పాట:
కథ చెబుతాము! కథ చెబుతాము
చిన్నారి బాలల కథ చెబుతాము
బాలల చదువుల కథ చెబుతాము
బాధల చదువుల కథ చెబుతాము
తల్లి దండ్రుల కథ చెబుతాము
పల్లె వెలుగుల కథ చెబుతాము
ఆట పాటల కథ చెబుతాము
అయ్యవారుల కథ చెబుతాము
చెట్టు చేమల కథ చెబుతాము
ఎగిరే పిట్టల కథ చెబుతాము
పిల్లల ఆశల కథ చెబుతాము
రేపటి కళల కథ చెబుతాము
పోతులయ్య: వినండి వినండి నాయనలారా, వినండి వినండి తల్లుల్లారా, పిల్లల
గన్నా పెద్దల్లారా, చదువులు చెప్పే అయ్యల్లారా, బుడి బుడి నడకల
పిల్లల్లారా- అంతా వినండి.
కల్పన: ఏం వినమంటావు, చెబితే గదా?
పోతులయ్య: రాజ్యాల మధ్య పోరులో పిల్లల చదువులు నాశనమౌతై నాయనా.
అలాంటప్పుడు పిల్లల్ని చదివించేందుకు వాళ్లని ఎత్తుకెళ్ళి జైల్లో
పెడతామా?
కల్పన: అదేం మాట? పిల్లల్ని ఎవరైనా జైల్లో ఎందుకు పెడతారు?
పోతులయ్య: అట్లాగనకు. ఈనాటి బళ్ళు జైళ్లకంటే ఎందులో తక్కువున్నాయో
కొంచెం ఆలోచించు.
కల్పన: అదేం లేదయ్యో. మేమంతా పిల్లల బాగుకోరేకదా, ఇదంతా చేసేది?
పోతులయ్య: అందుకేనమ్మా, ఈ కథ వినమంటున్నది!
కల్పన: చెప్పు మరి, వింటాం అందరం.
పోతులయ్య: అనగా అనగా ….........చాన్నాళ్ల క్రిందట ఒక రాజు ఉండేవాడు.
కల్పన: ఒక్క రాజేనా, ఉండేది?
పోతులయ్య:కాదు! ఇద్దరు రాజులు ఉండేవారు.
కల్పన: ఇద్దరు రాజులేనా ఉండేది?
పోతులయ్య: అబ్బబ్బ! చాలా మంది రాజులు ఉన్నారు. కాని నేను ఇద్దరు రాజుల
గురించే చెబుతాను.
కల్పన: సరే! చెప్పు.
పోతులయ్య: వాళ్ళలో ఒక రాజు చాలా యుద్ధాలు చేసినాడు. చాలా మంది సైనికులు
చనిపోయారు. ఆయన అనేక దేశాలు జయించాడు. అయినా యుద్ధాలు చేయడానికి కొత్త
కొత్త విషయాలు కనుగొంటూనే ఉన్నాడు. మరిన్ని యుద్ధాలు చేయాలని
అనుకుంటున్నాడు...
తరువాతి అంకం
అందరు: రాజాధి రాజ - రాజ మార్తాండ - విశ్వ విజేత- విక్రమార్క మహారాజా
బహు పరాక్ - బహు పరాక్ - బహు పరాక్
రాజు : మంత్రీ !
మంత్రి: మహాప్రభూ!
రాజు: సేనాపతీ!
సేనాపతి: మహారాజా!
రాజు: మనం అనేక యుద్ధాలు చేశాం, జయించాం!
మంత్రి: అవును మహారాజా!
రాజు: మరి ఇప్పుడేం చేద్దాం?
మంత్రి: మన రాజ్యం గురించి చూడండి మహా రాజా!
రాజు: మన రాజ్యానికేమయింది?
మంత్రి: మన రాజ్యంలో పిల్లలు చదవడం లేదు ప్రభూ!
రాజు: మనం పిల్లలను యుద్ధాలకు తీసుకెళ్ళలేదు కదా ! పెద్ద వాళ్ళలో యుద్దం
చేయగలిగిన వాళ్లంతా యుద్ధానికి వెళ్ళారు; మిగిలిన వారు యుద్ధ సామాగ్రిని
తయారు చేస్తున్నారు.
మంత్రి: పిల్లలు కూడా యుద్ధం ఆటలు ఆడుకుంటూ చదువుకోవడం లేదు ప్రభూ!
రాజు: అయితే తెలివైన వాళ్ళందరికీ చదువులు చెప్పించండి. ఎందుకంటే మనం
విశ్వ విజేతలం. యుద్ధం చేయడానికి కొత్త ఆయుధాలు కనిపెట్టాలంటే
చదువుండాలి. ప్రపంచాన్ని పరిపాలించే భాషలు రావాలి. కాబట్టి రాజ్యంలోని
పిల్లలందరినీ జైళ్ళల్లో పెట్టండి.
మంత్రి : మహారాజా! పిల్లలను జైళ్ళల్లో పెట్టడమేమిటి?
రాజు: బడులు జైళ్ళ మాదిరే ఉండాలి. ఎందుకంటే క్రమ శిక్షణ ముఖ్యం. క్రమ
శిక్షణ నేర్పాలంటే సైనికుల మాదిరి శిక్షణ ఇవ్వాలి. నేటి నుంచీ
ఆటలు-పాటలు బంద్. మన దేశం ప్రపంచంలోనే మహాశక్తి కావాలి-
మంత్రి: ప్రభూ ! తల్లి దండ్రుల నుంచి పిల్లలను వేరుచేయడం అంత మంచిది కాదేమో!
రాజు: మంత్రీ! ప్రశ్నించకండి, చెప్పింది చేయండి! సేనా పతీ, మా ఆజ్ఞలు
అమలు చేయండి.
దండోరా: అందరూ వినండహో! రాజ్యంలో పిల్లలందరికీ చదువు చెప్పించాలని
విక్రమార్క మహారాజు నిర్ణయించారు. కాబట్టి మీ పిల్లలందరినీ జైళ్ళకు-
అంటే కాన్వెంట్ బళ్ళకన్నమాట- పంపండి. పిల్లలందరూ ఖచ్చితంగా ఇంగ్లీష్
నేర్చుకొని, పెద్ద చదువులు చదివి, ప్రపంచాన్ని జయించాలి. ఇది రాజుగారి
ఆజ్ఞ. ఈ ఆజ్ఞను ఎవరైనా పాటించక పోతే వాళ్ళ తల తీయించి కోట గుమ్మానికి
వేలాడదీస్తామహో!
తరువాతి అంకం
కల్పన: అబ్బ! ఇదేమి, ఇంక చాల్లే గానీ, ఇంకో రాజు గురించి చెప్పు!
పోతులయ్య: రా, మరి పోదాం!
కల్పన : యాడికి, పొయ్యేది?
పోతులయ్య: ఆ రాజు రాజభవనంలో దొరకడు. యాడనో ఊర్లలో ఉండుంటాడు. వెతుక్కుంటూ పోవాలి.
కల్పన: ఏమి, ఆ రాజుకి ? సుఖంగా రాజ భవనంలో ఉండక, ఊర్లంట పోయేందుకు,
తిన్నది అరగకనా?
పోతులయ్య: ఇందాకటి రాజు ఉన్నాడు కదా! ఆ రాజు ఈ రాజు మీద కూడా యుద్ధం
చేశాడు.
కల్పన : ఓహో! మరి ఈ రాజు పేరేమి?
పోతులయ్య : ఈ రాజు పేరు చంద్రహాస మహారాజు! నువ్వు మధ్యలో ఆపక, కథ సాంతం విను.
కల్పన: అడిగేటోడు లేకపోతే కథ అడ్డగోలుగా పోతుంది.
పోతులయ్య: ఇంతకీ- యుద్ధం జరిగినాక ఏ రాజ్యంలోనైనా జనం నష్టపోతారు.
గాయపడిన సైనికులు, అనాధలయిన కుటుంబాలు, బీడు పడిన పొలాలు, వీటన్నిటినీ
చూసుకొనేకి ఈ రాజు ఊర్ల వెంట పోయాడు.
కల్పన: అయితే ఆలస్యం ఎందుకు, మనం కూడా పోదాం పద!
తరువాతి అంకం
అందరు(పాట):
కలిగిరి కలిగిరి కలింగర చెట్టు
కల్లే తాగి మర్లు తప్పి
కొత్తపల్లి మళ్ళలో పాట పాడుదునా?
ఓ తమ్ముడా, నాటు వేయుదునా?
।కలిగిరి।
మంచినీళ్ల బానకాడ
మల్లెపూలు మరచినాను
తీసుకురార ఓ తమ్ముడా,
తీసుకురార
।కలిగిరి।
వుడుకు నీళ్ళ బానకాడ
ఉంగరము మరచినాను
తీసుకు రార ఓ తమ్ముడా
తీసుకురార
।కలిగిరి।
చంద్రహాస: మంత్రీ! చూశారుగా? యుద్ధం తరువాత మన ప్రజలు ఇప్పుడిప్పుడే
కోలుకుంటున్నారు. మనదేశం బాగుపడాలంటే, పాడి పంటలు బాగుండాలంటే, మన
పిల్లలు చదువుకోవాలి.
మంత్రి: అవును మహారాజా, ఆయుధాలకు పెట్టే డబ్బులతో పుస్తకాలు
ముద్రించాలి. ప్రతి ఊర్లో బడి కట్టాలి. చదువు బాగా చెప్పే అయ్యవార్లు
ఉండాలి.
రాజు: పిల్లలు ఆడుతూ, పాడుతూ హాయిగా చదువుకోవాలి.
మంత్రి : కానీ, కరువు- కాటకాలు- పైగా యుద్ధం, తల్లిదండ్రులు పిల్లలతో పని
చేయిస్తున్నారు మహాప్రభూ!
రాజు: వాళ్ళని ఎలాగైనా బడిలో చేర్చాలి -
మంత్రి : తమరు ఆజ్ఞాపించండి మహారాజా!
రాజు: ఆజ్ఞలతో పనులు జరుగుతాయా? గుర్రాన్ని నీళ్ళదాకా తీసుకెళ్తాం. కాని
నీరు తాగించలేం కదా?
మంత్రి : మరేం చెయ్యాలంటారు?
రాజు: ఏం చేస్తే పనులు జరుగుతాయో అదే చేస్తాం. ముందు ప్రతి ఊరులోనూ బడి
పెట్టి, అందులో అయ్యవారిని నియమించండి.
మంత్రి: దండోరా వేసి పిల్లలను బడికి పంపమని చెప్తాం.
దండోరా: అందరు వినండహో. ప్రతి ఊర్లోనూ బడి పెట్టినారు. అయ్యవారిని
పెట్టినారు. కాబట్టి మీ పిల్లలను బడులకు పంపి చదివించుకోవాలహో. ఎవ్వరూ
డబ్బు కట్టక్కర లేదహో.
తండ్రి: ఆ...ఆ.....ఆ...సేద్యం చేసుకునే మనకు చదువులెందుకు?
చదువుకున్నాడంటే పిల్లవాడు ఇంక పొలం పనులే చేయడు.
తల్లి: అవునవును. ఆడపిల్లలకైతే అసలు చదువులెందుకు? ఇంటి పనులు, వంట పనులు
నేర్చుకుంటే చాలు.
దండోరా : ఎవ్వరూ పిల్లలను పంపించకపోతే ఎట్లాగమ్మా? చదువుకుంటే
తెలివితేటలు వస్తాయి. వ్యవసాయం బాగా చేయవచ్చు.
తండ్రి: అబ్బ! బాగా చెప్పినావులే, పని పాటలు బాగా నేర్చుకుంటారు!
తల్లి: చదువులు డబ్బులున్నోల్లకే ….. మాలాంటి పేదోళ్ళకి కాదు.
దండోరా: సర్లేమ్మా...మీ ఇష్టం. వినండహో! పిల్లలను బడికి పంపించమని
అడగడానికి స్వయంగా రాజుగారే వస్తున్నారహో.
రాజు: మంత్రి మనమే ఇంటింటికీ వెళ్ళి, పిల్లలను బడులకు పంపించమని అడుగుదాం!
రాజు,మంత్రి:
అరుగు మీద కూర్చున్నఓ పెద్దలారా…
ఓ పెద్దలారా
మీ ఊరి పిల్లలను బడికి పంపండి-
బడికి పంపండి .
పిల్లలు:
మేమెరుగ- మేమెరుగ
అమ్మ-నాన్నల్నడగండీ
అమ్మ- నాన్నల్నడగండీ.
రాజు, మంత్రి:
దుక్కులు దున్నేటి ఓ అయ్యలారా-
ఓ అయ్యలారా !
మీ ఇంటి బిడ్డల్ని బడికి పంపండీ
బడికి పంపండీ.
అయ్యలు:
మేమేల పంపాలి?
మేమేల పంపాలి?
బడి, చదువుల తోటి మాకేటి లాభాలు?
రాజు, మంత్రి:
వరుసగా దుక్కులు చక్కగా దున్నొచ్చు.
విత్తనాలు మొలకెత్తే రహస్యాలు తెలువచ్చు.
ఎరువులు వేసేటి వైనాలు ఎరుగొచ్చు.
వానలు కురిసేటి తీరులు తెలువచ్చు.
॥దుక్కులు॥
అయ్యలు:
సరే అయితే ….సరే అయితే ! ….॥2॥
రాజు, మంత్రి:
వంటలు చేసేటి ఓ అక్కలారా,
ఓ అక్కలారా !
మీ ఇంటి పాపలను బడికి పంపండీ
బడికి పంపండీ.
అమ్మలు:
మేమేల పంపాలి... మేమేల పంపాలి?
బడి, చదువుల తోటి... మాకేటి లాభాలు?
రాజు, మంత్రి:
లోకము నడిచేటి తీరులు తెలయాల
బ్రతుకును నడిపేటి దారులు తెలయాల
ఇళ్లల్లో కూర్చుంటే లోకమే తెలిసేనా?
వంటింట్లో మగ్గితే తెలివేమి పెరిగేను?
॥వంటలు॥
అమ్మలు: సరే అయితే ….సరే అయితే ..(2)
తరువాతి అంకం
కల్పన: ఆ...ఆ... సరే, ఈ రాజుగారు ఊరూరు తిరిగి పిల్లలను పోగేసుకున్నారు.
మరి విక్రమార్క మహారాజు రాజ్యంలో బడి చదువులు ఎలా ఉన్నాయో చూద్దామా?
పోతలయ్య: నీకు ఒక్క చోట కాలు నిలువదు కదా! సరే వెళ్దాం పద.
[మిలట్రీ మార్చే లెప్ట్ …రైట్......]
సైన్యాధి: ఏరా! మీకు నిద్రమత్తు వదలడం లేదు- ఇప్పుడు వదిలిందా?
పిల్లలు: వదిలింది సార్.
సైన్యాధి: మన బడిలో అందరూ ఇంగ్లీషులోనే మాట్లాడాలి.
A For Apple
B For Bat
C For Cat
Once upon a time, there was a king.
శివ: అంటే ఏమిటి సార్?
సైన్యాధి: అర్థం అడిగావంటే చంపేస్తా. ఇంగ్లీష్ ని ఇట్లాగే చదవాలి-
అంతే.... Once upon a time, there was a king. He was the King of
England.
పిల్లవాడు: సార్. మనకి రాజులు ఉన్నారుగా, వాళ్ళ గురించి చెప్పవచ్చుగా?
సైన్యాధి: మనవాళ్ళు ఉత్తి వెధవలోయ్. ఇంగ్లీష్ దొరలంటే గొప్పవాళ్ళు. Great Mans.
పిల్లవాడు: మీరు కూడానా సార్?
సైన్యాధి:ఏంటి- నేను కూడా?..
పిల్లవాడు: అదే సార్-...మీరు కూడా వెధవేనా? అని!
సైన్యాధి: ఒరేయ్...నిన్ను-...నిన్ను ఏం చేసినా పాపం లేదు... అయినా
నాలాంటి గొప్పవాళ్ల సంగతి మీకు అర్థం కాదు. నేను డ్రస్సులో, భాషలో...
తిండిలో.....
పిల్లవాడు: దొడ్డికి వెళ్ళటంలో.....
సైన్యాధి: ఏమన్నావురా?.....
పిల్లవాడు: ఏం లేదు సార్.
సైన్యాధి: ఆ....తిండిలో, మర్యాదలో, ఒకటేంటి- అన్నింటిలో ఇంగ్లీష్ దొరల
మాదిరిగానే అచ్చు గుద్దినట్లు చేస్తూ ఉంటాను.
పిల్లవాడు: మరి మీ రంగు మాటేంటి సార్....
సైన్యాధి: అదొక్కటే- ఏం చేసినా మారలేదమ్మా....
పిల్లవాడు: ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా,...నలుపు నలుపే గాని-
సైన్యాధి: నోర్ముయ్..ఆ..చదవండి....చదవండి!
పిల్లవాడు: అమ్మో....అమ్మో!
పిల్లవాడు: అయ్యో..అయ్యో! వీడు గిలగిలా తన్నుకుంటున్నాడు!
పిల్లవాడు: (కళ్ళు తేలేసినాడు..)
సైన్యాధి: ఏమయ్యిందిరా...ఏమయ్యింది? ఒరేయ్, హాస్పిటల్ కి ఫోను చెయ్యండి!
పిల్లవాడు: ఏం అక్కరలేదు సార్. వాడి పీకకు ఉన్న 'టై 'ని వదులు చేస్తే
చాలు- గాలి పీల్చుకుంటాడు. అది బిగుతుగా అయి ఉంటుంది. అసలే ఎండ వేడి...ఆ
కోటు కూడా తీసెయ్.
సైన్యాధి: హమ్మయ్య... ఎంత భయపెట్టావురా!
పిల్లవాడు: మనకు ఈ "టై" లు, “టక్కు"లు, కోట్లూ, బూట్లు, ఎందుకు సార్?
మాకందరికీ ఒకటే చెమట- అస్సలు గాలి ఆడదు!
పిల్లవాడు: గోక్కోవడానికి కూడా కష్టం!
పిల్లవాడు: బాగా గాలాడేట్టు మామూలు బట్టలు వేసుకుంటాం సార్!
సైన్యాధి: ఒరేయ్.. ఆటవికుల్లారా! ఈ దొరల బట్టల గొప్ప మీకేం తెలుసు,
అవెంత ఖరీదో....?
పిల్లవాడు: వాళ్ళకంటే మంచు కురుస్తుంది- కాబట్టి, చలిగాలి లోనికి పోకుండా
బందోబస్తుగా మెడకు గుడ్డ పీలిక కట్టుకుంటారు.
సైన్యాధి: ఒరేయ్, గాడిదా!..."నెక్ టై"ని పట్టుకొని ' గుడ్డపీలిక' అంటావా?
పిల్లవాడు: మనకు ఎప్పుడూ ఎండేగా, మనకెందుకు సార్, ఆ పీక తాడు?
సైన్యాధి: మీకు నాగరికత నేర్పడంకంటే, ఆ దున్నపోతులకు నేర్పడం తేలికరా...
పిల్లవాడు: ఆ...ఆ...దున్నపోతుకి ఇన్ని బట్టలేస్తే అది
ఊరుకుంటుందా...వేడికి తట్టుకోలేక, మిమ్మల్ని కుమ్మి...కుమ్మి...
సైన్యాధి: నోర్ముయ్యండి.. చదవండి! మళ్ళా లంచ్ సమయం అవుతుంది- (బెల్)
లెఫ్ట్….రైట్ ….. (2 )
ఆ...ఆ...తిన్నగా కూర్చోండి...ముందు అందరికీ 'సూపు'.
పిల్లవాడు: అంటే గంజా?
పిల్లవాడు: కాదు పులుసు.
సైన్యాధి: సూపంటే సూపే..ఒరేయ్..అట్లా గిన్నె ఎత్తి తాగకూడదు. ఏబ్రాసి
వెధవా! స్పూనుతో చక్కగా తాగాలి...తర్వాత వచ్చి రొట్టెని కత్తితో ఇట్లా
కోసి..ఇదిగో- ముందే చెప్తున్నా- చేత్తో తుంచితే వేళ్ళు విరుగుతై!
పిల్లవాడు: చేత్తో తింటే తొందరగా అయిపోతుంది. తేలిగ్గా తినొచ్చు..
సైన్యాధి: కుదరదు. ఇవన్నీ వాడాలి. కత్తీ..స్పూన్..ఫోర్క్
పిల్లవాడు: ఫోర్క్ అంటే ?
పిల్లవాడు: ముక్కలు గుచ్చి తినే పార- త్రిశూలం.
పిల్లవాడు: చేత్తోనే తింటాం సార్. అట్లా తింటే తిన్నట్లు ఉండదు!
సైన్యాధి: చేతులు విరుగుతాయి, చెప్తున్నాను. బ్రేక్ ఫాస్ట్, లంచ్,
డిన్నర్, సప్పర్ అన్నీ వీటితోనే తినాలి. అప్పుడు గాని మనం తెల్లదొరల్లాగా
కనబడం.
పిల్లవాడు: తెల్లదొరల్లాగా ఎందుకుండాలి? మనం మనలాగే ఉండొచ్చు గదా!....
సైన్యాధి: అదే వద్దనేది...వాళ్ళు చాలా గ్రేట్.
పిల్లవాడు: అన్నంలో పప్పు కలిపి కూర నంజుకోవాలంటే ఎట్లా సార్?
పిల్లవాడు: మీరు కలిపి పెడతారా?..
సైన్యాధి: ఛీ, ఛీ...ఫూల్స్….అట్లా అయితే రేపట్నుంచి కలుపుకోనవసరం
లేకుండా బ్రెడ్లు, కేక్ లు, పై లు, పిజ్జాలు, బర్గర్లు...
పిల్లవాడు: అవన్నీ ఏంటివి సార్, జంతువులా?
సైన్యాధి: జంతువులు కావురా, తినే పదార్థాలు!
పిల్లవాడు: మరి అన్నం, పప్పు, ముద్ద, పచ్చడి, కూర?
పిల్లవాడు: జొన్న రొట్టె, కుడాలు, ఓలిగలు?
పిల్లవాడు: అవికూడా తినేవేగా..అవి పెట్టరా?
పిల్లవాడు: వామ్మో..ఆకలితో చచ్చిపోతాం!
అందరూ: చచ్చిపోతాం...చచ్చిపోతాం...
సైన్యాధి: సైలెన్స్ ...సైలెన్స్...చావండి, పీడపోతుంది. (బెల్లు)
తిన్నది చాల్లే, పదండి క్లాసుకి- లెప్ట్ రైట్ ...లెప్ట్ రైట్
… ఆ...ఇప్పుడు లెక్కలు-
బోర్డు మీద లెక్క చూశారుగా? దాన్ని మీ
పుస్తకాల్లోకి ఎక్కించుకోండి.
పిల్లవాడు: లెక్కని ఎలా చేయాలో చెప్పండి సార్!
సైన్యాధి: లెక్కని బట్టీ పట్టండి..సూత్రాలన్నీ నోటికి రావాలి!
పిల్లవాడు: పై నుంచి కిందికి, కింది నుంచి పైకి అప్పజెప్పాలా సార్?
సైన్యాధి: కరెక్టు. అంతేకాదు- పుస్తకంలో ఉన్న లెక్కలన్నిటినీ ఒక్కొక్కటీ
వందసార్లు చేయండి.
పిల్లవాడు: వందసార్లా ?!(పడిపోతాడు)
సైన్యాధి: అవును, అప్పుడు అవి ఖచ్చితంగా గుర్తుంటాయి.
పిల్లవాడు: అర్థం అయినా గుర్తుంటాయ్ గదా, సార్?
సైన్యాధి: నాతో వాదించొద్దు. చెప్పింది చేయండి ..అంతే.
పిల్లవాడు: చెప్పింది చేయాలి అంతే ...(2)
సైన్యాధి: ఆ...ఇప్పుడు G.K.-
పిల్లవాడు: అంటే ఏంటి సార్?
సైన్యాధి: అది కూడా తెలీదా, జనరల్ నాలెడ్జి- అంటే లోక జ్ఞానం- ఈ
గైడులోనిది అందరికీ చెప్పమ్మా.
పిల్లవాడు: రాసుకోండి..ప్రపంచంలో ఒక్కటే నిజమైన భాష. అది ఇంగ్లీషూ.
ప్రపంచంలో ఆటంటేఒక్కటే ఆట. అది క్రికెట్టూ.
ప్రపంచంలో ఒక్కటేగొప్పదేశం ఉంది. అది అమెరికా.
ప్రపంచంలో ఒక్కటే గొప్ప పరీక్ష ఉంది. అది యంసెట్టూ.
ప్రపంచంలో ఒక్కటే గొప్ప చదువుంది. అది కంప్యూటర్ ఇంజనీరూ.
సైన్యాధి: ఆ, ఇక సైన్సులో 30 వ పేజీ నుండి 45 వ పేజీదాకా చదువుకొని
రండి......రేపు చూడకుండా రాయాలి.
Once upon a time there was a King. (2)
నందినీ, నువ్వు చెప్పమ్మా..
నందిని: Once upon a time.......(2)
సైన్యాధి: బాగా తిండి తింటావు గాని, ఆ మాత్రం అప్పజెప్పలేవా?
నందిని: ఆకలేస్తున్నది సార్ ...
సైన్యాధి: ఆకలేస్తున్నదా? నోర్ముయ్. ఈ అమ్మాయికి 3రోజులు తిండి
పెట్టొద్దు. పాఠం వచ్చిన తరువాతనే తిండి!
కుల్సింబి: సార్...సార్...సార్..ర్..ర్!
సైన్యాధి: చెప్పమ్మా, సాగదీక,...చంపేస్తా!
కుల్సింబి: (1,2,3 వేళ్లు చూపిస్తుంది)
సైన్యాధి: ఒంటికి, రెంటికి, మూడుకు- అడుగుతూనే ఉంటావు. ఎన్నిసార్లు
పోతావు? కూర్చో.
నర్మద: సార్..మాయమ్మ ఒచ్చినాదంట సార్ , నన్ను చూసేకి!
సైన్యాధి: మీ అమ్మ వచ్చిందా? మీ నాన్న వచ్చాడా? ఇదేమీ మామూలు బడి
కాదమ్మా! ఎవరినీ చూడడం కుదరదు- పంపించెయ్..చంపేస్తా.!.
నర్మద: సార్, మాయమ్మను చూడాలి సార్...
సైన్యాధి: రేయ్..ఈ అమ్మాయిని తీసికెళ్ళి చీకటి గదిలో పెట్టి తాళం వేయండి.
వాళ్లమ్మను చూడాలట..ఆ... మీరందరూ చదువుకోవాలి, చదువుకొని, కొత్త విషయాలు
కనిపెట్టాలి. చదవండి...చంపేస్తా..
Once upon a time there was a King...
పాట: రుబ్బు రుబ్బు -చదువుని రుబ్బు
రుద్దు రుద్దు- చదువుని రుద్దు
అక్షరాలు రుబ్బు- పదాలు రుబ్బు- అర్థం పర్థం అక్కరలేదు.
తెలివితేటలు అక్కరలేదు- ప్రశ్నలు ఏవీ అడగవద్దు
అనుమానాలు అసలే వద్దు. ॥రుబ్బు॥
పగలు రాత్రీ బట్టీ పట్టు- బట్టీ పట్టి అప్పజెప్పు
రుబ్బి రుబ్బి- పరీక్షలు రాయి- రాస్తే వొస్తే ర్యాంకులు వచ్చు ॥రుబ్బు॥
(రాజు గారు పంపిన కొత్త టైంటేబుల్ పట్టుకొని మంత్రిగారు తరగతిగదిలోకి వస్తారు..)
మంత్రి: ఒక్క నిమిషం- మన రాజుగారు పిల్లలకోసం కొత్త టైం-టేబుల్ యిచ్చారు-
వినండి. ఉదయం నాలుగు గంటలకు నిద్రలేవాలి. ఆరు గంటల దాకా చదవాలి. ఆ
తర్వాత పదహైదు నిముషాల్లో స్నానం, ఇతర పనులు అయిపోవాలి. ఆరు-పదహైదు
నుండి క్లాసు ఎనిమిదీ- నలభై ఐదు వరకు. మళ్ళీ పదహైదు నిముషాల్లో టిఫిన్
చేయాలి. తర్వాత తొమ్మిది గంటల నుండీ ఒంటి గంట వరకూ క్లాసులు. పదహైదు
నిముషాలు భోజన విరామం. తర్వాత ఐదు దాకా చదువు. పదహైదు నిముషాల్లో
టిఫిను. మళ్ళీ ఐదు-పదహైదు నుండి రాత్రి పది గంటల దాకా చదువు. మధ్య
మధ్యలో ఒంటికి (మూత్రానికి) మూడు నిముషాలు పోవచ్చు. ప్రతి
క్లాసురూములోనూ వీడియో కెమెరా పెడతాం . ఈ టైం టేబుల్ ని ఎవరు తప్పినా
కఠినంగా శిక్షలు ఉంటాయని రాజుగారు చెప్పారు!
(కొద్దిసేపు విరామం..తర్వాత రాజుగారు కూడా బడిని చూడటానికి వచ్చి ఉంటారు.)
మంత్రి: మహారాజా! మన బడుల్లో పిల్లలు రాత్రింబవళ్ళూ చదువుతున్నారు.
రాజు: మంచిది, మంత్రీ! మంచిది.
మంత్రి: అసలు ఆటలు-పాటలు లేవు, మహారాజా!
రాజు: ఆటలు, పాటలు చదువుకి చేటు మంత్రీ! అవి టైము వేస్టు -
మంత్రి: పోనీ, చదివే దానికి అర్థం కూడా తెలియడం లేదు మహారాజా!
రాజు: జ్ఞాపకం ఉంచుకొని తిరిగి రాస్తే చాలు. అర్థం ఎందుకు, మంత్రీ!
మంత్రి: ప్రశ్నలు అడగకపోతే, అసలు ఆలోచనే ఉండదు కదా, మహారాజా?
రాజు: మనకు ఆలోచనలతో పనేం ఉంది మంత్రీ, చెప్పింది చెయ్యాలి గాని? మన
పౌరులకి క్రమశిక్షణ ముఖ్యం.
మంత్రి: మహారాజా! పక్క రాజ్యంలో చదువులు ఎట్లా సాగుతున్నాయో చూచిరానా రాజా!
రాజు: వాళ్ళవి గాలి చదువులు. అయినా మీ తృప్తి కోసం చూచి రండి.
తరువాతి అంకం
పోతులయ్య: రా..రా..ఈ మంత్రితో పాటు ఆ రాజ్యం పోదాం. ఇక్కడ చూసింది చాల్లే.
కల్పన: అవునవును- ఈ బళ్ళ కంటే జైళ్ళే మేలు. పోదాం పద- ఈ పిల్లలు పీనుగలయి
పోతున్నారు.
అందరు(పాట): బడిలో ఆటుందిరా..చిన్నా..బడిలో పాటుందిరా
ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం-
మనం ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం!
అయ్యోరు: రండి రండి- మీ కోసమే ఎదురు చూస్తున్నాం. చాలా సంతోషం.
తండ్రి: ఏమయ్యోరూ! మా పిల్లల్ని రోజు బడికి పంపించేదే కాక, మేము కూడా
పనులు విడిచి పెట్టి వాళ్లని చూడడానికి రావాలా?
అయ్యోరు: లేకపోతే మేమేం చెబుతున్నామో, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో
మీకెలా తెలుస్తుంది?
తల్లి: ఆ..ఆ..ఆ..పాప ఇంట్లో చేతి కిందికి లేకుండాపాయే...వాడేమో అక్కడా
ఇక్కడా పని చేసి అంతో-ఇంతో డబ్బులు సంపాదించేది; అది కూడా పాయే..
అయ్యోరు: పిల్లలు హాయిగా చదుకునే వయసులో చదువుకోవాలి. వాళ్ళు పనికి పోతే ఎదగరు.
తండ్రి: ఆ..ఆ...ఇటు చదువులు రావు..అటు పనికి చెడతారు.
అయ్యోరు: చెడతారో, లేదో మీరే చూస్తారుగానీ,- రండి. అందుకే మిమ్మల్ని
పిలిపించింది. ఎవరండీ, అట్లా ముసుగువేసుకున్నారు?
కల్పన: ఆయనా? ప్రక్కరాజ్యం మంత్రిగారు.
మంత్రి: అయ్యా! నన్నేం చేయవద్దు. నన్నేం చేయవద్దు.
తండ్రి: ఏమి ఎందుకు చెయ్యొద్దు? మా మీద యుద్ధం చేసినందుకు నిన్ను
కుళ్ళబొడిచేస్తాను.
తల్లి: దొంగ సచ్చినోడా! మీ మూలంగా ఎంత మంది సచ్చినారు?
అయ్యోరు: ఆగండి..ఆగండి..అసలు ఆయన ఎందుకు వచ్చినారో కనుక్కుందాం.
తండ్రి: మరెందుకు వస్తారు. మన రహస్యాలు తెలుసుకొని, వాళ్ళ రాజుకు చెప్పడానికి.
మంత్రి: అయ్యా!..నేను గూఢచారిని కాదు. మీ పిల్లలు ఎలా చదువుతున్నారో
చూడడానికి వచ్చాను.
తల్లి: పచ్చి అబద్ధం.
అయ్యోరు: అబద్ధమయినా, నిజమయినా- బడిలో రహస్యాలేముంటాయి? రండి- మీరే
చూద్దురుగాని. పిల్లలూ- మీ అమ్మా-నాన్నలు మీరేం చదువుతున్నారో చూడడానికి
వచ్చారు.
పిల్లలు: స్వాగతం, సుస్వాగతం. (2)
అయ్యోరు: మరి మీరు వాళ్ళకి ఏం చెబుతారు?
జానకి: మన దేశం చాలా గొప్ప దేశం అని చెబుదాం.
అయ్యోరు: ఎందుకని గొప్పది, మనదేశం?
శివ: ఎందుకంటే, మన దేశంలో అనేక నదులు ఉన్నాయి.
నిర్మల: సారవంతమైన భూములు ఉన్నాయి.
నాగ: ఆ భూమిలో కష్టించి పంటలు పండించే రైతులు ఉన్నారు.
తండ్రి: పోనీలే!...మేము- రైతులం కష్టపడి పనిచేస్తామని మీరన్నా అర్థం
చేసుకున్నారు.
జానకి: అంతేకాదు- రైతులూ, మీరు చాలా తెలివైన వాళ్ళు కూడా.
తండ్రి: రైతులు అమాయకులు- అంతే.
నిర్మల: రైతుకి తెలివి లేకపోతే, ఇన్ని వందల, వేల రకాల విత్తనాలు ఎలా
తయారు చేస్తాడు?
నాగ: చౌడు భూములు నుండి కూడా, బంగారం ఎట్లా పండించాడు?
అయ్యోరు: బాగా చెప్పారు...
తండ్రి: బాగానే చెప్పారు. కానీ, రైతు వెన్నెముక విరిగి పోతోందమ్మా!
అందుకని వీళ్లకి గొప్ప విషయాలు ఇంగ్లీష్ లో చెప్పండమ్మా..!
అరుణ: రైతు రైతే...రైతు కంటే గొప్ప విషయం ఏంటి?
నాగ: మన తెలుగు భాషలో చెబితేనే మాకు బాగా అర్థం అవుతుంది.
జానకి: కావాలంటే ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, బెంగాలీ, ఇంకా- ఇంకా..
శివ: మన భాషలు 22. అవి గాక ఫ్రెంచి, స్ఫానిష్, జర్మన్, రష్యన్,
చైనీస్, జపనీస్....
అయ్యోరు: ఆ..ఆ..ఆ.. ప్రపంచంలో ఉన్న భాషల లిస్టు అంతా చెప్పకు!
నిర్మల: ఎవరికి ఏ భాష నేర్చుకోవలసిన పని పడితే అది నేర్చుకుంటారు!
తల్లి: వామ్మో! ఇన్ని భాషలే...!
అయ్యోరు: అవును. ప్రతి జాతికీ స్వంత భాష ఉంటుంది. ప్రపంచంలో 8 వేల
భాషలు ఉన్నాయి.
మంత్రి: అంటే మనకు అవసరం అయితేనే ఇన్ని భాషలు నేర్చుకోవాలా?
అయ్యోరు: సొంత భాషలో చెబితేనే ఎవరికైనా బాగా అర్థం అవుతుంది. సొంత
భాషలో- సొంత దేశం గురించి- సొంతంగా ఆలోచించితేనే దేశం బాగుపడుతుంది. అదే
ఆత్మగౌరవం కూడా.
తండ్రి: ఇంగ్లీష్ నేర్చుకుంటే గానీ తెలివి రాదని నేననుకున్నానే?
నాగ: అరువు భాషలో ఎవరైనా తెలివిగా ఆలోచిస్తారా?
అరుణ: అయ్యా, మీరు కోటు..బూటు వేసుకొని పొలం పని చేస్తారా?
తండ్రి: అమ్మో..కోటు వేడి. ఉక్క పోసి చచ్చిపోతాం..బూట్లూ బురదలో
పనికిరావు. పంచె, బనీను పనికి హాయి.
నాగ: చూశారా. మన వాతావరణానికి మన పంచే బాగుంటుంది.
అయ్య: మన పిల్లలకు మన భాషే హాయిగా ఉంటుంది. సొంత భాష రాకపోతే ఇతర భాషలు
కూడా సరిగ్గా రావు.
జానకి (పాటలాగా): అమ్మ ఒడిలో విన్నాను కమ్మనైన తెలుగు
మన మదిలో వికసించే విజ్ఞానపు వెలుగు.
తండ్రి: ఇక్కడి నుండి పదండి- లేకపోతే నాక్కూడా వీళ్ల మధ్యలో
కూర్చోబుద్ధి అవుతుంది.
అయ్య: కూర్చోండి! చదువుకి వయస్సుతో సంబంధం లేదు కదా? అయినా- పదండి,
చూడాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి.
అందరు(పాట): బడిలో ఆటుందిరా..చిన్నా..బడిలో పాటుందిరా
ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం-
మనం ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం!
తల్లి: ఇదేమి అయ్యోరు? పిల్లలు బొమ్మలకు రంగులు వేస్తున్నారు? ఇంక వీళ్ళు
చదువుకునేదెప్పుడు?
అయ్యోరు: బొమ్మలు గీసి రంగులు వేయడం కూడా చదువేనమ్మా, చేతివేళ్ళు సాపుగా అవుతాయి.
అందరు(పాట): బడిలో ఆటుందిరా..చిన్నా..బడిలో పాటుందిరా
ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం- మనం
ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం!
అయ్యోరు: అటు చూడండి పిల్లలు తోట పని చేస్తారు. సేద్యం గురించి
నేర్చుకుంటున్నారు.
తండ్రి: అదేదో మేమే నేర్పుతుంటిమి గదా, దానికి బడికి ఎందుకు?
అయ్యోరు: సేద్యం ఒక్కటే కాదుకదా! చదువుతో పాటు సేద్యం. దాంతో చదువు
వల్ల, సేద్యం నీకంటే బాగా ఎలా చేయాలో నేర్చుకుంటారు.
తండ్రి: ఏదైనా పైసలు వచ్చే పని నేర్పించు సామీ! మాలాగా వాళ్ళుకూడా మట్టి
పిసికేదెందుకు?
(వీళ్ళు మాట్లాడుతున్నదంతా వెనకనుండి వింటున్న రాజు మట్టి గురించి ఇలా అంటాడు:)
రాజు : మట్టి లేకుంటేమనిషే లేడు-
(పద్యం:)
భూమిలోన పుట్టు భూసారమెల్ల
తనువులోన పుట్టు తత్వమెల్ల
శ్రమలోన పుట్టు సంపద తానౌను
విశ్వదాభిరామ వినుర వేమా
మంత్రి: గొప్ప విషయం చెప్పారు మహాప్రభూ!
అందరు(పాట): బడిలో ఆటుందిరా..చిన్నా..బడిలో పాటుందిరా
ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం- మనం
ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం!
తల్లి: అదేమి, పిల్లలంతా ఆడుతూ ఉన్నారు?
రాజు: ఆటలు..ఆటల్లోనే కదా పిల్లల శరీరం, మనస్సు పెరుగుతాయి. ఒకరితో ఒకరు
ఎలా జట్టు కట్టాలో..ఎట్లా సహకరించాలో ఎట్లా..కలిసి ఉండాలో. అందరు కలిసి
పని పంచుకోవాలో ఆటల్లోనే కదా నేర్చుకుంటారు?
మంత్రి: అబ్బా! ఆటల్లో అంతుందా ప్రభూ?
రాజు: ఆటల్లోనే కదా స్నేహం పెరుగుతుంది? ఆటల్లోనే కదా ఓటమికి
కుంగిపోకుండా ఉండడం నేర్చుకుంటారు?
మంత్రి: నేను మీ నుంచి చాలా నేర్చుకున్నాను. దేనినైనా పెంచి పోషించడమే
విజయం దేన్నైనా నాశనం చేయడమే అపజయం. ఇంక సెలవు ప్రభూ..
రాజు: మంచిది. మీ దేశంలో పిల్లల్లాగ ప్రకృతిని ప్రేమించడం నేర్పండి.
కల్పన: మంత్రిగారూ, మంత్రిగారూ! ఏమి, అలా మాట మాత్రమైనా చెప్పకుండా
వెళ్ళిపోతున్నారు?
పోతులయ్య: మేం కూడా మీకు తోడు రావాలా..
మంత్రి: వస్తే రండి. మా రాజ్యంలో పిల్లలను కాపాడి సహాయం చేద్దురుగాని.
కల్పన&పోతులయ్య: సరే- సరే- పదండి.
అందరు: విజ్ఞానంతోనే వికసించు జగత్తు
పసిపిల్లల చదువే దానికి విత్తు ..(2)
లేగదూడ గంతులు
పసిడిపూల కాంతులు
గాలి తరగ పిలుపులు
సెలయేటి అలల మెరుపులు
ప్రకృతిలో అణువణువు
పసిపిల్లల అమ్మఒడి
ఆ ప్రేమను పంచాలి
పిల్లలకు చదువులబడి
।విజ్ఞానం।
చిన్న చిన్న చేతులతో
మోయలేని బరువులతో
పసిపిల్లల మనసుల్లో గాయాలే రేగితే
ప్రమాదాల కోరల్లో బాల్యం బలి ఐపోతే
భావి భారతి ఆశల బాల్యం ఇంకెక్కడిది?
।విజ్ఞానం।
దేశం ఏదైనా- కాలం ఏదైనా
చెప్పే చదువేదైనా బాల్యమొక్కటే
పువ్వులాంటి పసిప్రాయం
వసివాడిపోకుండా
కాపాడే బాధ్యత మన అందరిదీ అందరిదీ
।విజ్ఞానం।
పాఠమే పాటగా చదువే ఒక ఆటగా
గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా
మననుసు మురిపిస్తే బాధను మరిపిస్తే
తరగతి గదులే రేపటి తరగని నిధులు
।విజ్ఞానం।
తరువాతి అంకం
సైన్యాధి: అటెంక్షన్!! స్టాండెటీజ్!!
(రాజాధిరాజ- రాజ మార్తాండ- విశ్వవిజేత- విక్రమార్క మహారాజా- బహుపరాక్-
బహుపరాక్) (అందరూ కూర్చుంటారు)
సైన్యాధి: మహారాజా! మన బడులలో పిల్లలందరికీ మొదటి ర్యాంకులు వచ్చాయి.
రాజు: అద్భుతం..అద్భుతం! అది ఎట్లా సాధించారు?
మంత్రి: ర్యాంకులు రావనుకున్న వాళ్లను అందరినీ ఇళ్ళకు పంపించారు!
రాజు, సైన్యాధి: మంత్రిగారు!..
రాజు: మంచి పని చేశారు!
సైన్యాధి: మిలట్రీలాగ వీళ్ళకి చదువులు నేర్పించాం!
మేమే స్వయంగా పరీక్షిస్తాం..ఏయ్..పిల్లవాడా!
సైన్యాధి: వాడి నంబర్ 2 .
రాజు: మనదేశంలో ఎంత సైన్యం ఉంది?
No.2: దేశమంతా సైన్యమే సార్..
రాజు: వెరీగుడ్..వెరీగుడ్. దేశంలో ఎన్ని బాంబుల ఫ్యాక్టరీలు ఉన్నాయి?
No.2: మనకున్న ఫ్యాక్టరీలన్ని అవే కదా సార్?
రాజు: వెరీగుడ్..వెరీగుడ్! నీకు ఇంకేమి తెలుసు?
No.2: మన దేశ ఆదాయంలో సగం పైగా బాంబులకు, మిలట్రీలకు ఖర్చు పెడతాం సార్.
మనమంటే ప్రపంచానికి హడల్.
మంత్రి: ప్రభూ! నేను ప్రశ్నలు అడుగుతాను.
రాజు: సరే..అడగండి.
మంత్రి: పాపా! నువ్వు చెప్పమ్మా?
సైన్యాధి: పాప కాదు నంబర్ 5.
మంత్రి: సరే- పాపా, నువ్వు చెప్పమ్మా! మన దేశంలో ఏఏ పంటలు పండుతాయి?
పాప: తుపాకులు, తూటాలు పండుతాయి సార్..
మంత్రి: అది కాదమ్మా..మనం తినే పంటలు-
సైన్యాధి: పంటలు పండించే ఖర్మ మనకేమిటి? పంటలు దిగుమతి చేసుకుంటాం.
No.2: అన్ని రకాల వస్తువుల్నీ పేద దేశాల నుండి చౌకగా దిగుమతి చేసుకుంటాం!
మనం తయారు చేస్తే ఖర్చు ఎక్కువ.
రాజు: కారు చౌకగా ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలను కూడా దిగుమతి చేసుకుంటాం!
సైన్యాధి: మనమిచ్చే డబ్బులకు వాళ్ళంతా కుక్కల్లా పని చేస్తారు.
మంత్రి: ఆ కుక్కలే తిరగబడి కాటేస్తే? ఇతర దేశాలు మనకు వస్తువులు ఆహార
ధాన్యాలు ఇవ్వడం ఆపేస్తే?
రాజు: వాళ్ళకు ఎంత ధైర్యం ఉండాలి? మనల్ని ఎవరు ఎదిరిస్తే వాళ్లను
నలిపి పడేస్తాం.
నందిని: ఎవరినైనా చంపడం నేరం కదా?
మంత్రి: ఒకరిని ఒకరు చంపితే హత్య.. ఒక దేశంపై దాడి చేసి లక్షల మందిని
చంపితే యుద్ధం.
నందిని: చంపటం తప్పు. నేరం.
నర్మద: ఎవరు ఎవర్ని చంపినా తప్పే.. అందరూ బ్రతకాలి-
సైన్యాధి: నోర్ముయ్యండి.
రాజు: మనం చంపితే న్యాయం- అంతే!
No.2: ఎవరు ఎవర్ని చంపినా తప్పే!...అందరూ బ్రతకాలి!..ఎందుకు చంపినా నేరమే!
రాజు: సైన్యాధిపతీ. వీళ్ళకి ప్రశ్నించడం ఎవరు నేర్పారు, నన్నే ఎదిరిస్తున్నారు?
మంత్రి: చేపకు ఈదటం. పిట్టలకు ఎగరటం, పిల్లలకు అడగటం- ఎవరు నేర్పాలి?
రాజు: ప్రశ్న వేస్తే...........(4)
తలలు తీయిస్తా...
No.2: పిల్లలందరి తలలూ తీయిస్తారా?
నందిని: ఎందుకంటే మేమంతా ప్రశ్నలు అడుగుతాం!
నర్మద: జవాబులు వచ్చే వరకూ అడుగుతూనే ఉంటాం!..(2)
రాజు: నేనిది భరించలేను! నేనిది భరించలేను!!
కల్పన: హమ్మయ్య!...యుద్ధంలో గెలిచిన రాజు, పిల్లల చేతిలో ఓడిపోయాడు.
పోతులయ్య: వీచే గాలిని, పారే ఏరును, ఎదిగే పిల్లలను- ఆపటం ఎవరి వల్ల
అవుతుంది? ఎప్పటికైనా ప్రపంచంలో పిల్లలే గెలుస్తారు! తప్పక గెలుస్తారు!
అందరు (పాట):
పిల్లలకే స్వాతంత్ర్యం వస్తే
పిల్లలకే స్వరాజ్యం ఇస్తే
చిట్టి తల్లిని రాణిని చేస్తాం
చిట్టి తండ్రిని రాజును చేస్తాం
మా తాతే ఒక బొమ్మయితేను
మా అవ్వే ఒక బొమ్మయితేను
బొమ్మల పెళ్ళికి రమ్మని అంటాం
కమ్మని విందుకు గుమ్ముగ తింటాం
।పిల్లలకే।
చదువుకు గురువులు చాలకపోతే
బడులలో గురువులు కరువైపోతే
పిల్లలమంతా పంతుళ్ళమౌతాం
పెద్దలందరికి పాఠాలు చెబుతాం
।పిల్లలకే।
సూర్యుడు ఎర్రని కాగితమైతే
చంద్రుడు తెల్లని కాగితమైతే
వేడుకతోటి తాడుకు కట్టి
గాలిపటంలా ఎగరేస్తాం
।పిల్లలకే।
నక్షత్రాలే పుష్పాలైతే
మెరుపుతీగలే దారాలైతే
చుక్కల పువ్వులు చక్కని దండలు
మొక్కకు చదువుని మెడలో వేస్తాం
।పిల్లలకే।
శుభం