడు" అన్నది జింక దానితో.

(...మిగతాది వచ్చేమాసం..)