ఒక ఊళ్లో ఒక రాజంట. ఆ రాజుకు ఇద్దరు భార్యలంట. ఒకటో భార్యకేమో ఒక వెంట్రుకంట. రెండో భార్యకేమో రెండు వెంట్రుకలంట. ఎక్కువ వెంట్రుకలున్న భార్య కావాలని రాజు, రెండు వెంట్రుకలున్న భార్యను ఉంచుకొని, ఒక వెంట్రుకున్న భార్యను పంపించేశాడంట.
ఒకటో భార్య పోతావుంటే చీమ ఎదురయ్యిందంట. "చీమా! చీమా! మా అవ్వోళ్ల ఇళ్లు చూపీ నాకు?" అని అడిగిందంట.
అప్పుడు చీమ "మీ అవ్వోళ్లింటికి పొయ్యే దారి చూపిస్తాను, కానీ నువ్వు నన్ను తొక్కకుండా పోతానంటేనే నేను నీకు చూపిస్తాను" అని చెప్పిందంట.
"సరేలే" అని తొక్కకుండా పోయిందంట రాణి. అప్పుడు చీమ రాణికి దారిని చూపిందంట.
ఆ తరువాత చీమ చూపిన దారిలో పోతున్న రాణికి ఏనుగు అడ్డమొచ్చిందంట.
"ఏనుగూ! ఏనుగూ! నాకు మా అవ్వోళ్ల ఇళ్లు చూపిస్తావా ?" అంటే, "తప్పిపోయిన నా పిల్లను తెచ్చి నాదగ్గర వొదిలితే నేను నీకు మీ అవ్వోళ్ల ఇంటికి పొయ్యేదానికి దారి చూపిస్తా"ననిందంట.
`సరే'నని రాణి దాని పిల్లను తెచ్చి వదిలిందంట. అప్పుడు ఏనుగు దారి చూపిందట. దారెంబడి పోతావుంటే ముద్దబంతి పూలు కనిపించినాయంట.
అప్పుడు రాణి ముద్దబంతి పూలను అడిగిందట "ముద్దబంతీ! ముద్దబంతీ! నాకు మా అవ్వోళ్ల ఇల్లు చూపిస్తావా?" అని.
అప్పుడు ముద్దబంతి "నన్ను కోసుకుని పొయ్యి , దేవుని దగ్గర పెడితే చూపిస్తాను" అని చెప్పిందంట.
"సరే"లెమ్మని కోసుకొనిపొయ్యి దేవుడిదగ్గర పెట్టిందంట . పెట్టి అక్కడున్న దేవుణ్ణి అడిగిందంట రాణి "దేవుడా! దేవుడా! నాకు మా అవ్వోళ్ల ఇళ్లు చూపించవా?" అని.
"నాకు పూజ చెయ్యి" అన్నాడంట దేవుడు.
"సరే"నని పూజచేసిందంట ఒక వెంట్రుకున్న రాణి. అప్పుడు దేవుడు తన గుడిపక్కనే ఉన్న అవ్వోళ్ల ఇంటిని రాణికి చూపించినాడంట. రాణి అక్కడికి పోయి, అవ్వతో "అవ్వా! అవ్వా! నా మొగుడు నాకు ఒకటే వెంట్రుకుందని నన్ను పంపించేశాడవ్వా. అందుకని నేనేం చెయ్యాలి?" అని అడిగిందంట.
అప్పుడు అవ్వ రాణితో "నేను నీకొక నిమ్మకాయను ఇస్తాను. నువ్వు దాన్ని గట్టిగా పట్టుకొని కోనేట్లో మునుగు. అప్పుడు నీకు వెంట్రుకలొస్తాయి. కానీ నువ్వు దాన్ని కిందొదలద్దు. వొదిలేస్తే నీకు ఉండే వెంట్రుక కూడా పూడుస్తుంద"ని చెప్పిందంట.
"సరే"లే అని, అవ్వ ఇచ్చిన ఆ నిమ్మకాయను గట్టిగా పట్టుకుని నీళ్లల్లో మునిగిందంట రాణి. లేచి చూసుకుంటే వెంట్రుకలు పొడుగ్గా వచ్చున్నాయంట. అప్పుడు ఆ రాణి భర్త దగ్గరికి పోయిందంట. పోతే "ఒకటో భార్యకు ఎక్కువ వెంట్రుకలున్నాయని, ఆమెను ఉండమని, రెండు వెంట్రుకలున్న రెండవ భార్యను పంపించేశాడం"ట రాజు.
రెండో రాణి పోతావుంటే ఆమెకు చీమ కనిపించిందంట. అప్పుడు రెండో రాణి, చీమతో "చీమా! చీమా! నాకు మా అవ్వోళ్ల ఇల్లు చూపించవా?" అని అడిగిందంట.
"సరే, చూపిస్తాలేగానీ, నువ్వు నన్ను తొక్కకుండా పోవాలి మరి" అని చెప్పిందంట చీమ. కానీ రాణి దాన్ని తొక్కి పోయిందంట. అప్పుడు చీమ "ఫో నేను చూపియ్యను గాని" అని అనిందంట.
రాణి ఇంకా ముందుకు పోతావుంటే ఏనుగు ఎదురొచ్చిందంట. "ఏనుగూ! ఏనుగూ! నాకు మా అవ్వోళ్ల ఇల్లు చూపించవా?" అని అడిగిందంట.
అప్పుడు ఏనుగు "చూపిస్తానుగాని, ముందు నువ్వు తప్పిపోయిన నా పిల్లను చూపించవా?" అని అడిగిందంట. అప్పుడా రాణి ఏనుగును తనతోపాటు ఎక్కడికో తీసుకెళ్లి వదిలేసిందంట. అప్పుడు ఆ ఏనుగు "నేను నీకు ఏమీ చూపించను పో" అని అనిందంట.
రాణి ఇంకా ముందుకు పోతావుంటే ఒక ముద్దబంతి కనిపించిందంట. అప్పుడు రాణి ఆ ముద్దబంతితో "ముద్దబంతీ! ముద్దబంతీ! నాకు మా అవ్వోళ్ల ఇల్లు చూపించవా?" అని అడిగిందంట.
అప్పుడు ముద్దబంతి "నువ్వు నన్ను కోసుకుని పోయి దేవుని దగ్గర పెడితే నేను నీకు సాయం చేస్తాను" అని చెప్పిందంట.
అప్పుడు రాణి ఆ ముద్దబంతి చెట్టును రెండుగా ఇంచి , బాగా మొత్తిందంట. ఆ తరువాత ముందుకు పోయిన రాణికి దేవుడిగుడి కనబడిందంట. గుళ్ళోకి పోయి "దేవుడా! దేవుడా! నాకు మా అవ్వోళ్ల ఇల్లు చూపించవా?" అని అడిగితే, దేవుడు "నాకు పూజ చేస్తే నేను నీకుసాయం చేస్తా"నన్నాడట. అప్పుడా రాణి దేవుణ్ణి తన్నేసి పోయిందంట. అట్లా పోతున్న ఆ రాణికి అవ్వోళ్ల ఇల్లు కనిపించిందంట. అక్కడున్న అవ్వ దగ్గరకు పోయి "అవ్వా! అవ్వా! ఒకటో భార్యకు పూర్తీగా వెంట్రుకలొచ్చేటట్లు చేస్తివికదా! నాకు కూడా వెంట్రుకలొచ్చేటట్లు చెయ్యవూ?" అని అడిగిందంట. అప్పుడా అవ్వ ఒక నిమ్మకాయను ఇచ్చి, " పోయి, ఈ నిమ్మకాయను చేతిలో గట్టిగా పట్టుకుని కోనేట్లో మునుగు. అప్పుడు నీకు బాగా వెంట్రుకలొస్తాయి. కానీ నువ్వు మునిగున్నప్పుడు నిమ్మకాయను మాత్రం వొదిలేయొద్దు" అని చెప్పిందంట.
"సరే"నని పోయి కోనేట్లో మునిగిన ఆ రాణి, నీళ్లలో అవ్విచ్చిన ఆ నిమ్మకాయను వొదిలేసిందంట. అప్పుడా రాణికి ఉన్న రెండు వెంట్రుకలు కూడా పూడ్చినాయంట.
"ఉన్న వెంట్రుకలు కూడా పోయెనే" అని ఏడ్చుకుంటూ పోయి ఒక కొబ్బరి చెట్టు కింద కూర్చుందంట. అప్పుడు ఆ కొబ్బరిచెట్టులో ఉన్న టెంకాయ ఒకటి పైనుండి వచ్చి రాణి గుండు మీద పడిందంట. పాపం! తల పగిలినంత పనైందంట రాణికి. ఏడ్చుకుంటూ మళ్లీ అవ్వ దగ్గరకు పోయి "అవ్వా! నా తలమీద ఒక పుచ్చిపోయిన టెంకాయ పడిందవ్వా!" అని చెప్పిందంట.
అప్పుడు అవ్వ ఆ టెంకాయలోపలున్న బూజును తీసుకుని నీ గుండుకు పూసుకో" అని చెప్పిందంట. అప్పుడు రాణి ఆ బూజును తీసుకుని గుండుకు పూసుకున్నదట. అప్పుడు ఆమె తలమీద కొన్ని తెల్ల వెంట్రుకలొచ్చాయంట. అప్పుడా రాణి రాజుదగ్గరకు పోయిందంట. కానీ రాజు, "నాకు తెల్లవెంట్రుకల భార్య వొద్దు. నల్ల వెంట్రుకల భార్యనే కావాలి" అని రెండో భార్యను పంపించేశాడంట.