అమ్మా అమ్మా! చందమామతో
ఆడుకుంటాను
రమ్మను రమ్మను - కిందికి
రమ్మను - రమ్మనవే అమ్మా!
రామా రామా! చందమామ
రాడు రామయ్యా
తోడిపిల్ల వాళ్లతోను
ఆడుకోరాదా!
అందగాడు - చందగాడు
చందమామ
అందుకేను మామతోను
ఆడుకుంటాను!
మింటి నుండి రాడు రాడు
మంటిలోనికి
మన ఇంటిలోనికి!
ఎందుకు రాడో
అడిగేస్తాను చందమామను!
ఎందుకు నీవు - కిందికి రావు?
చందమామా?
కిందికి వస్తే అందరూ నన్ను
గేలిచేస్తారు!
గేలి చెయ్యము - గోల చెయ్యము
చందమామా!
బాలలంటే నాకు చాలా
భయమౌతుందయ్యా!
భయమూ వద్దూ - గియమూ వద్దూ
రయమున రావయ్యా!
పిల్లలంతా చుట్టుముట్టి
అల్లరి చేస్తారు!
అల్లరి చెయ్యము - గిల్లరి చెయ్యము
చందమామ!
కిందికి వస్తే తిరిగి అమ్మ
పైకి రానీదు!
అమ్మనడిగి కిందికి వస్తే
ఆడుకుందాము!
మంటిలోన ఆడుకుంటే
మామ్మ తిడుతుంది
మామ్మ తిడుతుంది
ఎంత పిలిచినా చందమామ
చెంతకు రాడమ్మ
అంతదాక అన్నం వద్దు
ఆటలు నాకొద్దు!
ఏడవకయ్యా బంగరు కొండా
రామా శ్రీరామా!
చూడవయ్యా అద్దంలోను
వీడె చందురుడు!
అవునే అవునే అద్దంలోన
అడుగో చందురుడు
చిక్కినాడు చేతికి యింక
ఎక్కడికెళ్తాడు?
ఇంకెక్కడికెళ్తాడు!?