నాన్న తప్పు: (సేకరణ: యం. చంద్ర శేఖర్, తొమ్మిదవ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.)
టీచరు: ఒరేయ్ రవీ, ఏంట్రా అన్నీ తప్పులే రాసుకొచ్చావు నువ్వు?
రవి: టీచర్.. అవన్నీ మా నాన్న చేసినవే అయ్యుంటాయి టీచర్.
ఎక్కడి తాత!
పిల్లాడు: సార్! ఇక్కడ ఓ దొంగవెధవ మా తాతగారిని కాల్చేస్తానన్నుంటున్నాడు సార్! మీరు త్వరగా వచ్చి ఆయన్ని కాపాడండి....
పోలీస్: ఎక్కడ ఆ దొంగ? ఎక్కడ మీ తాత?
పిల్లాడు: దొంగ మాత్రం తెలీదండి. మా తాత స్మశానంలో ఉన్నాడండి.
చీకటి రాతలు (సేకరణ: టి. శివకుమార్, 8 వ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.)
కొడుకు: నాన్నా! మీరు చీకట్లోనైనా రాయగలరా?
తండ్రి: శుబ్రంగా రాస్తారా!
కొడుకు: అయితే ఈ కాగితం మీద సంతకం పెట్టండి చూద్దాము..
తండ్రి: ఇంతకూ ఆ కాగితం ఏమిట్రా?
కొడుకు: నా ప్రోగ్రెస్ రిపోర్టు నాన్నా..
తండ్రి: ఆఆఆఆ...
నలుపు - తెలుపు
శాంతమ్మ: ఏమ్మా కాంతమ్మా మా అన్నగారు ఇంతకు ముందు అంత నల్లగా ఉండేవారు. ఇప్పుడేమో బాగా తెల్లబడ్డారే!
కాంతమ్మ: ఏమీ లేదు వదినా, ఆయన ఇంతకు ముందు బొగ్గుగనిలో పనిచేసేవారు. ఇప్పుడు పిండిమరకు మారారు. అదీ సంగతి!!!
మాలూం నహీ సాబ్!! ఒక విదేశీయుడు భారతదేశ పర్యటనలో భాగంగా హంపికి వెళ్ళి, అక్కడి శిల్ప సందను చూసి చాల సంతోషపడ్డాడు. ఎదురైన ఒక మనిషిని అడిగాడు "ఇవన్నీ ఎవరు కట్టించార"ని. అవతలి మనిషి ముస్లిం. అతనికి అతడేమడిగాడో అర్థం కాక "మాలూంనహీసాబ్" అని జవాబిచ్చాడు. ఇంగ్లీషాయన అనుకున్నాడు"వాటి నిర్మాత "మాలూం నహీ సాబ్" అని.
హంపి చూడటం అయ్యాక ఇంగ్లీషాయన హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ చార్మినార్ ని చూశాక "ఇదవెరు కట్టించార"ని అక్కడున్న ఓ తాతనడిగాడు. ఆ తాత కూడా ముస్లిమే. ఇంగ్లీషాయన ఏమడిగాడో ఆ తాతకూ అర్థం కాలేదు. అతనుకూడా "మాలూం నహీ సాబ్" అని జవాబిచ్చాడు. ఇంగ్లీషాయన అనుకున్నాడు "మాలూం నహీ సాబ్ " మంచి కళా పోషకుడే. అక్కడేమో హిందూ ఆలయాలు. ఇక్కడేమో ముస్లిం కట్టడం. బాగుంది బాగుంది అనుకున్నాడు. అంతలోనే ఓ శవ యాత్ర నడుస్తూఉన్నింది అక్కడ. కనబడ్డ ఓ మనిషిని "ఎవరది?" అని తన భాషలో అడిగాడు ఇంగ్లీషాయన. ఆ వ్యక్తి కూడా ముస్లిమే. ఆయనేమడుగుతున్నాడో అర్థంకాక "మాలూం నహీ సాబ్" అని జవాబిచ్చాడు. అయ్యో! మంచి కళాపోషకుడే! చచ్చిపోయాడు పాపం అని తను కూడా శవయాత్రలో పాలుపంచుకున్నాడు ఆయన.
కావలసింది అది కాదు
ఒకాయన ఈతకొడుతూ ఉన్నాడు. అంతలోనే అక్కడికొచ్చిన ఇంకో మనిషి , "ఏరా, ఇక్కడున్నావా? రారా..రా..దమ్ముంటే బయటకు రా ఇప్పుడు" అన్నాడు.
రెండోవాడు: ఇప్పుడు బయటికి రావడానికి నాకు కావలసింది దమ్ముకాదురా. డ్రాయర్!
పలికిన చిలక (సతీష్, 9 వ తరగతి, ప్రకృతిబడి)
చిలకలు అమ్మేవాడు: రండి బాబూ రండి, చిలకలు కొనండి.
రాముడు: నీ చిలకల ప్రత్యేకతలు ఏమిటయ్యా?
వ్యాపారి: చూడండి బాబూ, ఈ చిలకను చూడండి. బాగా మాట్లాడుతుంది. ఇంకా తన కుడి కాలుతో మీకు నమస్కారం కూడా చేస్తోంది చూడండి నా బంగారు చిలక.
రాముడు: మరి ఎడమ కాలితో నమస్కారం చేయమను చూద్దాం.
చిలకలమ్మేవాడు: చూడండి! ఎడమ కాలితోకూడా నమస్కారం చేస్తోంది.
రాముడు: సరే మరి, రెండు కాళ్లతోనూ నమస్కారం చేయమను చూద్దాం?
చిలక : రెండు కాళ్లూ ఎత్తితే పడిపోతాను రా వెధవా!!!!
సిగ్గు (సేకరణ: బాబు, శృతి ఆఫీసు, చెన్నేకొత్తపల్లి)
టీచరు: ఒరేయ్ వంశీ! నీకు కొంచెమైనా సిగ్గుండాలి. పదో తరగతిలోనే మూడేళ్లనుంచీ ఉంటున్నావు.
వంశీ: నాలుగేళ్ల నుంచీ ఒకే తరగతిలో మీరు మాత్రం లేరా, టీచర్? నన్నే ఎందుకంటారు?
టీచరు: ఆఆఆఆ......
గేటెందుకు? (సేకరణ: వి. విష్ణు, 9 వ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురంజిల్లా.)
ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు.
రవి: ఒరేయ్, రాజూ! రైలు వచ్చే ముందు గేటేందుకేస్తారో నీకు తెలుసారా?
రాజు: తెలీకేమిరా! వచ్చీ పోయే వాహనాలు రైలుకు గుద్దుకుంటాయనే....
రవి: ఆ ఒక్కదానికే కాదు. రైలు, అక్కడుండే రోడ్డు మీదికి వచ్చేయకుండా ఉంటుందనీ......