(ఆంధ్ర ప్రదేశ్ లోని ఓ మారుమూల మండల కేంద్రంలో ఒక వీధి. వీధికి రెండు వైపులా ఇళ్ల బారులు. పల్లెనుండి వచ్చిన ఎరుకలవాడు ఒకడు దూరంగా బుట్టల్ని అమ్ముకుంటుంటాడు. అతని అరుపులు వినిపిస్తుంటాయి నేపధ్యంలో: "బుట్టలు బాబూ!, బుట్టలు.. బుట్టలమ్మా, బుట్టలు!.అయ్యా బుట్టలు. ఈతబుట్టలు!" అని అతని అరుపులు ఇంకా ఇంకా బిగ్గరగా వినబడతై.. చివరికి అతను స్టేజీ పైకి వస్తాడు. అతని తలపైన అందంగా, రంగు రంగులతో, అందంగా, ముచ్చటగా అల్లిన బుట్టలుంటాయి..అతను వచ్చి ఆ వీధిలోని ఒక ఇంటి తలుపు ముందు నిలబడతాడు..)

బుట్టలవాడు: అమ్మా, ఓయమ్మా?

మొదటి ఆమె(ఇంటిలో నుండే): ఆ! ఎవరది?

బుట్టలవాడు: బుట్టలమ్మా, బుట్టలు. మీకేమన్నా కొన్ని బుట్టలు కావాలా అమ్మా?

మొదటి ఆమె(ఇంట్లోంచి): ఏమిటి?!

బుట్టలవాడు: బుట్టలు తల్లీ, ఈత బుట్టలు.

(మొదటి ఆమె చికాకుగా, తలుపు సగం తెరచి తల బయటికి పెడుతుంది)

మొదటి ఆమె : ఏం కావాలయ్యా, నీకు? పొద్దుపొద్దున్నే, ఊరికే తిక్కరేగిస్తావు?

బుట్టలవాడు: అమ్మా, మీకేమన్నా-

మొదటి ఆమె: లేదు. మేం బిచ్చగాళ్ళకు ఏమీ ఇచ్చేదిలేదు.

బుట్టలవాడు: ఓహ్, కాదు, తల్లీ. నేను, బిచ్చగాడిని కాదు...

మొదటి ఆమె: మీలాంటి వాళ్ళంతా ఉండే చోటికి పోతే నీకు నిక్షేపంగా ఉంటుంది కదా, పో అక్కడికి, బిచ్చగాడా.

బుట్టలవాడు: అమ్మా, మీరు ఈ బుట్టల్ని చూస్తే..

మొదటి ఆమె: ఫో,ఫో. మాకేమీ అవసరం లేదు. ఫో ఫో.

(బుట్టలమ్మే మనిషి ముఖం మీద ఆమె తలుపులు మూస్తుంది. బుట్టలమ్మే మనిషి తరువాత తలుపు దగ్గరకు పోతాడు.)

బుట్టలవాడు: అమ్మా, తల్లీ, బుట్టలు!

(రెండవ ఆమె తలుపులు తెరుస్తుంది)

రెండవ ఆమె: బుట్టలా!?

బుట్టలవాడు: అవునమ్మా! మీ ఇంట్లో వాడకానికి ఈత బుట్టలు.

రెండవ ఆమె: చెప్పు, ఎంతకిస్తావు?

బుట్టలవాడు: ఒక్క పదిరూపాయలివ్వండమ్మా

రెండవ ఆమె: అయ్యో దేవుడా!నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? ఈ చిన్న బుట్టకు-పదిరూపాయలా?!

బుట్టలవాడు: అమ్మా, మీరుచూడండి, ఈ రంగులు, ఈ అల్లిక - ఇవి చూసి ఇవ్వండమ్మా.

రెండవ ఆమె: ఇదిగో, ఈ మురికి ఈత బర్రల్ని అడవిలో తిరిగే ఏ గాడిదైనా తీసుకురాగలదు. నువ్వు మోసపుమాటలు చెప్పాల్సింది నాకు కాదురా.

బుట్టలవాడు: తల్లీ, ఒక్కొక్క బుట్టకూ ఒక్కో ప్రత్యేకత ఉన్నదమ్మా!

రెండవ ఆమె: (గంపలోంచి ఒక బుట్టను పైకి లాగుతూ) ఇవెంత చిన్నగా ఉన్నాయో చూడు. అయినా ఇంత చిన్నవి, ఇవెందుకు పనికివస్తాయి?

తల్లీ మీరు మీ సూదుల్ని ఇందులో పెట్టుకోవచ్చు, లేకపోతే కేవలం మీ కిటికీకి అందం ఇచ్చేందుకైనా దాన్ని అక్కడ పెట్టుకోవచ్చమ్మా.

రెండవ ఆమె: నేను దీనికి కనీసం రెండు రూపాయలిచ్చినా నువ్వు సంతోషపడి నా కాళ్లు మొక్కుతావు.

బుట్టలవాడు: లేదు, తల్లీ నేను వీటిని ఎనిమిది రూపాయలకంటే తక్కువకు అమ్మలేను.

రెండవ ఆమె: నీకు కనీసం సిగ్గుండాలి, అంత అడిగేందుకు!

బుట్టలవాడు: తల్లీ.-

రెండవ ఆమె: కానీ ఈ రోజు ఎందుకో నా గుండె జాలిగుండె అయిపోయింది. అందుకని నేను నీకు నాలుగు రూపాయలు ఇవ్వదలచుకున్నాను. ఏమంటావు నువ్వు?

బుట్టలవాడు: తల్లీ, ఆరు రూపాయలకు కొంచం తక్కువైనా-

రెండవ ఆమె: నాలుగు రూపాయలు. నేను అంతకంటే ఎక్కువ ఇవ్వను.

బుట్టలవాడు: తల్లీ, తప్పదంటే- ఐదు రూపాయలకు ఇవ్వగలను- ఆఖరి మాటమ్మా..

రెండవ ఆమె:ఐదు రూపాయలు. అంతేనంటావా?

బుట్టలవాడు: అంతేనమ్మా. ఐదు రూపాయలు.

(ఆమె మళ్ళీ ఓ సారి తన చేతిలోని బుట్టను చూసుకుని, చివరకి ఒప్పుకుంటుంది.)

రెండవ ఆమె: సరే. ఇది కొంచెం ఎక్కువే అయినా అదృష్టం నీవైపుకు చూస్తోంది ఇవ్వాళ్ళ. ఆగు నీ ఐదు రూపాయలు తెచ్చిస్తా.

(రెండవ ఆమె ఇంట్లోకి వెళ్తుంది)

(ఇంట్లోంచే) రెండవ ఆమె: ఓరబ్బీ, బుట్టలాయప్పా!

బుట్టలవాడు: అమ్మా, చెప్పండమ్మా.

రెండవ ఆమె(ఇంట్లోంచి): నీ దగ్గర చిల్లర ఉన్నది కదా, నా దగ్గర వెతికితే కనబడటం లేదు. .

బుట్టలవాడు: లేదు తల్లీ, నా దగ్గర కేవలం -

(రెండవ ఆమె వెంటనే బయటికి వచ్చేస్తుంది)

రెండవ ఆమె: చూడు, నీ రాత ఇలాగే తగలడింది. నా దగ్గర చిల్లరగా నాలుగు రూపాయలే ఉన్నాయి.

బుట్టలవాడు: కానీ, తల్లీ-

రెండవ ఆమె: నన్నేం చేయమంటావు? నా దగ్గర ఐదువందల రూపాయల నోటు ఉన్నది. నువ్విస్తావా చిల్లర?.. ఐదువందల రూపాయలకు?

బుట్టలవాడు: ఇంకొంచెం చూడండమ్మా, మీ దగ్గరే . .

రెండవ ఆమె: నా దగ్గర వేరే చిల్లరేదీ లేదు, ఒక్క రూపాయి కూడా. ఇచ్చింది తీసుకో, అంతే. నాలుగు రూపాయలు. లేదా ఎవరి దగ్గరన్నా ఈ ఐదు వందల నోటు మార్చగలిగితే అలాగే చెయ్యి.

(నిశ్శబ్దం)

బుట్టలవాడు: సరే, ఇవ్వండమ్మా. చాలా ధన్యవాదాలు తల్లీ.

(రెండవ స్త్రీ ఇంట్లోకి పోతుంది. బుట్టలవాడు తరువాతి ఇంటికి పోతాడు.)

బుట్టలవాడు: అమ్మా, ఓ అమ్మా, బుట్టలు, ఓ అమ్మా!

(మూడవ స్త్రీ తలుపు తెరిచి చూస్తుంది)

మూడవ స్త్రీ: ఓహ్, చిన్న చిన్న బుట్టలు! ఎంత ముద్దుగా ఉన్నాయో చూడు.

బుట్టలవాడు: అమ్మా, కొంటారా అమ్మా, బుట్టలు?

మూడవ స్త్రీ: ఎంత ముద్దుగా ఉన్నాయో, ఇవి. నేను నీకు రెండు రూపాయలిస్తాను.

బుట్టలవాడు: అమ్మా! వీటి ధర ఒక్కొక్కటి పది రూపాయలు.

మూడవ స్త్రీ: నీ కలల్లో ఆ రేటు వస్తుండచ్చు, నల్లోడా. రెండు రూపాయలిస్తా. లేకపోతే నువ్వు, నీ చిన్ని బుట్టలూ వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి దయచేయవచ్చు. ఇక త్వరలో చీకటి పడిపోతుంది మరి, ఏమంటావు?

బుట్టలవాడు: అమ్మా, దీని ఈత బర్రల నాణ్యత చూడండి, రంగులు, అల్లిక మీరే చూడండమ్మా. దీనికి ఒక్కో దానికిఎనిమిది రూపాయలకు తక్కువైతే గిట్టుబాటుండదమ్మా.

మూడవ స్త్రీ: నా దగ్గర నీ ఆటలు సాగవు, నల్లోడా. నువ్వెక్కడి నుండి వచ్చావు, ఇంతకీ? మీ తాండా ఏది?

బుట్టలవాడు: మాది గుర్రంగుట్ట తాండా తల్లీ.

మూడవ స్త్రీ: అంత దూరం నుండి వస్తున్నావా? మరి బరువులెత్తేందుకు గాడిద కూడా ఏదీ లేదు!?

బుట్టలవాడు: అమ్మా, మా గాడిద మూడు రోజుల క్రితం తాడు తెంపుకు పోయింది. దొరుకుతుంది లెండి, మళ్లీ. ఎన్ని సార్లు పోయి మళ్లీ దొరకలేదు, అది? అయితే ఈ సారి మాత్రం నాకు నడిచి రాక తప్పలేదు.

మూడవ స్త్రీ: నడిచి వచ్చావా! పాపం. ఇదిగో, తీసుకో, నీ రెండు రూపాయలు. ఇది నేను దయతలచి ఇచ్చిన దానమే అనుకో. నాకు తెలుసు, ఇదంతా వృథా ఖర్చే. కానీ చూడు, నేను ఒక మంచి క్రైస్తవురాలిని; ఎవరో ఒక పేద నల్లవాడు, అందులోనూ తన ఊరు విడిచి ఇంత దూరం వచ్చి, ఇక్కడ ఆకలి చావు చావటం నాకు అస్సలు ఇష్టం లేదు; నేనది చూడలేను.

(ఆమె బుట్టను తీసుకొని నిర్లక్ష్యంగా ఇంట్లోకి విసిరేస్తుంది)

బుట్టలవాడు: అమ్మా!-

మూడవ స్త్రీ: నువ్వు గుర్రంగుట్ట తాండా నుండి వచ్చానన్నావు కదూ? చూడు, వచ్చే శనివారం నాడు మీ తాండా నుండి రెండు మూడు సీమ కోళ్ళు తెచ్చి పెడతావా? అవి లావుగా, బరువుగా, చాలా చాలా చవకగా ఉండాలి. లేకపోతే నేను వాటిని ముట్టనైనా ముట్టను. మామూలు ధరకే కొనుక్కోవాలంటే నాకు అవి ఇక్కడే దొరుకుతాయి, అర్థమైంది గదా? మూడు పెద్ద పెద్ద సీమ కోళ్ళు, చవకగా, శనివారం నాడు. సరేనా? ఇక ముందుకు పో, నల్లోడా.

(ఆమె తలుపు మూసేస్తుంది. అలసిపోయిన బుట్టలవాడు తన మూటను భుజానికెత్తుకుంటాడు, ఇంకా అమ్ముడుపోని బుట్టలను బాధగా చూసుకుంటూ, వీధి వెంబడి ముందుకు సాగిపోతాడు, బుట్టలమ్మా బుట్టలు అని అరుచుకుంటూ.)

(మొదటి అంకం ముగిసింది)

రెండవ అంకం

(తాటి ఆకులతో కప్పిన పూరిపాక. అలికిన మట్టినేల. అది బుట్టలల్లేవాడి ఇంటి చావడి. కొత్తగా అల్లుతున్న బుట్టల మధ్య, పని చేస్తూ కూర్చొని ఉన్నాడు అతను. ఇంటి లోపలినుండి అతని భార్య బయటికి వస్తుంది. ఆమె చేతిలో పొగలు జిమ్ముతున్న మట్టి పాత్ర..)

బుట్టలవాడి భార్య: ఓయ్! పొద్దుగూకింది. భోజనానికి రా.

బుట్టలవాడు: ఆ! వచ్చేస్తున్నా.

(బుట్టలల్లే మనిషి కదల్లేదు. కదలబోతున్న లక్షణాలేవీ కనపడలేదు. అతని పనివేగం మారలేదు. పనిపట్ల అతని శ్రద్ధ చెదరలేదు. ఓపికగా అలాగే, ముందు మాదిరి పని కొనసాగిస్తున్నాడు. అతని భార్య పాత్రను కింద పెట్టి మరోసారి పిలుస్తుంది)

బుట్టలవాడి భార్య: ఓయ్, వచ్చి తిను. చిక్కుడు గింజలు చల్లారి పోతై మళ్లీ.

బుట్టలవాడు: నేను ఇక్కడ, ఈ కొంచెం పని ముగించి వస్తాను.

(అతను తొందరపడకుండా అదే వేగంతో పని కొనసాగిస్తున్నాడు)

బుట్టలవాడి భార్య: సంత మార్కెట్లో అమ్ముకునేందుకు పన్ను మళ్లీ పెంచారట గదా, నిజమేనా?

బుట్టలవాడు: అవును, మూడురూపాయలు ఉండేది, ఇప్పుడు నాలుగు చేశారు.

బుట్టలవాడి భార్య: అయినా కూడా బుట్టలకు గిరాకీ లేదు, కదూ? ఇంకా కూడా నువ్వు సంత అవ్వగానే గడప గడపకూ తిరిగి అమ్ముకోవలసిందే, బుట్టకు రెండు రూపాయలు!

బుట్టలవాడు: ఏం కాదు, చివరి బుట్టకే రెండు రూపాయలు.

బుట్టలవాడి భార్య: (వసారాలో భర్త పక్కన రాసి పోసి ఉన్న అమ్మడుపోని బుట్టలకేసి చూపిస్తూ) మరి ఇవి?

బుట్టలవాడు: తర్వాతి సంత రోజున వీటిని తీసుకుపోతాను.

బుట్టలవాడి భార్య: వచ్చే సంత రోజన్నా దేవుడు మనల్ని కొంచెం చల్లగా చూస్తే బాగుండు. (బుట్టలల్లేవాడు తను అల్లుతున్న బుట్టని చూస్తూ) ఓయ్, ఇది నిన్న మనల్ని కలిసిన సీతాకోక చిలుకే.

బుట్టలవాడు: అవును. అది ఈ రోజు ఉదయం కూడా వచ్చింది. నేను అక్కడ పెట్టిన బుట్ట ఏదో, దానికి నచ్చినట్లుంది. దాని మీదే కూర్చున్నది. అప్పుడు నాకనిపించింది, మనం ఈ సారి అల్లే బుట్టల్ని దాని రంగుల్లో అల్లాలని.

బుట్టలవాడి భార్య: సరేలే, మరి కొంచెం పొద్దు మునగగానే లోనికి రా, బువ్వతిందువు.

(ఆమె ఇంట్లోకి పోతుంది. బుట్టలవాడు పనిని కొనసాగిస్తుండగా మిష్టర్.ఇ.యల్. విన్ త్రోప్ గారు- అమెరికా నుండి వచ్చిన పర్యాటకుడు - ఆ రోడ్డుమీదుగా నడుచుకుంటూ వచ్చి, బుట్టలల్లేవాడి ఇంటి ముందు ఆగిపోతాడు! నవ్వుముఖంవేసుకొని, పనిలోఉన్న బుట్టలల్లేవాణ్ణి ఆశ్చర్యంగా చూస్తూ, నిలబడి పోతాడు! బుట్టలల్లేవాడు పనిలో మునిగి పోయి ఉంటాడు. అతనిని అసలు పట్టించుకోడు. కొంత సమయం గడచిన తర్వాత మిష్టర్ విన్ త్రోప్ కు ఏదో ఒకటి మాట్లాడాలనిపిస్తుంది..)

మిస్టర్ విన్ త్రోప్: ఆ చిన్న బుట్ట ఎంత,మిత్రమా?

బుట్టలవాడు: పది రూపాయలు స్వామీ, నా దేవుడా, యజమానీ, ఒక్క చిన్న నోటు- అంతే.

మిస్టర్ విన్ త్రోప్: పది రూపాయలేనా? ఓస్ - అంతేనా? ఓహ్, అయితే నేను కొనేశాను!

(అకస్మాత్తుగా వినవచ్చిన శబ్దానికి బుట్టలవాడి భార్య ఇంట్లోంచి బయటికి వచ్చి చూస్తుంది, నిశ్శబ్దంగా గమనిస్తూ నిలబడిపోతుంది. శ్రీ విన్ త్రోప్ గారు ఆమెనింకా చూడలేదు. తనకు దొరికిన ఆ బుట్టని ఆరాధనగా, మురిపెంగా చూసుకుంటూ ఉండిపోయాడు.)

దీన్ని ఖచ్చితంగా ఎవరికివ్వాలో నాకు తెలుసు! నేను దీన్ని ఇచ్చినందుకు గాను ఆమె తప్పకుండా నన్ను ముద్దు పెట్టుకుంటుంది, నిజం. ఆమె మరి దీన్ని దేనికి వాడుకోనున్నదో.

(అతను పది రూపాయల నోటు తీసి బుట్టలల్లేవాడికి అందిస్తాడు. బుట్టలవాడు ఉదాసీనంగా ఆ డబ్బును అందుకుంటాడు. మిస్టర్ విన్ త్రోప్ సంతోషంగా తనలో తాను అనుకుంటాడు - )

పది రూపాయలు, అంతే! నేనైతే ఇది కనీసం దీనికి పది రెట్లు - ఏ వందరూపాయలో ఉండవచ్చనుకున్నాను. ఇలా ఒక్కోటీ పది రూపాయలే అయితే నేను-... ఏయ్!!!

(మిస్టర్ విన్ త్రోప్ జేబులోంచి ఓ కాయితం ముక్కను తీసి దాని పైన ఏవేవో అంకెలు వెయ్యటం మొదలెడతాడు, ఆవేశంగా. బుట్టలల్లేవాడు పని కొనసాగిస్తుంటాడు.)

మిస్టర్ విన్ త్రోప్: మిత్రమా! నిన్నో ప్రశ్న అడగచ్చా?

బుట్టలవాడు: అడగండి యజమానీ.

మిస్టర్ విన్ త్రోప్: నేను నీ యీ చిన్న బుట్టల్ని పదింటిని కొన్నాననుకో. వీటి వల్ల నిజానికి ఎలాంటి ఉపయోగమూ లేదని మనిద్దరికీ తెలుసు - అయినా, నేను నీ దగ్గర పది బుట్టలు కొన్నాననుకో - ఒక్కోటి ఎంతకు ఇస్తావు?

బుట్టలవాడు: (ఒక్క క్షణం ఆలోచించి . .) మీరు పది బుట్టలు తీసుకునేట్లుంటే ఒక్కోటి తొమ్మిది రూపాయలకు ఇచ్చేస్తాను.

మిస్టర్ విన్ త్రోప్: బాగుంది, బాగుంది. అయితే ఊరికినే, అనుకుందాం, నేను పదికి బదులు, ఉం.. ఓ వంద బుట్టల్ని - ఏమాత్రం పనికి రాని ఈ చెత్తబుట్టల్నే, వంద- కొన్నాననుకో, ఒక్కోటీ ఎంతకివ్వగలవు?

బుట్టలవాడు: (పని లోంచి తలెత్తి పైకి చూడకుండా, ఏ మాత్రం ఉత్సాహం లేకుండా) అలా అయితే నేను ఒక్కోటీ ఎనిమిది రూపాయలకు ఇచ్చేందుకు ఇష్టపడచ్చు.

మిస్టర్ విన్ త్రోప్: (ఇది కూడా కాగితం మీద రాసుకుంటూ) అలా అయితే, .. నేనో వంద బుట్టలు కొంటున్నాను.

బుట్టలవాడు: కానీ నా దగ్గర వంద బుట్టలు లేవు యజమానీ.

మిస్టర్ విన్ త్రోప్: సరే, అలా అయితే నేను నీ దగ్గర ఎన్ని బుట్టలుంటే అన్ని కొనుక్కుంటాను.

బుట్టలవాడు: (పనిని కొనసాగిస్తూ) పూర్తైన బుట్టలన్నీ - అవిగో ఆ మూలన ఉన్నాయి మూటగా.

మిస్టర్ విన్ త్రోప్: (దగ్గరకు వెళ్లి లెక్క పెడుతూ -) ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు, పదమూడు, పద్నాలుగు, పదిహేను.

బుట్టలవాడు: పదిహేనున్నాయి. అంతేనా యజమానీ.

మిస్టర్ విన్ త్రోప్: (బుట్టలల్లేవాడికి డబ్బు చెల్లిస్తూ-) ఇదిగో పదిహేనింటికి నీ డబ్బు.

బుట్టలవాడు: ధన్యవాదాలు యజమానీ. తమరి దయ.

(మిస్టర్ విన్ త్రోప్ తన బుట్టల్ని మూట గట్టుకొని తీసుకెళ్తాడు. అతను వెళ్లగానే బుట్టలవాడి భార్య వసారాలోకి వస్తుంది)

బుట్టలవాడి భార్య: ఈ తొల్లదొర ఎక్కడి వాడంటావు?

బుట్టలవాడు: ఎవరికి తెల్సు? అతను చెప్పలేదు.

బుట్టలవాడి భార్య: మంచిదేలే. ఉన్నవాటినన్నింటినీ అమ్మావు చివరికి, ఎలాగైతేనేమి?

బుట్టలవాడు: వాళ్ల దగ్గర డబ్బులు చాలానే ఉన్నట్లున్నాయి.

బుట్టలవాడి భార్య: (బుట్టలల్లేవాడి చేతిలోని బుట్టను చూస్తూ) ఈ బుట్ట చాలా అందంగా తయారౌతోంది.

బుట్టలవాడు: అవును. అది చాలా అందమైన సీతాకోకచిలుక.

బుట్టలవాడి భార్య: పొద్దు గుంకింది. పద, తిని పడుకుందాం. బుట్టలవాడు: నేను ఇక్కడ, ఈ కొంచెం పని ముగించి వస్తాను.

(అతను తొందరపడకుండా అదే వేగంతో పని కొనసాగిస్తున్నాడు)

(రెండవ అంకం ముగిసింది)

మూడవ అంకం

(అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ఒక ఖరీదైన చాక్లెట్ల దుకాణం. దుకాణపు షోకేసులో ప్రదర్శిస్తున్న ఖరీదైన చాక్లెట్ల వెనక నిలబడి ఉన్నాడు, ఆ దుకాణపు యజమాని మిస్టర్ కెంపుల్ . ఆ ఖరీదైన చాక్లెట్లను ధనికుల కోసం ప్రత్యేకంగా- చేతితో- తయారు చేశారు! ఆలోగా సూటూ, బూటూ, టై ధరించిన మిస్టర్ విన్ త్రోప్ దుకాణం లోనికి ప్రవేశిస్తాడు. అతని వెంట ఒక పెద్ద డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో తను ఇండియాలో కొన్న ఈత బుట్టలు కొన్ని ఉంటాయి.)

మిస్టర్ విన్ త్రోప్: గుడ్ మార్నింగ్ మిస్టర్ కెంఫుల్!

మిస్టర్ కెంపుల్: గుడ్ మార్నింగ్! మీరు మిస్టర్ విల్సన్ అయి ఉండాలి.

మిస్టర్ విన్ త్రోప్: విన్ త్రోప్

మిస్టర్ కెంపుల్: అవునవును. మిస్టర్ విన్ త్రోప్. మీరు నన్ను కలవాలని చేసిన ఫోన్ మెసేజ్ అందింది. మేం ప్రత్యేకంగా తయారు చేసే చాక్లెట్లు కొన్నింటిని మీరు ఆర్డర్ చేయదలచారట..అవునా?

మిస్టర్ విన్ త్రోప్: ఖచ్చితంగా చూస్తే అలాంటిదేమీ కాదు, మిస్టర్ కెంపుల్. ఇప్పటికే కీర్తి గాంచిన మీ చాక్లెట్లకు మరింత వన్నె, పేరు ప్రఖ్యాతులు తెచ్చేందుకు తగిన వస్తువులు నా దగ్గర వున్నాయేమో, అని నాకు అనిపించింది. మొత్తం న్యూయార్క్ నగరంలోనే అతి పెద్ద చాక్లెట్ తయారీదారుగా వినుతికెక్కిన తమరే, నా యీ అత్యద్భుతమైన ప్రతిపాదనను స్వీకరించగల సమర్థులని నా భావన.

మిస్టర్ కెంపుల్: మీరు ఏం చెప్పదలచారు, మిస్టర్ విల్సన్?

మిస్టర్ విన్ త్రోప్: విన్ త్రోప్

మిస్టర్ కెంపుల్: అవునవును.

మిస్టర్ విన్ త్రోప్: (తన వద్దనున్న బుట్టల డబ్బాను తెరచి, ప్రదర్శిస్తూ-) నేను మీకు అత్యద్భుతమైన ఈ పెట్టెల్ని అందించగలను. అత్యంత కళాత్మకమైనవి, అదే సమయంలో అత్యంత సహజసిద్ధమైనవీ అయిన ఈ పెట్టెలు, మీరు అమ్మే అత్యంత ఖరీదైన చాక్లెట్లను ప్యాక్ చేసి ఇచ్చేందుకు పూర్తిగా తగినవని నా నమ్మకం. వీటిలో చాక్లెట్లను బహుమతులుగా ఇచ్చేందుకు సరసులు, కళాప్రియులైన ధనికులందరూ ఉత్సాహపడతారని నా విశ్వాసం.

(మిస్టర్ కెంపుల్ ఆ బుట్టల్ని చూసి నిర్ఘాంతపోతాడు. ఒక్క క్షణం అతనికి ఊపిరాడదు. కానీ అంతలోనే అతను తేరుకొని, మళ్లీ గతంలో మాదిరి మొఖం పెడతాడు.)

మిస్టర్ కెంపుల్: ఉం..ఏమో., మరి.,. నాకు తెలీదు.,.నేను వెతుకుతున్న పెట్టెలు నిజానికి ఇలాంటివి కావు,. బహుశ: వీటిని కూడా ఓసారి ప్రయత్నించి చూడవచ్చేమో- అయినా అది వీటి ధరపైన ఆధారపడుతుంది. చాక్లెట్ల కంటే వాటి ప్యాకేజింగ్ ధర ఎక్కువ అవ్వటం మాకు ఏమాత్రం ఇష్టం ఉండదు.

మిస్టర్ విన్ త్రోప్: మరి, బేరం లేదంటారా?

మిస్టర్ కెంపుల్: వీటికి మీకు ఎంత కావాలో చెబితే మేం ఆలోచించే వీలుంటుంది గదా?

మిస్టర్ విన్ త్రోప్: చూడండి, మిస్టర్ కెంపుల్, ఈ బుట్టల్ని కనుగొనేందుకుగాను అనేక శ్రమలకోర్చి ప్రపంచంలోని అరణ్యాలన్నీ పరిశోధించిన వీరయోధుడిని నేనే గనక, అంతేకాక వీటిని ఇంకా సంపాదించాలంటే ఏమి చేయాలో తెలిసిన ఏకైక వ్యక్తిని నేనే గనక, నేను వీటిని ఎవరు ఎక్కువ ధర పలికితే వారికే ఇవ్వదలచుకున్నాను. ఏమంటారు? దీనికి గాను వారికి పరిపూర్ణ హక్కులు లభిస్తాయి. నేను ఏం చెబుతున్నదీ మీకు అర్థమౌతున్నదనుకుంటాను.

మిస్టర్ కెంపుల్: చక్కగా. మీరు ఇతరులను కూడా సంప్రతించారా?

మిస్టర్ విన్ త్రోప్: నిజానికి నా దగ్గర ఇతరుల ప్రతిపాదనలూ ఉన్నాయి. చాలా ఉన్నాయి నిజానికి. కానీ నా మనసులో మాత్రం ఈ ప్రతిపాదనను మీరే గెల్చుకోవాలని ఉన్నది. ఈ అవకాశాన్ని మీరు కోల్పోవటం నాకు ఏమాత్రం ఇష్టంగా లేదు.

మిస్టర్ కెంపుల్: సాధారణంగా ఇలాంటి వాటిని నేను నా వ్యాపార భాగస్వాములతో చర్చిస్తాను.

మిస్టర్ విన్ త్రోప్: నిజం. నిజం. ఈ పెట్టెల గురించే తమ తమ భాగస్వాములతో చర్చిస్తున్న ఇతర వ్యాపారవేత్తలు అనేక మంది మాదిరే.

మిస్టర్ కెంపుల్: కానీ ఈ సందర్భంలో మాత్రం -

మిస్టర్ విన్ త్రోప్: చెప్పండి.

మిస్టర్ కెంపుల్: మీతో దాపరికం లేకుండా మాట్లాడుతాను. చూడండి, నేను కళను చూడగానే గుర్తు పట్టే వ్యక్తిని. ఈ చిన్న బుట్టలు అత్యుత్తమ కళాఖండాలే తప్ప వేరు కాదు. సందేహం లేదు. కానీ, మేం కేవలం స్వీట్లు అమ్ముకునే వ్యాపారులం. మేం తయారుచేసే ప్రత్యేకమైన ఫ్రెంచ్ ప్రాలైన్ చాక్లెట్ల కోసం ప్యాకేజింగ్ డబ్బాలుగా మాత్రం వీటిని వాడుకోగల్గుతాం. అంతే. అలా చూస్తే, అవి కేవలం ప్యాకింగ్ డబ్బాలుగా ఉపయోగింపబడుతాయి. మంచి డబ్బాలే, కానీ కేవలం డబ్బాలుగా - అంతే. మా పరిమితుల్లో మేం పని చేయాలి, తప్పదు. మిస్టర్ విన్ త్రోప్, మీరు మా సమస్య అర్థం చేసుకోగలరనుకుంటాను.

మిస్టర్ విన్ త్రోప్: చక్కగా. సరే, చెప్పండి మరి, మీకు ఇవి ఎంత విలువ చేస్తాయి?

మిస్టర్ కెంపుల్: తెలివైన వారు, మీకు వేరే చెప్పనక్కర్లేదు. కానీ మాకు కొంత బడ్జెట్ పరిమితులుంటాయి. అదే సమయంలో మా వినియోగదార్ల కళాదరణనూ గౌరవిస్తాం. నా ప్రతిపాదన వినండి. మేం ఒక్కో బుట్టకు మూడున్నర డాలర్లు ఇవ్వగలం. అంతకుమించి ఒక్క సెంటు కూడా ఎక్కువ చెల్లించలేం. మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు.

(మూడున్నర డాలర్లంటే సుమారు వంద రూపాయలు. విన్ త్రోప్ అంత ఎక్కువ మొత్తాన్ని ఊహించి ఉండడు. అందుకు ఉలిక్కి పడతాడొకసారి.)

మిస్టర్ కెంపుల్: సరే, సరే. ఆందోళన పడకండి. నాలుగు డాలర్ల వరకు పోతాం మేము.

మిస్టర్ విన్ త్రోప్: ఐదు డాలర్లు చేయండి.

మిస్టర్ కెంపుల్: సరే. పక్కా. న్యూయార్క్ రేవు దగ్గర - ఒక్కో బుట్ట నాలుగు ముప్పావు డాలర్ల లెక్కన. మేం కస్టమ్స్ సుంకం చెల్లిస్తాం, మీరు రవాణా చార్జీలు భరిస్తారు. సరేనా?

మిస్టర్ విన్ త్రోప్: సరే. అంగీకారమే.

(విన్ త్రోప్, కెంపుల్ లు కరచాలనం చేసుకుంటారు.)

మిస్టర్ కెంపుల్: ఈ ఒప్పందపు పత్రాల్ని వెంటనే రిజిస్టర్ చేసుకుందాం. మీరు వాటిపై సంతకాలు పెట్టి ఈరోజే మా సెక్రటరీకి పంపండి.

మిస్టర్ విన్ త్రోప్: తప్పకుండా.

మిస్టర్ కెంపుల్: ఒక్కటే నిబంధన, మరి. మాకు ఈ బుట్టలు చాలా కావలసి ఉంటాయి - కనీసం పదివేలు. అంతే కాదు; అవన్నీ కనీసం పన్నెండు వేర్వేరు డిజైన్లలో, అల్లికల్లో ఉండాలి.

మిస్టర్ విన్ త్రోప్: నేను మీకు వేర్వేరు డిజైన్లు అరవై ఇవ్వగలను.

మిస్టర్ కెంపుల్: అంతకంటేనా, మరి మాకు ఇవన్నీ అక్టోబర్ మొదటి వారంకల్లా అందాలి. ఆలస్యం కాకూడదు. అలా మీరు అందించగలరు - కదూ?

మిస్టర్ విన్ త్రోప్: ఓ, ఖచ్చితంగా అందించగలను.

(మూడవ అంకం ముగిసింది)

నాలుగవ అంకం (బుట్టలవాడి ఇంటి వసారా. బుట్టలవాడు ఇంతకు ముందు లాగానే పనిలో నిమగ్నుడై, కూర్చొని ఉంటాడు. మిస్టర్ విన్ త్రోప్ ప్రవేశిస్తాడు. అతని చేతిలో పేపర్ల కట్ట ఒకటి ఉంటుంది)

మిస్టర్ విన్ త్రోప్: శుభోదయం, మిత్రమా, బాగున్నావా?

బుట్టలవాడు లేచి నిలబడి, రెండు చేతులూ పైకెత్తి అభివాదం చేసి మర్యాదగా వంగి నిలబడతాడు)

బుట్టలవాడు: స్వాగతం, రండి రండి, యజమానీ. నేను బాగున్నాను. రండి. నా వందనాలు అందుకోండి. ఈ ఇల్లూ, నాకున్న వస్తువులూ అన్నీ మీవే. (అతను ఇంకో సారి వంగి నమస్కరించి తిరిగి పనిలో కూర్చుంటాడు) క్షమించాలి, యజమానీ. నేను పగటి సమయాన్ని వృథా చేసుకోలేను.

మిస్టర్ విన్ త్రోప్: ఈ పరిస్థితి త్వరలో మారిపోతుంది మిత్రమా. నేను నీకో శుభవార్త తెచ్చాను. పెద్ద వ్యాపారం.

బుట్టలవాడు: మీ మాటలు విని చాలా సంతోషమౌతోంది యజమానీ.

మిస్టర్ విన్ త్రోప్: నువ్వు నాకు ఇలాంటి చిన్న బుట్టలు వెయ్యి చేసి పెట్టగలవా?

బుట్టలవాడు: ఎందుకు చేయలేను సామీ? పదిహేను అల్లగలిగిన నేను, వెయ్యి కూడా అల్లగలను.

మిస్టర్ విన్ త్రోప్: అదే నేననేది, మిత్రమా! మరి నువ్వు నాకు ఐదు వేలు చేసి పెట్టగలవా?

బుట్టలవాడు: ఓ, అల్లగలను యజమానీ. వెయ్యి బుట్టలు అల్లగలిగితే ఐదు వేలూ అల్లగలను.

మిస్టర్ విన్ త్రోప్: మంచిది. మరి, నేను ఒక వేళ పది వేల బుట్టలు చెయ్యమంటే, నువ్వేమంటావు? ఒక్కో దాన్ని ఎంత ధరకిస్తావు? నువ్వు నిజంగానే పది వేల బుట్టలు అల్లగలవు - కదూ, అసలు?

బుట్టలవాడు: ఓ! ఖచ్చితంగా, యజమానీ. మీరెన్ని అల్లమంటే నేను అన్ని అల్లగలను. ఈ రకపు అల్లికలో నాకు సాటి రాగలవారు ఎవ్వరూ లేరు. ఈ మొత్తం ఆదిలాబాదు జిల్లాలోనే ఎవ్వరూ ఈ బుట్టల్ని నా మాదిరి అల్లలేరు.

మిస్టర్ విన్ త్రోప్: నేను సరిగ్గా అదే అనుకున్నాను. సరే, ఇప్పుడు నేను పది వేల బుట్టలు కావాలన్నాననుకో, వాటిని పూర్తి చేసేందుకు నీకెంత సమయం కావాలి?

(బుట్టలవాడు ఒక వైపున తన పని కొనసాగిస్తూనే మనసులో లెక్కలు వేసుకుంటాడు)

బుట్టలవాడు: అన్ని బుట్టలు చేసేందుకు చాలా సమయం పడుతుంది యజమానీ. చూడు, ఈత బర్రల్నీ, నారనీ చాలా జాగ్రత్తగా ఎండ బెట్టుకోవాలి. వాటితో జాగ్రత్తగా పని చేసి, ఎండినా కూడా అవి తమ సహజమైన మెరుపును కోల్పోకుండా చూసుకోవాలి. ఎండినా కూడా అవి మెత్తగా ఉండాలి. తాజాగా కనబడాలి. అప్పుడు వాటికి రంగులు అద్దాలి. మరి ఆ రంగుల తయారీకి గాను నేను మొక్కల్ని, వేర్లను, బెరడులను, పురుగులను సేకరించుకోవాలి. దానికి సమయం పడుతుంది. ఈ మొక్కల్ని చంద్రుడు సరిగ్గా ఉన్నపుడే సేకరించుకోవాలి లేక పోతే అవి సరైన రంగును ఇవ్వవు. పురుగుల్ని కూడా సరైన సమయంలో, సరైన పరిస్థితుల్లోనే సేకరించాలి లేకపోతే అవి సరిగ్గా మెరిసే రంగుల్నివ్వవు, వృథా అయిపోతై. అయినాగానీ యజమానీ, నేను నీకెన్ని బుట్టలు కావాలంటే అన్ని బుట్టలు అల్లిపెడతాను. మూడు డజన్లడిగినా పర్లేదు - నేను నీకు అల్లిపెట్టగలను. కేవలం నాక్కొంత సమయం ఇవ్వు, అంతే.

మిస్టర్ విన్ త్రోప్: మూడు డజన్లా? మూడు డజన్లు! మూడు? డజన్లు?! (విన్ త్రోప్ అరుపులు విని కంపేసినో భార్య బయటికి వస్తుంది, ఏం జరుగుతోందోనని) సరే. ఆగు. చూడు. మనం దీన్ని ఇంకోసారి జాగ్రత్తగా మాట్లాడుకుందాం. నువ్వేమన్నావు? నేను వంద బుట్టలు కొంటే ఒక్కొక్క దాన్నీ ఎనిమిది రూపాయలకు ఇస్తానన్నావు. అవునా?

బుట్టలవాడు: అవును యజమానీ.

మిస్టర్ విన్ త్రోప్: సరే, మరి, నేను ఇప్పుడు నిన్ను బుట్టలిమ్మంటే - అంటే పది వందల బుట్టలు - ఒక్కొక్క బుట్టనీ ఎంతకివ్వగలవు?

(మిస్టర్ విన్ త్రోప్ వచ్చినప్పటి నుండీ తొలిసారిగా బుట్టలల్లేవాడు పనినాపివేసి చూస్తాడు. చాలా సార్లు తల ఊపుతూ భార్యకేసి చూస్తాడు, లెక్క వెయ్యటానికి ప్రయత్నిస్తూ. చివరికి మళ్లీ మాట్లాడుతాడు - )

బుట్టలవాడు: క్షమించాలి, యజమానీ. ఈ లెక్క నా స్థాయికి చాలా ఎక్కువ. మీకు వీలైతే రేపు ఒక సారి రండి, ఆలోగా నేను మీకు జవాబు లెక్కపెట్టి ఉంచుతాను.

మిస్టర్ విన్ త్రోప్: రేపా? రేపు!? సరే, సరే. నేను నీకు ఒక రోజు సమయం ఇస్తున్నాను. కానీ నేను తిరిగి వచ్చేసరికి నాకు నీ జవాబు సిద్ధంగా ఉండాలి. సరేనా?

(మిస్టర్ విన్ త్రోప్ వెళ్తాడు)

బుట్టలవాడి భార్య: ఓయ్! పదివేల బుట్టలు! పదివేల బుట్టలు ఎవరికి కావాలో అసలు?

బుట్టలవాడు: ఈ ధర లెక్కించటంలో నువ్వు నాకు సాయం చెయ్యాలి. ఇది చాలా సమయం పడుతుంది.

బుట్టలవాడి భార్య: కానీ అతని ఆలోచన ఏమై ఉంటుందంటావు? పదివేల బుట్టలు...

బుట్టలవాడు: ఈ మనుషుల్ని ఎవరు అర్థం చేసుకోగలరు? కానీ అతను అడిగాడు, కనుక మనం ప్రయత్నించి అతనికి జవాబివ్వాలి.

బుట్టలవాడి భార్య: లోపలికి వచ్చి, ముందు తిను. ఇప్పటికే దాదాపు పొద్దు గుంకుతున్నది. ఈ లెక్కేదో తేలాలంటే నీ కడుపులో ఏది ఉన్నా చాలేట్లు లేదు. రా, తిని పోదువు.

(నాలుగవ అంకం ముగిసింది)

ఐదవ అంకం (తరువాతి రోజున, ఎప్పటి మాదిరే బుట్టలవాడు తన ఇంటి వసారాలో కూర్చొని పని చేసుకుంటున్నాడు. మిస్టర్ విన్ త్రోప్ తన చేతిలో కాగితాల కట్ట పట్టుకొని హడావిడి పడుతూ వస్తాడు.)

మిస్టర్ విన్ త్రోప్: సరే, చెప్పు. పదివేల బుట్టలకు ధర లెక్కించటం అయ్యిందా?

బుట్టలవాడు: లెక్క తేలింది, యజమానీ! ధర ఖచ్చితంగా నిర్ణయించుకున్నాం. మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బును దోచుకునే ఆలోచన లేదు మాకు. అందువల్ల చాలా శ్రమపడి, ఆందోళన పడి చివరికి ఖచ్చితమైన ధర లెక్కించుకున్నాం.

మిస్టర్ విన్ త్రోప్: సరే సరే. చెప్పండి ఇకనైనా. ఏంటి మీ ధర?

బుట్టలవాడు: దీన్ని ఖచ్చితంగా కనుక్కునేందుకు మేం నిన్న రాత్రంతా మేలుకొనాల్సి వచ్చింది. ఒక వేళ నేను వెయ్యి బుట్టలు చేయాలంటే, ఒక్కొక్కటి మూడు ఇరవైలు - అంటే అరవై రూపాయలు అవుతుంది. ఒకవేళ నేను ఐదువేల బుట్టలు చేయాలాంటే, ఒక్కొక్కటి నూటఎనభై రూపాయలౌతుంది. ఇక నేను పదివేలు చేయాలంటే, ఒక్కొక్కటి మూడువందల రూపాయలకు తక్కువ ధరకు అందించలేను.

(చెప్పేసిన వెంటనే అతను తిరిగి పనిలోకి దిగుతాడు.)

విన్ త్రోప్: ఆగు. ఆగు. నువ్వన్నది నేను సరిగ్గానే విన్నానా? నువ్వు ఒక్కో బుట్టకు మూడువందల రూపాయలు అడుగుతున్నావా?

బుట్టలవాడు: అయ్యా అవును. సరిగ్గా, తప్పు లేకుండా, లెక్కించి నేను చెప్పిన ధర అంతే.

మిస్టర్ విన్ త్రోప్: కానీ, చూడు, మా మంచి మనిషీ, నేను నీ స్నేహితుడిని. నువ్వు నీ కాళ్ల మీద నువ్వు నిలబడేందుకు సాయపడాలనుకుంటున్న వాడిని.

బుట్టలవాడు: అవును సామీ, నాకు ఆ సంగతి తెలుసు. మీ మాటలు దేన్నీ నేను అనుమానించటం లేదు.

మిస్టర్ విన్ త్రోప్: కానీ నాకు అర్థం కావట్లేదు. నువ్వే అన్నావు గదా, వంద బుట్టలు చేసి ఇస్తే ఒక్కోటీ ఎనిమిది రూపాయలు పడుతుందని?

బుట్టలవాడు: అవును నిజమే. మీరు వంద బుట్టలు కొంటే ఒక్కొక్కటీ ఎనిమిది రూపాయలకు తీసుకోవచ్చు - అదీ నా దగ్గర వంద బుట్టలు ఉంటే. అవి నా దగ్గర ఎలాగూ లేవు.

మిస్టర్ విన్ త్రోప్: కానీ నేను ఇంకా ఎక్కువ మొత్తం కొంటున్నపుడు ఒక్కోటీ ఇంకా తక్కువ ధరకు రావాలి కదా? ధర అకస్మాత్తుగామూడు వందలకు - అంటే తెలుసా,ముప్ఫైవేల పైసలకు - ఎందుకు పెరిగిపోతుందో నాకు అర్థం కావడం లేదు - దాదాపు నలభై రెట్లు ఎక్కువ ధర! ఎందుకు అవుతుంది అలా?

బుట్టలవాడు: ప్రియమైన యజమానీ, ఇందులో అర్థం కానిదేముంది? చాలా సులభం. పన్నెండు బుట్టలు చేయటం నాకు చాలా సులభం. వెయ్యి బుట్టలు అల్లటంలో నాకు అంతకు వంద రెట్లు శ్రమ కల్గుతుంది. ఇక పదివేల బుట్టలంటే, నాకు ఎంత శ్రమ, ఎంత సమయం అవసరమౌతాయంటే, నేను వాటిని ఎన్నటీకీ పూర్తి చేయలేను; వంద సంవత్సరాల్లో కూడా పూర్తి కావు అవి. నేను వందల రెట్ల నార, వందలాది రెట్ల మొక్కలు, వేళ్లు, బెరడులు, పురుగులు సంపాదించాల్సి ఉంటుంది. ఊరికే అడవికి పోగానే మీ కాళ్ల దగ్గర పడి కన్పించేవి కావు అవి. నేను కోరి వెతికే నిజం వంకాయరంగు మొక్క కనబడేందుకు నాకు నాలుగు-ఐదు రోజులు పట్టవచ్చు. మరి, నారను తయారు చేసి, సిద్ధం చేసేందుకు ఎంత పని ఉంటుందో మీకు తెలుసా? మరి మీరు ఇంకో సంగతినీ గుర్తించాలి: ఇది నా వృత్తే. అయినా ఇదే నా సర్వస్వం కాదు. నేను నా పొలాలను సంరక్షించుకోవాలి - అది నాకు ప్రధానం. నా జొన్నలు, నా చిక్కుళ్లు, నా గొర్రెలు, నాకోళ్ల కోసం నేను పొలం పని చేయాలి. నేను ఒక వేళ అన్ని బుట్టలు చేయాలంటే, మరి నా యీ జీవనాధారాల్ని ఎవరు చూసుకుంటారు? నాకు జొన్నలు లేకపోతే నా అంబలి నాకుండదు, నేను చిక్కుళ్లు పండించక పోతే నా పప్పు నాకు ఎక్కడ నుండి వస్తుంది?

మిస్టర్ విన్ త్రోప్: కానీ నేను నీ బుట్టలకు ఎంత ఎక్కువ డబ్బిస్తానంటే, నువ్వు నీక్కావలసినంత జొన్న, చిక్కుళ్లు - నిజానికి ఇంకా చాలా ఎక్కువే కొనుక్కోవచ్చు.

బుట్టలవాడు: అలా అని మీరు అనుకుంటారు, సామీ! కానీ మరో సంగతి అర్థం చేసుకోవాలి. నేను సొంతంగా పండించే జొన్నలపైనే నాకు భరోసా. ఇతరులు పండించే, లేదా పండించని జొన్నలు నాకు పండగ చేస్తాయని నేను అనుకోలేను.

మిస్టర్ విన్ త్రోప్: కానీ నీకు సాయం చేయమని మీ బంధువులెవరినైనా అడగొచ్చు కదా! నీకు దగ్గర్లో బంధువులు ఎవ్వరూ లేరా?

బుట్టలవాడు: ఓహ్, నాకు ఇక్కడ చాలా మంది బంధువులున్నారు. దాదాపు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ మా బంధువే!

మిస్టర్ విన్ త్రోప్: మరి, నువ్వు నాకోసం బుట్టలల్లుతున్నప్పుడు నీ పొలాల్ని, నీ గొర్రెల్నీ వాళ్లు చూసుకొనేట్లు చెయ్యవచ్చు. బహుశ: వాళ్లే నీకు నారలు, మొక్కలు, వేళ్లు, పురుగులు అన్నీ సేకరించి పెడుతుండవచ్చు.

బుట్టలవాడు: ఆవును. వాళ్లు సాయపడచ్చు. బహుశ: సాయపడతారు కూడా. కానీ మరప్పుడు వాళ్ల పొలాల్నీ, వాళ్ల గొర్రెల్నీ, వాళ్ల కోళ్లనీ ఎవరు చూసుకోవాలి? పొలాల్లో ఎవ్వరూ పని చేయక పోతే జొన్నలవీ, చిక్కుళ్లవీ ధరలు ఎంతగా పెరిగి పోతాయంటే ఇక మేమెవ్వరం వాటిని కొనుక్కోలేం. అందరూ ఆకలి మాడి చచ్చిపోవాలి. అందువల్ల నేను నా బుట్టల ధరను కూడా పెంచాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు అర్థం అయి ఉంటుంది. అన్ని బుట్టలు తయారు చెయ్యాలంటే ఒక్కొక్క బుట్టనూ మూడువందల రూపాయలకు తక్కువగా నేనెందుకు అమ్మలేనో.

మిస్టర్ విన్ త్రోప్: (చికాకు పడుతూ, అసహనంగా) నీకు, నీకు., బహుశ: నీకింకా అర్థం కావట్లేదు - నేను నా ప్రతిపాదన ద్వారా నీకెంత మేలు చేస్తున్నదీ. నీకు తెలుసో, తెలీదో. అదృష్టం ఒకే సారి తలుపు తడుతుంది. నీకు నీ జీవితంలోనే ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. ఈ అవకాశాన్ని కోల్పోతే నువ్వు ఎంత డబ్బును నష్టపోతావో ఆ కఠోర వాస్తవాన్ని ఇదిగో, ఈ కాగితాల్లో అంకెలు చెప్తాయి. కావాలంటే నేను ఈ అంకెల్ని వివరిస్తాను నీకు.

(మిస్టర్ విన్ త్రోప్ కంపేసినోకి తన చేతిలోని కాయితాల దొంతరను చూపెడతాడు.)

మిస్టర్ విన్ త్రోప్: చూడు. ఇక్కడే ఉంది ఇదంతా. నువ్వు బుట్టల్ని నాకు అమ్మే ధర - ఇక్కడుంది - ఎనిమిది రూపాయలు! చూడు గుర్తు పట్టావా?

బుట్టలవాడు: మరి, ఇది?

విన్ త్రోప్: అది ఏమీ లేదు. నేను వాటిని మళ్ళీ ఎంతకు అమ్ముకుంటాను అన్న దానికి సంబంధించిన అంకెలవి, వాటితో నీకేమీ పని లేదు. చూడు, ఒక వేళ నువ్వు నాకు పదివేల బుట్టల్ని, ఒక్కొక్కటీ ఎనిమిది రూపాయలకు అమ్మితే, నీకు ఎనభైవేల రూపాయలు వస్తాయి -ఎనభైవేలు! మొత్తం తాండాలోనే నువ్వు అత్యంత ధనికుడివౌతావు. అయితే, నువ్వు నా మిత్రుడివి కనుక, కేవలం మన స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నీకు కొంత బోనస్ ఇస్తాను - మొత్తం పనికి గాను నీకు లక్ష రూపాయలు ఇస్తాను. ఇక అంగీకారమే. అంతే కదూ. ’అవును’ అన్నావంటే, నువ్వింకా పని మొదలు పెట్టకుండానే నీకు అడ్వాన్సు కూడా ఇస్తాను.

బుట్టలవాడు: ముందుగా వివరించిన ప్రకారం, యజమానీ, ఒక్కో బుట్ట ఖరీదూ మూడువందల రూపాయలు.

మిస్టర్ విన్ త్రోప్: (ఇప్పుడు పెద్దగా అరుస్తూ -) అయ్యా, పెద్దాయనా! ఎక్కడున్నావు ఇంత సేపూ? చంద్ర మండలంలో ఎక్కి కూర్చున్నావా? నీకెమైనా చెముడా? నువ్వు నీ ధరను అసలు మార్చనే లేదు.

బుట్టలవాడు: అవును సామీ, నాకు ఆ సంగతి తెలుసు. కానీ ఆ ధర మారదు, అంతే ఉంటుంది, ఎందుకంటే నాకు ఇంకో ధర తయారు చేయటం రాదు. అంతే కాదు, మీకు తెలీని సంగతి ఇంకోటీ ఉంది. చూడండి, యజమానీ, నేను ఈ బుట్టల్ని నా సంతోషం కొద్దీ నా పద్ధతిలోనే చేయాల్సి ఉన్నది. నా పాటను ఆ బుట్టల్లో పెట్టి, నా ఆత్మని తీగలుగా మలచి బుట్టల్లో అల్లాల్సి ఉన్నది. నేను అంత పెద్ద పెద్ద సంఖ్యల్లో తయారు చేస్తే, ప్రతి బుట్టలోనూ నా ఆత్మ, నా పాట ఉండవు. అప్పుడిక అన్నీ ఒకేలాగా, ఏమీ తేడా లేకుండా, కనిపిస్తాయి. ఆ పరిస్థితి మెల్లిగా నా హృదయాన్ని తినివేస్తుంది. సూర్యుడు ఉదయించగానే నేను చేసిన ఒక్కో బుట్టా ఒక్కో పాట పలికించాలి. పక్షులు కిలకిలలాడటం మొదలు పెట్టగానే, సీతాకోకచిలుకలు వచ్చి కూర్చుంటే, నా బుట్టల్లో కొత్త అందాలు కనిపించాలి - ఎందుకంటే, చూడండి, సీతాకోక చిలుకలకు నా బుట్టలన్నా, వాటిపైన వేసే అందమైన రంగులన్నా చాలా యిష్టం. అందుకే అవి వచ్చి వాలి, కూర్చుంటాయి. వాటిని చూసి నేను బుట్టల్ని వాటి మాదిరి తయారు చేస్తాను. ఇక, యజమానీ, మీరు నన్ను క్షమించాలి, నేను ఇప్పటికే చాలా సమయం వృథా చేశాను, అయినా మీవంటి గొప్ప వ్యక్తి మాట్లాడే విషయాల్ని వినటం నా అదృష్టంగా భావిస్తున్నాను. కానీ ఇప్పుడైనా నేను ఇక నా పనిని మళ్లీ మొదలు పెట్టుకోవాలి, ఎందుకంటే ఎల్లుండి సంత రోజు, ఆ రోజున నేను అక్కడ నా బుట్టలు అమ్ముకోవాలి. ధన్యవాదాలు యజమానీ, మీరు ఇంత దూరం వచ్చినందుకు ధన్యవాదాలు.

(తల తిరిగి, దిమ్మెర పోయిన మిస్టర్ విన్ త్రోప్ ఏం చేయాలో, ఏం ఆలోచించాలో తెలీక నిశ్చలంగా నిలబడి పోతాడు. ఒక్కొక్కటిగా కాయితాలు అతని చేతుల్లోంచి జారి నేలమీద పడిపోతాయి. చెల్లా చెదరైన ఆ కాగితాలను చూస్తూ, తిరిగి పని ప్రారంభించిన బుట్టలవాణ్ణి చూస్తూ మెల్లగా కాళ్లీడ్చుకుంటూ నడుస్తూ వెళ్లి పోతాడు. లోపల్నుండి అంతా వింటున్న బుట్టలవాడి భార్య బయటి వసారాలోకి వస్తుంది.

బుట్టలవాడి భార్య: అవును. నాకూ ఇదంతా అర్థమైంది. అంత పని ఎవరికి కావాలట? ఏదో బ్రతికేందుకు మనకేమీ పని లేనట్లే!

బుట్టలవాడు: నువ్వు అతని కాయితాలు చూసి ఉండాల్సింది. అంతటా గీతలూ, అంకెలూ, రాతలూ. అతనికి ఏదో పెద్ద కల ఏమన్నా వచ్చిందేమో!

బుట్టలవాడి భార్య: పది వేల బుట్టలట! ఎవరిక్కావాలి, పదివేల బుట్టలు! మనం ఇప్పుడు బ్రతుక్కోవటం లేదూ?

(ముగిసింది)