ఒక ఊర్లో ఒక రాజంట. ఆ రాజు ఒక పనిమషిని పిలుచుకొని వచ్చిండంట. ఆ పనిమనిషికి ఒకే ఒక వంటకం చేయడమొచ్చంట. అదేమంటే `ఇడ్లీ'.
రాజుగారికి ఆమె ప్రతిరోజూ ఇడ్లీలే చేసిపెట్టేదంట. ఆమె చేసే ఆ ఇడ్లీలు తినీ తినీ రాజుగారికి విసుగొచ్చిందంట. ఒకనాడు ఆయనకు కోపం వచ్చి, "రోజూ ఇదే వండితే నేనెట్ల తినేది? నువ్వు రేపు ఏదైనా కొత్తది చేయకపోతే మాత్రం నేను నిన్ను చంపేస్తా!" అని చెప్పినాడంట.
పనిమనిషికేమో ఇంకోటి చేసేది రాక, ఏమీ తోచక దిగాలుగా కూర్చున్నదంట. ఏమిచేసేదా, అని దానిమీదే ఆలోచిస్తూ, నీళ్లు తాగుదామని ఒక చెంబుడు నీళ్లు తీసుకున్నదట. ఏడనో మనసు పెట్టి ఆలోచిస్తున్న ఆమె, ఆ చెంబును సరిగా పట్టుకోకపోయుండి, అది జారి, కిందుండే ఇడ్లీ పిండి గిన్నెలో పడిపోయిందంట. ఇడ్లీ పిండంతా నీళ్లు నీళ్లుగా అయిపోయిందంట.
ఏం చెయ్యాలో తోచక, `ఏమైతే అది కాన'ని ఇంకో చెంబుడు నీళ్లు తీసుకుని వాటినికూడా ఇడ్లీ పిండిలో పోసేసిందట ఆ పనామె. ఇడ్లీ పిండంతా ఇంకా నీళ్లగా అయిపోయిందంట. వంట చేసే సమయం అయింది. పొయ్యి వెలిగించి, పొయ్యిమీద ఒక చదునైన వెడల్పాటి పెనం పెట్టి మండించిందట.
అప్పటికే వంట సమయం దాటిపోయిందంట. రాజుగారు ఆకలితో, ఏమిటీ వంటమనిషి! ఎంతకీ వంటచేసుకరాలేద'ని అనుకుంటూ వంటగదికే పోయినాడంట. వంట గదిలోకి పోయి చూసిన ఆయనికి పనిమనిషి కొంచెం కొంచెం కాకుండా "దోసెడు" పిండి తీసుకుని పెనం మీద పోస్తూ కనిపించిందంట. కాసేపటికి ఆమె వాటిని తీసుకెళ్ళి రాజుగారికి పెట్టిందంట. చాలా కాలానికి ఓ కొత్త వంటను - అదీ ఆకలితో - తిన్న రాజుగారికి, అది నచ్చిందంట. అప్పుడాయన పనిమనిషిని
ఇదేమిట'ని అడిగాడంట.
దాని పేరు తనకు తెలియదని పని మనిషి చెప్పడంతో, రాజుగారు దానికి `దోస 'అని పేరు పెట్టాడంట!