కొండ కోనల మధ్య, మారుమూల ప్రాంతంలో పేరుకు తగ్గట్టుగానే ప్రశాంతంగా ఉండేదా పల్లె. పేరు శాంతిపురం. పాడి పశువులతో, పంటలతో అలరారే ఆ గ్రామంలోకి ఎక్కడినుండి వచ్చిందో, వచ్చిందొక దొంగ కుటుంబం. మల్లన్నకు చిన్ననాడే వంట బట్టిన దొంగతనాలు, అతను పెద్దయ్యేసరికి అతనిలో స్థిరపడిపోయాయి. మల్లన్న భార్య, కూతురు, కొడుకు మాత్రం పాపం, మంచివాళ్ళు. అయితే భార్యా బిడ్డలు ఎంత వారించినా మల్లన్న మాత్రం తన అలవాటును మానుకునేవాడు కాదు.

ఒకనాడు మల్లన్న ఆ ఊరి దేవాలయాన్నే దోచాలనుకున్నాడు. అందరూ నిద్రపోతున్న సమయంలో వెళ్ళి గుడి తలుపులు పగలగొట్టి, విగ్రహంమీది నగలతో సహా ఆలయంలోని విలువైన వస్తువులన్నింటినీ దోచుకొని ఇంటికి తీసుకొచ్చాడు. వాటిని చూసిన భార్య వణికిపోయింది. ఈపని దైవద్రోహమేకాక, తమను నమ్మి ఆశ్రయమిచ్చిన గ్రామానికే ద్రోహమనీ, వాటిని తిరిగి ఇచ్చెయ్యమనీ మల్లయ్యను వేడుకున్నది.

కానీ మల్లయ్య వినలేదు. అయితే ఎలాకనుక్కున్నారో, ఏమో- తెల్లవారేసరికి గ్రామాధికారీ, గ్రామంలోని యువకులూ అనేకమంది మల్లయ్య ఉండే ఇంటికి వచ్చారు. ఇల్లంతా సోదా చేసేసరికి దాచిన నగలన్నీ బయటపడ్డాయి. ఆనాడు గ్రామస్థులు కొట్టిన దెబ్బలకు మల్లన్నతోపాటు, అతని భార్య, కూతురు కూడా చనిపోయారు!

మల్లన్న కొడుకు రాజేష్ ఆ సమయానికి అడవిలో ఉన్నాడు. అందువల్ల అతను గ్రామస్థుల చేతుల్లో పడలేదు. అతను వెనక్కి వచ్చేసరికి, గ్రామస్థుల కోపం చల్లారింది. అయితే ఇప్పుడు రాజేష్ కు గ్రామంలో ఆదరణ కరువైంది. అందరూ అతన్ని చూసి ముఖం తిప్పుకుంటున్నారు. తోటి పిల్లలంతా 'పిల్ల దొంగ' అని ఎగతాళి చేస్తున్నారు. రాజేష్ వేరే ఊరికి వలస పోదామనుకున్నాడు గానీ, బడి పంతులు రామనాధంగారు 'నువ్వు ఏమీ తప్పు చేయలేదు గద రాజేష్? మరి నువ్వెందుకు భయపడి పారిపోవాలి?' అన్న మీదట, ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని ఆ ఊరిలోనే ఉండాలని నిశ్చయించుకున్నాడు రాజేష్.

రెండు సంవత్సరాలు గడిచేసరికి, రాజేష్ మంచితనం క్రమంగా ఊళ్ళోవాళ్ళందరికీ తెలియవచ్చింది. ఇప్పుడు ఎవరైనా అతన్ని 'పిల్ల దొంగ' అన్నాకూడా అతను ఏమీ అనకుండా ఉండగల్గుతున్నాడు. రెండు చేతులు కలిస్తేనే కద, చప్పట్లు మ్రోగేది? రాజేష్ ఏమీ అనకపోవటంతో అతన్ని తిట్టినవాళ్లే తగ్గిపోవాల్సి వస్తున్నది.

ఇలా ఉండగా ఒకసారి, దాపులనున్న అడవిలోంచి పులి ఒకటి, శాంతిపురం మీద పడటం మొదలుపెట్టింది. సాయంకాలం తరువాత ఒంటరిగా పోయేవాళ్ళు ఎవరైనా సరే, పులి బారిన పడుతున్నారు. ఆ పులిని గురించి ప్రభుత్వం వారికి తెలియ పరచినా కూడా ఫలితం లేకుండా ఉన్నది. శాంతిపురం అంతా అశాంతితో నిండిపోయింది. ఊరిని ఎలాగైనా పులి బారినుండి కాపాడాలనుకున్న రాజేష్ గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళి, "అయ్యా, మన ఊరిని పట్టి పీడిస్తున్న పులిని చంపేందుకు నాకు అనుమతివ్వండి" అన్నాడు. "పులి అంటే పిల్లి అనుకున్నావా, పిల్లాడా? పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని, పో, యిక్కడినుండి!" అన్నాడు గ్రామపెద్ద. "అయ్యా, నావాళ్ళంటూ ఇప్పుడెవ్వరూ లేరు. తప్పుడు పనులు చేసిన మా నాన్న తన చావును తానే కొనితెచ్చుకున్నాడు. ఇప్పుడు నేను చనిపోయినా బాధపడేవాళ్ళెవ్వరూ లేరు. అందుకని నాకు ఈ అవకాశం ఇవ్వండి, ఇలాగైనా మా కుటుంబం మీద పడిన మచ్చను తుడిచివేస్తాను నేను" అని వెళ్ళిపోయాడు రాజేష్.

ఆనాటి మధ్యాహ్నం అతనొక గునపం, పార తీసుకొని అడవి దాపులకు వెళ్ళాడు. సాయంత్రం వరకూ శ్రమిస్తే లోతైన గుం త ఒకటి తయారైంది. గుంతపైన సన్నటి కొమ్మలు, ఆకులు పరచి, వాటి అంచున కూర్చున్నాడు రాజేష్, ధైర్యంగా. సాయంత్రం అవుతుండగానే ఆహారసంపాదనకు బయలుదేరింది పులి. అది రాజేష్ ను చూసిన క్షణంలోనే అతనూ దాన్ని చూసి, తేలికగా గెంతి గుంతమీద నిలబడ్డాడు- చేతిలో గునపం పట్టుకొని. పులి భయంకరంగా గర్జిస్తూ అతని మీదికి దూకగానే అతను మెరుపు వేగంతో వెనక్కి గెంతాడు. పులి సూటిగా వచ్చి గుంతలో పడిపోయింది. ఇక అది పెద్దగా గర్జిస్తూ గుంత పైకెక్కేందుకు ప్రయత్నిస్తుంటే, రాజేష్ గునపంతో దాన్ని గాయపరచటం మొదలెట్టాడు. ఆ గర్జనలు ఊరంతా ప్రతిధ్వనించాయి. ఊళ్ళో జనాలంతా 'ఏమౌతున్నదో' అని ఒక్కరొక్కరుగా అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి ఆ పులిని మట్టుపెట్టారు.

ప్రతి ఒక్కరూ రాజేష్ ధైర్యాన్ని, తెలివిని, ఊరిపట్ల అతనికున్న అంకితభావాన్ని ప్రశంసించారు. పులిబారినుండి గ్రామాన్ని కాపాడిన రాజేష్ సాహసబాలుడయ్యాడు. ఊరిలో పిల్లలందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. పెద్దయిన తరువాత ఆ రాజేషే నిజాయితీ గల పోలీస్ ఆఫీసరుగా అందరి మన్ననలూ పొందాడు.