పేద, ముసలి, విధవరాలు ఒకావిడ తన ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ల పంచన జీవిస్తుండేది. వాళ్లు నలుగురికి నలుగురూ ఆమెను వేధించుకు తినేవాళ్లు.ఆమె కష్టాలన్నీ చెప్పుకునేందుకు కూడా ఎవరూ లేరు. ఇక అలా ఆమె తన బాధల్ని తనలోనే దాచుకొనీ దాచుకొనీ లావెక్కడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె కొడుకులు- కోడళ్లకు ఆమెను ఎగతాళి చేసేందుకు ఒక సాకు దొరికింది- వాళ్లు ఆమె భారీకాయాన్ని, అది రోజు రోజుకూ ఇంకా పెరగటాన్ని సాకుచేసుకొని, ఆమెకు పెట్టే తిండినీ తగ్గించారు!
ఒకరోజున, ఇంట్లోవాళ్లంతా ఎక్కడికో బయటికి పోయినప్పుడు, తన బాధని మరచేందుకని ఆమె ఊరిలోకి వచ్చి గమ్యం లేకుండా తిరగటం మొదలెట్టింది. అలా మెల్లగా ఊరి చివరి వరకూ చేరుకున్నది ఆమె. అక్కడ ఆమె కొక పాడుబడ్డ ఇల్లు కనపడింది. దాని కప్పు ఇది వరకే కూలిపోయింది. ఇప్పుడు దానికి నాలుగు గోడలు తప్ప మరేమీ లేవు. ఆమె నడుచుకుంటూ ఆ ఇంట్లోకి పోవటమైతే పోయింది కానీ, అక్కడికి వెళ్లాక అకస్మాత్తుగా ఆమెను ఒంటరితనం ఆవహించింది. దు:ఖం ముంచుకొచ్చింది. ఇక తన బాధల్ని తనలో ఉంచుకోవటం వీలుకాలేదు ఆమెకు. ఇప్పుడు వాటిని ఎవరో ఒకరికి వినిపించాల్సిందే.
అందుకని ఆమె తనకు ఎదురుగా ఉన్న గోడకు తన మొదటి కొడుకు గురించి చెప్పుకోవటం మొదలెట్టింది. వాడు తననెంత కష్టపెట్టాడో చెప్పుకుని, పెద్దగా ఏడ్చి, చివరికి ముగించేసరికి, ఆ గోడ ఆమె బాధల బరువుని మోయలేక నిలువునా కుప్పకూలిపోయింది. ముసలవ్వ శరీరం, మనసూ కొంత తేలిక పడ్డాయి.
ఆ తర్వాత అవ్వ రెండవ గోడ వైపుకు తిరిగి తన పెద్దకొడుకు భార్య తనను ఏమేం చేసిందో చెప్పుకున్నది. ఆగోడా కుప్పకూలింది. అవ్వ ఇంకొంచెం తేలికైంది. ఇలా ఆమె తన రెండో కొడుకు గురించి చెప్పుకునేసరికి మూడో గోడ కూడా పగిలిపోయి రాసిపోసియినట్లు నేలరాలింది. ఆమెకు రెండో కోడలిమీద ఉన్న ఫిర్యాదుల బరువుకి తాళలేక నాలుగో గోడ కూడా ముక్కలు చెక్కలై పోయింది.
అలా బరువంతా తగ్గాక ముసలమ్మ శరీరమూ, మనసూ రెండూ కుదుట పడ్డాయి. ఆ గృహ శకలాల మధ్య నిలబడి చూసుకుంటే, నిజంగానే, గడ్డుకాలంలో ముసలమ్మ పెరిగిన బరువంతా తగ్గి, ఆమె మునుపటి మాదిరే సన్నగా తయారైంది.
అప్పుడామె మళ్లీ ఇంటికి పోయింది - తేలికైపోయి.
అర్థమైందా, మీకూ కష్టాలుంటే - గోడలకు చెప్పుకోండి!