అనగా అనగా గుజరాత్ లో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు ఏడుగురు కొడుకులు, కోడళ్ళు. వాళ్ళల్లో అందరికంటే చిన్న కోడలుపేరు ఉమ. ఆమెకు, పాపం, చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ఆ రోజుల్లో అలాంటి కోడళ్లను అత్తింటివాళ్ళు చాలా కష్టపెట్టేవాళ్ళు. వాళ్ళు 'దురదృష్ట జాతకులు' అని అందరూ చిన్నచూపు చూసేవాళ్ళు. ముఖ్యంగా ఆమె అత్త కోకిలాబెన్- ఉమని చాలా ఈసడించుకునేది. ఇంట్లోవాళ్లంతా ఆమెని "ఎవరూ లేని పిల్ల" అని పిలిచి ఏడిపిస్తుండేవాళ్ళు. ఆమె భర్త మాత్రం ఆమెపట్ల ప్రేమగా ఉండేవాడు. అతనొక్కడే ఆయింట్లో ఆమెకు స్నేహితుడు. కానీ ఇంట్లో అతనిమాట నెగ్గేది కాదు- ఎవ్వరూ అతన్ని పట్టించుకునేవాళ్లు కాదు.
పెళ్ళైన కొన్ని నెలలకే ఉమ గర్భవతి అయ్యింది, కానీ భర్త తప్ప, ఆ యింట్లో ఎవ్వరూ అందుకు సంతోషించలేదు. అంతలోనే పెద్దల పండుగ వచ్చింది. ఆరోజున గృహస్తులంతా వాళ్ళ పూర్వీకులకోసం పిండివంటలు, స్వీట్లు చేసి అర్పించటం రివాజు. అందుకని ఇంట్లో పాయసం వండారు. ఉమకు పాయసం చాలా ఇష్టం. దానికి తోడు గర్భవతికూడా కావటంతో, ఆమె పాయసం తినాలని చాలా ఆశపడింది. కానీ ఇంట్లోవాళ్ళు ఆమెకు ఒక్క చుక్క పాయసంకూడా ఇవ్వలేదు. అందరూ తిని, గిన్నెలు ఖాళీ చేశాక, వాళ్లు గిన్నెలు ఉమకు ఇచ్చేసి, శుభ్రంగా తోమిపెట్టే పనిని అప్పజెప్పారు!
అయినా పాపం, ఆమె ఏమీ అనలేదు; పాయసం వండిన గిన్నెను తీసుకెళ్లి, దాని లోపల అంటుకొని ఉన్న మాడు చెక్కల్ని అన్నిటినీ గీకి, కనీసం ఆ ముక్కల్నైనా తిందామనుకున్నది. అయితే ఆమె అప్పటికి ఇంకా స్నానం చేయలేదు- అందుకని, గీకిన పాయసం మాడుచెక్కల్ని ఆమె ఒక బట్టలో మూటగట్టి అక్కడ పెట్టుకొని, స్నానానికి పోయింది.
కానీ ఆమె స్నానం చేసి తిరిగివచ్చి చూసేసరికి, ఆ మూట ఖాళీగా ఉంది! ఉమకు చాలా దు:ఖం వేసింది. అయినా ఆమె "పోనీలే, నా పాయసం పోయింది. ఎవరో ఎత్తుకుపోయినట్లున్నారు. నాకంటే వాళ్ళకే ఎక్కువ ఆకలి అయ్యిందేమోలే. నేనే వాళ్లకి కృతజ్ఞతలు చెప్పాలి- ఎందుకంటే ఆకలిగా ఉన్నవాళ్ళకు భోజనం పెడితే పుణ్యం వస్తుంది గద!" అనుకున్నది.
అంతలో, ఎక్కడినుండి ఊడిపడిందో, ఏమో ఒక పే..ద్ద పాము ఆమె ముందుకొచ్చి నిలబడింది. భయంతో ఉమ వణికిపోయింది. అంతలో ఆ పాము ఉమతోమనిషి భాషలో ఇలా అన్నది: "అమ్మాయీ! భయపడకు. నా పేరు నాగరాణి. నీ పాయసం తిన్నది నేనే! నేను నీ పాయసం మొత్తాన్నీ తినేసినా, నువ్వు నన్ను ఏమీ తిట్టుకోలేదు. అందుకని నువ్వంటే నాకు చాలా ఇష్టం అవుతున్నది. నీకు ఏ సాయం కావాలంటే ఆ సాయం చేద్దామనిపిస్తున్నది. చెప్పు, నువ్వెందుకు అంత బాధగా ఉన్నావు?" అని అడిగింది.
అప్పుడు ఉమ తన గోడు అంతా నాగరాణికి చెప్పుకున్నది. బంధువులు ఎవ్వరూ లేరని తనని అత్తింటివాళ్ళు ఎలా కష్టపెడుతున్నదీ వివరించింది. అంతావిని నాగరాణి "నీకు ఎవరూ లేరని అనుకోకు. నేను మీ అమ్మనే అనుకో. ఇక మా వాళ్లం అందరం నీకు బంధువులమే! నీ అవసరాలన్నీ ఇకపైన మేమే తీరుస్తాం" అన్నది.
తర్వాత కొన్ని నెలలకు ఉమకు శ్రీమంతం చేయాల్సిన సమయం వచ్చింది. అత్తింటివాళ్ళు, అయిష్టంగానే శ్రీమంతానికి తేదీ నిర్ణయించారు. "నా దూరపు బంధువు ఒకావిడ ఈ మధ్యే నన్ను చూసింది- ఆమె ద్వారా నాకు ఇంకా కొద్దిమంది బంధువులు ఉన్నట్లు తెల్సింది- ఆహ్వానాలు పంపితే, వాళ్ళుకూడా వస్తారు" అన్నది ఉమ అత్తతో.
"అయ్యో, వస్తారంటే పిలువకేమి, తల్లీ? అయినా వాళ్ళంతా నీ ఊహల్లోనే తప్ప, వాస్తవంలో ఉండరని నా అనుమానం" అన్నది కోకిలాబెన్, ఈసడించుకుంటూ.
అయితే శ్రీమంతం రోజున, ఆశ్చర్యం! ఉమ తరపు బంధువులు చాలామంది- కార్లలోనూ, బస్సుల్లోను, ఆటోల్లోను వచ్చి వాలారు. ధగ ధగ మెరిసే ఉంగరాలు, నగలు, పట్టు వస్త్రాలతో వాళ్లంతా ఇంట్లో తిరుగుతూ ఆప్యాయంగా గలగలా మాట్లాడుతుంటే అత్తింటివాళ్ళు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. వాళ్లంతా ఉమకోసమూ, ఇంట్లో వాళ్ళందరికోసమూ అమూల్యమైన బహుమతుల్ని తెచ్చి ఇస్తుంటే అత్తగారికి "ఇదంతా కలా, నిజమా" అనిపించింది. ఆమె వాళ్లందరినీ ఎంతో గౌరవించి, గొప్ప విందు చేసి సత్కరించింది.
ఆ తరువాత నాగమాత ఉమను తనవెంట నాగలోకానికి తీసుకెళ్ళింది. ఉమను కాలు క్రింద పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చూసుకున్నది. అక్కడ ఉమకు పండంటి కొడుకు పుట్టాడు.
బంగారంలాంటి కొడుకును ఎత్తుకొని, భాగ్యవంతులైన బంధువర్గాన్ని వెంటబెట్టుకొని అత్తవారింటికి తిరిగి వచ్చిన ఉమకు ఇప్పుడు అత్తింటివారు బ్రహ్మరధం పట్టారు! అందరూ ఉమను ఎంతో గౌరవించసాగారు- సంపద ఏమేం చేస్తుందో చూడండి!