ఒక ఊళ్లో ఒక అవ్వ ఉండెనంట. ఆ అవ్వ ఒకసారి కూరగాయలు కోస్తావుంటే దాండ్లలోనుంచి ఒక బుడ్డోడు వొచ్చినాడంట. వొచ్చి "అవ్వా! అవ్వా! నేను పోయి రాజు బిడ్డను పెళ్లిచేసుకుంటానవ్వా" అని అడిగినాడంట వాడు.

"నీకు రాజుబిడ్డొదొద్దులేరా" అన్నదంట అవ్వ.

"లేదు, నేను రాజుబిడ్డనే చేసుకుంటాన"ని, వాడు బయలుదేరిపోయినాడంట.

పోతావుంటే వాడికొక వాగు అడ్డం వచ్చిందంట.

"ఓహో! నాకు అడ్డం వచ్చావా నువ్వు" అని వాడు వంగి ఆ వాగులోని కొన్నినీళ్లను నోట్లోకి తీసుకున్నాడంట. అంతే వాగంతా బుడ్డోడి నోట్లోకి వచ్చేసిందంట.

ఏటిని నోట్లో దాచుకుని ముందుకు పోతున్న బుడ్డోడికి పిల్లులు అడ్డం వచ్చాయంట. పిల్లులనన్నింటినీ పట్టుకుని ఒక చెవిలో వేసుకుని, ముందుకు పోసాగినాడంట బుడ్డోడు.

ఈసారి వాడికి గద్దలడ్దం వచ్చినాయంట. సరే ఉండడని గద్దలనన్నింటినీ కూడా పట్టుకుని ఇంకో చెవిలో వేసుకుని పోయాడంట వాడు.

పోయి, పోయి చివరికి రాజుగారిళ్లు చేరినాడంట బుడ్డోడు.

రాజుదగ్గరకు పోయి "రాజా! రాజా! నేను నీ బిడ్డను పెళ్ళిచేసుకుంటానన్నాడంట రాజుతో.

బుడ్డోడన్న ఆ మాటలువిన్న రాజుకు కోపమొచ్చిందంట.

"ఏరా! వేలెడు లేవు, నీకు నాబిడ్ద కావాలా" అని భటులను పిలిచి, వీడ్ని మంటలలో వేయండని చెప్పాడంట రాజుగారు.

భటులు బుడ్డోడిని పట్టుకుని పోయి మంటలలో పడేసినారంట.

అప్పుడు బుడ్దోడు తను నోట్లో దాచుకున్న ఏటిని మంటలమీదికి వొదిలాడంట. నీళ్లన్నీ మంటలనార్పేశాయంట.

ఈసారి బుడ్డోడిని ఎలకల గదిలో పడేయమన్నాడంట రాజుగారు.

ఎలుకల గదిలో పడిన బుడ్డోడు పిల్లులను బయటికొదిలాడంట. పిల్లులు ఎలకలన్నింటినీ తినేశాయంట.

ఎలుకలనుంచి తప్పించుకున్న బుడ్డోడిని పాముల గదిలో తోసెయ్యమన్నారంట రాజుగారు.

పాముల గదిలోకి గద్దలనొదిలాడంట బుడ్డోడు. గద్దలన్నీ పాములను తినేశాయంట.

పాములనుంచీకూడా తప్పించికున్న బుడ్డోడు చాలా శక్తిమంతుడేనని తన కూతురుని బుడ్డోడికిచ్చి పెళ్లిచేశారంట రాజుగారు.

రాకుమారిని పెళ్లిచేసుకున్న బుడ్డోడు, వెనుదిరిగి తన ఊరికి పోతూ పోతూ దారిలో వాడు పట్టుకున్న , వాగునూ, పిల్లులనూ, గద్దలనూ వాటి స్థానాలలో వదిలేసి ఇంటికి పోయి సుఖంగా కాలం గడిపాడంట!!!!