ఒక ఊళ్లో రాజమ్మ అనే మహిళ తన కూతురు చిన్నారితో కలిసి జీవించేది. చిన్నారి రెండవ తరగతి పాప. రాజమ్మ పాపం, పేదరాలు. జీవనం గడపటానికి ఆమెకంటూ పెద్ద ఆధారాలేమీ లేవు- వాళ్ళ ఇంట్లో ఉన్న పాత కరివేపాకు చెట్టొకటి తప్ప. రోజూ రాజమ్మ, చిన్నారి ఇద్దరూ కలిసి కరివేపాకుచెట్టు నుండి కరివేపాకును తెంపుకొని, ఊళ్లో వీధి వీధినా తిరిగి అమ్ముకునేవాళ్ళు. అలా వచ్చిన డబ్బుతో తమకు అవసరమైన సరుకులు తెచ్చుకుని, మిగిలిన డబ్బుల్ని హుండీలో వేసుకునేవాళ్ళు.
ఒకరోజున, చిన్నారికి ఒక ఆలోచన వచ్చింది: 'కరివేపాకు చెట్టుకు కూడా ప్రాణం ఉంది గదా? దాని కొమ్మలు విరిస్తే దానికి బాధ కలుగుతుందిగదా? మరి మనం ఇలా రోజూ కరివేపాకు కోసుకుంటుంటే ఎలాగ?' అని. ఆపైన ప్రతిరోజూ ఆ పాప తన తల్లిని ఇదే ప్రశ్న అడిగేది. రాజమ్మకి ఏమి జవాబివ్వాలో తెలిసేదికాదు. 'నన్నడిగితే నేనేం చెప్పాలి తల్లీ! నువ్వడిగేదేదో ఆ కరివేపాకు చెట్టునే అడుగు!' అన్నదామె చివరికి.
చిన్నారి కరివేపాకు చెట్టు దగ్గరకు వెళ్లి 'చెట్టూ, చెట్టూ! రోజూ నీ కొమ్మలు విరుస్తున్నాం, నీకు బాధ కలగటంలేదా?' అని అడిగింది.
"బాధగానే ఉంటుంది చిన్నారీ! కానీ నన్ను జాగ్రత్తగా చూసుకునే నువ్వూ, మీ అమ్మా కూడా బ్రతకాలిగదా? నేను కొంచెం కష్టపడినాగానీ, మీరు సుఖపడుతున్నారని నాకు సంతోషంగా ఉంటుంది. అందుకే మీరు నా కొమ్మ ఒకటి విరిస్తే నేను నాలుగు కొమ్మలు వేసి అందిస్తున్నాను. నా ఆకులు మీ ఆహారంలో రుచినిస్తూ, ఔషధ గుణాలనందిస్తూంటే, ఎండిన నా కొమ్మలు మీ పొయ్యిలో మంటనిస్తుంటే నా వాళ్ళకు నేను ఉపకరిస్తున్నానని తృప్తి కలుగుతుంటుంది" అన్నది కరివేపాకు చెట్టు.
చిన్నారికి పెద్దగా అర్థం కాలేదుగానీ, ప్రక్కనే నుంచుని వింటున్న రాజమ్మకు 'ఇతరులకోసం జీవించటం' అంటే ఏమిటో అర్థమైంది.