ఇంద్రప్రస్థాన్ని ఒకప్పుడు కీర్తివర్మ అనే రాజు పరిపాలించేవాడు. కీర్తివర్మకు తన రాజ్యాన్ని విస్తరింప జేయాలని చాలా కోరికగా ఉండేది. ఆ రాజ్యానికి చుట్టుప్రక్కల ఉన్న చిన్న చిన్న రాజ్యా లపైకి అతను దండెత్తి, వాటినన్నిటినీ తన రాజ్యంలో కలుపుకున్నాడు. వాటిని సామంత రాజ్యాలుగా ఉంచుకొని, ఆ రాజుల నుండి బలవంతంగా కప్పం వసూలు చేయసాగాడు. సామంత రాజ్యాల ప్రతినిధులు తమ అశక్తతను ఎన్ని విధాలుగా వ్యక్తం చేసినా ఫలితం లేకపోయింది- కీర్తివర్మ కోరికలకు అంతులేకుండా ఉన్నది.
కొన్నాళ్లకు గూఢచారులనుండి కీర్తివర్మకు ఒక వర్తమానం అందింది: సామంత రాజులంతా కలిసి తనకు వ్యతిరేకంగా కుట్రపన్నుతున్నారు. అయినా కీర్తివర్మ ఏమాత్రం తొణకలేదు. తనకు సైనిక బలం ఎక్కువ ఉన్నదనే ధైర్యం ఆయన కళ్ళకు పొరగా నిల్చింది. వాళ్లందరిపైనా మరోసారి యుద్ధం చేద్దామని నిశ్చయించాడు. మంత్రి, సైన్యాధిపతి అది తప్పని చెప్పిచూశారు. అయినా లాభం లేకపోయింది.
తెలివైన మంత్రి రాజుకు ఏదో ఒక విధంగా కళ్ళు తెరిపించాలనుకున్నాడు. దానికి తగిన సందర్భంకోసం వేచి ఉన్నాడు. అలాంటి అవకాశం త్వరలోనే వచ్చింది: రాజు, మంత్రి ఉద్యాన వనంలో విహరిస్తుండగా వాళ్లకొక వింత కనబడింది- ఒక మూలన ఉన్న పుట్టకు దగ్గరలోనే వేలాది చలి చీమలు ఒక పామును కరిచి చంపుతున్నాయి. పాము అటూ ఇటూ దొర్లుతున్నది- దానిక్రిందపడి అనేక చీమలు నలిగిపోతున్నాయి- అయినా మరిన్ని చీమలు వచ్చి ఆ పామును పట్టుకొని ఈడ్చుకు పోతున్నాయి. చివరికి ఆ పాము చనిపోయింది కూడా. ప్రక్కనే ఉన్న మంత్రి సమయానుకూలంగా ఈ పద్యం చెప్పాడు:
"బలవంతుడ నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా?
బలవంతమైన సర్పము
చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ?" అని.
కీర్తివర్మకు కనువిప్పు కలిగింది. కేవలం తనకున్న సైన్యబలంపై ఆధారపడి, సామంతరాజ్యాలను దోచటం తప్పని అర్థమైంది. చిన్న చిన్నవైనా సరే, అవన్నీ కలిస్తే తనకు ముప్పు తప్పదని అతను తెలుసుకున్నాడు. సామంత రాజ్యాల కష్టాలను అర్థంచేసుకొని, ఆ రాజుల మనోభావాలకు దెబ్బ తగలకుండా ప్రవర్తించాలని అతనికి తెలిసివచ్చింది.
ఆపైన అతను మంత్రిగారి సలహాల మేరకు అనేక పరిపాలనా సంస్కరణలు చేపట్టాడు. ప్రజా సంక్షేమం కోసం అతను చేపట్టిన చర్యలవల్ల, సామంత రాజులకు ఆందోళన మార్గం చేపట్టవలసిన అవసరమే లేకుండా పోయింది. అందరూ కీర్తివర్మకు మిత్రులైనారు. దట్టంగా క్రమ్ముకున్న యుద్ధ మేఘాలు దూదిపింజల్లాగా తొలగిపోయాయి.
తన కనువిప్పుకు కారణమైన మంత్రిని ఘనంగా సత్కరించాడు కీర్తివర్మ.