మహేంద్రపురం జమీందారీలో దివాను ముసలివాడయ్యాడు. ఆయన విశ్రాంతి కోరటంతో కొత్త దివాను అవసరం ఏర్పడింది. దివాను పదవికి అర్హులైన వారందరూ దరఖాస్తులు పంపమని జమీందారు గారు చాటింపు వేయించారు. చాలా మంది చదువుకున్నవాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ పరీక్ష పెట్టగా అన్నింటా సమానంగా ఉన్న అభ్యర్ధులు ముగ్గురు లెక్కతేలారు. కానీ పదవి ఉన్నది ఒకటే కదా! దిక్కుతోచని జమీందారుగారు పాత దివానునే పిలిపించి, కొత్తదివాను ఎంపిక బాధ్యతను ఆయనకు అప్పగించారు.
పాత దివాను ఆ ముగ్గురినీ పిలువనంపి, ఆ ఊరి రచ్చబండ దగ్గరకు పోయి రమ్మన్నాడు. ఇద్దరు అభ్యర్థులు వెంటనే బయలుదేరి వెళ్ళారు; కానీ మూడోవాడు మాత్రం అక్కడే కూర్చుని ఉండిపోయాడు.
"ఏం, నువ్వెందుకు వెళ్ళలేదు?" అని అడిగారు జమీందారు గారు. "అసలు తమరు మమ్మల్ని అక్కడికి ఎందుకు వెళ్ళమన్నారు, అని ఆలోచిస్తున్నాను ప్రభూ!" అన్నాడు వాడు.
కొంచెం సేపు అయ్యిందో లేదో, వెళ్ళినవాళ్ళలోఒకడు తిరిగి వచ్చాడు వగర్చుకుంటూ. "నీతోపాటు వెళ్ళినవాడు ఏడి?" అనడిగారు జమీందారుగారు. "అతని సంగతి నాకు తెలీదు- పోయి రమ్మన్నారు గనుక పరుగు పరుగున పోయి వచ్చాను" అన్నాడు వాడు.
ఇంకో పావుగంట గడిచాక రెండోవాడు తిరిగివచ్చాడు. "ఏమి, ఇంత ఆలస్యం ఎందుకైంది?" అని అడిగాడు పాత దివాను. "తమరు పోయి రమ్మని ఊరికే చెప్పరు కదా, అందుకని, పోయి ఆ పరిసరాలను గమనించి వచ్చాను. రావిచెట్టు, మఱ్ఱిచెట్టు కలిసి పెరిగిన చోట అరుగు ఏర్పరచి రచ్చబండ కట్టించారు. కానీ దాని నిర్వహణ సరిగ్గా లేకపోవటంతో చెట్టు మీద చేరిన పక్షుల రెట్టలతో అదంతా చాలా అపరిశుభ్రంగా అయ్యింది. పనీపాట లేనివాళ్లంతా అక్కడ చేరి దారిన పోయే మామూలు వాళ్లకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అక్కడంతా బాగుచేసి, రచ్చబండను ఊరి పెద్దల చర్చలకు అనువైన ప్రదేశంగా మార్చాల్సి ఉంది" అని జవాబిచ్చాడతను వినయంగా.
పాతదివాను నవ్వుతూ జమీందారు వైపు చూశాడు. జమీందారు కూడా నవ్వి, రెండవవాడినే కొత్తదివానుగా నియమించాడు. మిగిలిన ఇద్దరూ నిరాశ చెందటం చూసిన పాతదివాను వాళ్ళను అనునయిస్తూ "ఏదైనా పనిని అప్పగించినప్పుడు ఆ పనిని అసలు మొదలు పెట్టకనే, 'అది ఎందుకు చెప్పారా' అని కారణాలు వెతకబోవటం తెలివైన పని కాదు- శుద్ధ అవివేకం. అలానే సమస్య ఏమిటో గుర్తించకుండా గుడ్డిగా ఎవరో చెప్పారు కాబట్టి ఏదోముగించుకొని రావాలనుకోవటమూ సరైనది కాదు. ఈ విషయాన్ని మీరిద్దరూ గుర్తించారనుకుంటాను" అన్నాడు.