"ఆ సన్యాసి నన్ను చూస్తూ ఇట్లా చెబుతుంటే నేను చాలా దు:ఖించి, ఇట్లా అనుకున్నాను- “ఇక నేను ఇక్కడ నివసించకూడదు. నా యీ కథ ఇతరులతో చెప్పుకోవటానికి ఏమాత్రం తగనిది. 'ధననష్టం, మనస్తాపం, ఇంట్లో వాళ్ల చెడు ప్రవర్తన, మోసగింపబడటం, అవమానింపబడటం- ఇవి ఇతరులతో చెప్పుకో-జాలని విషయాలు' అని పెద్దలంటారు. దైవం అనుకూలించక అవమానం పాలైనప్పుడు- సిగ్గున్నవాడికి వనవాసం కంటే సుఖమైనది వేరేదేదీ లేదు. అభిమానం గలవాడు పూలగుత్తి మాదిరి, అందరి కంటే ఉన్నతుడుగా, వాళ్ల తలల పైనైనా ఉండాలి; లేదా అడవిలోనే నశించిపోవాలి. 'ఇక్కడే బ్రతుక్కుంటూ, బిచ్చం ఎత్తుకొని జీవించేద్దామా' అంటే- దానికంటే నీచమైన పని ఇంకోటి లేదు. మనకంటే తక్కువ వాడిని ఒక్కడిని అడుక్కోవడం కంటే‌, నిప్పుల్లో పడి ఈ శరీరాన్ని త్యజించటమే మేలు. అబద్ధాలు చెప్పటంకంటే నోరు మూసుకొని మౌనంగా ఉండటం మేలు. ఇతరుల ధనాన్ని అపహరించటం కంటే‌ బిచ్చం ఎత్తుకోవటం మంచిది. జ్ఞానం లేని యజమానిని సేవించటం కంటే‌ అడవిలో బ్రతకటం ఉత్తమం. ఇతరులను ప్రాధేయపడుతూ బ్రతకటం కంటే‌చావు మేలు. ఇతరుల అడుగులకు మడుగులొత్తి బ్రతకటమే గౌరవాన్ని పోగొడుతుందంటే‌, ఇక 'యాచిస్తూ బ్రతకటం' అనేది ఏ కొద్దిపాటి గౌరవాన్నీ మిగలనీయదు. 'ఒకరి ఇంటిని ఆశ్రయించుకొని, వాళ్ళ బెదిరింపులకు తలఒగ్గి బ్రతకటం' అనేది చాలా నీచం" అని పలు విధాలుగా ఆలోచించాను.”

"అయినా నా దురాశకు అంతులేక పోయింది. 'మళ్లీ ఏదో ఒక విధంగా ధనాన్ని సంపాదించి కూడబెట్టాలి' అనుకొని, అక్కడే ఉండసాగాను. చూడు- దురాశ వల్ల వస్తువుల పట్ల మితి లేని ప్రేమ కలుగుతుంది. ఆ మోహం దు:ఖాన్ని కలిగిస్తుంది. దు:ఖం అగ్ని లాంటిది. తనకు ఆశ్రయమిచ్చిన దానినే అది నాశనం చేస్తుంది. అందువల్ల తెలివిగలవాడు దురాశకు ఎన్నడూ లోబడడు. “

"అలా ఆ తర్వాత కూడా నేను ఆ స్థలాన్ని విడిచి పెట్టకుండా తిరుగుతుంటే‌ చూసిన చూడాకర్ణుడు, ఒకసారి తన చేతిలోని కట్టెను నాపైకి విసిరివేశాడు. దేవుడి దయవల్ల ఆ వేటు తప్పిపోయింది గానీ, ఒకవేళ ఆ దెబ్బే తగిలి ఉంటే నేను ఈ పాటికి యమలోకంలో మ్రగ్గుతూ ఉండేదాన్ని. “

"ఆ తర్వాత నేను "అబ్బా! అన్ని కష్టాలకూ మూలం ఈ ధనాశయే కదా! ధన సంపాదన కంటే లోకంలో సుఖం ఏదీ లేదు. అలాంటి సుఖంపై ఆశను వదిలిపెట్టిన వాడే గొప్పవాడు. 'అన్ని శాస్ర్తాలూ చదివినవాడు' అనాల్సింది వాడినే. అట్లా ఆశను వదలి వేసినవాడే, అన్ని ధర్మాలనూ ఆచరించిన వాడు అవుతాడు. కడుపు నింపుకోవడానికి ఇతరులను పీడించకుండా, తనకు దొరికిన దానితో సంతోషపడే‌ వాడొక్కడే ఈ లోకంలో ధన్యజీవి; సుఖజీవిన్నీ! ఎవరికైనా, వాళ్ల చేతల్ని బట్టే దు:ఖాలు గానీ, సుఖాలు గానీ ప్రాప్తిస్తున్నాయి. అందుకని, ఇక ఇక్కడ ప్రయాసపడటంలో అర్థం లేదు. నాకు ఈ చోటేమీ తాత ముత్తాతలు సంపాదించి పెట్టిన భూమి కాదు. ఈ భూమండలంలో ఇంక వేరే చోటేమీ లేదా, ఏమి? ఇక్కడ ఉండవలసిన అగత్యం ఏమున్నది? క్రూరుడైన యీ సన్యాసి చేత కర్ర- దెబ్బలు తింటూ ప్రాణాలు పోగొట్టుకునేది ఎందుకు? ఇంకా ఎక్కడైనా, మనుషులు లేని చోటును చేరుకొని ప్రొద్దుపుచ్చటం మంచిది. కఠినమైన గండ శిలల లోపల కూడా కప్పకు జీవాన్ని ఇవ్వగల దయామయుడైన ఆ భగవంతుడు- ఇంత ఎలుకను, నన్ను కాపాడలేడా? “ అని ఆలోచించి, మనసును రాయి చేసుకొని, ఆ చోటును విడిచిపెట్టి, ఎవ్వరూ నివసించని ఆ అడవికి చేరుకున్నాను.”

“అడవిలో కాయకసుర్లు తిని, చిన్న గుంతల్లో నిలిచిన నీళ్లు త్రాగి, ఏదైనా చెట్టు నీడన కాలం గడపటం మంచిది గాని, సంపదను కోల్పోయి నలుగురి మధ్యా బ్రతకకూడదు. నేను చేసుకున్న పుణ్యం కొద్దీ ఆ తర్వాత నాకు యీ స్నేహితుడు దొరికాడు. మహాభాగ్యం వల్లనే నాకు 'నీ ఆశ్రయం' అనే స్వర్గం దక్కింది. మంచివారి సాంగత్యాన్ని మించిన మేలు ఈ లోకంలో వేరే ఏదీ లేదు.

ఈ ప్రపంచం ఒక విష వృక్షం. అయినా అమృతంతో సమానమైనవి అందులో రెండు ఉన్నాయి: 'మంచి కావ్యం' అనే అమృతాన్ని రుచి చూడటం ఒకటి; మంచివాళ్లతో కలిసి బ్రతకటం రెండవది " అని తన ఆత్మకథను ముగించింది ఎలుక.

శ్రద్ధగా విన్న తాబేలు, దురాశ గురించి చెబుతూ, ఇలా అన్నది:

" సంపదలు శాశ్వతాలు కావు. వాగుల్లో నీరు వేగంగా ప్రవహించి పోయినట్లు, యౌవనం కూడా వేగంగా వెళ్లిపోతుంది. జీవితం బుడగలాంటిది. అందువల్ల బుద్ధిమంతుడు త్వరగా ధర్మకార్యాలు చేయాలి. అలా ధర్మాన్ని సమాచరించని వాడు ఆ తర్వాత దు:ఖానికి లోనై, శోకం అనే మంటలో దహించుకు-పోతాడు. నువ్వు అతిగా కూడబెట్టావు. దాని ఫలితమే ఇది. చెరువులో ఉండే‌ నీళ్లకు మొరవ ఎలా రక్షణ నిస్తుందో, అదే విధంగా- సంపాదించబడిన ధనానికి త్యాగమే రక్షణ.

బీరువాల లోను, నేలమాళిగ లోను దాచటం ఆ ధనాన్ని పోగొట్టుకోవటానికే తప్ప, వేరు కాదు. ఇతరుల నోరుకొట్టి, కడుపు కొట్టి, తాను తినక, ఇతరులను తిననివ్వక డబ్బు సంపాదించేవాడికి, ఇతరుల కోసం బరువులు మోసేవాడికి మాదిరి, ఆ బరువు(కష్టం) మాత్రమే లభిస్తుంది. తాను సుఖంగా గడిపేందుకు, ఇతరులకోసం వదిలిపెట్టేందుకు ఉపయోగపడని డబ్బు ఉండటం వల్ల ప్రయోజనం ఏముంది, అది పోతే నష్టం మాత్రం ఏమున్నది? పిసినారి వాడు ఎంత ధనికుడైనా, తను సుఖపడడు- ఆ విధంగా అతడు దరిద్రుడితో సమానమే. అయినా ధనాన్ని సంపాదించటంలోను, దానికి కాపలా కాయటంలోను, దాన్ని పోగొట్టుకోవటంలోను- ఈ మూడింటిలోనూ పిసినారికి వచ్చేది దు:ఖమే.

పిసినారి తన సంపదను- ఇతరులకు పెట్టడు; బంధువులకోసం ఖర్చు చేయడు; తాను కూడా తినడు- చివరికి ఆ సంపదంతా నేలపాలైనా అవుతుంది; దొంగల పాలైనా అవుతుంది. లోకంలో ఎంతో కష్టం మీద గానీ లభించని విషయాలు నాలుగు ఉన్నాయి: 'ప్రేమగా మాట్లాడుతూ ఇచ్చే దానము, గర్వం తోడుగా లేని జ్ఞానము, క్షమాగుణంతో కూడుకున్న వీరత్వము, త్యాగగుణంతో ఉండే‌ డబ్బు'- ఈ నాలుగూ ప్రపంచంలో అంత సులభంగా దొరకవు. 'ధన సంపాదన' అనే పనిని బుద్ధిమంతుడు ఎల్లప్పుడూ చేయవలసిందే- కానీ అతిగా కూడబెట్టాలన్న కోరిక తప్పు. ఇది వరకు ఒక నక్క దురాశ కొద్దీ ఎక్కువ సంపాదించాలని పోయి, వింటి దెబ్బ తగిలి చచ్చింది. విను, నీకు ఆ కథ చెబుతాను.

'కల్యాణ కటకం ' అనే పట్టణంలో భైరవుడు అనే వేటగాడు ఒకడు ఉండేవాడు. వాడు ఒకరోజున విల్లు, బాణాలు, వల త్రాళ్లు, భోజనపు మూట మొదలైన సాధనాలన్నిటినీ తీసుకొని, వేటకోసం వింధ్యారణ్యానికి వెళ్లాడు. అక్కడ , వాడు తాను దాక్కొనటం కోసం ఒక మరుగును ఏర్పరచుకొని, జంతువులను ఆకర్షించేందుకై ఎరను పెట్టి, పొంచి కూర్చున్నాడు. ఆ పైన అతను అక్కడికి వచ్చిన జింకను ఒకదాన్ని బాణంతో కొట్టి చంపాడు. బాగా బలిసిన ఆ జింకను భుజం మీద పెట్టుకొని అతను వస్తూంటే, ఒక అడవి పంది అతనికి ఎదురు అయింది. చూస్తే అది నడస్తున్న కొండేమో' అనిపిస్తున్నది.

అప్పుడు ఆ వేటగాడు " ఆహా! నా అదృష్టం కొద్దీ ఇంకో జంతువు కూడా దొరకబోతున్నది " అని సంతోష పడి, భుజం మీద ఉన్న జింకను క్రిందికి దించి, విల్లు ఎక్కుపెట్టి, బాణం సంధించి, పంది మీదికి వదిలాడు. దెబ్బ తగిలిన మరుక్షణమే ఆ పంది కోపంతో రెచ్చిపోయి, భయంకరంగా గర్జిస్తూ, బాణం మాదిరి దూసుకొని వచ్చి వాడిని చీల్చి వేసింది. ఆ దెబ్బకు వాడు మొదలు నరికిన చెట్టులాగా నేలకూలి, బాధతో అరుస్తూ ప్రాణం విడిచాడు. బాణం దెబ్బ తగిలిన పంది కూడా చచ్చిపోయింది. అక్కడే ఉన్న పాము ఒకటి, వాటి త్రొక్కుడులో పడి, నలిగి చచ్చింది.

ఆ తర్వాత కొంతసేపటికి, “ దీర్ఘరావం " అనే నక్క ఒకటి ఆహారంకోసం అడవిలో అంతా వెతుక్కుంటూ అక్కడికి వచ్చి చేరుకొని, ఆ ప్రాంతంలో పడి ఉన్న రకరకాల జీవులను చూసి చాలా సంతోషించింది. “ఆహా! నాకు భోజనం పుష్కలంగా దొరికింది. వీటి మాంసం నాకు మూడు నెలల వరకూ సరిపోతుంది: జింక- పందిల మాంసాల్ని రెండు నెలల పాటు తినచ్చు. ఈ వేటగాడి మాంసాన్ని నెల రోజుల పాటు తినచ్చు. పాము ఒక్క రోజుకు సరిపోతుంది. మరి, ఇప్పటి ఆకలి తీరటం కోసం ఏమి తినను? ఈ ధనస్సుకు తాడు బదులు గట్టి నరం కట్టి ఉంచాడు, వేటగాడు. ఈ రోజుకు నాకు ఆ నరం ఒక్కటే చాలు" అనుకున్నది. ఆ పైన అది విల్లు దగ్గరికి చేరుకొని, దానికి గట్టిగా లాగి కట్టి ఉన్న నరాన్ని చప్పరిస్తూ పంటితో కొరకగానే, అది పుటుక్కున తెగింది. అలా హటాత్తుగా పట్టు వదిలిన ఆ వింటి త్రాడు వచ్చి బలంగా నక్క రొమ్ముకు తాకగానే, ఆ నక్క నేలబడి అరుస్తూ, విలవిలా తన్నుకొని, చచ్చింది. చూడు, దురాశ నక్కను ఏ గతికి తెచ్చిందో! “

"అందుకనే, 'అతిగా కూడబెట్టాలన్న కోరిక మంచిది కాదు' అని చెప్పాను. ఇతరులకు ఇచ్చి, తాను తిన్నదే తన సొత్తు. ఇతరులకు ఇయ్యక, తాను తినక, కూడబెట్టిన ధనం చచ్చినప్పుడు వెంటరాదు” అని చెప్పి, తాబేలు ఇంకా ఇట్లా అన్నది- (మిగతాది మళ్ళీ...)