అనగా అనగా ఒకసారి జంతువులన్నీ సమావేశమైనాయి. "మన సమాజంలో సంబంధాలన్నీ రాను రాను చాలా సంక్లిష్టం అయిపోతున్నాయి. దీన్ని తట్టుకునేందుకు-గాను మనం ఏమైనా చెయ్యాల్సిందే, తప్పదు" అనుకున్నాయి. అన్నీ కలిసి చర్చించుకొని, భావి తరాల బాగుకోసం ఒక బడి పెట్టాలని నిశ్చయించుకున్నాయి.

ఆ బళ్ళో పరుగెత్తటం, పైకి ఎగ బ్రాకటం, ఈదటం, ఎగరటం నేర్పించాలని నిర్ణయమైంది. ఈ నాలుగూ అన్ని ప్రాణులకూ అవసరమైన మౌలిక విషయాలే- కనుక, 'విద్యార్థులందరూ ఈ నాలుగింటిలోనూ ప్రావీణ్యత సాధించాల్సిందే' అని నిశ్చయమైంది.

బాతుకు ఈదటం అసలు సమస్యే కాలేదు. నిజానికి అది తమ టీచరుకంటే బాగా ఈదింది! అది చక్కగా ఎగిరింది కూడా. కానీ పాపం, దానికి పరుగెత్తటమే, బాగా రాలేదు. ఈ అంశంలో అది వెనకబడి ఉన్నది కనుక, ముందు కొన్నాళ్లపాటు దాన్ని బడి వదిలిన తరువాత కూడా ఉండమన్నారు. అలా దాన్ని ఎక్కువసేపు పరుగెత్తించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. చివరికి అది తనకు చాలా ఇష్టమైన ఈతను ప్రక్కన పెట్టి, ఆ సమయాన్ని కూడా పరుగులు పెట్టేందుకే వెచ్చించాల్సి వచ్చింది. దాన్ని ఈ వెనకబడిన అంశంలో ఎంత కాలం నిలిపి ఉంచారంటే, చివరికి దాని పాదాలకు తీవ్రంగా గాయాలైనాయి. ఈదటంలో అది ఇప్పుడు 'సాధారణ' స్థాయికి పడిపోయింది. కానీ అలా సాధారణ స్థాయి ఉంటే బడి పరిధిలో పరవాలేదు, కనుక ఎవ్వరూ ఈ విషయమై బాధ పడలేదు- బాతు ఒక్కటీ తప్ప!

ఇక కుందేలు, పరుగుల్లో ఫస్టుగా ఉండేది. కానీ చివరికి అది నరాల బలహీనతకు లోనై తప్పుకోవాల్సి వచ్చింది. తనకు అస్సలు ఇష్టంలేని ఈత కోసం మరింత ఎక్కువ సమయాన్ని వెచ్చించీ, వెచ్చించీ దాని పరిస్థితి అట్లా తయారైంది.

పైకి ఎగబ్రాకటంలో మొదటి స్థానంలో ఉన్న ఉడుత, మొదట్లో బాగానే ఉండేది. కానీ ఎగిరే తరగతిలో టీచరు దాన్ని చెట్ల కొమ్మల పైనుండి కాక, నేలపైనుండి మొదలు పెట్టమని శాసించేసరికి, దానికి మెదడులో ఏవో అడ్డుగోడలు తయారయ్యాయి. దానితో అది ఇక ఎగరలేకపోయింది. అందుకని, దాన్ని ఎగిరే తరగతిలోనే నిలిపి మరింత సాధన చేయించారు. చివరికి, పాపం, దాని కండరాలు బిగుసుకు పోయాయి- అలా దానికి ఎగబ్రాకటంలో‌ c గ్రేడు, పరుగులెత్తటంలో‌D గ్రేడు వచ్చాయి. బడి మొత్తంలోనూ క్రమశిక్షణ సమస్య ఏదైనా ఉందంటే అది గ్రద్దనే. ఎగబ్రాకే తరగతుల్లో అది మిగిలిన వాళ్లందర్నీ మించిపోయేది. అన్నిటికంటే ముందుగానే అది గమ్యాన్ని చేరుకునేది. అయితే, అలా చేసేందుకు అది తన పద్ధతుల్ని తను ఉపయోగించేది తప్పిస్తే, ఎవ్వరిమాటా వినేది కాదు.

ఇక పందికొక్కుల్లాంటి బిలాశయ జీవులైతే బడిలో చేరనేలేదు! విద్యకోసం ప్రభుత్వం వారు విధించిన పన్నును వ్యతిరేకిస్తూ అవి పోరాటం ఆరంభించాయి- ఏమంటే, నేలలో బొరియలు చేయటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చలేదని వాటికి కోపం వచ్చింది. అవన్నీ తమ పిల్లల్ని ముందు ఎలుకకు, తర్వాత పందికొక్కుకు అనుచరులుగా ఉంచి శిష్యరికం చేయించాయి.

చివరికి అవన్నీ కలిసి ప్రత్యామ్నాయ విద్యనందించే ప్రైవేటు బడిని ఒకదాన్ని ప్రారంభించాయి!