"చెట్లు నాటిన మనిషి" అనే అద్భుతమైన కథ ఒకటుంది. అందులో ఒకాయన రోజూ క్రమం తప్పకుండా కనీసం వంద విత్తనాలు నాటుతుంటాడు. అంటే నెలకు మూడు వేల విత్తనాలు- సంవత్సరానికి ముప్ఫైఆరువేలు- మూడేళ్ళలో లక్ష! అలా ఆ మనిషి తను ముసలివాడై చనిపోయేవరకూ ప్రతిరోజూ‌విత్తనాలు నాటుతూ పోతాడు. అతను నాటిన లక్షలాది విత్తనాల్లో సుమారు మూడో వంతు మాత్రం మొలకెత్తి, పెరిగి, పెద్దై, చెట్లౌతాయి. అయినా ఆ క్రమంలో కొన్ని వేల ఎకరాల బీడు భూమి దట్టమైన అరణ్యంగా మారిపోతుంది. వాగులూ, వంకలూ, నదులూ తిరిగి జీవం పోసుకుంటాయి. పక్షులూ, జంతువులే కాక, ఆ ఎడారిని వదిలిపెట్టి వలసపోయిన మనుషులు కూడా తిరిగి వస్తారు.

పనుల్ని విడువకుండా, ప్రతిరోజూ, ప్రతివారం, ప్రతినెలా చేస్తూ పోతే, అవి ఒకదానికి ఒకటి తోడవుతూ పోతాయి- చుక్క చుక్కా కలిసి మహా సముద్రం అయినట్లు.

కొత్తపల్లి పత్రికకు ఇప్పుడు రెండేళ్ళు నిండాయి. సర్వధారి ఉగాది(ఏప్రియల్ 2008)న కొంచెం అనుమానంగా, కొంచెం బిడియంగా, చాలా మామూలుగా రెండు బడుల పిల్లలకోసంవెలువడిన చిన్న, నలుపు-తెలుపు పత్రిక, రెండో సంవత్సరానికి రంగుల హరివిల్లై, వెడల్పాటి పేజీలతో సొంపుగా తయారైంది.

ఈ రెండేళ్ళలోనూ ఒక నూటయాభై పిల్ల రచయితల కథలు, ఓ వంద అనువాద కథలు, నూటయాభై పాటలు, నాలుగువందలకు పైగా రంగుల బొమ్మలు ఈ మాధ్యమం ద్వారా తెలుగు పిల్లలకు అందాయి. కనీసం ఓ రెండువేలమంది పత్రికని విడువకుండా ప్రతినెలా, ఇష్టంగా చదువుతున్నారు. ఓ నూరు-నూటయాభై మంది పిల్లలు 'తామూ రచనలు చేయగలం' అని తెలుసుకున్నారు; తమలోని కళాకారుల్ని గుర్తించారు. ఓ ఇరవై-ముప్ఫై మంది పల్లె పిల్లలు కంప్యూటర్లని సరిగ్గా వాడుకోవటంలో రకరకాల మెళకువల్ని నేర్చుకున్నారు. రాను రాను వీళ్ల సంఖ్యలు ఇంకా పెరుగుతాయి, ఎలాగూ.

"ఇదంతా జరిగేందుకు మేం పెట్టిన ఖర్చు చాలా తక్కువ" అనుకోవటం బాగుంది. మేం వెచ్చించిన సమయానికీ, పెట్టిన మనసుకూ, మీ ఆదరణకూ వెల కట్టుకోకపోతే ఇవన్నీ దాదాపు ఉచితంగా వచ్చినట్లే. ఈ పనికి కావలసిన సాంకేతిక పరికరాలు- కంప్యూటర్లు, ప్రింటర్లు, కెమెరా, శబ్ద గ్రహణ యంత్రం- వంటివాటిని అనేకంది మిత్రులు ఉదారంగా ఇచ్చారు, వాడుకొమ్మని. చాలామంది ప్రొఫెషనల్ చిత్రకారులు సమయం వెచ్చించి, కథలకు ఉచితంగా బొమ్మలు వేసి ఇచ్చారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు.

అభ్యుదయ కళాకారిణి 'దేవి' గత సంవత్సరం టింబక్టు బడి పిల్లలకోసం ఒక నాటికను రచించటమే కాక, నెల రోజుల సమయం వెచ్చించి, దాన్ని పిల్లలకు నేర్పించి, వాళ్లచేత హైదరాబాదు రవీంద్రభారతిలో ప్రదర్శన ఇప్పించారు. ఆ నాటినుండీ అనుకోగా, ఆ నాటిక- "రెండు రాజ్యాలు-రెండు దారులు"- ఇన్నాళ్లకు అక్షర రూపం ధరించింది. జె.యన్.టి.యు లలిత కళల విద్యార్థి కొలుకులూరి శివప్రసాద్ దానికి చక్కని వర్ణచిత్రాలను అందించాడు. మన విద్యా విధానపు లోతుల్ని స్పృశించే ఈ నాటిక, ఈ మాసపు కొత్తపల్లికి అనుబంధం. రచయిత్రి దేవికీ, చిత్రకారుడు శివప్రసాదుకూ అభినందనలు.

కథల్నీ, పాటల్నీ, ఆటల్నీ ఇష్టపడని తెలుగుపిల్లలంటూ ఉండరు. కొత్తపల్లి పత్రిక వాళ్ళందరినీ చేరే అవకాశం ఇప్పట్లో లేదు- అందుకని, స్వతంత్రంగా నడిచే కొత్తపల్లులు మరిన్ని తయారవ్వాల్సి ఉన్నది. ఊరుకొకటి- జిల్లాకొకటిగా అవి తెలుగు పిల్లలందరినీ చేరుకొని, వాళ్ళకు సంతోషాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పంచాలి. వాటికి కావలసిన సాంకేతిక సహాయాన్నీ, ఇతర సలహాలనూ కొత్తపల్లి బృందం అందించగలదు. వికృతి నామ సంవత్సరం ఈ ప్రక్రియకు నాంది పలుకుతుందని ఆశిద్దాం.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో-

కొత్తపల్లి బృందం.