చిన్న పల్లె పేరుకు తగ్గట్లే చిన్న పల్లె. చెట్లు చేమలతో పచ్చగా ఉండే చిన్నపల్లెలో పిల్లలంతా రోజూ సంతోషంగా బడికి వెళ్ళేవాళ్ళు. ఆదివారం వచ్చిందంటే చాలు, అందరూ కలిసి అడవికో, కొండలు ఎక్కేందుకో వెళ్ళేవాళ్ళు. చిన్నపల్లె చుట్టూ ఉన్న అడవిలో జింకలు, కుందేళ్ళు, పాములు, అడవిపందులు, ఎలుగుబంట్లు ఉండేవి. లెక్కలేనన్ని నెమళ్ళు, రకరకాల పక్షులు ఆ అడవిలో నివాసం ఉండేవి.

ఒక ఆదివారంనాడు పిల్లలంతా అడవికి పోతుంటే ఆరేళ్ళ గణేశు 'నేనూ వస్తాను' అని బయలుదేరాడు. మిగిలిన పిల్లలందరూ పెద్దవాళ్ళు- "నువ్వొద్దులే, చిన్నవాడివి" అన్నారు. వాళ్ళట్లా అన్నకొద్దీ గణేశుకు పట్టుదల హెచ్చింది. వాడు ఎంతగా ప్రాధేయపడ్డాడంటే, ఎంత మొండిపట్టు పట్టాడంటే, చివరికి అందరూ వాడిని కూడా అడవికి రానిచ్చారు.

అప్పటివరకూ గణేశు అడవిలోకి పోయి ఎరుగడు- ఎవరన్నా వాడిని రానిస్తే గద! ఇన్నాళ్ళకు దొరికిన అవకాశాన్ని వాడు సద్వినియోగం చేసుకున్నాడు. కనబడ్డ ప్రతి ఆకునూ, గడ్డినీ, చెట్టునూ, పురుగునూ, పిట్టనూ, జంతువునూ వాడు శ్రద్ధగా గమనిస్తూ తోటి పిల్లల్ని వాటి గురించి ప్రశ్నలు వేస్తూంటే, సమాధానాలు చెప్పలేక, పిల్లలంతా "నువ్వు నోరు మూసుకొని నడువు గణేశూ" అన్నారు.

చూస్తూండగానే మధ్యాహ్నం అయ్యింది. అందరూ ఒక వంక దగ్గర, చెట్లకింద కూర్చుని భోజనాలు చేశారు. కొందరు పిల్లలు ఆడుకున్నారు; కొందరు వంకలో స్నానాలకు దిగారు. గణేశుకు పాపం, కాళ్ళు నొప్పి పుడుతుంటే, ఏమీ చేయకుండా చెట్టుక్రింద కొంచెంసేపు నడుం వాల్చాడు.

ఆ తరువాత గణేశు ఒక్కడే అడవిలో నడుస్తూ పోతుంటే, ఒక గుంత కనబడింది. చిలిపి గణేశు ఆ గుంతపైనుండి దూకుదామనుకుని, దూకాడు. అయితే అవతలివైపు పడటానికి బదులు ఆ గుంతలోనే పడ్డాడు. తీరా చూస్తే, అక్కడినుండి లోపలికి ఒక దారి కనబడింది!

గణేశు ఆ దారివెంబడి నడుస్తూ ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోయాడు. కొంత దూరం వరకూ పెద్దగా చెట్లూ మొక్కలూ కనబడలేదు గానీ, ఆపైన తను ఏనాడూ చూడని వింత పువ్వులతో, చెట్లతో ఒక దట్టమైన అడవి మొదలైంది.

చిన్నపల్లెలో జంతువులన్నీ ఆహారం వెతుక్కొని జీవించేవి. కానీ‌ఇక్కడి జంతువుల పని చాలా భిన్నంగా ఉంది- అవి మనుషుల్లాగా పంటల్నీ, చెట్లనీ, అడవినీ పెంచుకుంటున్నాయి!

అంతలో అక్కడ ఉన్న కుందేలు ఒకటి గణేశును చూసి, 'అరే, ఇదేదో కొత్త జంతువు ఇక్కడికి వచ్చినట్లుందే' అనుకున్నది. వెంటనే అది గణేశు దగ్గరికి వచ్చి ఎంతో ప్రేమగా పలకరించింది కూడా. కానీ గణేశు ఎంత ప్రయత్నించినా అది ఏమంటున్నదో‌అర్థం కాలేదు- వాడికి కుందేలు భాష రాదు కద!

అక్కడ చేరిన ఉడతలూ, కప్పలూ, గువ్వలూ, అన్నీ తమలో తాము ఏవేవో మాట్లాడుకున్నై, కానీ గణేశుకు ఒక్క ముక్కా అర్థం కాలేదు. చివరికి కుందేలు వాడిని చేయిపట్టుకొని నడిపించుకు వెళితే, మర్యాద కొద్దీ వాడు దాని వెంట నడిచాడు.

కుందేలు వాడిని తన ఇంటికి తీసుకెళ్ళింది. క్యారట్లు, ముల్లంగి గడ్డలు స్తంభాలుగా చేసుకొని కట్టుకున్న ఆ యింటి కప్పుకోసం క్యారట్ మొక్క ఆకుల్నే వాడుకున్నది కుందేలు. కుందేలు భర్త, కుందేలు కొడుకూ గణేశును ఆప్యాయంగా పలకరించారు. నోట మాట రాని ఈ మూగ జీవి అంటే వాటన్నిటికీ చాలా జాలి కలిగింది.

కొంతకాలానికి గణేశు కుందేళ్లకు మంచి మిత్రుడయ్యాడు. వాటి భాషకూడా వాడికి ఇప్పుడిప్పుడే అర్ధం అవుతున్నది. కుందేళ్ళు వాడికి తమ లోకాన్ని కొద్ది కొద్దిగా పరిచయం చేశాయి- అన్నీ కలిసి ఒకరోజున పట్టణానికి వెళ్ళాయి. అక్కడి దృశ్యం గణేశును ఆశ్చర్య చకితుణ్ని చేసింది: పట్నంలో ఎలుగుబంటి స్కూటర్ నడుపుతున్నది- సింహం కారును, పులి పెద్ద లారీని నడుపుతున్నై. నక్కలు, తోడేళ్ళు, అడవిపందులు దుకాణాలు పెట్టుకుని కూర్చున్నై. చీమలు రోడ్లను శుభ్రం చేస్తున్నై. సీతాకోక చిలుకలు, కందిరీగలు హడావిడిగా అటూ ఇటూ ఎగురుతూ ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నాయి.

కుందేళ్ళు గణేశుకి వాటి లోకంలో‌ ప్రసిద్ధి చెందిన ప్రాంతాలను కూడా చూపించాయి. అక్కడి భవనాల్ని చూసి గణేశు చాలా ఆశ్చర్యపోయాడు. అవన్నీ గడ్డితోటీ, చెట్లతోటీ తయారైనాయని తెలుసుకొని గణేశుకు చాలా సంతోషం కలిగింది.

అలా ఇంకొన్ని రోజులు గడిచేసరికి గణేశుకు కుందేళ్ళ భాష పూర్తిగా వచ్చేసింది. వాడిప్పుడు వాటితో చక్కగా మాట్లాడుతున్నాడు. కుందేళ్ళు వాడిని కూడా తమ పిల్లలతోబాటు బడికి పంపాయి. బడిలో వాడు కుందేళ్ళ అయ్యవార్లు చెప్పే పాఠాల్ని శ్రద్ధగా చదవటం మొదలు పెట్టాడు. ఇప్పుడు వాడు పూర్తిగా ఆ లోకపు ప్రాణి అయిపోయాడు.

ఆ సమయంలో వాడికో కల వచ్చింది. కలలో వాళ్ళ అమ్మ, నాన్న, బడి, బడిలో‌వాడి స్నేహితులు అందరూ వచ్చారు. అందరూ వాడికోసం‌వెతుక్కుంటూ, "గణేశూ, గణేశూ!" అని కేకలు పెడుతున్నారట. వాళ్ళని తలుచుకునేసరికి గణేశుకు ఏడుపొచ్చింది. 'తను ఇన్నాళ్ళుగా వాళ్ళని గురించి పట్టించుకోలేదే' అని వాడికి బాధ వేసింది.

అంతలో ఎవరో వచ్చి వాడిని తట్టి లేపారు. ఎవరా అని లేచి చూస్తే- వాడితోబాటు అడవికి వచ్చిన పిల్లలు!

గణేశు గబుక్కున చుట్టూ కలియ చూశాడు. వంక, అడవి, చెట్లు- అన్నీ‌అంతకు ముందు ఎట్లా ఉన్నాయో అట్లానే ఉన్నాయి. అయితే అవన్నీ గణేశు కు ఇప్పుడు ప్రత్యేకంగాను, క్రొత్తగాను కనబడుతున్నాయి. చెట్లచాటునుండి తనవైపే చూస్తున్న ఉడతలు తనను ఆ వింతలోకం నుండి వెనక్కి తీసుకొచ్చిన జంతువుల్లాగా అనిపించాయి. వంకలో నీళ్ళు సాయంత్రపుటెండలో మెరుస్తూ, గలగలా శబ్దం చేసుకుంటూ‌ సాగిపోతున్నాయి. వెనక్కి వస్తుండగా, దారిలో ఎదురైన ఒక కుందేలుతో గణేశు మాట్లాడేందుకు ప్రయత్నించాడు గానీ, అది ఊరికే ఓసారి వెనక్కి తిరిగిచూసి, తుప్పల్లోకి పరుగుతీసింది!